SOURCE :- BBC NEWS
ఆంధ్రప్రదేశ్ తీరం పొడవెంత ? ఈ ప్రశ్న పోటీ పరీక్షల్లో అడుగుతుండటం చూసే ఉంటారు. దానికి సమాధానం 973/974 కిలోమీటర్లు అని కూడా వినే ఉంటారు, చదివే ఉంటారు.
కచ్చితంగా చెప్పాలంటే 973.70 కిలోమీటర్లు. కానీ.. ఇకపై ఈ సమాధానం తప్పు కావొచ్చు. దాని వల్ల ఒక మార్కును కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం పొడవు పెరిగింది. అవును.. ఇది నిజం.
అదేంటి, మనుషులు, మొక్కలు పొడవు పెరిగినట్లు.. తీర ప్రాంతాలు కూడా పొడవు పెరుగుతాయా? అదెలా సాధ్యం? సముద్ర శాస్త్ర అధ్యయన నిపుణులు ఏమంటున్నారు?
తీరం పొడవు ఎంత పెరిగిందంటే..
ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా 1970లో దేశంలోని మొత్తం తీర ప్రాంతం పొడవును లెక్కించింది. అప్పటి డేటా ప్రకారం, దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్రతీరం పొడవు 7,516.6 కిలోమీటర్లుగా నిర్ధరించింది.
ఇందులో, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు 973.70 కిలోమీటర్లుగా లెక్కతేల్చింది.
తాజా గణాంకాల ప్రకారం, ఇప్పుడది 973.70 కిలోమీటర్ల నుంచి 1053.07 కిలోమీటర్లకు పెరిగింది. అంటే, తీరం పొడవు 79.37 కిలోమీటర్లు పెరిగింది. గతంతో పోలిస్తే 8.154 శాతం పెరిగింది.
ఈ అంశంపై విశాఖలోని జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్ సైంటిస్ట్ వీవీఎస్ఎస్ శర్మ బీబీసీతో మాట్లాడారు.
“తాజాగా మరోమారు తీరప్రాంత లెక్కింపు జరిగింది. దీనిని రీ-కాలిక్యులేషనల్ లేదా రీ-వెరిఫికేషన్ అంటారు. ఇది నేషనల్ మారిటైం సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ నిర్దేశించిన విధివిధానాల ప్రకారం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్‌లో ఏపీ తీరం పొడవు 1053.07 కిలోమీటర్లుగా తేల్చారు. అలాగే, భారతదేశ తీరం పొడవు కూడా 11,098.81 కిలోమీటర్లుగా లెక్కించారు.
గతంలో ఏపీ తీరం పొడవు 973.70 కిలోమీటర్లు కాగా, దేశంలో మొత్తం తీరప్రాంతం పొడవు 7,516 కిలోమీటర్లుగా ఉండేది” అని ఆయన చెప్పారు.
నిజంగానే తీరం పొడవు పెరిగిందా?
తీరప్రాంతం పొడవు వాస్తవంగా పెరగదని.. కానీ లెక్కల్లో పెరిగిందని వీవీఎస్ఎస్ శర్మ చెప్పారు. అదెలా అంటే.. రీ-వెరిఫికేషన్ పేరుతో మళ్లీ తీరాన్ని కొలిచినప్పుడు దాని కొలతలు పెరిగాయని అన్నారు.
“భారతదేశం తీరం పొడవు కానీ, ఆంధ్రప్రదేశ్ తీరం పొడవు కానీ నిజంగా పెరగలేదు. పెరగదు కూడా. కానీ, 1970లో చేసిన సర్వే లెక్కలతో పోల్చినప్పుడు.. ఇప్పుడు చేసిన సర్వే విధానం వల్ల కొలతలు మారాయి.
అది కూడా ఎందుకంటే, 54 ఏళ్ల కిందట తీరప్రాంత కొలతలు తీసినప్పుడు ప్రతి 50 కిలోమీటర్లను ఒక యూనిట్‌గా తీసుకుని.. నిలువుగా కొలుచుకుంటూ పోయారు.
కానీ, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఈ టెక్నాలజీ సాయంతో నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ విధానాల ప్రకారం ఇప్పుడు చేసిన రీ-వెరిఫికేషన్‌లో తీరాన్ని నిలువుగా కాకుండా.. ప్రతి మలుపు, ఎత్తుపల్లాలు, ఒంపులు.. ఇలా ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా ప్రతి అంగుళాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో తీరం పొడవు పెరిగినట్లైంది” అని వీవీఎస్ఎస్ శర్మ చెప్పారు.
“అంటే, వాస్తవానికి తీరం పెరగలేదు. కానీ, తీరం కొలతలు పెరిగాయి” అన్నారాయన.
తాజా లెక్కల ప్రకారం భారతదేశ తీరప్రాంత పొడవు 48 శాతం పెరిగినట్లైంది. గతంలో 7,516.6 కిలోమీటర్లు ఉండగా.. ఇప్పుడది 11,098.81 కిలోమీటర్లకు పెరిగింది.
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానం, కరైకల్ తదితర తీరాల మొత్తం పొడవు 47 కిలోమీటర్ల నుంచి 42.65 కిలోమీటర్లకు తగ్గింది.
మూడో స్థానానికి ఏపీ..
దేశంలోనే రెండో అత్యధిక తీరప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ, ఇప్పుడు కాదు. ఏపీ స్థానంలోకి తమిళనాడు వచ్చి చేరింది. ఏపీ మూడో స్థానంలో ఉంది.
తాజాగా జరిగిన రీ-వెరిఫికేషన్‌లో తమిళనాడు తీరం 906.90 కిలోమీటర్ల నుంచి 1068.69 కిలోమీటర్లకి పెరిగినట్లు లెక్కతేలింది. దీంతో ఏపీ రికార్డు మూడో స్థానానికి మారింది.
కానీ, గుజరాత్ మాత్రం అప్పుడు, ఇప్పుడు కూడా పొడవైన తీరప్రాంతం కలిగిన రాష్ట్రంగా మొదటి స్థానంలో ఉంది. 1970 లెక్కల ప్రకారం గుజరాత్ తీరం 1214.70 కిలోమీటర్లు ఉండగా.. తాజాగా అది 2340.62 కిలోమీటర్లకు పెరిగింది. అంటే 92.69 శాతం పెరిగింది.
దేశ భద్రత, ఇంధన భద్రతను పెంపొందించే లక్ష్యంతో నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ (ఎన్‌ఎంఎస్‌సీ) వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సముద్ర రంగంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ఎన్ఎంఎస్సీని ఏర్పాటు చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
సముద్ర వ్యవహారాలు, రక్షణ, సముద్ర వాణిజ్యం (బ్లూ ఎకనామీ) వంటి అంశాల నిర్వహణకు ఈ వ్యవస్థ పని చేస్తుంది.
సమద్ర చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు దేశానికి సంబంధించిన సముద్ర కార్యకలాపాలను సమన్వయం చేయడాన్ని ఎన్‌ఎంఎస్‌సీ విధుల్లో చేర్చారు.
అంతేకాకుండా, తీవ్రవాదం, పైరసీ, మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల రవాణా, దేశీయ జలాల్లో అక్రమంగా చేపలు పట్టడం వంటి చర్యలను ఎప్పటికప్పుడు పసిగట్టి, వాటిని నిలువరించే విధంగా చర్యలు చేపట్టనున్నారు.
కొత్త గణాంకాల ప్రకారం..
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS