SOURCE :- BBC NEWS
నైజీరియాలోని ఒకిజా పట్టణంలో ఉచిత ఆహార సరఫరా కేంద్రాల వద్ద జనం కిక్కిరిసి, నలిగిపోయి చనిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరిందని పోలీసులు వెల్లడించారు.
ఈ దుర్ఘటన శనివారం జరిగింది.
ఆహారం పంపిణీ చేసే కార్యక్రమాల్లో ప్రజలు నలిగి చనిపోవడం ఒకే వారంలో ఇది మూడోసారి.
ఒకిజాలో ఓ చారిటీ ఈవెంట్ సందర్భంగా ఈ మరణాలు సంభవించాయి. క్రిస్మస్ సందర్భంగా దానంగా లభించే బియ్యం, నూనె వంటివి తీసుకునేందుకు స్థానికులు పోటెత్తడంతో ఈ ప్రమాదాలు జరిగాయి.
రాజధాని అబుజాలోనూ శనివారం ఇలాంటి విషాద ఘటనే జరగ్గా, అక్కడ 10 మంది చనిపోయారు. ఇబదాన్ నగరంలో బుధవారం ఓ కార్నివాల్ సందర్భంగా 35 మంది చిన్నారులు మరణించారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏమన్నదంటే
ఇలాంటి ప్రాణనష్టాన్ని నివారించేందుకు, చారిటీ కార్యక్రమాలు నిర్వహించబోయే ముందు అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు.
అబుజాలోని హోలీ ట్రినిటి క్యాథలిక్ చర్చిలో జరిగిన తొక్కిసలాటను చూసిన టోయిన్ అబ్దుల్ ఖాద్రి వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో మాట్లాడారు.
అక్కడికి వచ్చిన వారు ఒకరినొకరు తోసుకున్నారని ఆయన అన్నారు.
”ఈవెంట్‌కు వృద్ధులు కూడా వచ్చారు. నలుగురు పిల్లలు చనిపోయారు” అని పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాద ఘటనలపై సోషల్ మీడియా వేదికగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నైజీరియా విభాగం స్పందించింది.
‘‘ అధ్యక్షుడు బోలా టినుభు నేతృత్వంలోని ప్రభుత్వం, దేశంలో పడిపోతున్న జీవన ప్రమాణాలు, నిరుద్యోగం, ఆకలి వంటి అంశాలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి” అని సోషల్ మీడియాలో పేర్కొంది.
18 నెలల్లో ఖర్చులు మూడింతలు
నైజీరియాలో గత ఏడాదిన్నర కాలంలో ఆహారం, రవాణా ఖర్చులు మూడింతలకు పైగా పెరిగాయి.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇంధన సబ్సిడీ తొలగింపు సహా ప్రభుత్వం చేపట్టిన కొన్నిచర్యల వల్ల అక్కడ ద్రవ్యోల్బణం తీవ్రమైంది.
”సంతోషపడాల్సిన, వేడుకలు చేసుకోవాల్సిన సీజన్‌లో మనం మన తోటివారి మరణాలకు సంతాపం తెలియజేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి” అని ఒక ప్రకటనలో నైజీరియా అధ్యక్షుడు బోలా టినుభు పేర్కొన్నారు.
బాధితుల గౌరవార్థం తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్న ఆయన, రద్దీ నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
స్కూల్ ఫన్ ఫెయిర్‌లో 35 మంది చిన్నారుల మృతి
ఇబాదన్‌లో జరిగిన ప్రమాద ఘటన గురించి కూడా అధ్యక్షుడు టినుభు ప్రస్తావించారు.
స్కూల్ ఫన్ ఫెయిర్‌లో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో 35 మంది చిన్నారులు చనిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉచితంగా పంపిణీ చేసే ఆహారం కోసం అక్కడికి వేల మంది పోటెత్తడంతో ఈ ఘటన జరిగింది.
”5000 కంటే ఎక్కువ మందే వచ్చి ఉంటారు. అందులో చాలామంది స్కూల్ గేటు దూకేందుకు ప్రయత్నించారు” అని ఇబాదన్ శివారులోని బషోరన్ నివాసితులు, బీబీసీకి చెప్పారు.
స్కూల్లోకి వచ్చేందుకు తల్లిదండ్రులు కాంపౌండ్ దగ్గరున్న కంచె మీద నుంచి దూకేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు.
ప్రజలకు సహాయాన్ని అందించే సమయంలో సురక్షిత పద్ధతులు పాటించాల్సిన అవసరాన్ని ఈ మూడు విషాద ఘటనలు చాటిచెబుతున్నాయని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి ఒలుముయివా అడెజోబీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)