SOURCE :- BBC NEWS

అస్సాంలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి

ఫొటో సోర్స్, Getty Images

అస్సాంలో ఒక మూక, రాయల్ బెంగాల్ టైగర్‌ను చంపేసి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికిందని అటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

తమ పెంపుడు జంతువులను, పశువులను చంపిన ఈ పులితో తమ ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందనే కోపంతో గోలాఘాట్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ప్రజలు దాన్ని చంపేశారని చెబుతున్నారు.

రాష్ట్ర అటవీశాఖ దీనికి సంబంధించి కేసు నమోదు చేసింది.

అస్సాంలో మనుషులకు, జంతువులకు మధ్య ఘర్షణ కొత్తేమీ కాదు.

ఈ ఏడాది పులిని చంపినట్లు రిపోర్ట్ అవ్వడం ఇది మూడోసారి.

బుల్లెట్ల వల్ల కాకుండా (గన్‌ షాట్స్), పదునైన గాయాల కారణంగా పులి చనిపోయిందని అటవీ శాఖ అగ్రస్థాయి అధికారి గుణదీప్ దాస్ చెప్పినట్లు వార్తా పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

మెజిస్ట్రేట్ సమక్షంలో పులి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వార్తాకథనాలు వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

సుమారు వెయ్యి మంది ప్రజలు కలిసి పులిని చంపడానికి సిద్ధమయ్యారని.. వారిలో కొందరు పదునైన కత్తులతో పులిపై దాడి చేశారని స్థానిక వార్తా పత్రికకు దాస్ చెప్పారు. పులి కళేబరాన్ని శవపరీక్ష కోసం పంపించినట్లు ఆయన తెలిపారు.

ఈ హత్యను ఖండిస్తున్నట్లు అస్సాం ఎమ్మెల్యే మృణాల్ సైకియా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు.

ముఖం, కాళ్లు, కొంతభాగం చర్మం లేకుండా ఉన్న పులి కళేబరాన్ని చూపించే ఒక వీడియోను ఆయన షేర్ చేశారు.

బీబీసీ స్వతంత్రంగా ఈ వీడియోను ధ్రువీకరించలేదు.

”ఇది చాలా బాధాకరమైన చర్య. ఈ భూమి మనుషులది మాత్రమే కాదు జంతువులది కూడా. ఈ హత్యతో ప్రమేయం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తన పోస్ట్‌లో మృణాల్ రాశారు.

ఈ పులి ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా తెలియదని స్థానిక మీడియాతో అటవీ శాఖకు చెందిన మరో అధికారి సొనాలి ఘోష్ చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Reuters

కజిరంగా నేషనల్ పార్క్‌కు దాదాపు 20 కి.మీ. దూరంలో ఇది చనిపోయిందని చెప్తున్నారు.

అస్సాంలో పులుల జనాభా క్రమంగా పెరిగినట్లు ఆ రాష్ట్ర అటవీ శాఖ తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. అనేక రకాల పరిరక్షణ ప్రయత్నాల కారణంగా 2006లో 70గా ఉన్న పులుల సంఖ్య 2019 నాటికి 190కి చేరిందని ప్రభుత్వ గణాంకాలు చూపుతున్నాయి.

గ్రామస్థులు పులులను చంపిన ఘటనలు తరచుగా మీడియాలో కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని జాతీయ పార్కుల మధ్య టైగర్ కారిడార్లకు రక్షణ తగ్గడం, వాటి ఆవాసాలు కుచించుకుపోవడాన్ని ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.

భారత వన్యప్రాణి పరిరక్షణ చట్టం (1972) ప్రకారం, పులులు రక్షిత జాతి. పులులను వేటాడడం, నిర్బంధించడం, వాటి శరీర భాగాలు కొనడం, అమ్మడం ఈ చట్టం ప్రకారం నేరం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)