SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
7 నిమిషాలు క్రితం
కశ్మీర్ విషయంలో అణ్వస్త్ర దేశాలైన భారత్, పాకిస్తాన్‌లు రెండుసార్లు యుద్ధాలు చేశాయి. నిరంతరం గొడవ పడుతున్నాయి. అసలీ ప్రాంతం ఎందుకు వివాదమైంది. ఈ వివాదం ఎలా మొదలైంది? చరిత్ర ఏంటి?
ఎన్నాళ్ల నుంచి ఈ ఘర్షణ?
కశ్మీర్ జాతుల పరంగా వైవిధ్యభరితమైన హిమాలయ ప్రాంతం. అక్కడ ఉన్న సరస్సులు, పచ్చిక మైదానాలు, మంచుతో నిండిన పర్వతాలతో ప్రకృతి అందాలకు ప్రసిద్ధి.
1947 ఆగస్టులో బ్రిటిష్ వారి నుంచి భారత్ పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందడానికి ముందు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం తీవ్ర పోటీ ఉంది.
భారత స్వాతంత్ర్య చట్టం అందించిన విభజన ప్రణాళిక కింద ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీర్‌కు భారత్ లేదా పాకిస్తాన్లో చేరేందుకు స్వేచ్ఛ ఉంది.
నాటి జమ్మూ కశ్మీర్ మహరాజు హరిసింగ్ తొలుత కశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని భావించారు. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్‌లోని ఓ తెగ కశ్మీర్‌పై దాడి చేసినప్పుడు భారత్ అండగా నిలవడంతో తమ ప్రాంతాన్ని భారత్‌లో కలపాలని హరిసింగ్ నిర్ణయించారు.
రెండు దేశాల మధ్య యుద్ధం చెలరేగడంతో భారతదేశం ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరింది. కశ్మీర్ ఏ దేశంలో కలవాలనే విషయమై అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.
ప్లెబిసైట్ జరపడానికి ముందు సైన్యాల ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించలేదు.
1949 జులైలో ఐక్యరాజ్యసమితి సూచించినట్లుగా ఈ ప్రాంతం రెండుగా విడిపోవడం, సరిహద్దుల్లో కాల్పుల విరమణను పాటించేలా రూపొందిన ఒప్పందంపై రెండు దేశాలు సంతకం పెట్టాయి.
1965లో ఈ రెండు దేశాల మధ్య రెండో యుద్ధం జరిగింది. తర్వాత 1999లో కార్గిల్‌లో భారత్ పాకిస్తాన్ మద్దతు ఉన్న దళాల మీద యుద్ధం చేసి విజయం సాధించింది.
ఆ సమయానికే, తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రెండు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం కశ్మీర్ మొత్తం మాదే అని దిల్లీ, ఇస్లామాబాద్ రెండూ చెప్పుకుంటున్నాయి. కానీ వాటి నియంత్రణ కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది.


ఫొటో సోర్స్, AFP/Getty Images
కశ్మీర్లో అశాంతి ఎందుకు?
కశ్మీర్ లోపల ఉంటున్న వారిలో ఈ ప్రాంతం పట్ల విధేయత గురించి అభిప్రాయాలు వైవిధ్యంగా, బలంగా ఉన్నాయి. చాలామంది భారత్ పరిపాలనను అంగీకరించడం లేదు. భారత్ పాలనకు బదులు స్వతంత్రంగా ఉండటం లేదా పాకిస్తాన్‌తో కలిసేందుకు ఇష్టపడతారు.
మతం ప్రధాన అంశం: జమ్మూ కశ్మీర్లో 60 శాతం ముస్లింలు ఉన్నారు.
భారత పరిపాలనకు వ్యతిరేకంగా ఇక్కడ 1989 నుంచి సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఈ ఘర్షణల్లో వేలమంది ప్రాణాలు కోల్పోయారు.
కశ్మీర్లో మిలిటెంట్లకు పాకిస్తాన్ సాయం చేస్తోందని భారత్ ఆరోపిస్తోంది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణను ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది.
2019లో, దిల్లీలోని ప్రభుత్వం కశ్మీర్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ ప్రాంతానికున్న స్వతంత్ర ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాంతానికున్న ప్రత్యేక హోదా తొలగించిన కొన్నేళ్ల తర్వాత ఇక్కడ తీవ్రవాద దాడులు తగ్గాయి. పర్యటకుల సంఖ్య పెరిగింది.

గతంలో కశ్మీర్లో తీవ్రవాద దాడులు తర్వాత ఏం జరిగింది?
2016లో యూరీ సెక్టార్లో 19 మంది భారతీయ సైనికులపై దాడి చేసి చంపేయడంతో, పాక్ పాలిత కశ్మీర్లో ఉన్నాయని ఆరోపిస్తున్న మిలిటెంట్ స్థావరాలపై భారత్ ‘సర్జికల్ స్ట్రైక్స్’ చేసింది.
2019లో పుల్వామాలో బాంబు పేలుడులో పారా మిలటరీ బలగాలకు చెందిన 40 మంది చనిపోయారు. దీంతో భారత్ బాలాకోట్ ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. 1971 తర్వాత భారత్ ఇలాంటి దాడులు చేయడం అదే తొలిసారి.
ఈ దాడులపై పాకిస్తాన్ కూడా ఇదే రీతిలో స్పందించింది.
తాజాగా 2025 ఏప్రిల్‌లో పహల్గాంలో తీవ్రవాదుల దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ రెండు దశాబ్ధాల్లో కశ్మీర్లో పౌరుల మీద జరిగిన అత్యంత పాశవికమైన దాడి ఇది.
ఈ సంఘటన జరిగిన 2 వారాల తర్వాత భారతదేశం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై క్షిపణి దాడులు చేసింది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో, రెండు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపిచ్చాయి.
ప్రపంచంలో సైనికీకరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కశ్మీర్ కూడా ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
శాంతి మీద ఎలాంటి ఆశలు ఉన్నాయి?
2003లో కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించాయి.
పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి అవలంభిస్తామని చెప్పిన నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి చర్చల పట్ల శ్రద్ధ చూపించారు.
దిల్లీలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాకిస్తాన్ ప్రధానమత్రి నవాజ్ షరీఫ్ హాజరయ్యారు.
అయితే ఏడాది తర్వాత, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది. దీనికి పాక్ ప్రేరేపిత దళాలదే బాధ్యతని భారత్ ఆరోపించింది.
ఈ దాడి తర్వాత 2017లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ప్రాంతీయ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కాలేదు.
అప్పటి నుంచి రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS