SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ప్రోటీన్ ఆహారం అనగానే గుడ్లు, చికెన్ వంటివి గుర్తొస్తాయి.
పండ్లు తింటే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అందుతాయని చాలా మందికి తెలుసు. కానీ, పండ్లలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రోటీన్ ఉంటుందనే సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు.
”కొన్ని పండ్లలో 4 గ్రాములకు పైగా ప్రోటీన్ ఉంటుందనే సంగతి తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు” అని మయో క్లినిక్‌కు చెందిన న్యూట్రిషనిస్ట్ ఆండ్రియా డెల్గాడో చెప్పారు.
మన ఆహారంలో అన్ని రకాల పోషకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. మన శరీరానికి ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకర కొవ్వులు అవసరమని చెప్పిన ఆమె కొన్ని పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కండరాలను బలోపేతం చేసుకోవచ్చని తెలిపారు.
కండర సామర్థ్యం కోసం ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నవారు ఈ అయిదు రకాల పండ్లను జాబితాలో చేర్చుకోవచ్చని ఆమె సూచిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
జామ
ఒక కప్పు జామలో 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని, రోజువారీగా తీసుకోవాల్సిన విటమిన్ సి, రెట్టింపు మొత్తంలో లభిస్తుందని ఆండ్రియా తెలిపారు.
”జామ విత్తనాల్లో ప్రోటీన్ ఉంటుంది. అందుకే జ్యూస్ కంటే కూడా గుజ్జును తినడమే మంచిది” అని ఆమె సిపార్సు చేశారు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ కెరొటనాయిడ్స్ పుష్కలంగా ఉండే జామ పండ్లు, కండరాల రికవరీకి సహాయపడతాయి. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తాయి.
ఒక వ్యక్తికి ఒక రోజుకు కావాల్సిన విటమిన్ సి కంటే జామపండులో దాదాపు 300 శాతం అధికంగా విటమిన్ సి లభిస్తుంది. ఇది కొల్లాజెన్ సంశ్లేషణ, రోగనిరోధక పనితీరుకు సహాయపడుతుంది.
జామను సహజ యోగర్ట్‌తో కలిపి తీసుకోవడం వల్ల ప్రోటీన్‌తో పాటు కాల్షియం, ప్రోబయాటిక్స్ కూడా లభిస్తాయని ఆండ్రియా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాషన్ ఫ్రూట్
ఒక కప్పు పాషన్ ఫ్రూట్లో దాదాపు 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని ఆండ్రియా చెప్పారు.
ఈ పండులోని ప్రతి గింజలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. గుజ్జును వడపోసి గింజలను వేరుచేస్తే వీటిని మనం కోల్పోతాం.
అందుకే జ్యూస్‌లా కాకుండా పండు రూపంలోనే దీన్ని తినాలని సూచిస్తారు. ఒకవేళ జ్యూస్ చేసుకుంటే గింజలు తొలగించకూడదు.
”ఒకవేళ జ్యూస్‌ను వడకట్టి తీసుకుంటే మీకు కేవలం చక్కెరలు మాత్రమే అందుతాయి. అందుకే గింజలతో సహా జ్యూస్ చేసుకుంటే మంచిది” అని ఆండ్రియా సూచించారు.
ఈ పండ్లలో ప్రోటీన్‌తో పాటు నీళ్లలో కరిగే పీచు పదార్థాలు, మెగ్నీషియం, రక్తపోటును నియంత్రించే ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి.
అంటే వ్యాయామం తర్వాత పాషన్ ఫ్రూట్ స్మూతీని తీసుకుంటే దాదాపు ఒక స్కూప్ కమర్షియల్ ప్రోటీన్ పౌడర్‌తో లభించే ప్రోటీన్ లభిస్తుందన్నమాట. అదనంగా సహజ యాంటీ ఆక్సిడెంట్లు కూడా అందుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
దానిమ్మ
దానిమ్మపండ్లలో అద్భుతమైన పోషకాలుంటాయని ఆండ్రియా తెలిపారు.
కప్పు దానిమ్మ విత్తనాలు 4 గ్రాముల ప్రోటీన్ అందిస్తాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, యాంటీ ఆక్సిడెంట్ల చర్యకు ఉపకరిస్తాయి.
రక్తపోటు సరిగ్గా ఉండడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి దానిమ్మ జ్యూస్ సహాయపడుతుందని సంస్థ నిర్వహించిన అధ్యయనాలు సూచిస్తున్నాయి.
దానిమ్మ విత్తనాలలోని ఫైబర్ జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది. అలాగే తిన్నామన్న సంతృప్తిని పెంచుతుంది. గుండెనాళాలు, నాడీ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తాయి.
దానిమ్మ ప్రత్యేక రుచి, అన్ని రకాల సలాడ్లకు కొత్త రుచిని కల్పిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పనస
వండి తినాలసిన పండ్లకు ఆండ్రియా తన జాబితలో చోటు కల్పించారు. వ్యాయామం చేసేటప్పుడు వాటిని తింటే చాలా ఉపయోగంగా ఉంటుంది.
శాకాహార వంటల్లో మాంసానికి ప్రత్యామ్నాయంగా ఎండిన పనస ఉపయోగిస్తారు. దీనిని ఉడికించి తినొచ్చు. వేయించుకుని తినొచ్చు. లేదా కాల్చుకుని తినొచ్చు.
ఈ పండు 2.5 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తుందని, ఎముకల ఆరోగ్యానికి కీలకమైన పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఇందులో ఉంటాయని ఆండ్రియా తెలిపారు.
వండిన తర్వాత కూడా ఇందులో ఫైబర్, ప్రొటీన్ చెక్కుచెదరకుండా ఉంటాయన్నారు.
ఎండిన ఆప్రికాట్
ఆప్రికాట్లలో అనేక రకాల పోషకాలుంటాయి.
ఒక కప్పు ఆప్రికాట్ల ద్వారా 4 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఆప్రికాట్ల ద్వారా ఈ ప్రొటీన్ చాలా తేలిగ్గా శరీరానికి అందుతుందని ఆండ్రియా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆండ్రియా అవకాడోలను తన జాబితాలో కూడా చేర్చలేదు.
“ఇతర డ్రై ఫ్రూట్స్ లేదా గింజలతో పోలిస్తే, అవకాడోలు తక్కువ ప్రోటీన్‌ను అందిస్తాయి” అని ఆండ్రియా వివరించారు. దీన్నుంచి ప్రోటీన్లు అంతగా అందవని తెలిపారు.
“ఇందులో ప్రోటీన్ ఉంటుంది, కానీ అది చాలా తక్కువ: కప్పుకు దాదాపు 1.8 గ్రాములు.” అని తెలిపారు.
తగినంత ప్రోటీన్ శరీరానికి అందడానికి, మనం కేజీ బరువుకు 1-1.2 గ్రాముల ప్రోటీన్ (65 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు 65 నుంచి 78 గ్రాముల మధ్య ప్రోటీన్ కావాలి ) తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
“పాషన్ ఫ్రూట్ నుంచి కప్పుకు ఐదు గ్రాముల ప్రొటీన్ తీసుకోవడం మామూలు విషయంగానే అనిపించొచ్చు. అయితే ఇతర ఆహారం ద్వారా మనకు అందని విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కూడా అది అందిస్తుంది” అని ఆండ్రియా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)