SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ANI
టెర్రరిజంపై భారత్ చేసిన పోరాటంలో ‘ఆపరేషన్ సిందూర్’ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించిందని సోమవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిపిన దాడిలో 26 మంది చనిపోయిన తర్వాత పాకిస్తాన్ ”టెర్రరిస్ట్ స్థావరాలపై” న్యూదిల్లీ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులు చేసిన ఐదు రోజుల తరువాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఈ దాడులు అణ్వస్త్రాలు కలిగిన ఇరుదేశాలు మధ్య ఘర్షణకు దారితీసిన తరువాత సీమాంతర సైనిక కార్యకలాపాలు నిలిపివేసేందుకు శనివారం (మే10వతేదీ) ఒక అవగాహనకు వచ్చాయి.

భారత్ ప్రస్తుతానికి తన ప్రతీకారచర్యలను మాత్రమే నిలిపివేసిందని సోమవారం మోదీ ఉద్ఘాటించారు.
”రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే దానిపై ఆధారపడి పాక్ ప్రతి అడుగును సునిశితంగా పరిశీలిస్తాం.” అని చెప్పారు.
పాకిస్తాన్‌పై సైనిక చర్యలను, దాడులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించడంపై తన మద్దతుదారులలో కొంతమందిలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి దీని ద్వారా మోదీ ప్రయత్నించారని కొంతమంది రాజకీయ పరిశీలకులు బీబీసీకి చెప్పారు.
భారత్-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ వాషింగ్టన్ మధ్యవర్తిత్వంపై ప్రధాని మోదీ ఈ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హమని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మధ్యవర్తిత్వంపై ఎలాంటి ప్రస్తావన లేదు
భారత్-పాకిస్తాన్లను సంప్రదింపులకు తీసుకొచ్చింది అమెరికాయేనని ట్రంప్ మాత్రమే కాకుండా, ఆయన డిప్యూటీ జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పేర్కొన్నారు.
ఒక తటస్థ ప్రదేశంలో విస్తృతమైన అంశాలపై చర్చలు జరిపేందుకు రెండు దేశాలు అంగీకరించాయనికూడా రూబియో చెప్పారు.
ఉద్రిక్తతలను తగ్గించినందుకు కేవలం అమెరికాకు మాత్రమే కాక, బ్రిటన్, తుర్కియే, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌కు కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం రాత్రి తన ప్రసంగంలో కృతజ్ఞతలు చెప్పారు.
కానీ దీనికి దీనికి విరుద్ధంగా, ఏ మూడో వ్యక్తి ప్రమేయాన్ని మోదీ ప్రస్తావించలేదు.
”భారీ నష్టాలను ఎదుర్కొంటోన్న పాకిస్తాన్, భారత సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ)ను సంప్రదించిన తర్వాతనే భారత్ వెనక్కి తగ్గిందని చెప్పడంతో పాటు తమవైపు నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు లేదా సైనిక కవ్వింపులు ఉండవని పాకిస్తాన్ చెప్పింది” అని మోదీ తెలిపారు.
ఈ విషయంలో భారత దీర్ఘకాలిక వైఖరిని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పునరుద్ఘాటించినట్లు అనిపిస్తుందని విదేశీ వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ ఇంద్రాణి బాగ్చి అన్నారు.
”పాకిస్తాన్ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని లేదా మూడో వ్యక్తి ప్రమేయాన్ని ఎన్నడూ ఒప్పుకోమని భారత్ చెబుతూ వస్తోంది.” అని తెలిపారు.
‘‘టెర్రరిజం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్’’ అనే రెండు అంశాలపైనే పాకిస్తాన్‌తో చర్చలు జరుగుతాయని మోదీ తన ప్రసంగంలో చెప్పారు.
కశ్మీర్ విషయంపై పరిష్కారం చూపుతామంటూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌కు పరోక్ష మందలింపుగా మోదీ ప్రకటన ఉందని దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ప్రొఫెసర్, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ ప్రకటనల ద్వారా మోదీ తన స్పష్టమైన సందేశాన్ని అమెరికా అధ్యక్షునికి పంపించారని బాగ్చి చెప్పారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు అయినప్పటి నుంచి, కశ్మీర్ విషయంపై ఎలాంటి చర్చలు ఉండవని భారత్ స్పష్టం చేసిందని బాగ్చి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సరికొత్త ప్రమాణమా?
”ఆపరేషన్ సిందూర్” సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించిందని చెప్పిన మోదీ… ఈ సందర్భంగా మూడు విషయాలను ప్రముఖంగా ప్రస్తావించారు. వాటిల్లో భారత్ అణ్వాయుధ బెదిరింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని చెప్పారు. ఈ విషయంలో న్యూదిల్లీ స్పష్టమైన హద్దును గీసిందని బాగ్చి అన్నారు.
2016లో నియంత్రణ రేఖ గుండా సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం నుంచి ఈ నెల ప్రారంభంలో చేపట్టిన ”ఆపరేషన్ సిందూర్” క్షిపణి దాడుల వరకు.. భారత సైనిక చర్యలకు స్పందనగా అణ్వాయుధాలను మోహరిస్తామనే పాకిస్తాన్ బెదిరింపులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందని బాగ్చి చెప్పారు.
”2016 ముందు కూడా పాకిస్తాన్ లోపల భారత్ దాడులు చేసినప్పటికీ వాటిని ప్రచారం చేసుకోలేదు. అప్పటి నుంచి ఈసారి నాలుగు రోజుల పాటు నిరంతరం దాడులు చేసే వరకూ.. భారత్ అణ్వస్త్ర పరిధిని పెంచుకుంటూ వచ్చింది” అని తెలిపారు.
ప్రధాని మోదీ చెప్పిన విధానాలు ఏమీ కొత్తగా లేవని పొలిటికల్ కాలమిస్ట్ అదితి ఫడ్నీస్ చెప్పారు.
అయితే మోదీ చెప్పిన ‘‘సరికొత్త ప్రమాణాన్ని’’ ఆమె ప్రస్తావించారు. తమ సొంత పద్ధతిలో టెర్రరిజానికి భారత్ గట్టిగా బదులిస్తుందని, ”ఉగ్రవాద సూత్రధారులను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాన్ని” భారత్ విడివిడిగా చూడదని మోదీ చెప్పారు.
2016లో ఉరీ సైనిక స్థావరంలో 19 మంది భారత సైనికులు చనిపోయినప్పుడు, 2019లో పుల్వామా బాంబు దాడిలో 40 మంది భారత పారామిలటరీ బలగాలు మరణించినప్పుడు కూడా మోదీ ప్రభుత్వం ఇదే చెప్పిందని ఫడ్నీస్ అన్నారు.
”ప్రతిసారి భారత స్పందన గట్టిగానే ఉంటుంది. ఈసారి కూడా ఇదే జరిగింది. కానీ, ఉగ్రవాద దాడులను ఆపలేకపోతోంది. మళ్లీ ఇవి జరిగే అవకాశం ఉంది.” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ సందేశం
సైనిక కార్యకలాపాలు ఆపివేసేందుకు ఇరు దేశాలు అంగీకరించి రెండు రోజులైనప్పటికీ, అధికార భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్న వారితో పాటు చాలామంది ఇప్పటికీ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
పాకిస్తాన్‌ను మరింత దెబ్బతీసేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లు వారు చూస్తున్నారు.
మోదీ ప్రసంగం తన రాజకీయ మద్దతుదారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినట్లుగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ నీర్జా చౌదరి బీబీసీతో అన్నారు.
”క్షిపణి దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను హత మార్చామని చెబుతూ, భారత్ ప్రస్తుతానికి మాత్రమే తన చర్యలను నిలిపివేసిందన్నారు. పాకిస్తాన్ స్పందనను బట్టి మా బదులు గట్టిగా కొనసాగుతుందన్నారు. తన ప్రసంగం ద్వారా గట్టి సందేశాన్ని పంపాలని ప్రయత్నించారు.” అని నీర్జా చౌదరి చెప్పారు.
”సిందూర్” ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ, భావోద్వేగ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని ప్రధానమంత్రి లక్ష్యంగా చేసుకున్నారు.” అని ఆమె అన్నారు.
”మన సోదరీమణులు, బిడ్డల నుదుటి సిందూరం తుడిచివేయడానికి ప్రయత్నించిన ప్రతి టెర్రరిస్ట్ సంస్థకు దాని పర్యవసానాలు ఏమిటో తెలిసి వచ్చింది.” అని మోదీ తన ప్రసంగంలో చెప్పారు.దీని ద్వారా సామాన్య ప్రజలకు దగ్గర కావాలని ప్రధాని మోదీ ప్రయత్నించారని నీర్జా చౌదరి అన్నారు.
”ఇతర ఉగ్రవాదుల దాడులతో పోలిస్తే పహల్గాం దాడి భిన్నమైంది. పురుషులను వారి మతం అడిగారు. వారి భార్యలు, పిల్లల ముందే కాల్చిచంపారు. సెంటిమెంట్ పరంగా దీనికి ఉన్న విలువను ప్రధాని అర్థం చేసుకున్నారు. అందుకే, దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.” అని నీర్జా చౌదరి చెప్పారు.
తన మద్దతుదారుల్లో అసంతృప్తిని ప్రధాని మోదీ ప్రసంగం తగ్గిస్తుందని భావించడం లేదని అదితి ఫడ్నీస్ చెప్పారు.
”ప్రధాని పాకిస్తాన్ వ్యవహారంలో ప్రజలను ఒప్పించే విధంగా మాట్లాడుతున్నారంటే, ప్రభుత్వం ఇప్పటి వరకూ తాను చేస్తూ వచ్చిన ప్రచారాలకు తానే బాధితురాలిగా మారిందని… అయితే ఆ సమస్యను అధిగమించడానికి నిన్నటి ప్రసంగం ఉపయోగపడిందా అంటే, చెప్పలేము.” అని తెలిపారు.
భారత్-పాకిస్తాన్ మధ్యలో మధ్యవర్తిత్వం ఘనత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కే దక్కుతుందనే విషయం మోదీ మద్దతుదారులకు అంత రుచించడం లేదన్నారు. దీన్ని విపక్షాలు కూడా ఎత్తిచూపుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ సందేశం
భారత్ క్షిపణులు దాడులు జరిపిన బహవల్పూర్, మురీద్కే గ్లోబల్ టెర్రరిజానికి యూనివర్సిటీలుగా ఉన్నాయని మోదీ చెప్పారు.
భారత్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రవాదదాడులకు , అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 9/11 దాడులకు, 2005లో లండన్ ట్యూబ్ బాంబు దాడులకు ఈ నగరాల్లోనే మూలాలు ఉన్నాయని అన్నారు.
ఇలా చేయడం ద్వారా భారత చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు పెంచేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని ఇంద్రాణి బాగ్చి చెప్పారు.
” 9/11 దాడుల తర్వాత అమెరికాలో ఒక తరం వచ్చేసింది. 2005 తర్వాత బ్రిటన్‌లో మరో తరం పుట్టింది. ప్రపంచ ప్రయోజనం కోసం భారత్ ఏం చేసిందో చెప్పేందుకు మోదీ వారికి సందేశం ఇవ్వాలనుకున్నారు.” అని బాగ్చి భావిస్తున్నారు.
సీనియర్ రాజకీయ విశ్లేషకులు అదితి ఫడ్నీస్ కూడా దీన్ని అంగీకరించారు.
” ఈ ఏడాది చివరిలో భారత్‌లో జరిగే క్వాడ్ సదస్సులో ఈ విషయాన్ని మోదీ ట్రంప్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతారు. లేదంటే, ఐక్యరాజ్యసమితిలో దీన్ని లేవనెత్తనున్నారు.” అని తెలిపారు.
” భారత్ బుద్ధుడికి చెందిన దేశం. యుద్ధం దేశం కాదు. ఈ ప్రకటన కూడా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ బుద్ధ పౌర్ణమి అని మోదీ ప్రస్తావించినప్పటికీ, శక్తిసామర్థ్యాల మార్గం ద్వారానే శాంతిని చేరుకోగలమని’’ ఆయన చెప్పారుఅని ఫడ్నీస్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)