SOURCE :- BBC NEWS

గాజా, ఇజ్రాయెల్, హమాస్, కాల్పుల విరమణ

ఫొటో సోర్స్, Getty Images

గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ, హమాస్ చెరలోని బందీల విడుదలపై ఒప్పందం ఖరారుకు ఖతార్‌లో చర్చలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ – హమాస్ మధ్యన ఒప్పందం ఓ కొలిక్కి వస్తోందని, తుది దశలో ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

యుద్ధం మొదలైన తర్వాత, మొదటిసారి ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు ఒకే భవనంలో పరోక్ష చర్చలు జరుపుతున్నారని చర్చల గురించి సమాచారమున్న పాలస్తీనా అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకోవాలనే షరతును కూడా హమాస్ విరమించుకున్నట్లు చెబుతున్నారు.

ఒప్పందం దాదాపు కొలిక్కివచ్చిందని, ‘తుది దశ’లో ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ”కొద్ది గంటలు, లేదంటే రోజులు, లేదా ఇంకొంత సమయం”లో ఒప్పందం ఖరారయ్యే అవకాశముందని ఓ ఇజ్రాయెల్ అధికారి కూడా ‘రాయిటర్స్‌’ వార్తా సంస్థకు చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

జనవరి 20న తాను ప్రమాణస్వీకారం చేసే నాటికి ఎలాంటి ఒప్పందం కుదరకపోతే ”ఇక విధ్వంసమే” అని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపుల తర్వాత ఈ పరిణామాలు ఊపందుకున్నాయి.

ఆదివారం నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన బైడెన్ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో సోమవారం మాట్లాడారు.

హమాస్, ఇజ్రాయెల్ అధికారులు సోమవారం ఒకే భవనంలో ఆరుగంటల పాటు పరోక్ష పద్ధతిలో చర్చలు జరిపారని పాలస్తీనా అధికారి బీబీసీతో చెప్పారు.

ఒప్పందంలో ఉండొచ్చని భావిస్తున్న కొన్ని విషయాలను వెల్లడిస్తూ, ”కీలక అంశాల్లో చర్చలకు చాలా సమయం పట్టింది” అని చెప్పారాయన.

ఒప్పందంలో భాగంగా తొలిరోజు హమాస్ ముగ్గురు బందీల విడుదలకు, ఆ తర్వాత జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ ప్రారంభానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఏడు రోజుల తర్వాత, హమాస్ మరో నలుగురు బందీలను విడుదల చేస్తుంది, అనంతరం యుద్ధం కారణంగా నిరాశ్రయులై దక్షిణ ప్రాంతానికి వచ్చిన ప్రజలు తిరిగి ఉత్తరం వైపు వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతిస్తుంది. అయితే, తీరప్రాంత రహదారిపై కాలినడకన మాత్రమే అనుమతించనుంది.

సలాహ్ అల్ – దిన్ రోడ్డు పక్కనే ఉన్న మార్గంలో కార్లు, లాగుడు బండ్లు, ట్రక్కులు వెళ్లేందుకు అనుమతిస్తుంది, వీటిని ఖతార్, ఈజిప్ట్‌కు చెందిన సాంకేతిక భద్రతా సిబ్బంది ఎక్స్-రే యంత్రం ద్వారా స్కాన్ చేస్తుంది.

ఈ ఒప్పందంలో భాగంగా, మొదటి దశలో ఇజ్రాయెల్ దళాలు ఫిలడెల్ఫీ కారిడార్‌లో కొనసాగడంతో పాటు తూర్పు, ఉత్తర సరిహద్దుల వెంబడి 800 మీటర్ల మేర బఫర్ జోన్‌‌ను తమ అధీనంలో ఉంచుకుంటాయనే నిబంధన కూడా ఉంది. ఇది 42 రోజుల పాటు కొనసాగుతుంది.

అలాగే, ఇజ్రాయెల్ 1000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసేందుకు కూడా అంగీకరించింది. వీరిలో 190 మంది 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ఖైదీలు ఉన్నారు. దానికి బదులుగా, హమాస్ మరో 34 మంది బందీలను విడుదల చేస్తుంది.

ఇజ్రాయెల్, గాజా, హమాస్, కాల్పుల విరమణ

ఫొటో సోర్స్, Getty Images

మొదటి దశ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక 16వ రోజున ఈ ఒప్పందంలో రెండు, మూడో దశలకు సంబంధించిన చర్చలు ప్రారంభమవుతాయి.

ఇజ్రాయెల్ అమెరికన్ బందీ తండ్రి ఒకరు బీబీసీ న్యూస్‌ అవర్‌తో మాట్లాడుతూ, ఇజ్రాయెల్ ఒక ఒప్పందానికి ‘అంగీకారం’ తెలిపిందని ‘విశ్వసిస్తున్నా’ అని అన్నారు.

బందీగా ఉన్న తన కుమారుడు ‘సాగుయ్’ గురించి ఆలోచిస్తూ నిత్యం భయంభయంగా జీవిస్తున్నట్లు జొనాథన్ డెకెల్ – చెన్ చెప్పారు.

ట్రంప్ మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా దోహాలో ఉన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ విలేఖరులతో మాట్లాడుతూ, చర్చల్లో ‘పురోగతి’ ఉందని, ఒప్పందం ‘గతం కంటే మెరుగ్గా’ ఉందని అన్నారు.

అయితే, తాజా పరిణామాలతో నెతన్యాహు ప్రభుత్వం సంకీర్ణంలోని భాగస్వాముల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, ఇప్పటికే పది మంది రైట్‌వింగ్ సభ్యులు నెతన్యాహుకి లేఖ రాశారు. వారిలో నెతన్యాహు సొంత పార్టీ లికుడ్ సభ్యులు కూడా ఉన్నారు.

ఇజ్రాయెల్ , గాజా, హమాస్, కాల్పుల విరమణ

ఫొటో సోర్స్, Getty Images

2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ఈ యుద్ధం మొదలైంది. హమాస్ జరిపిన ఈ దాడిలో దాదాపు 1200 మరణించగా, 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు.

అనంతరం, హమాస్‌ను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ సైనిక దాడికి దిగింది.

యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 46,500 మందికి పైగా మరణించినట్లు గాజాలోని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

బందీల్లో 94 మంది గాజాలోనే ఉన్నారని, వారిలో 34 మంది చనిపోయినట్లు భావిస్తున్నామని, యుద్ధానికి ముందు కిడ్నాపైన మరో నలుగురు ఇజ్రాయెలీల్లో ఇద్దరు చనిపోయినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

గాజాలో ఇప్పటికీ పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది.

మెడిసిన్స్ శాన్స్ ఫ్రాంటియర్స్‌కు చెందిన అమండే బజరోల్ బీబీసీ టుడేతో మాట్లాడుతూ, కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నప్పటికీ, గాజావ్యాప్తంగా.. రఫా, ఖాన్ యూనిస్ సహా ఉత్తర గాజా వరకూ భారీ దాడులు జరిగినట్లు చెప్పారు.

కాల్పుల విరమణతో తక్షణమే పరిస్థితులు మారిపోతాయని అనుకోవడం లేదని ఆమె చెప్పారు.

” ఇక్కడ నిత్యజీవితానికి కావాల్సిన కనీస సదుపాయాలు కూడా లేవు” అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)