SOURCE :- BBC NEWS

చెవి గులిమి

ఫొటో సోర్స్, Emmanuel Lafont/ BBC

అల్జీమర్స్ నుంచి క్యాన్సర్ వరకు.. అనేక ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునేందుకు చెవి గులిమి (ఇయర్‌వ్యాక్స్) ఒక సంకేతం.

వ్యాధులను గుర్తించేందుకు సరికొత్త మార్గాలను కనుగొనాలనే ఉద్దేశంతో.. అందుకు చెవి గులిమి ఎలా ఉపయోగపడుతుందనే దానిపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు.

క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి మెటబాలిక్ డిజార్డర్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్న శాస్త్రవేత్తలను చెవి గులిమి ఎక్కువగా ఆకర్షిస్తోంది.

గులిమిని వైద్య పరిభాషలో సెరుమెన్ అంటారు. బయటి చెవి మార్గం (ఔటర్ ఇయర్ కెనాల్) లైన్‌పై ఉండే రెండు రకాల గ్రంథులకు చెందిన స్రావాల మిశ్రమం ఇది.

ఆ గ్రంథులు సెరుమినస్, సెబాషియస్.

ఇయర్ కెనాల్‌లో ఏర్పడిన తరువాత ఈ పదార్థం ఒక రకమైన కన్వేయర్ బెల్టు మెకానిజంలో ప్రయాణిస్తుంది. లోపల చెవి నుంచి బయటకు ప్రయాణించేటప్పుడు ఇది చర్మ కణాలకు అతుక్కుపోతూ ఉంటుంది. గులిమి ప్రతి రోజూ ఒక మిల్లీ మీటర్‌లో 20వ వంతు వేగంతో ప్రయాణిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఇయర్ కెనాల్ శుభ్రంగా, తడిగా ఉంచేందుకు గులిమి సాయపడుతుంది.

బ్యాక్టీరియా, ఫంగీ, కీటకాలు వంటి ఇతర అనవసరమైనవి చెవి మార్గంలోంచి తలలోకి వెళ్లకుండా ఇది నిరోధిస్తూ ఉంటుంది.

శరీరంలో విడుదలయ్యే మిగతా స్రావాలతో పోల్చితే చెవి గులిమిని పరిశోధకులు పెద్దగా పట్టించుకోలేదు.

కానీ, ఆశ్చర్యకరమైన శాస్త్రీయ ఆవిష్కరణలతో మార్పు మొదలైంది. ఒక వ్యక్తి చెవి గులిమి వారి గురించి ఆసక్తికరమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. అది చాలా ముఖ్యమైంది.

ఉదాహరణకు.. యూరప్ లేదా ఆఫ్రికా ప్రాంతానికి చెందిన చాలామంది ప్రజల చెవి గులిమి పసుపు పచ్చగా లేదా నారింజ రంగులో ఉండి జిగటగా, తడిగా ఉంటుంది. అయితే, ఈస్ట్ ఏసియాలోని 95 శాతం ప్రజలకు చెవి గులిమి పొడిగా, బూడిద రంగులో కనిపిస్తుంది.

అది జిగటగా కూడా ఉండదు. తడి లేదా పొడి చెవి గులిమిని విడుదల చేసే జన్యువు ఏబీసీసీ11.

చెవి గులిమికి సంబంధించిన కొన్ని ఆవిష్కరణలు మన ఆరోగ్యం గురించి చెవుల్లోని ఈ జిగురు పదార్థం ఏం చెప్తుందనేది సూచిస్తున్నాయి.

ఇయర్‌వ్యాక్స్

ఫొటో సోర్స్, Emmanuel Lafont/ BBC

ముఖ్యమైన ఆధారాలు

జపాన్, తైవాన్ మహిళల చెవి గులిమి పొడిగా ఉంటుంది.. కానీ, యూరోపియన్ మూలాలున్న(కాకేసియన్) వారు, ఆఫ్రికన్ అమెరికన్, అమెరికాలోని జర్మన్ మహిళలకు అంతకు నాలుగు రెట్లు ఎక్కువ తడిగా ఉండే గులిమి ఉంటుంది.

చెవి గులిమి పొడిగా ఉండే ఆయా ప్రాంతాల మహిళల్లో కంటే తడి గులిమి ఉండే కాకేసియన్, ఆఫ్రికన్ అమెరికన్, అమెరికాలోని జర్మన్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు ఎక్కువగా ఉన్నాయని శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మెడిసిన్ ప్రొఫెసర్ నిఖోలస్ ఎల్ పెట్రాకిస్ 1971లో చెప్పారు.

టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు 2010లో ఒక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న 270 మహిళా రోగులకు చెందిన రక్త నమూనాలను తీసుకున్నారు.

ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న జపాన్ మహిళలలో 77 శాతం ఎక్కువగా తడి గులిమికి కారణమయ్యే జన్యువు ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఈ ఆవిష్కరణలు వివాదాస్పదమైనప్పటికీ.. జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీలో చాలా అధ్యయనాలు కూడా తడి లేదా పొడి గులిమి ఉన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పులో ఎలాంటి తేడా లేదని వెల్లడైంది. ఈ దేశాల్లో పొడి చెవి గులిమి ఉన్న వ్యక్తులు చాలా తక్కువగా ఉన్నారు.

చెవి గులిమిలో ఉన్న పదార్థాలు, కొన్ని వ్యాధుల మధ్య గల సంబంధం ఏంటనేది కనుగొనేందుకు పరిశోధకులు ప్రయత్నించారు.

ఆహారంలో ఉండే కొన్ని అమైనో ఆమ్లాలను విచ్ఛిన్నం చేయకుండా శరీరాన్ని అడ్డుకునే ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి ‘మాపిల్ సిరప్ యూరిన్ డిసీజ్‌’ని ఉదాహరణగా తీసుకుంటే .. ఈ వ్యాధి ఉన్నవారి రక్తంలో, మూత్రంలో కొన్ని అస్థిరమైన పదార్థాలు అభివృద్ధి చెందుతాయి. దీంతో, వారి మూత్రం మాపిల్ సిరప్ వాసన వస్తుంది.

ఈ వాసనకు కారణం సోటోలోన్ అనే అణువు. మాపిల్ సిరప్ యూరిన్ డిసీజ్‌ ఉన్నవారి చెవి గులిమిలోనూ ఈ సోటోలోన్ ఉంటుంది.

కాబట్టి ఈ వ్యాధిని గుర్తించడానికి సులభమైన విధానం గులిమి పరీక్ష.

‘‘శిశువు జన్మించిన 12 గంటలలోపు చెవి గులిమి మ్యాపిల్ సిరప్ వంటి వాసన వస్తే వారికి ఈ జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు’’ అని లూసియానా స్టేట్ యూనివర్సిటీ ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్ రబి అన్ మూసా చెప్పారు.

చిన్నపిల్లలు

ఫొటో సోర్స్, Emmanuel Lafont/ BBC

అయితే, ప్రస్తుతం రక్త పరీక్షల ద్వారా ఈ పరిస్థితిని గుర్తించడం తేలికైంది.

మెనీర్ డిసీజ్ అనేది లోపలి చెవిలో వచ్చే ఒక రుగ్మత. దీనివల్ల వినికిడి లోపం, వెర్టిగో (తలతిరుగుడు) వంటివి వస్తాయి. ఇది ఒక దీర్ఘకాలిక సమస్య. ఇది కాలక్రమేణా తీవ్రమై, శాశ్వతంగా వినికిడి కోల్పోతారు.

మెనీర్ డిసీజ్ ఉన్న రోగుల్లో చెవి గులిమిలో మూడు ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ స్థాయిలో ఉన్నట్లు ఒక అధ్యయన బృందం గుర్తించింది.

” రక్తం, మూత్రం లేదా సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ వంటి సాధారణ జీవ ద్రవాలను ఉపయోగించి రోగ నిర్ధరణ చేయడం కష్టమైన అనారోగ్యాలను గుర్తించేందుకు చెవి గులిమి ఉపయోగించడంపై ఆసక్తిగా ఉంది. అరుదైన వ్యాధులైనందున వీటిని గుర్తించేందుకు చాలా సమయం పడుతుంది.” అని లూసియానా స్టేట్ యూనివర్సిటీ ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్ రబి అన్ మూసా చెప్పారు.

చెవి గులిమిలో ఉండే 27 రకాల పదార్థాలు క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఉపయోగపడతాయని పరిశోధకులు కనుగొన్నారు.

‘‘జీవుల్లో ఉండే చాలా వ్యాధులు జీవక్రియకు చెందినవి’’ అని డయాబెటిస్, క్యాన్సర్, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులను ఉదాహరణలుగా చెప్పారు బ్రెజిల్ ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ గోయాస్‌లో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నీల్సన్ రాబర్టో యాంటోనియోసి ఫిల్హో.

రక్తం, మూత్రం, చెమట, కన్నీళ్లు వంటి ఇతర జీవ ద్రవాలను మించి ఇయర్‌వ్యాక్స్ అత్యంత వైవిధ్యమైన పదార్థాలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు.

యాంటోనియోసి ఫిల్హో , ఆయన బృందం కలిసి ”సెరుమెనోగ్రామ్” అనే డయాగ్నస్టిక్ టూల్‌ను తయారు చేస్తున్నారు. ఇది చెవి గులిమిని ఆధారంగా చేసుకుని కొన్ని రకాల క్యాన్సర్లను కచ్చితంగా అంచనావేయొచ్చని చెబుతున్నారు.

2019 అధ్యయనంలో, యాంటోనియోసి ఫిల్హో 52 మంది క్యాన్సర్ రోగుల నుంచి చెవి గులిమి శాంపిల్స్ సేకరించారు. వారికి లింఫోమా, కార్సినోమా, లుకేమియా ఉన్నాయి. అలాగే, ఆరోగ్యకరంగా ఉన్న 50 మంది నుంచి కూడా చెవి గులిమిని సేకరించారు. ఈ రెండు రకాల శాంపిళ్లను పోల్చి చూశారు.

జీర్ణక్రియ

ఫొటో సోర్స్, Emmanuel Lafont/ BBC

క్యాన్సర్‌ను గుర్తించేందుకు చెవి గులిమిలోని 27 పదార్థాలు ”ఫింగర్‌ ప్రింట్”లా పనిచేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు.

ఈ 27 అణువుల సాంద్రతలను ఆధారంగా చేసుకుని ఎవరికైనా లింఫోమా, కార్సినోమా, లుకేమియా వంటి క్యాన్సర్ ఉందో లేదో కచ్చితంగా ఈ టీమ్ అంచనావేయగలదు.

ఇంకా ప్రచురితం కాని అధ్యయనంలో, క్యాన్సర్‌కు ముందు దశల్లో వచ్చే జీవక్రియలోని అవాంతరాలను సెరుమెనోగ్రామ్ గుర్తించగలదని యాంటోనియోసి ఫిల్హో చెప్పారు.

”మొదటి దశలోనే గుర్తించడం ద్వారా చాలా రకాల క్యాన్సర్లను 90 శాతం వరకు నయం చేయొచ్చని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. ప్రీ-క్యాన్సర్ స్టేజస్‌లో గుర్తించడం ద్వారా చికిత్సలో విజయాన్ని పొందవచ్చు” అని యాంటోనియోసి ఫిల్హో చెప్పారు.

ఇటీవలే బ్రెజిల్‌లోని ఓ హాస్పిటల్ డయాగ్నస్టిక్ టూల్‌గా సెరుమెనోగ్రామ్‌ను వాడుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)