SOURCE :- BBC NEWS

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియా ప్రాంక్ కోసం వేసిన ఒక పెళ్లి సెట్టింగ్‌లో పెళ్లి కూతురిగా నటించానని అనుకున్నారు ఆమె.

కానీ, తర్వాత అది నకిలీ పెళ్లి కాదు నిజంగానే పెళ్లి అయినట్లు తెలుసుకొని షాకయ్యారు. తన ఇష్టపూర్వకంగా జరగని ఆ పెళ్లిని రద్దు చేయాలంటూ కోర్టుకెళ్లి విజయం సాధించారు.

ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ విషయంలో ఇదంతా జరిగింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన తన భాగస్వామి ఒకరు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రాంక్ చేయడానికి పెళ్లి వేడుకలో భాగం కావాలని తనను ఒప్పించినట్లు ఆమె చెప్పారు.

ఈ పెళ్లిని వాడుకొని ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్సీ) పొందాలని ఆయన ప్రయత్నించినప్పుడు అసలు విషయం ఆమెకు అర్థమైంది.

మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని నిరూపణ కావడంతో ఈ పెళ్లిని రద్దు చేస్తున్నట్లు మెల్‌బోర్న్‌ కోర్టు తీర్పు చెప్పింది. గురువారం ఈ తీర్పు వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

2023 సెప్టెంబర్‌లో ఒక ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో తొలిసారి వీరిద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పట్లో మెల్‌బోర్న్‌లో నివసించిన వీరు తరచుగా కలుసుకునేవారు.

అదే ఏడాది డిసెంబర్‌లో తాను ప్రేమిస్తున్నట్లుగా చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు.

ఇది జరిగిన రెండు రోజుల తర్వాత, సిడ్నీలో ఆయనతో కలిసి ఆమె ఒక ఈవెంట్‌కు హాజరయ్యారామె. ఆ ఈవెంట్ ఒక ‘వైట్ పార్టీ’ అని, అక్కడికి అందరూ తెలుపు రంగు దుస్తుల్లోనే వస్తారని, కాబట్టి ఒక తెలుపు రంగు డ్రెస్‌లో రావాలని తనకు చెప్పినట్లు ఆమె వెల్లడించారు.

కానీ, ఆ ఈవెంట్‌కు వెళ్లాక తాను షాక్‌కు గురయ్యానని, కోపం వచ్చిందని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఆ మహిళ పేర్కొన్నారు. ఎందుకంటే ఆ పార్టీలో తన పార్ట్‌నర్, ఒక ఫోటోగ్రాఫర్, ఆ ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్, ఒక ప్రీస్ట్ మాత్రమే కనిపించడంతో గందరగోళానికి గురయ్యానని ఆ పత్రాల్లో చెప్పారామె.

”నేను అక్కడికి చేరుకోగానే, తెలుపు దుస్తుల్లో ఎవరూ నాకు కనిపించలేదు. ఇదేంటని నేను అతన్ని అడిగాను. నన్ను పక్కకు లాక్కెళ్లి, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ కోసం ఒక ప్రాంక్ వెడ్డింగ్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. తన పేజీకి కంటెంట్‌ కావాలని, దానిని మోనిటైజ్ చేయబోతున్నానని అందుకే ఇదంతా అని చెప్పాడు” అని ఆమె వివరించారు.

ఇన్‌స్టాగ్రామ్

ఫొటో సోర్స్, Getty Images

ఆయనొక సోషల్ మీడియా పర్సన్ కావడం, ఆయన ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 17,000కు పైగా ఫాలోయర్లు ఉండటంతో ఆయన చెప్పింది నిజమేనని నమ్మినట్లు ఆమె చెప్పారు. అయినా కోర్టు ఆమోదంతో జరిగే సివిల్ మ్యారేజ్‌లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి కదా అని ఆమె అనుకున్నారు.

అయినప్పటికీ, ఆందోళనగానే ఉండటంతో ఒక ఫ్రెండ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ ఫ్రెండ్ నవ్వుతూ ఇందులో భయపడాల్సిందేమీ లేదని చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒకవేళ అది నిజమైన పెళ్లి అయితే ముందుగా ఆ పెళ్లికి సంబంధించి ఒక నోటీసును ఫైల్ చేయాల్సి ఉంటుందని, అలాంటిదేమీ చేయలేదు కాబట్టి ఆందోళన అక్కర్లేదని చెప్పినట్లు ఆమె తెలిపారు.

దీంతో కుదుటపడిన ఆమె పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. వేడుకలో భాగంగా పెళ్లి ప్రమాణాలు చేసుకోవడంతో పాటు కెమెరా ముందు ముద్దు కూడా పెట్టుకున్నారు. వీడియో సహజంగా కనిపించేందుకు, తాను సంతోషంగా ఆ వేడుకలో పెళ్లి కూతురిగా నటించానని ఆమె చెప్పారు.

రెండు నెలల తర్వాత, ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం కోసం ఆమె చేసిన దరఖాస్తులో డిపెండెంట్‌ స్థానంలో తన పేరును రాయాలంటూ ఆయన కోరారు. వారిద్దరూ విదేశీయులే.

పెళ్లి జరక్కుండా తాను ఆ పని చేయలేనంటూ చెప్పడంతో, సిడ్నీలో జరిగింది నకిలీ పెళ్లి కాదని అసలు పెళ్లేనని ఆయన వెల్లడించినట్లు వాంగ్మూలంలో ఆమె తెలిపారు.

సోషల్ మీడియా

ఆ తర్వాత వివాహ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె చూశారు. సిడ్నీ పర్యటనకు నెల రోజుల ముందే, సదరు పెళ్లి తాలూకూ నోటీసు నమోదు అయినట్లు ఆమె తెలుసుకున్నారు. అయితే, ఆ నోటీసుపై తాను సంతకం చేయలేదని ఆమె కోర్టులో తెలిపారు.

కోర్టు పత్రాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆ నోటీసులోని సంతకం ఆ మహిళ సంతకంతో సరిపోలలేదు.

”అది నిజం పెళ్లి అని నాకు తెలియదు. అతను నాతో అబద్ధాలు చెబుతున్నాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా అప్లికేషన్‌లో అతని పేరును చేర్చాలని ఆయన కోరుకుంటున్నాడని నాకు తెలియదు. ఇవన్నీ తెలిశాక నాకు చాలా కోపం వచ్చింది” అని ఆమె చెప్పారు.

ఈ కండీషన్లు అన్నింటికీ ఇద్దరి సమ్మతం ఉందని, తాను ప్రపోజ్ చేశాక సిడ్నీలో ఒక సన్నిహిత వేడుకలో పెళ్లికి ఆమె ఒప్పుకుందని ఆయన వాదించారు.

అయితే, ఈ ఇది నిజమైన పెళ్లి కాదని, దీనికి ఆమె అంగీకారం తెలపలేదని కోర్టు గుర్తించినట్లు తీర్పులో చెప్పారు.

”తాను నటిస్తున్నానే ఆమె అనుకున్నారు. అదొక ప్రాంక్ ఈవెంటని ఆమె భావించారు. వీడియో విశ్వసనీయతను పెంచేందుకు ఆ వేడుకలో సహజంగా ఒక పెళ్లి కూతురిలా కనిపించేలా ఆమె ప్రవర్తించారు. ఆ వీడియో చట్టబద్ధంగా చెల్లుబాటయ్యేలా రూపొందించారు” అని తీర్పులో జడ్జి పేర్కొన్నారు.

2024 అక్టోబర్‌లో ఈ వివాహాన్ని చట్టబద్ధంగా రద్దు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)