SOURCE :- BBC NEWS

34 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు

ఫొటో సోర్స్, Queensland Police

ఆస్ట్రేలియాకు చెందిన ఓ సోషల్ మీడియా వుమన్ ఇన్‌ఫ్లూయెన్సర్ విరాళాల కోసం, ఆన్‌లైన్‌లో ఫాలోయర్లను పెంచుకోవడం కోసం తన బిడ్డకు మందులు ఇస్తూ ప్రచారం చేసుకున్నారంటూ ఆ దేశ పోలీసులు కేసు నమోదు చేశారు.

తన బిడ్డ తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతోందని, ప్రాణాంతకమై వ్యాధితో ఆమె చేస్తున్న పోరాటాన్ని తాను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నానని ఆమె చెప్పుకునేవారు. అయితే, డిటెక్టివ్‌లు చెప్పిన దాని ప్రకారం, ఆ మహిళ తన కూతురికి డ్రగ్స్ ఇచ్చి, ఆమె అత్యంత తీవ్రమైన బాధతో, నొప్పితో బాధపడుతోందంటూ చిత్రీకరించారు.

ఆరోగ్య సమస్యలతో దాదాపు ఏడాది వయసున్న ఆ శిశువును ఆసుపత్రిలో చేర్చినప్పుడు వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

కొన్ని నెలల విచారణ తర్వాత, 34 ఏళ్ల మహిళపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. మోసం, చిత్రహింసలు, చిన్నారులను ఫోటోలు, వీడియోలు చిత్రించడం ద్వారా దోపిడికి పాల్పడటం, విషప్రయోగం ఆరోపణలను ఆమెపై మోపారు.

‘‘ఇది ఎంత ఘోరమైన నేరమో చెప్పడానికి మాటలు చాలవు’’ అని క్వీన్స్‌లాండ్ పోలీస్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పాల్ డాల్టన్ విలేఖరుల సమావేశంలో అన్నారు.

ఆగస్ట్, అక్టోబరు నెలల మధ్య, క్వీన్స్‌లాండ్ లోని సన్‌షైన్ కోస్ట్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ కొన్ని ప్రిస్క్రిప్షన్ ‌ మందులు, కొన్ని ఫార్మసీ నుంచి కొనుగోలు చేసిన మందులను అనుమతి లేకుండానే తన బిడ్డకు తినిపించారని డిటెక్టివ్‌లు పేర్కొన్నారు.

అక్రమ మార్గంలో మందులు కొనడానికి ఆమె అనేక ప్రయత్నాలు చేశారని, ఇంట్లో మిగిలిపోయిన పాత మందులను కూడా ఆ పాపకు తినిపించారని పోలీసులు ఆరోపించారు.

ఆరోగ్యం బాగాలేదంటూ ఆమె ఆ పాపను అక్టోబర్ 15న ఆసుపత్రికి తీసుకువచ్చారు. గత ఏడాది జనవరి నుంచి ఆమె చిన్నారికి ఇలా మందులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉందని ఇన్‌స్పెక్టర్ డాల్టన్ తెలిపారు.

గో ఫండ్ మీ (GoFundMe) అనే సంస్థ వెబ్‌సైట్‌‌కు ఆమె ప్రచారం కారణంగా రూ. 27 లక్షలు విరాళాలుగా వచ్చాయని, ప్రస్తుతం ఈ డబ్బును ఆ సంస్థ దాతలకు తిరిగి ఇవ్వనుందని ఇన్‌స్పెక్టర్ డాల్టన్ చెప్పారు.

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇతర వ్యక్తులను కూడా విచారించారు. అయితే, వారిపై కేసులు పెట్టడానికి సరైన ఆధారాలు దొరకలేదని డాల్టన్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)