SOURCE :- BBC NEWS
అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు వేలాది మంది ఆందోళనాకారులు, అందులో ఎక్కువ మంది మహిళలు ట్రంప్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్లో ఆందోళన నిర్వహించారు.
గతంలో మహిళల ప్రదర్శనగా పిలిచే ఈ ఆందోళనను ప్రస్తుతం పీపుల్స్ మార్చ్ అని పిలుస్తున్నారు. 2017 నుంచి ఇది ప్రతి ఏటా జరుగుతోంది.
ట్రంపిజానికి వ్యతిరేకంగా కొన్ని సమూహాలు కూటమిగా మారి ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి అని పీపుల్స్ మార్చ్ వెబ్సైట్ తెలిపింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా న్యూయార్క్, సియాటెల్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రదర్శనలు జరిగాయి.
సోమవారం నాటి ప్రమాణ స్వీకారం కోసం ట్రంప్ వారాంతంలో వాషింగ్టన్ వచ్చారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనాకారులు నగర వీధుల్లోకి భారీ సంఖ్యలో వచ్చారు.
శనివారం వాషింగ్టన్లో జరిగిన పీపుల్స్ మార్చ్‌లో పాల్గొన్న వారి సంఖ్య గతంతో పోలిస్తే తక్కువగా ఉంది.
50వేల మంది పాల్గొంటారని నిర్వాహకులు భావిస్తే, 5వేల మంది మాత్రమే వచ్చారు.
లింకన్ మెమోరియల్ నుంచి ర్యాలీగా బయల్దేరడానికి ముందు ఆందోళనాకారులంతా నగరంలోని మూడు పార్కుల వద్దకు చేరుకున్నారు.
వాతావరణ మార్పులు, వలసలు, మహిళల హక్కులు ఇలా వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నవారు, అంశాల వారీగా ఆసక్తి ఉన్న వారంతా ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారని ఈ గ్రూపు వెబ్సైట్ వెల్లడించింది.
తమను వివిధ అంశాలు ప్రేరేపించాయని, అందుకే ఆందోళనల్లో పాల్గొన్నట్లు కొంతమంది మహిళలు బీబీసీతో చెప్పారు.
అబార్షన్ హక్కుల కోసం తాను ఆందోళనల్లో పాల్గొన్నట్లు బ్రూకే చెప్పారు.
“అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లు ఓటు వేసిన తీరు నాకేమీ నచ్చలేదు. ఇప్పటికే ఒకసారి దేశాన్ని నాశనం చేసిన వ్యక్తికి దేశ ప్రజలంతా అండగా నిలవడం నన్ను బాధించింది. మనం ఒక మహిళా అభ్యర్థిని అధ్యక్షురాలిగా చేయలేకపోయాం” అని ఆమె చెప్పారు.
కొన్ని మిశ్రమ స్పందనలు తనను దేశ రాజధాని వీధుల్లోకి వచ్చేలా చేశాయని మరో మహిళ కయలా చెప్పారు.
“నిజం చెప్పాలంటే, నాకు పిచ్చి పట్టినట్లుగా ఉంది, నేను చాలా బాధలో ఉన్నాను. నేను విచారంలో మునిగిపోయాను” అని ఆమె అన్నారు.
2016లో డోనల్డ్ ట్రంప్ హిల్లరీ క్లింటన్‌ను ఓడించిన తర్వాత పీపుల్స్ మార్చ్ మళ్లీ మొదలైంది.
అప్పట్లో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజు మహిళలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో వేల మంది ప్రజలు స్పందించారు.
మహిళల జననావయవాలను పట్టుకోవడం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేప్ బయటకు రావడంతో, ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళలంతా గులాబీ రంగు “పుస్సీ టోపీలు” ధరించి ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమం వాషింగ్టన్లోనే కాకుండా దేశమంతటా విస్తరించింది.
ఆ తర్వాతి రోజుల్లో ట్రంప్ అజెండాను వ్యతిరేకించేవారికి మహిళల ప్రదర్శన కీలకంగా మారింది. అయితే నాటి మహిళ మార్చ్ తర్వాత జరిగిన ఆందోళనలు ఏవీ ఆ స్థాయిలో లేవు.
సోమవారం జరగనున్న అధ్యక్ష బాధ్యతల స్వీకారంలో పాల్గొనేందుకు ట్రంప్ శనివారమే వాషింగ్టన్ చేరుకున్నారు. వాషింగ్టన్ రావడానికి ముందు వర్జీనియా ఐలండ్స్‌లోని గోల్ఫ్ క్లబ్లో టపాసులుపేల్చి వేడుక చేసుకున్నారు.
నిరంకుశ వాదులకు వ్యతిరేకంగా సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించడం ద్వారా ట్రంప్‌ను ఎదుర్కొంటామని ఆందోళనల నిర్వహకులు చెప్పారు.
శనివారం ట్రంప్ మద్దతుదారులు కొంతమంది వాషింగ్టన్‌లోని స్మారక చిహ్నం వద్దకు చేరుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని రాసిన టోపీలను ధరించి ఉన్న వారి వద్దకు పీపుల్స్ మార్చ్ నాయకుడు ఒకరు వెళ్లి నో ట్రంప్, నో కేకేకే అంటూ నినాదాలు చేశారు.
ట్రంప్ మద్దతుదారుల్లో ఒకరైన తిమోతి వాల్లిస్ తాము ఒక వీధి వ్యాపారి వద్ద టోపీలు కొనుక్కున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థతో చెప్పారు
ఆందోళన చేసేందుకు అందరికీ ‘హక్కు’ ఉందని వాల్లిస్ చెప్పారు. అయితే వారు తమ పట్ల ద్వేషాన్ని ప్రదర్శించడం తనను అయోమయంలో పడేసిందన్నారు.
“మనందరికీ ఒకే దేశం. ఇలా చేయడం విచారకరం” అని ఆయన అన్నారు.
బీబీసీతో మాట్లాడిన మరో ఆందోళనాకారుడు తాను ఆందోళనలో పాల్గొనేందుకే నగరానికి వచ్చానని చెప్పారు.
శాన్ఫ్రాన్సిస్కో నుంచి ప్రదర్శనల్లో పాల్గొనేందుకు సూసి వచ్చారు. ఆమె సోదరి కూడా ఇందులో పాలుపంచుకున్నారు. వీళ్లిద్దరూ గతంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత జరిగిన మహిళల మార్చ్‌లో పాల్గొన్నారు.
2017లో మహిళల మార్చ్‌లో పాల్గొన్న జన సమూహం గురించి సూసీ గుర్తు చేసుకున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ప్రజలు వీధుల్లోకి వస్తారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.
“ఈసారి ఆందోళనలు జరిగితే అవి చాలా తీవ్రంగా ఉంటాయి. ట్రంప్ చాలా ధైర్యంగా ఉన్నారు. ఆయన కార్పొరేట్లు, ధనవంతులకు గులాంగిరీ చేస్తున్నారు” అని ఆమె అన్నారు.
నిరసనకారుల్లో అనేకమందికి అమెరికాలో ఏం జరుగుతోందో తెలియడంలేదని తాను భావిస్తున్నట్లు అన్నే చెప్పారు. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఏడు కీలక రాష్ట్రాల్లో గెలిచారు.
మిగతా వారి సంగతి ఎలా ఉన్నా “తాము ఇక్కడే ఉంటామని, పోరాడతామని” ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)