SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఇంతవరకు ఎవరూ చూడని కొత్త రంగును కనుగొన్నట్లు ఓ శాస్త్రవేత్తల బృందం చెప్తోంది.
ఒక ప్రయోగం కోసం జరిపిన పరిశోధనలో, అమెరికాలోని శాస్త్రవేత్తలు తమ కళ్లల్లోకి లేజర్ పల్సస్ను పంపించుకున్నారు.
రెటీనాలోని ఒక ప్రత్యేక కణాలను ప్రేరేపించడం వల్ల, ‘నీలం-ఆకుపచ్చ’ రంగును చూసినట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న వారు చెప్పారు.
శాస్త్రవేత్తలు ఈ కొత్త రంగును ‘ఓలో’గా పిలుస్తున్నారు.
జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన అంశాలను ఈ అధ్యయనానికి సహ రచయితగా ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రెన్ ఎన్జీ ”అద్భుతమైనవి”గా అభివర్ణించారు.
కలర్ బ్లైండ్నెస్ (రంగులను చూడలేకపోవడం)పై మరింత పరిశోధనకు ఈ అంశాలు సాయపడొచ్చని ప్రొఫెసర్ ఎన్జీ, ఆయన సహోద్యోగులు చెప్పారు.
ఆ ప్రయోగంలో పాల్గొన్న ఐదుగురు శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్ ఎన్జీ ఒకరు. బీబీసీ రేడియో 4 టుడే ప్రొగ్రామ్‌లో మాట్లాడుతూ ప్రొఫెసర్ ఎన్జీ ఓలో వివరాలు చెప్పారు.
శాస్త్రవేత్తల బృందం ప్రయోగం చేసేటప్పుడు, ప్రయోగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కనుగుడ్డులోకి పరిశోధకులు ఒక లేజర్ బీమ్ వేశారు.

అధ్యయనం చేపట్టిన ఐదుగురిలో నలుగురు మగవారు, ఇద్దరు మహిళలు. అందరికీ సాధారణ కంటిచూపు ఉంది.
ప్రొఫెసర్ ఎన్జీతో పాటు మరో ముగ్గురు పార్టిసిపెంట్లు ఈ పరిశోధనా పత్రానికి సహ రచయితలు.
పరిశోధనా పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. అద్దాలు, లేజర్లు, ఆప్టికల్ డివైజ్లతో ఉన్న ఓజెడ్ అనే డివైజ్‌లోకి పార్టిసిపెంట్లు చూశారు.
ఈ పరికరాన్ని గతంలో వాషింగ్టన్ యూనివర్సిటీ, యూసీ బెర్క్లీకి చెందిన శాస్త్రవేత్తల బృందంలోని కొందరు పరిశోధకులు రూపొందించారు. ఈ అధ్యయనంలో వాడేందుకు దీన్ని అప్డేట్ చేశారు.
రెటీనా అనేది విజువల్ సమాచారాన్ని స్వీకరించి ప్రాసెస్ చేయడంలో కీలకంగా వ్యవహరించే కంటికి వెనుకాల ఉండే కణజాలానికి చెందిన సున్నితమైన పొర. ఇది కాంతిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఆప్టిక్ నర్వ్లోంచి మన మెదడులోకి ప్రసరింప చేసి, మనం చూడటానికి వీలు కలిగిస్తుంది.
రెటీనాలో కోన్ కణాలు ఉంటాయి. ఇది రంగులను గుర్తిస్తుంటాయి.
మూడు రకాల కోన్ కణాలుంటాయి. అవి ఎస్, ఎల్, ఎం. ప్రతిదీ నీలం, ఎరుపు, ఆకుపచ్చలకు చెందిన భిన్నమైన తరంగధైర్ఘ్యాలతో సున్నితంగా ఉంటాయి.
”ఏదైనా కాంతి ఎం కోన్ సెల్‌ను ప్రేరేపిస్తే దాని పక్కనే ఉన్న ఎల్, ఎస్ కోన్ కణాలను కూడా ప్రేరేపించాలి. ఎందుకంటే, దాని పనితీరు వాటివరకు వ్యాప్తి చెంది ఉంటుంది” అని పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
”సాధారణంగా రంగు సంకేతాలను మెదడులోకి పంపే ఎం కోన్ కణాలను మాత్రమే లేజర్ ప్రేరేపించింది. ఇది సాధారణంగా సహజ కంటిచూపులో జరగదు.
అంటే, ప్రత్యేక ప్రేరణ సాయం లేకుండా వాస్తవ ప్రపంచంలో ఒక వ్యక్తి తన కంటిచూపుతో ఓలో రంగును చూడలేరని అర్థం. ” అని తమ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
ఓలో రంగును గుర్తించి, ఈ రంగును ధ్రువీకరించేందుకు ప్రయోగంలో పాల్గొన్న ప్రతి పార్టిసిపెంట్ కంట్రోలబుల్ కలర్ డయల్‌ను సవరిస్తూ వచ్చారు.
ఈ కొత్త రంగును మరింత వివరించాల్సి ఉందని కొందరు నిపుణులు అంటున్నారు.
ఎంపిక చేసుకున్న కోన్ కణాలను ప్రేరేపించడంలో ఈ పరిశోధనా ఒక సాంకేతిక విజయం అయినప్పటికీ, కొత్త రంగు కనుగొనడంపై మరింత చర్చకు దారితీసిందని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సిటీ సెయింట్ జార్జ్స్ విజన్ సైంటిస్ట్ ప్రొఫెసన్ జాన్ బార్బర్ అన్నారు.
”ఓలో రంగును సాంకేతికంగా చూడటం క్లిష్టమైనప్పటికీ, రంగుల మధ్య తేడాలను గుర్తించలేక ఇబ్బంది పడుతున్న వారికి ఇదెలా సాయపడుతుందో గుర్తించేందుకు తమ శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుంది.” అని ప్రొఫెసర్ ఎన్జీ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)