SOURCE :- BBC NEWS

trump

ఫొటో సోర్స్, Getty Images

తన అధ్యక్ష పదవీకాలం ముగిసేలోగా గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

మొదట 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 లక్షల కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు.

గోల్డెన్ డోమ్‌కు మొత్తంగా సుమారు 175బిలియన్ డాలర్ల (సుమారు రూ. 14 లక్షల కోట్లు) వ్యయం అవుతుందని ట్రంప్ అంచనావేస్తున్నారు. కానీ అంతిమంగా అయ్యే ఖర్చు అంచనాలకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

భూమి, సముద్రం, అంతరిక్షంలో కీలకమైన ”తరువాతి తరం” టెక్నాలజీ నెట్ వర్క్‌గా భావిస్తున్న ఈ గోల్డెన్ డోమ్‌లో సెన్సర్లు, నిరోధకాలు ఉంటాయి. క్షిపణులను గుర్తించి దాడులను అడ్డుకుంటాయి.

ప్రస్తుతం ఉన్న వ్యవస్థలకన్నా మెరుగ్గా, మరింత ఎక్కువ పరిధిలో పనిచేసేలా గోల్డెన్ డోమ్‌ను నిర్మించవచ్చు. రష్యా, చైనా వంటి దేశాల అధునాతన విమానాల దాడుల నుంచి రక్షణకు ఇది ఉపయోగపడుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అమెరికా, గోల్డెన్ డోమ్, ఇజ్రాయెల్, ఐరన్ డోమ్

ఫొటో సోర్స్, Getty Images

గోల్డెన్ డోమ్ ఎలా పనిచేస్తుంది?

గోల్డెన్ డోమ్ నిర్మించుకోవాలన్న ట్రంప్ ప్రణాళికకు స్ఫూర్తి ఇజ్రాయెల్ ఐరన్

డోమ్. ఇందులోని రాడార్ రక్షణ వ్యవస్థ, తక్కువస్థాయి క్షిపణుల దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 2011 నుంచి ఇజ్రాయెల్ దీన్ని ఉపయోగిస్తోంది.

విస్తృత స్థాయి దాడులను ఎదుర్కోడానికి గోల్డెన్ డోమ్ నిర్మించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కన్నా ఇది చాలా రెట్లు పెద్దగా ఉండనుంది.

ఇది వందలాది శాటిలైట్ల నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించి గతంలో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. కానీ ప్రస్తుతం ఇది ఆచరణసాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

”చాలా సంవత్సరాల క్రితం రోనాల్డ్ రీగన్ ఇలాంటిది కావాలనుకున్నారు. కానీ అప్పుడు టెక్నాలజీ లేదు” అని ట్రంప్ చెప్పారు. అంతరిక్ష ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను ట్రంప్ ఉదహరించారు. దీన్ని ”స్టార్ వార్స్” అంటారు. ఈ పదం చాలా ప్రఖ్యాతిగాంచింది. 1980ల్లో రోనాల్డ్ రీగన్ దీన్ని ప్రతిపాదించారు.

ప్రపంచంలోని మరో వైపు నుంచి లేదా అంతరిక్షం నుంచి క్షిపణులతో దాడులు చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం గోల్డెన్ డోమ్‌కు ఉంటుందని ట్రంప్ తెలిపారు.

క్రూయిజ్, శబ్దం కన్నా వేగంగా ప్రయాణించగల హైపర్ సోనిక్ ఆయుధాలు సహా బాలిస్టిక్ మిసైళ్ల దాడులను, అంతరిక్షం నుంచి వార్‌హెడ్‌లను పంపగల ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబర్డ్‌మెంట్ సిస్టమ్స్‌ను గోల్డెన్ డోమ్‌తో అడ్డుకోవచ్చు.

వందలాది శాటిలైట్లతో ఉండే మూడు లేదా నాలుగు గ్రూపు శాటిలైట్ల ఆధారంగా గోల్డెన్ డోమ్ పనిచేస్తుందని సైబర్ అండ్ టెక్నాలజీ ఇన్నొవేషన్ అమెరికా సెంటర్ సీనియర్ డైరెక్టర్ రేర్ అడ్మిరల్ మార్క్ మాంట్‌గోమెరీ చెప్పారు.

”వందలాది శాటిలైట్లుంటాయి. క్షిపణులను గుర్తిస్తాయి. వాటిని ట్రాకింగ్ చేస్తాయి. దాడులను అడ్డుకుంటాయి. శత్రువులు ప్రయోగించే మిసైళ్లను కూల్చే సామర్థ్యమున్న ఆయుధాలు అందులో ఉంటాయి” అని న్యూస్‌డే ప్రోగ్రామ్‌లో ఆయన చెప్పారు.

అమెరికా, గోల్డెన్ డోమ్, ఇజ్రాయెల్, ఐరన్ డోమ్

ఫొటో సోర్స్, Getty Images

మూడేళ్లలో గోల్డెన్ డోమ్ నిర్మించవచ్చా?

‘‘అమెరికా మిలటరీ ఈ ప్రణాళికపై చాలా తీవ్రంగా పనిచేస్తోంది. అయితే ట్రంప్ హయాంలోనే అది పూర్తవుతుందని భావించడం వాస్తవికంగా ఉండదని సైన్యం భావిస్తోంది. అమెరికా రక్షణ బడ్జెట్‌లో చాలా భాగం దీనికోసం ఖర్చు పెట్టాల్సిఉంటుంది’’ అని ‘ద ఎకనమిస్ట్’ డిఫెన్స్ ఎడిటర్ శశాంక్ జోషి బీబీసీతో చెప్పారు.

మాజీ అడ్మిరల్ మాంటొగోమెరీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఈ మిషన్ పూర్తవడానికి ఏడు నుంచి పదేళ్ల కాలం పట్టవచ్చని చెప్పారు.

మూడేళ్లలో మనకు మరింత రక్షణ పెరిగేలా పరిస్థితులు మారతాయని, అయితే ప్రస్తుత అధ్యక్షుని పదవీకాలం పూర్తయ్యేనాటికి వంద శాతం రక్షణ వ్యవస్థ ఏర్పాటు సాధ్యం కాదని ఆయనన్నారు.

అంతరిక్ష ఆధారిత వ్యవస్థలోని భాగాల నిర్మాణానికే 20ఏళ్ల కాలంలో 542 బిలియన్ డాలర్ల ఖర్చవుతుందని అమెరికా ప్రభుత్వం తరఫున ఖర్చులు అంచనావేసే బడ్జెట్ ఆఫీస్ తెలిపింది.

అమెరికా, గోల్డెన్ డోమ్, ఇజ్రాయెల్, ఐరన్ డోమ్

ఫొటో సోర్స్, Getty Images

గోల్డెన్ డోమ్ ఎవరు నిర్మిస్తారు?

అమెరికా స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్‌లీన్ రూ. లక్షల కోట్ల విలువైన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు బాధ్యతలు చూస్తున్నారు.

2023 నుంచి ఆయన స్పేస్ ఫోర్స్‌లో అంతరిక్ష వ్యవహారాల ముఖ్యాధికారిగా ఉన్నారు. ఇది అమెరికా మిలటరీ బ్రాంచ్. క్షిపణి హెచ్చరికలు, స్పేస్ డొమైన్‌పై అవగాహన కల్పించడం, పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్, కమ్యూనికేషన్లు, స్పేస్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వంటి సేవలను అందిస్తుంది.

గుట్‌లీన్‌ను ట్రంప్ చాలా ప్రతిభావంతుడైన వ్యక్తిగా అభివర్ణించారు. స్పేస్ సిస్టమ్స్ కమాండ్, డైరెక్టర్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్స్ హెడ్‌గా పనిచేసిన అనుభవంతో కొత్త బాధ్యతలపై గుట్‌లీన్ తనదైన ముద్రవేస్తారని ట్రంప్ అన్నారు.

అమెరికాలోని ఒక్లహోమా రాష్ట్రంలో పుట్టిపెరిగటిన గుట్‌లీన్ ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో చదువు పూర్తయిన తర్వాత అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో 1991లో చేరారు.

అమెరికా, గోల్డెన్ డోమ్, ఇజ్రాయెల్, ఐరన్ డోమ్

ఫొటో సోర్స్, Getty Images

గోల్డెన్ డోమ్ గురించి చైనా, రష్యా ఏమనుకుంటున్నాయి?

రష్యా, చైనా ప్రయోగించే క్షిపణులను అడ్డుకోవడమే గోల్డెన్ డోమ్ ప్రాథమిక లక్ష్యం.

అమెరికా రక్షణ రంగంలో ఉన్న లోపాలను లక్ష్యంగా చేసుకుని చైనా, రష్యా కొత్త తరహా క్షిపణుల దాడుల బెదిరింపులకు దిగే అవకాశముందని అమెరికా రక్షణ రంగ నిఘా సంస్థ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంట్‌లో ఉంది.

ఈ కొత్త రక్షణ వ్యవస్థ అంతరిక్షంలో యుద్ధాలు చేయడానికి వీలుగా ఆయుధ సామర్థ్యాన్ని పెంచేలా ఉందని ఈ నెల ప్రారంభంలో చైనా, రష్యా మధ్య జరిగిన చర్చల తర్వాత చేసిన ప్రకటనలో క్రెమ్లిన్ ఆరోపించింది.

ఇది అమెరికా సార్వభౌమత్వానికి సంబంధించిన సొంత విషయమని, అయితే అణ్వాయుధాల చర్చలు మళ్లీ మొదలవడానికి ఇది దారితీయొచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు.

అంతరిక్షంలో సైనికీకరణ పెంచడం అంతర్జాతీయ భద్రతను దెబ్బతీస్తుందని చైనా ఆందోళన వ్యక్తంచేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)