SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్ మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చురుగ్గా వ్యవహరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం త్రివిధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్‌తో వివాదాన్ని ముగించడానికి భారత్ నుంచి కనిపించిన మొదటి సూచన ఇది.
అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో భారత డీజీఎంవోతో పాకిస్తాన్ డీజీఎంవో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో ఇరు దేశాలు భూ, వాయు, జల ప్రాంతాల్లో సైనిక చర్యను నిలిపివేయడానికి అంగీకరించాయి.
అయితే, భారత్, పాకిస్తాన్ ‘కాల్పుల విరమణ’పై మొదటి సమాచారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్, భారత ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించాయి.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఎక్స్‌లో ‘కాల్పుల విరమణ’ను ధ్రువీకరించారు. అమెరికా, సౌదీ అరేబియా, బ్రిటన్‌తో సహా ముప్పైకి పైగా దేశాలు దౌత్య ప్రయత్నాలలో పాల్గొన్నాయని ఆయన అన్నారు.
మరోవైపు, కాల్పుల విరమణకు భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. అయితే, అమెరికా సహా ఏ ఇతర దేశం పేరును విక్రమ్ ప్రస్తావించలేదు.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఎందుకు ముందుకొచ్చింది?
మరి అమెరికా చొరవకు కారణం ఏమై ఉంటుంది? నిపుణులు ఏమంటున్నారు?
“ఇరు దేశాల మధ్య ఘర్షణ మరింత పెరిగితే, పాకిస్తాన్ ఏ చర్యకైనా దిగొచ్చని అమెరికా ఆందోళన చెంది ఉంటుంది. డీజీఎంవో ద్వారా భారత్‌తో మాట్లాడాలని పాకిస్తాన్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చినట్లు కనిపిస్తోంది” అని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర అన్నారు.
“భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఎవరైనా జోక్యం చేసుకోవాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కోరుకున్నారు. అమెరికాకు పాకిస్తాన్ ఎందుకు కృతజ్ఞతలు చెప్పిందో అక్కడే స్పష్టమవుతోంది. కానీ, భారత్ ఎవరినీ కాల్పుల విరమణ కోరలేదు” అని మహాపాత్ర అభిప్రాయపడ్డారు.
”కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఈ రెండు గొప్ప దేశాలతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.
ఈ పోస్టు కూడా చర్చనీయమైంది.

ఫొటో సోర్స్, ANI
భారత్ ఒప్పుకుంటుందా?
“ట్రంప్ ముందుగా కాల్పుల విరమణ ప్రకటించడం అతిశయోక్తి. అయితే, అమెరికా మీడియా చాలా చురుకుగా ఉంది. అందుకే ట్రంప్ ముందుగా సమాచారాన్ని పంచుకొని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు” అని భారత మాజీ రాయబారి, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు రాజీవ్ భాటియా అభిప్రాయపడ్డారు.
“భవిష్యత్తులో అన్ని సమస్యలు చర్చకు వస్తాయని, కశ్మీర్ అంశం కూడా వస్తుందని ట్రంప్ చెప్పారు. కానీ, ఈ చర్చల కోసం భారత్, పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరిందని అనుకోను. ఒక పెద్ద, ముఖ్యమైన దేశానికి నాయకత్వం వహిస్తున్న ట్రంప్ ఏదైనా చెప్పుకోగలరు కానీ, భారత్ ఏం చేయాలో అది చేస్తుంది” అని భాటియా అన్నారు.
ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర మాట్లాడుతూ “కశ్మీర్ సమస్యలో మూడో దేశం జోక్యాన్ని భారత్ నిరాకరిస్తుంది. కానీ, ఈ వివాదం కశ్మీర్ గురించి కాదు, ఉగ్రవాదం గురించి” అని అన్నారు.
ఇంతకీ, అమెరికా ప్రయత్నాలను భారత్ పట్టించుకుంటుందా?
దీనిపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు స్తుతి బెనర్జీ మాట్లాడుతూ “అమెరికా ప్రయత్నాలను భారత్ తక్కువగా చూస్తుందని అనుకోవట్లేదు. చర్చలకు సాయాన్ని భారత్ అనుమతించొచ్చు. కానీ, భారత్, పాకిస్తాన్ మధ్య మాత్రమే చర్చలుంటాయి. అందుకే అమెరికా ప్రకటనలపై ఇండియా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు” అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
కశ్మీర్ గురించి ట్రంప్ ఎందుకు ప్రస్తావించారు?
అయితే, భారత్, పాకిస్తాన్ మధ్య వివాదంలో ఒక అమెరికన్ అధ్యక్షుడు జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కార్గిల్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో మాట్లాడారు. భారత్‌తో కాల్పుల విరమణ చేయించాలని నవాజ్ కోరారు. దీంతో, యుద్ధం ఆపాలని అటల్ బిహారీ వాజ్‌పేయికి బిల్ క్లింటన్ సూచించారు. అనంతరం, భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.
డోనల్డ్ ట్రంప్ కంటే ముందు కూడా, చాలామంది అమెరికన్ అధ్యక్షులు కశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ, భారత్ అలాంటి ప్రయత్నాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు.
“కశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ నిత్యం అమెరికా దగ్గర లాబీయింగ్ చేస్తుంటుంది. కానీ, భారత్ దానిని అనుమతించడం లేదు” అని మహాపాత్ర అన్నారు.
కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడి ప్రకటన ద్వారా తెలుస్తోందని మహాపాత్ర అభిప్రాయపడ్డారు.
ఇంతకీ, కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ సీరియస్‌గా ఉన్నారా?
“కశ్మీర్‌పై భారత్, పాకిస్తాన్ మధ్య ఒప్పందం తీసుకురావడంపై ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ ఉద్దేశం సరైనదే కానీ, అది సీరియస్‌గా లేదు” అని మహాపాత్ర అభిప్రాయపడ్డారు.
భారతదేశంతో ఉన్న సంబంధాల కంటే పాకిస్తాన్‌తో అమెరికా సంబంధాలు భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, రెండు దేశాలతో సమతుల్య సంబంధాన్ని కొనసాగించడం అమెరికాకు సవాలుగా మారిందన్నారు.
స్తుతి బెనర్జీ మాట్లాడూతూ “పాకిస్తాన్, అమెరికా సంబంధాలపై భారత్‌కు ఎటువంటి సమస్యా లేదు. పాకిస్తాన్‌తోనే భారత్‌కు సమస్యలున్నాయి. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం అంతం కావాలని భారత్ కోరుకుంటోంది. అమెరికా ఈ విషయంలో ఎలా సహాయపడుతుందో చూడాలి” అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)