SOURCE :- BBC NEWS

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు

ఫొటో సోర్స్, Getty Images

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలియజేసింది. ఏడో దశ రింగ్‌ రోడ్ల అభివృద్ధి కింద ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది.

ఈ ప్రాజెక్టుకు ‘ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఫర్‌ న్యూ కాపిటల్‌ సిటీ’ అని పేరు పెట్టారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ గత నెలలో ఆమోదించింది.

రింగ్ రోడ్డు వెడల్పును 150 మీటర్లుగా రాష్ట్రం ప్రతిపాదించగా కేంద్రం దాన్నికుదించింది. ఆరు లైన్ల రహదారే కాబట్టి 70 మీటర్ల వెడల్పు(రైట్‌ ఆఫ్‌ వే) సరిపోతుందని తెలిపింది.

ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా సర్వీస్‌ రోడ్లను నిర్మించాలని రాష్ట్రం ప్రతిపాదించగా అందుకు ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ అంగీకరించలేదు. దేశంలోని ఇతర ఓఆర్‌ఆర్‌ల నిర్మాణంలో ఎక్కడా సర్వీస్‌ రోడ్లు వేయట్లేదని చెప్పింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అవుటర్ రింగ్ రోడ్డు

ఫొటో సోర్స్, Getty Images

150 మీటర్లు ప్రతిపాదించిన రాష్ట్రం

150 మీటర్ల వెడల్పుతో ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి భూసేకరణ చేయాలని, భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్‌ వెంబడి రైల్వేలైన్‌ నిర్మాణం, ఇతరత్రా వాటికి భూమి అవసరమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

అయితే, ఆరు వరుసల రోడ్డుకు 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో అది 8 వరుసల వరకూ విస్తరించేందుకు వీలుంటుందని కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం-1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున, ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది.

రూ. 16 వేల కోట్లు

అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు భూసేకరణతో పాటు నిర్మాణ వ్యయం మొత్తం రూ.16,310 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్‌కు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర లాంటి వాటికి సీనరేజ్‌ ఫీజు మినహాయింపు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వాటి వ్యయం రూ.1,156 కోట్ల మేర తగ్గుతుంది.

మొత్తంగా కేంద్రం రూ.15,154 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి సుమారు 3,404 హెక్టార్లు. ఆ భూసేకరణకు వ్యయం రూ.4,198 కోట్లు. మిగిలిన మొత్తం సివిల్‌ వర్క్స్‌ వ్యయం.

అమరావతి రింగ్ రోడ్డు

ఫొటో సోర్స్, amaravati.gov.in

ఓఆర్‌ఆర్‌ ఏయే జిల్లాల్లో అంటే..

ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 189 కి.మీ.ల పొడవున ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు.

ఆయా జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్‌ఆర్‌ క్రాస్‌ చేస్తుంది.

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పది మండలాల్లో 49 గ్రామాల మీదుగా వెళ్తుంది. కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మీదుగా రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది.

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా సాగుతుంది.

ఎక్కడ ఎలా మొదలవుతుందంటే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల వద్ద ఓఆర్‌ఆర్‌ మొదలై గుంటూరు నగరం వెలుపల పొత్తూరు వద్ద కోల్‌కతా-చెన్నై రహదారిలో కలుస్తుంది.

అక్కడి నుంచి కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పరిధిలో ఎన్‌హెచ్‌-65లో, అటు నుంచి విజయవాడ-ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-16ను కలుస్తుంది.

కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెనలు

ఓఆర్‌ఆర్‌లో భాగంగా రెండు చోట్ల కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెనలు నిర్మిస్తారు.

అమరావతిలోని శ్రీ అమరేశ్వరస్వామి వారి ఆలయానికి సమీపంలో ఒకటి, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు వద్ద మరొకటి నిర్మిస్తారు.

ఈ రెండు మేజర్‌ వంతెనలతో పాటు మరో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు నిర్మిస్తారు.

అమరావతి

ఫొటో సోర్స్, amaravati.gov.in

అర్బన్‌ నోడ్స్, గ్రోత్‌ సెంటర్లుగా ఆ ఊళ్లు

ఓఆర్‌ఆర్‌కు లోపల, వెలుపల ఉన్న ప్రాంతాలైన గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లపూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాల్ని అర్బన్‌ నోడ్స్‌గా అభివృద్ధి చేస్తారు.

అలాగే గ్రోత్‌ సెంటర్లుగా మైలవరం, ఆగిరిపల్లి, పెదఅవుటపల్లి, రేపల్లె, నందివెలుగు, వేజెండ్ల, పేరేచర్ల, అమరావతి(పాత), కంచికచర్లను అభివద్ధి చేయాలన్నది లక్ష్యం.

సర్వీస్‌ రోడ్లు అక్కర్లేదన్న కమిటీ

ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని రాష్ట్రం ప్రతిపాదించగా, అవి అవసరం లేదన్న అభిప్రాయాన్ని ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ వ్యక్తం చేసింది. ఓఆర్‌ఆర్‌ల నిర్మాణంలో ఎక్కడా సర్వీస్‌ రోడ్లు నిర్మించట్లేదని, అయితే రింగ్‌రోడ్‌కు లోపలి వైపు సర్వీస్‌ రోడ్ల నిర్మాణానికి పరిశీలించాలని కమిటీ సూచించింది.

ఓఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌కు 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయవిక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

ఎలైన్‌మెంట్‌ కమిటీ ఆమోదంపై రాష్ట్రం ఆచితూచి..

ఎలైన్‌మెంట్‌ కమిటీ ప్రాథమిక ఆమోదంపై మాట్లాడేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు గానీ ఇటు రాష్ట్ర ఎన్‌హెచ్‌ఏఐ(భారత జాతీయ రహదారుల అధికార సంస్థ) అధికారులు గానీ ఇష్టపడటం లేదు.

మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే ఈ ప్రాజెక్టుపై బహిరంగంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పూర్తిగా కేంద్రంతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టుపై ఆచితూచి స్పందించాల్సిన అవసరముందని కొందరు అధికారులు బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెడల్పును రాష్ట్ర ప్రభుత్వం 150 మీటర్లకు ప్రతిపాదించగా 70 మీటర్లకు ఎలైన్‌మెంట్‌ కమిటీ కుదించడంపై మాట్లాడేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ సుముఖత వ్యక్తం చేయలేదు.

”సీఆర్‌డీఏ పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఓ భాగం మాత్రమే. దానిపై మేం బహిరంగంగా మాట్లాడలేం” అని బీబీసీతో అన్నారు.

అమరావతి రింగ్ రోడ్

ఫొటో సోర్స్, Getty Images

‘అధ్యయనం చేస్తున్నాం’

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్‌ రెడ్డి వద్ద ఈ విషయాన్ని బీబీసీ ప్రస్తావించగా ఆయన ఇలా స్పందించారు.

”ఎలైన్‌మెంట్ కమిటీ సూచనలు సిఫార్సులను అధ్యయనం చేస్తున్నాం. కూలంకషంగా పరిశీలించిన తర్వాతే మాట్లాడతాం” అని అన్నారు.

ఇక పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్ర స్థాయి అధికారి ఒకరు బీబీసీ వద్ద మాట్లాడుతూ, ”అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. భవిష్యత్‌ అవసరాలకు కూడా సరిపోతుందనే కమిటీ 70 మీటర్లను ప్రతిపాదించింది. దీనిపై రాష్ట్ర స్థాయిలో పనిచేసే మేం ఏం చెప్పగలం? వాళ్ల ఆదేశాలను అనుసరించడమే మా పని” అని వ్యాఖ్యానించారు.

‘కేంద్రంపై ఒత్తిడి తేవాలి’

ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని రాష్ట్రం ప్రకటిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు ఓఆర్‌ఆర్‌ వెడల్పు 70 మీటర్లు సరిపోదని రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు బీబీసీతో అన్నారు.

”ఒకటి రెండు దశాబ్దాల్లోనే విజయవాడ, గుంటూరు, తెనాలి నగరాలు పూర్తిగా కలిసిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్‌ఆర్‌ నిర్మించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. రూ.16 వేలకోట్ల ప్రాజెక్టు చేపట్టే ముందు మరో దఫా పరిశీలించి కేంద్రం నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మొహమాట పడకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)