SOURCE :- BBC NEWS

ఇన్సూరెన్స్, జీవితబీమా,

ఫొటో సోర్స్, Getty Images

నెల తిరిగేసరికి ఈఎంఐలన్నీ ఠంచనుగా కట్టేస్తారు. ట్యాక్సులు చెల్లిస్తారు. ఏ నెలకు ఆ నెల ఫైనాన్స్‌ మినిస్టర్‌ అవతారమెత్తి బడ్జెట్‌ వేసేస్తారు. వచ్చే నెలకే కాదు, ఆ పై ఏడాదికి కూడా ముందే ప్లాన్‌ చేసేస్తారు.

పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్‌… ఇలా అన్నీ ముందే ఆలోచించే ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

ఎవరో కాదు.. అది ముమ్మాటికీ మీరే!!

ఇంటిల్లిపాది గురించి ఇంతగా ఆలోచించే మీరు, మీ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీ విలువేంటో కుటుంబానికి తెలుసు, కానీ అది ఎంతో మీరెప్పుడైనా గుర్తించారా? కనీసం 2025లో అయినా ప్లానింగ్ మొదలుపెట్టండి.

జిందగీ కే సాత్‌ బీ.. జిందగీకే బాద్‌ బీ… మీరు మీలా హీరోలానే ఉండండి.

ఉద్యోగులు సాధారణంగా వ్యక్తిగత ఇన్సూరెన్స్‌ గురించి పెద్దగా పట్టించుకోరు. కంపెనీ ఇచ్చే ఏదో చిన్నపాటి ఇన్సూరెన్స్‌తో సరిపెట్టేసుకుంటారు.

ముఖ్యమైన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ గురించి అసలు పట్టనే పట్టదు.

ఇక యాక్సిడెంటల్‌ ఇన్సూరెన్స్‌, క్రిటికల్‌ కేర్‌, మెటర్నిటీ కవర్‌ వంటి వాటి గురించి మనలో ఎంత మందికి తెలుసో మీకే తెలియాలి.

అందుకే మీరు పక్కాగా ప్లాన్‌ చేసుకోవాల్సిన బీమాల గురించి ఈ కథనంలో సంక్షిప్తంగా చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇన్సూరెన్స్ పాలసీలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, boonchai wedmakawand

హెల్త్‌ ఇన్సూరెన్స్‌

ఇది లేకపోతే ఏళ్లుగా కూడబెట్టిన ఆస్తులన్నీ రోజుల్లోనే ఆవిరైపోతాయ్. జాగ్రత్త!

భారత్‌లో మెడికల్‌ ఇన్‌ఫ్లేషన్‌ వార్షికంగా 14 శాతంగా ఉందని వాట్సన్‌ గ్లోబల్‌ మెడికల్‌ రిపోర్ట్‌ 2024 చెబుతోంది. అంటే ఈ రోజు రూ.10వేలు అయ్యే ట్రీట్‌మెంట్‌ వచ్చే ఏడాదికి రూ.11400 అవుతుంది.

ఈ లెక్కన వైద్యం ఎంత ఖరీదు కాబోతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

వైద్యరంగంలో కొత్త టెక్నాలజీలతో మనిషి లైఫ్ స్పాన్ పెరగడం మంచి పరిణామమే. మనం 80 ఏళ్లుపైనే బతుకుతాం.

మరి మనం బతికి ఉన్నంతవరకూ ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పట్టించుకునేది ఎవరు? డబ్బులు చెల్లించేది ఎవరు? ఆలోచించారా?

ఆయుర్దాయం పెరగడం మంచి విషయమే అయినా, అందుకు తగ్గట్టు మన ప్లానింగ్‌ లేకపోతే మాత్రమే ముమ్మాటికీ ముప్పే.

ఇన్సూరెన్స్ పాలసీలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా

ఏం చేయాలి?

– కనీసం రూ.10-15 లక్షల విలువైన ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ ప్లాన్‌ తీసుకోండి

– మెటర్నిటీ, క్రిటికల్ ఇల్‌నెస్‌, ఔట్‌పేషెంట్‌ వంటి యాడ్‌ఆన్స్‌ పరిగణించండి

– లైఫ్‌ టైమ్‌ రెన్యువల్‌, రూమ్‌ రెంట్‌ క్యాప్‌ లేకుండా ఉండే ప్లాన్స్‌ చూడండి.

ప్రో టిప్‌ – రూ.5 లక్షల డిడక్షన్‌తో రూ.20లక్షల సూపర్‌ టాప్ అప్ కూడా‌‌ తీసుకోండి. ఇది మీకు రూ.2500-4000 మధ్య లభిస్తుంది.

టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ – ప్రతీ ఉద్యోగికీ మస్ట్‌

మీ కుటుంబమంతా మీపైనే ఆధారపడి ఉంటే మీరు తప్పకుండా టర్మ్‌ లైఫ్ ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మార్కెట్లో ఇదే అతి చవకైన లైఫ్‌ ప్రొటెక్షన్‌ కవర్‌.

ఏదో నాలుగు డబ్బులు తిరిగి వస్తాయి కదా అనే ఉద్దేశంతో యూలిప్స్‌, మనీ బ్యాక్‌ పాలసీల జోలికి వెళ్లకండి.

చవక ధరలో మీ కుటుంబ భవిష్యత్‌కు రక్షణ కల్పించేది టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే.

ఇన్సూరెన్స్ పాలసీలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, Getty Images

ఏం కొనాలి?

మీ వార్షిక ఆదాయానికి కనీసం 15-20 రెట్లు ఉండేలా కవర్‌ తీసుకోండి.

(ఉదాహరణకు మీ వార్షిక వేతనం రూ.5 లక్షలు ఉంటే, రూ.50-75 లక్షల కవర్‌ తప్పక తీసుకోండి. ఇది మీ జీవితానికి మీరిచ్చే విలువ!)

గరిష్ట వయసు (65 ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లిస్తూ) 80 ఏళ్ల వరకూ కవర్ చేసే పాలసీలు ఎంపిక చేసుకోండి. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 60/65 ఏళ్లు

వీలైతే యాక్సిడెంట్‌ రైడర్స్‌, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్స్‌ తీసుకోండి.

2025లో ఇవే టాప్‌ ప్లాన్స్‌

ప్రో టిప్‌ – టర్మ్‌ పాలసీ తీసుకోవడంలో అసలు ఆలస్యం చేయొద్దు.

వయసు పెరిగితే ప్రీమియం కూడా 10 -15 శాతం పెరుగుతుందని గుర్తించండి

ఇన్సూరెన్స్ పాలసీలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, Getty Images

యాక్సిడెంటల్‌ కవర్‌, డిజేబులిటీ కవర్‌

మనలో చాలామందికి వీటి గురించి తెలియనే తెలియదు. కానీ ఇవి చాలా చాలా ముఖ్యం.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2022 లెక్కల ప్రకారం భారత్‌లో ప్రమాదాల బారిన పడి ప్రతి రెండు నిమిషాలకూ ఒకరు కాళ్లో, చేతులో పోగొట్టుకుని శాశ్వత వైకల్యం (పర్మనెంట్‌ డిజేబిలిటీ) బారిన పడుతున్నారు.

సాధారణంగా ఏ యాక్సిడెంట్‌ పాలసీ అయినా, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అయినా యాక్సిడెంట్స్‌ మిగిల్చే వైకల్యానికి అక్కరకు రావు.

ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవించి హాస్పిటల్‌ పాలైతే, వైద్య ఖర్చులను హెల్త్‌ కవర్‌ తీరుస్తుంది.

మరి ఆ ప్రమాదంలో ఏదైనా శరీర భాగం శాశ్వతంగా డ్యామేజ్‌ అయితే? కొద్దికాలం ఉద్యోగం చేసే వీలులేకపోతే? అసలు పనిచేసేందుకే అవకాశం లేకపోతే? ఇలాంటి పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

అందుకే ఇలాంటి యాక్సిడెంట్‌ పాలసీలు అవసరం. ఇవి

  • పర్మనెంట్‌ డిజేబిలిటీకి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తాయి.
  • తాత్కాలిక వైకల్యం ఏదైనా సంభవిస్తే వీక్లీ ఇన్‌కమ్ అందిస్తాయి.

రూ.10 లక్షల కవరేజీకి కూడా ప్రీమియం గరిష్టంగా రూ.1000 మాత్రమే ఉంటుంది. చాలా వరకూ బ్యాంకులు నాలుగైదు వందల రూపాయలకే రూ.5 లక్షల వరకూ కవరేజీని అందిస్తున్నాయి.

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద రూ.19 ప్రీమియంతో రూ.2 లక్షల వరకూ యాక్సిడెంటల్‌ కవర్‌ లభిస్తుంది. అయితే ఇందులో శాశ్వత వైకల్యం మాత్రమే కవర్‌ అవుతుంది.

18 నుంచి 70 ఏళ్ల వయసు వారెవరైనా తీసుకోవచ్చు. మీతో పాటు మీ లైఫ్‌ పార్ట్‌నర్‌కు, పిల్లలకు కూడా తీసుకోవచ్చు.

ఇన్సూరెన్స్ పాలసీలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, Getty Images

క్రిటికల్‌ ఇల్‌నెస్‌

క్యాన్సర్‌, హార్ట్‌ అటాక్‌ వంటి అతితీవ్ర వ్యాధుల సమయంలో కొండంత అండ ఈ క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీలతో లభిస్తుంది.

ఏ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నా, ఎంత తీసుకున్నా హాస్పిటల్‌ ఖర్చులు మాత్రమే కవర్ అవుతాయి. ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు హాస్పిటలేతర ఖర్చులే అధికం. ప్రయాణాలు, సెకండ్‌ ఒపీనియన్‌, జాబ్‌ చేయలేకపోవడం, ఆదాయాన్ని కోల్పోవడం వంటివి జరగొచ్చు.

అందుకే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ సుమారు 30 నుంచి 60 తీవ్ర ఆరోగ్య సమస్యలకు పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బులు చెల్లిస్తుంది. వ్యాధి నిర్దరణైతే చాలు, మీరు చేసే ఖర్చులతో సంబంధం లేకుండా లంప్సమ్‌ అమౌంట్ చెల్లిస్తారు.

కనీసం రూ.10-25 లక్షల మధ్య ఈ కవరేజ్‌ ఉండేలా చూసుకుంటే మంచిది.

వీలైతే స్టాండలోన్‌ పాలసీ ప్రిఫర్‌ చేయండి. లేదంటే టర్మ్‌ పాలసీతో యాడ్‌ ఆన్‌ కవర్‌గా అయినా తీసుకోండి.

ఇన్సూరెన్స్ పాలసీలు, జీవిత బీమా, ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, Getty Images

మెటర్నిటీ, ఫర్టిలిటీ కవర్‌

ఫ్యామిలీ ప్లానింగ్‌కు ఈ పాలసీలు తప్పనిసరిగా తీసుకోవాలి.

సాధారణంగా ఏ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అయినా మెటర్నిటీ విషయంలో ఎక్కువ ఆంక్షలు పెడుతుంది. గరిష్టంగా రూ.25-50వేల మధ్య చెల్లించి చేతులు దులుపుకుంటాయి. వీటిలో కూడా మెజారిటీ పాలసీలు ఐవీఎఫ్‌, ఇన్‌ఫర్టిలిటీ సమస్యలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవు.

అందుకే..

మెటర్నిటీ కవర్‌ రూ.1-2లక్షల మధ్య ఉండేలా రిటైల్‌ ప్లాన్స్‌ చూడండి.

ఐవీఎఫ్‌, ఇన్‌ఫర్టిలిటీ, న్యూబార్న్‌ బేబీ బెనిఫిట్స్‌ వంటివి కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తున్నాయి, ఓసారి చెక్‌ చేయండి.

వెయిటింగ్‌ పీరియడ్‌ 2-4 ఏళ్ల లోపు ఉంటుంది.

ప్రో టిప్‌ – రాబోయే మూడేళ్లలో మీకు ఫ్యామిలీ ప్లానింగ్‌ ఉన్నా లేదా పెళ్లైన వెంటనే ఈ ప్లాన్‌ తీసుకునే ప్రయత్నం చేయండి. కనీసం రెండో కాన్పుకు అయినా పనికొస్తుంది.

ఇంత డబ్బు ఇన్సూరెన్స్‌కే పోతే, ఇంకేం మిగులుతాయి, ఏం దాచుకోవాలి అనే భావన చాలామందిలో ఉండొచ్చు. అయితే మనం బతికి, బాగా తిరుగుతుంటేనే జీవితంలో ఏదైనా సాధించి ముందుకు సాగగలం. ఇప్పటివరకూ చెప్పిన ఇన్సూరెన్స్‌లు అన్నీ తీసుకున్నా ఏడాదికి మనం చేసే ఖర్చు సుమారు రూ.25వేలు మాత్రమే. అంటే నెలకు గరిష్టంగా రూ.2200.

ఉద్యోగం ఉన్నా లేకపోయినా అనారోగ్యం, యాక్సిడెంట్‌, హాస్పిటల్ ఖర్చులు వంటివి మాత్రం ఆగవు. అందుకే ఈ కాలంలో ఇన్సూరెన్స్‌ అనేది లగ్జరీ కానే కాదు. అందరికీ ఇదే లైఫ్‌లైన్‌.

(గమనిక – ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)