SOURCE :- BBC NEWS

ఏసీలు

ఫొటో సోర్స్, Getty Images

27 నిమిషాలు క్రితం

ఎయిర్ కండిషనర్(ఏసీ)ల వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు, నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఏసీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వేడిని తట్టుకునేందుకు ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు మాత్రమే కాకుండా ఏసీలనూ వాడుతున్నారు. దీంతో, ఏసీల అమ్మకాలు పెరిగాయి.

అయితే, ఏసీ పాతదవుతుంటే దాని సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగి బిల్లులు పెరుగుతుంటాయి.

దీనికోసం పాత ఏసీలను మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్‌ను తీసుకురాబోతుందనే కథనాలు ఇటీవల వినిపించాయి. అయితే, అవన్నీ అసత్యాలని తేలింది. ప్రభుత్వం అలాంటి పథకమేమీ తేవడం లేదని స్పష్టం చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

పాత ఏసీని తిరిగి ఇచ్చేసి కొత్త 5 స్టార్ రేటెడ్ మోడల్స్‌ను పొందేలా ప్రోత్సాహక పథకం పీఎం మోదీ ఏసీ యోజనను తీసుకొస్తుందని సంబంధిత అధికారులు చెప్పినట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి.

అవన్నీ తప్పుడు కథనాలని ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.

‘పీఎం మోదీ ఏసీ యోజన 2025’ అనే కొత్త పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 స్టార్ ఏసీలను అందిస్తుందని, ఇప్పటికే 1.5 కోట్ల ఏసీలను సిద్ధం చేసినట్లు వస్తోన్న కథనాలను కొట్టివేసింది.

ఇదంతా ఎలా ఉన్నా అసలు ఏసీలు ఎంతకాలం పనిచేస్తాయి? మనం వాడే ఏసీలకు రేటింగ్‌లు ఎలా ఇస్తారు? ఏసీల వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఏసీ జీవిత కాలం ఎంత?

3 స్టార్, 5 స్టార్ ఏసీలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తుంటే 10 నుంచి 15 ఏళ్ల పాటు వాడుకోవచ్చని వోల్టాస్ తన బ్లాగ్‌లో పేర్కొంది.

ఏసీల కాల వ్యవధిని పెంచేందుకు సరైన మెయింటనెన్స్ అనేది చాలా కీలకమని క్రోమా కూడా తన బ్లాగ్‌లోని ఓ ఆర్టికల్‌లో తెలిపింది.

తరచూ ఫిల్టర్స్‌ను మార్చాలి, కాయిల్స్‌ను శుభ్రపరుచుకోవాలి. ఏసీల కాలవ్యవధి తగ్గిపోయినప్పుడు, మనకు కరెంట్ బిల్లులు పెరుగుతూ ఉంటాయి. కూలింగ్ కూడా సరిగ్గా రాదు.

ఏసీల నుంచి శబ్దాలు వస్తుంటాయి. లీకేజీ అవుతుంటుంది. ఈ హెచ్చరికలు ఉన్నప్పుడు మన ఏసీల కాల వ్యవధి తీరిపోయినట్లు గమనించుకోవాలి.

కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఏసీని సర్వీసింగ్‌కు ఇవ్వాలని, దీంతో, వాటి సామర్థ్యం పెరుగుతుందని అర్బన్ కంపెనీలో ఏసీ రిపెయిర్ సర్వీస్‌ విభాగానికి చెందిన ఎం.రిహాన్ బీబీసీతో చెప్పారు.

ఫిల్టర్లను, కాయిల్స్‌ను తరచూ చెక్ చేస్తూ, మెయింటనెన్స్ చేస్తున్నప్పటికీ, మన కరెంట్ బిల్లులపై కూడా ఓ కన్నేసి ఉండాలి. అవసరమైనప్పుడు క్వాలిటీ విభాగాలపై ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని క్రోమా తన బ్లాగ్‌లో పేర్కొంది.

కూలింగ్ ఫ్యాన్‌ను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అందులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి.

ఏసీలు

ఫొటో సోర్స్, Getty Images

3 స్టార్, 5 స్టార్ ఏసీలకు తేడా ఏంటి?

రేటింగ్స్ అనేది ఏసీల ఇంధన సామర్థ్యాన్ని కొలిచేందుకు కీలకమైన విషయం.

ఈ రేటింగ్‌లను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) అందిస్తుంది.

ఏసీల వార్షిక ఇంధన వినియోగం (ఏఈసీ) బట్టి ఈ రేటింగ్స్‌ను బీఈఈ ఇస్తుంటుంది.

ఏడాదిలో విద్యుత్ వినియోగం, దాని శీతల సామర్థ్యం (కూలింగ్ కెపాసిటీ) అనుగుణంగా ఏఈసీని కొలుస్తుందని వోల్టాస్ తెలిపింది.

3 స్టార్ ఏసీలతో పోలిస్తే 5 స్టార్ ఏసీలు గణనీయమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంటాయి.

3 స్టార్ ఏసీతో పోలిస్తే 5 స్టార్ ఏసీలు 10 నుంచి 15 శాతం తక్కువ విద్యుత్ వినియోగిస్తాయి.

అందువల్ల విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా వస్తాయి.

అయితే, చాలామంది వినియోగదారులు తమ ఏసీ వినియోగాన్ని బట్టి 3 స్టార్, 5 స్టార్ రేటింగ్‌ల ఏసీలను ఎంపికచేసుకుంటుంటారు.

రోజులో కొన్ని గంటలు మాత్రమే ఏసీని వాడేవారు సాధారణంగా 3 స్టార్ ఏసీలను తీసుకుంటూ ఉంటారు.

వాతావరణ పరిస్థితులు సాధారణంగా ఉండి, ఎప్పుడో ఒకసారి వాడేవారికి ఇది ఆర్థికంగా మేలును చేకూర్చే ఎంపిక అని ఒక ఏసీల కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది.

అదే అత్యధిక వేడి ఉన్న ప్రాంతాల్లో, రోజులో చాలా గంటల పాటు ఏసీలను వాడే వారికి 5 స్టార్ ఏసీ అనేది మంచి ఎంపిక అని నిపుణులు చెప్తున్నారు.

రోజుకు 3 నుంచి 4 గంటలు మాత్రమే ఏసీ వినియోగించేవారు 3 స్టార్ ఎంచుకోవచ్చని… అంతకంటే ఎక్కువ వినియోగం ఉంటే 5 స్టార్ ఏసీలు ఉపయోగించడం వల్ల విద్యుత్ ఆదా చేయొచ్చని సూచిస్తున్నారు.

‘గది విస్తీర్ణానికి తగినట్లుగా కూడా ఏసీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గది విస్తీర్ణం 120 నుంచి 140 చదరపు అడుగుల వరకు ఉంటే 1 టన్ సామర్థ్యం ఉన్న ఏసీని తీసుకుంటే సరిపోతుంది. అదే 150 నుంచి 180 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే 1.5 టన్నుల ఏసీ మంచిది. అంతకంటే ఎక్కువ అంటే 180 చదరపు అడుగుల పైగా విస్తీర్ణం ఉంటే 2 టన్నుల ఏసీని ఎంచుకోవాలి’ అని ఏసీల సర్వీసింగ్ నిపుణుడు ఎం.రిహాన్ గతంలో బీబీసీకి వివరించారు.

”చిన్న గదికి ఎక్కువ టన్నులుండే సామర్థ్యమున్న ఏసీతో విద్యుత్ అదనంగా ఖర్చు అవుతుంది. అదే సమయంలో తక్కువ సామర్థ్యముండే ఏసీలు పెద్ద గదులకు సరిపోవు. అందుకే ముందు మన ఇంటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఏసీని ఎంచుకోవాలి” అని ఆయన చెప్పారు.

ఏసీ

ఫొటో సోర్స్, Getty Images

ఏసీలు పేలుతాయా?

కొన్నిసార్లు తీవ్ర వేడికారణంగా, ఏసీలు పేలుతూ ఉంటాయి. దీని వెనక ఉన్న శాస్త్రీయ కారణాలను ఐఐటీ బీహెచ్‌యూ మెకానికల్ విభాగ ప్రొఫెసర్ జహర్ సర్కార్‌ గతంలో బీబీసీతో చెప్పారు.

గదిని ఏసీ చల్లగా మార్చాలంటే, బయట కంప్రెసర్ చుట్టూ ఉండే ఉష్ణోగ్రత, దాని కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండాలని ప్రొఫెసర్ జహర్ సర్కార్ బీబీసీతో చెప్పారు.

”సాధారణంగా భారత్‌లో వినియోగించే ఏసీల కండెన్సర్ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత కండెన్సర్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటే ఏసీ పనిచేయడం ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కండెన్సర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల కండెన్సర్ పేలిపోయే అవకాశాలు కూడా పెరుగుతాయి” అని ప్రొఫెసర్ జహర్ బీబీసీకి తెలిపారు.

కాయిల్స్ మురికిగా దుమ్ము కొట్టుకుపోయినప్పుడు వాటికి గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తి, కండెన్సర్ వేడెక్కేందుకు కారణమవుతుందని, దానివల్ల అగ్నిప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు బీబీసీకి చెప్పారు. అందుకే కాయిల్స్ ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని పేర్కొన్నారు.

తరచూ వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులు సంభవిస్తే కంప్రెసర్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇది ప్రమాదానికి కారణమవుతుంది.

ఏసీపై నేరుగా ఎండ పడితే, గదిలోని వేడిగాలిని చల్లబరిచే సామర్థ్యం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ”ఎండ తగలడం వల్ల గదిని చల్లబరిచేందుకు ఏసీ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఫలితంగా ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది” అని రిహాన్ వివరించారు.

ఏసీలు పేలిపోకుండా చూసుకోవడం ఎలా?

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏపీ కంప్రెసర్‌ నీడలో ఉండేలా చూసుకోవాలి.

కంప్రెసర్, కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన వెంటిలేషన్ ఉండాలి. అక్కడ గాలి వీచేలా ఉంటే, యూనిట్ మరింత వేడెక్కకుండా ఉంటుంది.

క్రమం తప్పకుండా ఏసీ సర్వీస్ చేయించాలి. ఇలా చేయడం ద్వారా ఏవైనా రిపేర్లు ఉన్నా సరి అవుతాయి.

ఏసీ

ఫొటో సోర్స్, Getty Images

రోజంతా ఆన్‌లో ఉంచకూడదు

”ప్రస్తుతం దాదాపు అన్ని ఏసీల్లోనూ టైమర్లు ఉంటున్నాయి. మన గది ఎంత సేపటిలో చల్లబడుతుందో గమనించి ఆ సమయానికి టైమర్ పెట్టుకోవాలి. దీంతో ఏసీ 24 గంటలూ పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ ఆదా అవుతుంది” అని ఆయన అన్నారు.

”మనం మధ్యమధ్యలో ఏసీని ఆఫ్ చేయడంతో ఏసీ భాగాలన్నీ చల్లబడతాయి. దీంతో మనం మళ్లీ ఆన్‌ చేసేటప్పుడు ఏసీ మెరుగ్గా పనిచేస్తుంది. ఏసీలో ఉండే ఎనర్జీ సేవింగ్ మోడ్‌ ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి” అని ఆయన వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)