SOURCE :- BBC NEWS

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇండియన్ ఆర్మీ, బిపిన్ రావత్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి, హెలికాప్టర్ క్రాష్

ఫొటో సోర్స్, Getty Images

21 డిసెంబర్ 2024

2021 డిసెంబర్ 8న భారత దేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం జరగడంతో దేశమంతా నిర్ఘాంతపోయింది.

ఈ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక రావత్ మరో 12 మంది చనిపోయారు.

ఈ సంఘటన జరిగిన మూడేళ్ల తర్వాత స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఒక నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ‘మానవ తప్పిదం’ వల్లే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ- 17 హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగిందని అందులో పేర్కొంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమాన ప్రమాదాల గురించి 13వ డిఫెన్స్ ప్లాన్ పీరియడ్ నివేదికలో కమిటీ ఈ ప్రమాదం గురించి వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇండియన్ ఆర్మీ, బిపిన్ రావత్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి, హెలికాప్టర్ క్రాష్

ఫొటో సోర్స్, ANI

నివేదికలో ఏముంది?

2017-2022 ఆర్థిక సంవత్సరంలోని 13వ డిఫెన్స్ ప్లాన్ పీరియడ్‌లో భారత వైమానిక దళానికి చెందిన 34 విమానాలు కూలిపోయినట్లు నివేదిక వెల్లడించింది.

2021-22 ఆర్ధిక సంవత్సరంలో 9 విమాన ప్రమాదాలు జరిగాయని, 2021 డిసెంబర్ 8న జరిగిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం మానవ తప్పిదంవల్లే జరిగిందని తేల్చింది.

ప్రమాదం ఏ రోజున జరిగింది? కూలిపోయిన విమానం ఏ రకానిది వంటి వివరాలన్నీ ఈ నివేదికలో పేర్కొన్నారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇండియన్ ఆర్మీ, బిపిన్ రావత్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి, హెలికాప్టర్ క్రాష్

ఫొటో సోర్స్, ADG PI-INDIAN ARMY

స్పష్టం చేసిన నివేదిక

పైలట్ తప్పిదమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని గతంలో వచ్చిన అనుమానాలను ఈ నివేదిక ధ్రువీకరించింది.

దర్యాప్తు బృందం నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఇదే విషయం వెల్లడైనట్లు ఎన్డీటీవీ నివేదిక తెలిపింది “లోయలో అనుకోకుండా ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల హెలికాప్టర్ మేఘాల్లోకి వెళ్లింది. దీంతో ప్రమాదం జరిగింది” అని దర్యాప్తు బృందం తెలిపింది.

ప్రమాదానికి కారణాల గురించి తెలుసుకోవడానికి దర్యాప్తు బృందం ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌‌లలోని సమాచారాన్ని విశ్లేషించింది. దీంతో పాటు ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక నిర్థరణకు వచ్చింది.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇండియన్ ఆర్మీ, బిపిన్ రావత్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి, హెలికాప్టర్ క్రాష్

ఫొటో సోర్స్, ANI

2021 డిసెంబర్ 8న ఏం జరిగింది?

కోయంబత్తూరులోని సూలూర్ ఆర్మీ బేస్ నుంచి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, 12 మంది సైనిక సిబ్బందితో ఎంఐ-17 హెలికాప్టర్ బయలుదేరింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజీకి ఇది వెళ్లాల్సి ఉంది.

హెలికాప్టర్ ఆ ప్రాంతానికి చేరుకోవడానికి కొన్ని నిముషాల ముందు, నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని కొండ ప్రాంతంలో కూలిపోయింది. ఇందులో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 11 మంది సైనికులు మరణించారు.

ఈ ప్రమాదంలో శౌర్య చక్ర విజేత గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే వారం రోజుల తర్వాత చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇండియన్ ఆర్మీ, బిపిన్ రావత్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి, హెలికాప్టర్ క్రాష్

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదంలో ఎవరెవరు చనిపోయారు?

ఈ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులికా రాజేసింగ్ రావత్, ఆయన డిఫెన్స్ అసిస్టెంట్ బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎంఐ-17 పైలట్ వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, పైలట్ స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ మరణించారు.

వీరితో పాటు జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్, జూనియర్ వారెంట్ ఆఫీసర్ అరక్కల్ ప్రదీప్, హవల్దార్ సత్పాల్ రాయ్, నాయక్ గుర్‌సేవక్ సింగ్, నాయక్ జితేంద్ర కుమార్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్, లాన్స్ నాయక్ బి.సాయి తేజ కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎంఐ-17 విమానం సురక్షితమైనదిగా, విశ్వసనీయమైనదిగా గుర్తింపు పొందింది

రష్యాలో తయారైన ఎంఐ-17 హెలికాప్టర్లను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధిక ఎత్తులో ఎగిరే ఆపరేషన్లు, వరద ప్రభావిత ప్రాంతాలు, విపత్కర పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది.

“ఎంఐ-17 చాలా నమ్మకమైన హెలికాప్టర్. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండే ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సహాయ కార్యక్రమాల కోసం ఈ హెలికాప్టర్‌నే ఉపయోగిస్తారు” అని ప్లానెట్ ఎక్స్ ఏరోస్పేస్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ చెప్పారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇండియన్ ఆర్మీ, బిపిన్ రావత్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి, హెలికాప్టర్ క్రాష్

ఫొటో సోర్స్, PENGUIN VEER

భారత దేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

2019 డిసెంబర్31న భారత దేశపు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. 2020 జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా సైన్యంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం, భారత సైన్యం ఆధునీకరణకు అధిక ప్రాధాన్యమిచ్చారు.

ఆయన అంతకు ముందు ఇండియన్ ఆర్మీ అధిపతిగా ఉన్నారు. 2016 డిసెంబర్ 31 నుంచి 2017 జనవరి1 వరకు భారతదేశ ఆర్మీ స్టాఫ్‌కి 26వ చీఫ్‌గా కూడా ఉన్నారు.

కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటి అమలులోనూ అంతే కచ్చితంగా వ్యవహరిస్తారు. తీవ్రవాదుల చెర నుంచి ఈశాన్య రాష్ట్రాలను విముక్తం చెయ్యడంలో కీలకంగా వ్యవహరించారు రావత్.

పాకిస్తాన్‌లోని తీవ్రవాదుల రహస్య స్థావరాలను ధ్వంసం చేయడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS