SOURCE :- BBC NEWS

భారత్, చైనా, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

సుంకాలపై అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచంలోని అనేక దేశాలకు కొత్త అవకాశాలు లభించే పరిస్థితులను ఏర్పరుస్తోంది.

భారత్‌పైనా అమెరికా సుంకం విధించింది. కొన్ని రంగాలలో ఇది భారత్‌కు మంచి అవకాశాలు కల్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.

చైనా ఉత్పత్తులకు భారత మార్కెట్ ‘డంపింగ్ గ్రౌండ్’గా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అంటే సుంకాల వల్ల నెలకొన్న ఉద్రిక్తతతో అమెరికా మార్కెట్‌లో అమ్మకాలకు ఇబ్బందులు ఎదురైన ఉత్పత్తులను చైనా భారత్‌కు తరలించవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భారత్, చైనా, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతున్న వాణిజ్య లోటు

భారత్, చైనా మధ్య వాణిజ్యలోటు పెరుగుతూ పోతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సోలార్ సెల్స్, బ్యాటరీల దిగుమతుల్లో పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

చైనా ఆధిపత్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సోలార్ సెల్స్ వంటి వాటికి డిమాండ్ పెరగడంతో ఆ దేశం నుంచి దిగుమతులు 11.5 శాతం పెరిగాయి. అదే సమయంలో చైనాకు ఎగుమతులతో పోలిస్తే ఆ దేశానికి భారత్ ఎగుమతులు 14.5 శాతం తగ్గాయి.

ఇది భారత్ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరిగడానికి దారితీసింది. ఈ లోటు గతంలో ఎప్పుడూ లేని విధంగా 99.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.46 లక్షల కోట్ల) కు చేరుకుంది.

ఒక్క మార్చిలోనే చైనా నుంచి భారత్ 9.7 బిలియన్ డాలర్ల ( సుమారు రూ. 80.5 వేల కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. భారత్‌లోకి చైనా తన సరుకులను డంప్ చేస్తే, వాణిజ్య లోటు మరింత పెరగవచ్చు.

భారత్, చైనా, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చైనా వెతుకులాట?

అమెరికా విధించిన భారీ సుంకాలతో చైనా తన వస్తువులకు అమెరికా మార్కెట్ వెలుపల ఆల్టర్నేటివ్ మార్కెట్లను వెతుక్కోవచ్చు. అవసరమనుకుంటే భారత మార్కెట్‌కు తరలించవచ్చు.

“ఎనిమిది ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తుల విభాగంలో భారత్‌కు చైనా అతిపెద్ద ఎగుమతిదారు. అన్ని ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులకు చైనా సప్లయ్ చైన్‌పై భారత్ ఆధారపడి ఉంది. భారత వాణిజ్య లోటు పెరగడానికి ఇదే కారణం” అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ థింక్ ట్యాంక్ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

చైనాకు భారత ఎగుమతులు పడిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

“ఈ గణాంకాలను భారత్ తీవ్రంగా పరిగణించాలి. ఇవి కేవలం వాణిజ్యపరమైన సమస్యలు మాత్రమే కాదు. పోటీకి సంబంధించిన సంక్షోభం. చైనాపై మనం ఆధారపడటాన్ని పెంచుతుంది” అని శ్రీవాస్తవ హెచ్చరించారు.

భారత్, చైనా, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

డంపింగ్ అంటే ఏంటి?

అమెరికా మార్కెట్‌కు వెళ్లే మార్గాలు లేకపోతే, చైనా ఉత్పత్తిదారులు తమ వస్తువులను భారత్ సహా ఇతర మార్కెట్‌లకు పంపే అవకాశం ఉండటం భారత్‌కు ఆందోళన కలిగించే మొదటి అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు మార్కెట్‌లోకి పంపినప్పుడు, దానిని ‘డంపింగ్’ అంటారు.

“చైనా ఉత్పత్తిదారులు ఈ పని చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం. కచ్చితంగా డంపింగ్ భయం ఉంది” అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

భారత మార్కెట్‌లోకి డంపింగ్‌ జరగకుండా అడ్డుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్(డీజీటీఆర్) అనే వ్యవస్థ ఉందని, డంపింగ్ జరిగితే పన్నులు విధించే అధికారం ఆ వ్యవస్థకు ఉందని ఆయన తెలిపారు.

“చైనా ఉత్పత్తులకు అమెరికా పెద్ద వినియోగ కేంద్రం. సుంకాల పెంపుతో సహజంగానే ఈ మార్కెట్ తలుపులు చైనాకు మూసుకుపోతాయి. అయితే దీనర్థం చైనా తన వస్తువులను భారత మార్కెట్‌కు పంపుతుందని కాదు. భారత్‌లో కొనుగోలుదారులు ఉంటేనే చైనా వస్తువులను పంపుతుంది. అయితే ఇక్కడున్న పెద్ద అవకాశం ఏంటంటే కొత్త సప్లయ్ చైన్ ఏర్పడితే అమెరికాకు వెళ్లే చైనా ఉత్పత్తులకు భారత్ స్టాప్‌ ఓవర్‌గా మారొచ్చు” అని ఆయన విశ్లేషించారు.

”చైనా తమ దేశంలో పాక్షికంగా తయారుచేసిన వస్తువులను భారత్, వియత్నాం, మెక్సికో వంటి దేశాల మార్కెట్లకు పంపి, అక్కడ వాటి తయారీ పూర్తి చేసి అమెరికా మార్కెట్‌కు పంపవచ్చు. భారత్‌లో ఉత్పత్తి ఖర్చు చైనా కంటే 20 శాతం ఎక్కువ. కానీ అమెరికా చైనాపై విధించిన భారీ సుంకం వల్ల భారత్‌లో తయారీ ఖర్చు ఎక్కువైనా..చివరకు చైనాలో ఉత్పత్తి అయిన వాటికన్నా తక్కువ రేటే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో చైనా ఉత్పత్తులకు భారత్ స్టాప్‌ ఓవర్‌గా మారొచ్చు” అని అజయ్ శ్రీవాస్తవ విశ్లేషించారు.

భారత్, చైనా, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఈ పరిస్థితులు భారత ఉత్పత్తిదారులకు కూడా ఒక అవకాశం కావచ్చు. అయితే ఇంకా అనేక ఆందోళనలు కూడా ఉన్నాయి.

మార్కెట్‌ అనిశ్చితి, అమెరికా వ్యవహారశైలి వల్ల పెట్టుబడులు పెట్టే ముందు భారత ఉత్పత్తిదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

చైనా కంపెనీలు భారత్‌ను రవాణా స్థావరంగా ఉపయోగిస్తే, అమెరికాకు వస్తువులను పంపడానికి భారత మార్కెట్‌ను ఉపయోగిస్తే, ఓడరేవులు, లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్లకు స్వల్పకాలిక ప్రయోజనాలు కలగవచ్చు. అయితే ఇది అమెరికాకు కోపం తెప్పించే ప్రమాదమూ ఉంది.

భారత్, చైనా, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

కన్నేసి ఉంచనున్న భారత్

తక్కువ ధరలకు వస్తున్న దిగుమతులపై నిఘా ఉంచినట్టు ఇటీవల భారత్ తెలిపింది. అమెరికా సుంకాలను తప్పించుకోవడానికి చైనాకు సహాయం చేయవద్దని కంపెనీలను హెచ్చరించింది.

చైనా తన వస్తువులను భారత మార్కెట్లోకి డంప్ చేయడంపై ఆందోళనలు ఉన్నాయని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ అజయ్ సహాయ్ కూడా భావిస్తున్నారు.

“అమెరికా మార్కెట్‌ను చైనా లాస్ అయినప్పుడు, సహజంగా ఇతర మార్కెట్ల కోసం అన్వేషిస్తుంది. అలాంటి పరిస్థితిలో చైనా వస్తువులను తక్కువ ధరలకు డంప్ చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం” అని అజయ్ సహాయ్ అంటున్నారు.

అయితే, భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, అవసరమైతే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని కూడా సహాయ్ అభిప్రాయపడ్డారు.

“భారత వ్యాపారవేత్తల ప్రయోజనాలను కాపాడటానికి అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగిస్తుందని ఆశిస్తున్నాం” అని అజయ్ సహాయ్ చెప్పారు.

తయారీ కేంద్రంగా మారాలని భారత్ కోరుకుంటోందని, చౌకయిన చైనా ఉత్పత్తులు, వస్తువులపై ఆధారపడటం, భారత్ లక్ష్యానికి ఆటంకం కలిగించవచ్చని ఆయనన్నారు.

“కావాలని చౌకగా తయారుచేసే ఉత్పత్తులతో భారత కంపెనీలు పోటీ పడలేవు” అని అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)