SOURCE :- BBC NEWS

పహల్గాం దాడులు

ఫొటో సోర్స్, Getty Images

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి అనంతరం, కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో హమీ ఇచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దయింది.

‘ఆర్టికల్ 370ని ఒక టూల్‌గా వాడి కశ్మీర్‌లో బీభత్సం, హింస, అవినీతిని వ్యాప్తి చేస్తున్నారు’ అని నరేంద్ర మోదీ ఆ సమయంలో అన్నారు.

గత పదేళ్ల పాలనలో జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ, పహల్గాంలో తాజా దాడి భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల కాలంలోని తీవ్రవాద దాడులలో ఈనెల 22న జరిగిన దాడి అత్యంత దారుణమైనదిగా పరిగణిస్తున్నారు.

ఈ దాడి తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిలో అతిపెద్ద ప్రశ్న కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వ విధానం. ప్రభుత్వ పాలసీ ఎంతవరకు విజయవంతమైంది? ప్రభుత్వ వాదనలలో వాస్తవికత ఎంత? ఈ సంఘటన తర్వాత ప్రభుత్వ విధానం ఎలా ఉండనుంది?.

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి, బీబీసీ కొందరు నిపుణులతో మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

‘స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు’

జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడమనేది 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమైన హామీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ చర్య జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పుతుందని ప్రభుత్వం చెప్పింది. భారత్‌లోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జమ్మూకశ్మీర్‌లో భూమిని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవచ్చని తెలిపింది.

పర్యాటకం, భద్రత అనేది జమ్మూకశ్మీర్ పాలసీలో ముఖ్యభాగంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో పర్యటకుల సంఖ్య పెరిగిందని కేంద్రం చాలాసార్లు చెప్పింది. గణాంకాలు కూడా దీనిని ప్రతిబింబించాయి. 2024లో 34 లక్షలకు పైగా పర్యటకులు కశ్మీర్‌ను సందర్శించారు. ఇది కశ్మీర్ లోయలో కొత్త రికార్డు. అంతేకాదు, సరిహద్దు పర్యటకం కూడా ప్రారంభమైంది.

మరోపక్క కశ్మీర్‌లో ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాలను కల్పించింది, సొరంగాలను నిర్మించింది. ఇది జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి సహాయపడింది.

ఈ ఏడాది సోనామార్గ్ సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది సోనామార్గ్, గగన్‌గిర్‌లను కలుపుతుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 2,700 కోట్లు ఖర్చు చేశారు.

ఉన్నత విద్య కోసం అనేక సంస్థలు ప్రారంభించారు. సిద్రాలో గోల్ఫ్ కోర్టును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 10, 12వ తరగతి విద్యార్థులకు టాబ్లెట్‌లను అందించింది .

మొత్తంమీద, కశ్మీర్‌లో భయపడే రోజులు ముగిసినట్లు, పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు, తీవ్రవాదాన్ని అదుపులోకి తెచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆర్టికల్ 370 రద్దు చేసిన ఐదేళ్ల తర్వాత, 2024లో ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్‌ను సందర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఇది జరిగింది.

“ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ పురోగతి కొత్త శిఖరాలను తాకుతోంది. స్థానిక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాతే ఇది జరిగింది. దశాబ్దాలుగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆర్టికల్ 370 గురించి జమ్మూకశ్మీర్‌ను, దేశ ప్రజలను తప్పుదారి పట్టించాయి” అన్నారు మోదీ.

కానీ ఈ కాలంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. 2017లో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన తీవ్రవాదుల దాడిలో ఎనిమిది మంది యాత్రికులు మరణించారు.

2019లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు పుల్వామాలో జరిగిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మరణించారు.

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

‘భారతీయ సమగ్రతను చాటాలి’

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం నిపుణుడు డాక్టర్ అజయ్ సాహ్నితో బీబీసీ మాట్లాడింది.

“కౌంటర్ టెర్రరిజం విషయానికొస్తే ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయలేదు. గతంలో ఉన్న విధానమే ఇప్పటికీ ఉంది” అని అభిప్రాయపడ్డారు అజయ్ సాహ్ని.

“గతంలో అభివృద్ధి చేశామని చెప్పుకునేవారు. ఇప్పుడు పెట్టుబడులను తీసుకొచ్చామని చెబుతున్నారు. నాకది కనిపించడం లేదు. బహుశా రెండో-నాలుగో రోడ్లు నిర్మించొచ్చు. ఇంతకుముందు కూడా నిర్మించారు. సొరంగం ఇపుడే ప్రారంభించినప్పటికీ, అది వారి కాలంలో నిర్మించినది కాదు” అన్నారు.

‘కౌంటర్ టెర్రరిజం’ అనేది భద్రతా దళాల విజయమని అజయ్ అభిప్రాయపడ్డారు. పాలసీలను రూపొందించడం, చర్చలు జరపడం ప్రభుత్వం పని ఆయన చెప్పారు. ఈ అంశంలో మోదీ ప్రభుత్వం పెద్దగా విజయవంతం కాలేదని అజయ్ అభిప్రాయపడ్డారు.

” కౌంటర్ టెర్రరిజం కేవలం భద్రతా దళాల విజయం. గతంలోనూ వైఫల్యాలు ఉన్నాయి. వాటి నుంచి నేర్చుకోవాలి, మార్చుకోవాలి. అప్పుడు సామర్థ్యం క్రమంగా పెరుగుతుంది” అన్నారు.

“రాజకీయ సమస్యలను పరిష్కరించడం భద్రతా దళాల పని కాదు. అవి కొంతవరకు ఒక ప్రాంతం లేదా జనాభాపై నియంత్రణను కొనసాగించడంలో సహాయపడతాయి” అని అజయ్ అన్నారు.

“రాజకీయ విధానం భిన్నాభిప్రాయాలను కలిగిస్తోంది. ప్రతిరోజూ ముస్లిం జనాభాను దూరం చేసేలా, హిందూ జనాభాను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేస్తున్నారు” అని అజయ్ అన్నారు.

“క్రమంగా ఇలాంటివాటికి ముగింపు పలుకుతూ మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారతీయ గుర్తింపులోకి తీసుకురావాలి. ఇది భారతీయ సమగ్రతను చాటేలా ఉండాలి. ఈ ప్రాంత అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదం ఇతర అతివాద భావజాలాలను పరిష్కరించాలి’’

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మోదీ ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతిందా?

ఈ సంఘటన ప్రభుత్వ ప్రతిష్ఠపై, దాని కశ్మీర్ విధానంపై ఎటువంటి ప్రభావం చూపబోదని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది.

“ఇది ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయదు. కశ్మీర్‌పై ప్రజల నమ్మకం దెబ్బతింది. ముఖ్యంగా పర్యటకుల నమ్మకం” అని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్ బీబీసీతో అన్నారు.

“కశ్మీర్ పర్యటకానికి ప్రసిద్ధి. పర్యటక రంగంలో ప్రజల నమ్మకాన్ని పెంపొందించడానికి చాలాకాలం పట్టింది. భద్రత మళ్లీ పెద్ద సమస్యగా మారింది. కానీ, ఈ ఘటన కశ్మీర్ విషయంలో ప్రభుత్వ విధానాన్ని మార్చదు. కశ్మీర్‌ను భారత ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగుతుంది” అని అన్నారు.

‘‘కశ్మీర్ యువత పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ముస్లిం యువత కూడా ఇందులో పాల్గొంటోంది. కశ్మీర్ ప్రజలలో తిరిగి నమ్మకాన్ని కలిగించడమే ప్రస్తుత లక్ష్యం.’’ అని చెప్పారు

కశ్మీర్ విధానం

ఫొటో సోర్స్, Getty Images

విధాన వైఫల్యమా?

ప్రభుత్వం తన కశ్మీర్ విధానాన్ని అమలు చేయడంలో విఫలమైందని రాజకీయ నిపుణుడు, కశ్మీర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నూర్ అహ్మద్ బాబా అభిప్రాయపడ్డారు.

“ఆర్టికల్ 370 తొలగించినపుడు కశ్మీర్‌లో తీవ్రవాదం, వేర్పాటువాదాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ఆ తర్వాత, కశ్మీర్ భద్రత నియంత్రణ మొత్తం దిల్లీ చేతుల్లోకి వెళ్లింది” అని ప్రొఫెసర్ నూర్ అహ్మద్ అన్నారు.

“దీని తరువాత పరిస్థితి మెరుగుపడింది, పర్యటకం పెరిగింది. అప్పుడు కూడా జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో హింస జరుగుతోంది. కానీ, పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు చెప్పడంతో ప్రజలలోనూ నమ్మకం వచ్చింది” అని ఆయన అన్నారు.

మంగళవారం జరిగిన దాడి భద్రతా సంస్థల వైఫల్యమని, అతి విశ్వాస ఫలితమని అభిప్రాయపడ్డారు.

”ఈ సంఘటన ఒక విధంగా ప్రభుత్వ కశ్మీర్ విధాన వైఫల్యం” అని ప్రొఫెసర్ నూర్ అభిప్రాయపడ్డారు.

కశ్మీర్ టూరిజం

ఫొటో సోర్స్, Getty Images

పరిస్థితులు మారాయా?

ఈ పరిస్థితిపై మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ సభ్యుడు ఆదిల్ రషీద్‌తో బీబీసీ మాట్లాడింది.

“2019లో ఆర్టికల్ 370 తొలగించినప్పటి నుంచి కశ్మీర్‌లో భద్రత మెరుగుపడింది. అభివృద్ధి కూడా బాగుంది. ప్రారంభంలో అనిశ్చితి ఉండేది, ఇప్పుడది లేదు” అని రషీద్ అభిప్రాయపడ్డారు.

“దీనికి రుజువు ఏమిటంటే, ఈ తీవ్రవాద దాడికి నిరసనగా నిన్న రాత్రి ర్యాలీ, క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఇమామ్‌లు దాడిని ఖండించారు. కశ్మీర్‌లోని అన్ని వర్గాలు ఘటనను ఖండించాయి. ఇది ప్రభుత్వానికి, భద్రతా దళాలకు ప్రోత్సాహకరమైన సంకేతం” అని ఆయన అన్నారు.

“ఇది కచ్చితంగా చాలా పెద్ద దాడి. దౌత్య, సైనిక స్థాయిలో నిర్దుష్ట చర్యలు తీసుకోవాలి. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై ఏర్పరచుకున్న నమ్మకం బలహీనపడుతుందనుకోను” అని రషీద్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)