SOURCE :- BBC NEWS
గత సంవత్సరం నవంబర్‌లో సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను చైనా ఉరితీసింది.
జుహై నగరంలోని ఒక స్టేడియం బయట వ్యాయామం చేస్తున్న వారిని 62 ఏళ్ల ఫ్యాన్ వీకియు కారుతో ఢీకొట్టారు. నవంబర్ 11న జరిగిన ఈ ఘటనలో 35 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దశాబ్ద కాలంలో చైనాలో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటిగా పరిగణించారు.
విడాకుల తర్వాత తన ఆస్తిని విభజించిన విధానంపై వీకియు కలత చెంది, ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వీకియు కూడా గాయపడ్డారు.
మరో ఘటనలో జు జియాజిన్ (21) వుక్సీ నగరంలోని తన వర్సిటీలో కత్తితో దాడి చేసి, ఎనిమిది మందిని చంపారు. పరీక్షల్లో తప్పి, డిప్లొమా దక్కనందుకు ఆయన ఈ ఘటనకు పాల్పడ్డారు.
నేరాలు తీవ్రమైనవి: కోర్టు
వీకియు చర్య క్రూరమైనదిగా, అతని ఉద్దేశం చాలా తీవ్రమైనదిగా జుహై ఇంటర్మీడియెట్ పీపుల్స్ కోర్టు అభిప్రాయపడింది. ఆయనను కోర్టు దోషిగా తేల్చుతూ డిసెంబర్లో తీర్పు వెల్లడించగా, నెల రోజులలోపే అంటే సోమవారం నాడు ఉరితీశారు.
మరోవైపు, జు జియాజిన్ నవంబర్ 16న తన నేరాన్ని అంగీకరించారు. ఆయన చర్యలు అత్యంత తీవ్రమైనవని కోర్టు పేర్కొంటూ డిసెంబర్ 17న మరణశిక్ష విధించింది.
ఇతర దేశాలతో పోల్చితే చైనా ఎక్కువ మందిని ఉరితీస్తుందని మానవ హక్కుల సంఘాలు భావిస్తున్నాయి. అయితే చైనా మరణశిక్షల గురించి ప్రపంచానికి ఎక్కువగా వివరాలను అందించలేదు.
అక్కడ ప్రతి సంవత్సరం వేలల్లో ఉరిశిక్షలు ఉంటాయని హక్కుల సంఘాలు అంచనా వేస్తున్నాయి.
పెరుగుతున్న ప్రతీకార దాడులు
చైనా ప్రజా హింస సమస్యలతో సతమతమవుతోంది. వ్యక్తిగత సమస్యల కారణంగా ‘సమాజంపై ప్రతీకారం’ కోరుకుంటూ పలువురు దాడులకు పాల్పడుతున్నారు. 2024లో ఇలాంటివి 19 దాడులు జరిగాయి.
జుహై, వుక్సీ దాడుల తరువాత చాంగ్డే నగరంలో మరొక సంఘటన జరిగింది. ఇక్కడ హువాంగ్ వెన్ అనే వ్యక్తి ప్రాథమిక పాఠశాల వెలుపల పిల్లలు, తల్లిదండ్రులపైకి కారును నడపడంతో 30 మంది గాయపడ్డారు. పెట్టుబడి నష్టాలు, కుటుంబ సమస్యలతో హువాంగ్ కలత చెందినట్లు అధికారులు తెలిపారు.
అతనికి గత నెలలో మరణశిక్ష విధించి, దానిని సస్పెండ్ చేశారు. రాబోయే రెండేళ్లలో అతను మరో నేరానికి పాల్పడకుండా ఉంటే ఆ శిక్షను జీవిత ఖైదుగా తగ్గించనున్నారు.
ఈ హింసాత్మక ఘటనలు చైనాలో పెరుగుతున్న ఉద్రిక్తతలను చూపుతున్నాయని, దీనికి దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉండటం లాంటి అంశాలు కూడా కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సమీప భవిష్యత్తులో ఉపశమనం కలిగే సూచనలు కూడా కనిపించడం లేదని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ చైనా సెంటర్లో ఆర్థికవేత్త అయిన జార్జ్ మాగ్నస్ పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)