SOURCE :- BBC NEWS
అమెరికాకు 47వ అధ్యక్షునిగా డోనల్డ్ ట్రంప్ ఇవాళ (సోమవారం) అధికారికంగా వైట్‌హౌస్‌లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నారు.
ఈ ఇనాగ్యురల్ కార్యక్రమంలో భాగంగా ప్రమాణ స్వీకారోత్సవం, సంగీత ప్రదర్శన, పలు అధికారిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే ట్రంప్ అధికారికంగా అమెరికాకు 47వ అధ్యక్షుడు అవుతారు.
కానీ, అమెరికాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి, వాతావరణ పరిస్థితులు గడ్డకట్టే రీతిలో ఉండటంతో, ఈసారి అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం భవనం లోపలే జరగనుంది.
యునిటెడ్ స్టేట్స్ క్యాపిటల్ రొటుండా బిల్డింగ్‌లోనే అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
వాతావరణ పరిస్థితులతో సంప్రదాయంగా జరిగే ఇనాగ్యురల్ పరేడ్ కూడా వాయిదా పడింది.
‘ఇనాగ్యురేషన్’ అంటే ఏమిటి?
ఒక అధ్యక్షుని పరిపాలన కాలం ముగిసి, తరువాత గెలుపొందిన వారి పాలన ప్రారంభమయ్యే సమయంలో జరిగే అధికారిక వేడుకనే ‘ఇనాగ్యురేషన్’ అంటారు.
వాషింగ్టన్ డీసీలో ప్రభుత్వ నేతల మధ్య అధికార బదిలీలో ఇది అత్యున్నత భాగంగా పేరుగాంచింది. ఇందులో కీలకమైన భాగం అధ్యక్షుని ప్రమాణస్వీకారోత్సవమే.
” అమెరికా అధ్యక్ష పదవిని నేను విశ్వసనీయంగా నిర్వహిస్తానని, నా శక్తి మేరకు అమెరికా రాజ్యాంగాన్ని పరిక్షించి, కాపాడతానని సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను.” అని అధ్యక్షునిగా ఎన్నికైన వారు ప్రమాణం చేస్తారు.
నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందినప్పటికీ, ట్రంప్ ఈ వాగ్దానం చేసిన తర్వాతనే అధికారికంగా 47వ అధ్యక్షుడు అవుతారు. అంతకుముందు, 2017 నుంచి 2021 మధ్య ఆయన అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పనిచేశారు.
వాన్స్ కూడా ఉపాధ్యక్షుని పదవిని అధికారికంగా చేపట్టడానికి ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇనాగ్యురేషన్ రోజు ఏం జరుగుతుంది?
ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు వాషింగ్టన్ డీసీలో చరిత్రాత్మక చర్చిగా పేరుగాంచిన లఫాయెతే స్క్వేర్‌లో సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాత వైట్‌హౌస్‌లో టీ కార్యక్రమం ఉంటుంది.
సంగీత ప్రదర్శన, ప్రారంభ వేడుకలు అమెరికాలో ఉదయం 9.30కు అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8.00 గంటలకు మొదలవుతాయి.
ఆ తర్వాత క్యాపిటల్ రొటుండా లోపల ట్రంప్, వాన్స్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసే ప్రతి వ్యక్తి సాధారణంగా బైబిల్‌పై తమ చేయిని పెట్టి ప్రమాణం చేస్తారు. (అయితే అన్నివేళలా అది బైబిల్ పుస్తకం అవ్వాల్సిన అవసరం లేదు)
ఈ ఏడాది ట్రంప్ రెండు బైబిళ్లను వాడనున్నారు. ఒకటి 1955లో తన తల్లి ఆయనకు ఇచ్చిన వ్యక్తిగత బైబిల్, రెండోది 1861లో అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఇనాగ్యురేషన్ రోజు వాడిన వెల్వెట్ బౌండ్ వాల్యూమ్ చరిత్రాత్మక లింకన్ బైబిల్.
జేడీ వాన్స్ తన అమ్మమ్మకు చెందిన వ్యక్తిగత బైబిల్‌పై ప్రమాణం చేయనున్నట్లు ట్రంప్ వాన్స్ ఇనాగ్యురల్ కమిటీ తెలిపింది.
ఆ తర్వాత ట్రంప్ ఇనాగ్యురల్ ప్రసంగం ఇస్తారు. దానిలో రాబోయే నాలుగేళ్లలో అధ్యక్షుడిగా తాను పెట్టుకున్న లక్ష్యాలను చెబుతారు. ఐక్యత, బలం, నిష్ఫాక్షికతతో ఆయన ప్రసంగం ఉండబోతుందని అంచనా.
ఈ ప్రసంగం తర్వాత ట్రంప్ అధ్యక్షుని గదికి వెళతారు. అది సెనేట్ చాంబర్‌కు దగ్గర్లో ఉంటుంది. ఈ గదిలో కీలకమైన డాక్యుమెంట్లపై సంతకం చేస్తారు. ఇనాగ్యురల్ కార్యక్రమాల్లో భాగంగా జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు చేసిన లంచ్‌కు ట్రంప్ హాజరవుతారు.
సాధారణంగా క్యాపిటల్ బిల్డింగ్ నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ గుండా వైట్‌హౌస్ దాకా పరేడ్ సాగుతుంది. కానీ, ఈ ఏడాది పరేడ్ జరగడం లేదు.
ఈరోజు సాయంత్రం ట్రంప్ నగరంలో జరిగే మూడు ఇనాగ్యురల్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకటి కమాండర్-ఇన్-చీఫ్ బాల్, రెండు లిబర్టీ ఇనాగ్యురల్ బాల్, మూడు స్టార్‌లైట్ బాల్. ఈ మూడింట్లో ట్రంప్ ప్రసంగిస్తారని అంచనాలున్నాయి.
జనవరిలోనే ఎందుకు?
మొదట్లో అమెరికా రాజ్యాంగంలో అధ్యక్ష ప్రమాణ స్వీకార తేదీగా మార్చి 4 ఉండేది. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఓట్ల లెక్కింపునకు సరిపడా సమయం ఉండాలని అప్పట్లో అలా పెట్టారు. అయితే, ఎన్నికల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులు వచ్చాక ఫలితం తేలడానికి పట్టే సమయం తగ్గిపోయింది. దీంతో 1933లో రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్ష ప్రమాణస్వీకార తేదీని జనవరి 20కి మార్చారు.
ఇనాగ్యురేషన్ ఎక్కడ జరుగుతుంది?
ఇనాగ్యురేషన్ కార్యక్రమాలు సంప్రదాయంగా అమెరికా క్యాపిటల్ భవంతి బయట జరుగుతాయి.
ఈ ఏడాది వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి, చల్లని గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఈరోజు కనిష్ఠంగా మైనస్ 11 సెంటిగ్రేడ్ నుంచి గరిష్టంగా మైనస్ 5 సెంటిగ్రేడ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.
వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రమాణ స్వీకారం జరిగే వేదికను మార్చాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించినట్టు ట్రంప్ శుక్రవారం తెలిపారు. ” ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బాధపడటాన్ని లేదా గాయపడటాన్ని నేను చూడాలనుకోవడం లేదు.” అని ఆయన రాశారు.
క్యాపిటల్ భవంతి లోపలే ఇనాగ్యురల్ కార్యక్రమం, ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి. అతిథులు, చట్టసభ్యులు, ప్రముఖులకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.
క్యాపిటల్ వన్ ఎరీనా లోపల నుంచి లైవ్‌స్ట్రీమ్ ద్వారా ఈ వేడుకను వీక్షించవచ్చు.
ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి పడిపోవడంతో, పరేడ్‌ను రద్దు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, స్పోర్ట్స్ ఎరీనాలో ప్రజల వద్దకు తాను వస్తానని ట్రంప్ చెప్పారు.
వాతావరణ పరిస్థితుల కారణంతో, 1985లో కూడా అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తన ఇనాగ్యురేషన్‌ను క్యాపిటల్ భవనం లోపలే చేపట్టారు.
అసాధారణమైన గడ్డకట్టే పరిస్థితులతో సంప్రదాయకంగా జరిగే పరేడ్‌ను అప్పుడు కూడా ఇలానే రద్దు చేశారు.
ఎవరెవరు హాజరవుతారు?
స్థానిక ఫెడరల్ అధికారుల అంచనాల ప్రకారం వాషింగ్టన్ డీసీలో 2 లక్షల మంది ప్రజలు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో ట్రంప్ మద్దతుదారులు, నిరసనకారులు ఉండొచ్చు.
అమెరికాలోని సెనేటర్లు, హౌస్ మెంబర్లలో పలువురు, రాబోయే ప్రభుత్వానికి చెందిన అతిథులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
ట్రంప్, వాన్స్, వారి కుటుంబాలు తర్వాత, ఈ కార్యక్రమంలో హాజరయ్యే వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులుగా పదవి నుంచి దిగిపోయే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వారి భాగస్వాములు ఉంటారు.
అంటే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వారి భాగస్వాములు జిల్ బైడెన్, డగ్ ఎమ్‌హాఫ్‌లను ముఖ్యమైన వ్యక్తులుగా మనం చూడొచ్చు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌పై పోటీకి దిగిన కమలా హారిస్ ఓడిపోయారు.
మాజీ అధ్యక్షులు, మాజీ ఫస్ట్ లేడీలు తరచూ అతిథుల జాబితాలో ఉంటారు. కానీ, మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమె ఈ ఏడాది కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలిసింది.
2009లో తన భర్త బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఇనాగ్యురేషన్‌కు మిషెల్ హాజరవుతున్నారు. 2017లో ట్రంప్ తొలి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆమె హాజరయ్యారు. బరాక్ ఒబామా ఈ రోజు జరిగే ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది.
మరో మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన భార్య లారా బుష్ కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ఈ కార్యక్రమానికి రావడం లేదు.
బిలియనీర్ టెక్ చీఫ్‌లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ కూడా వస్తారని అమెరికా మీడియా రిపోర్టు చేసింది.
టిక్‌టాక్ సీఈవో సౌ జి చువ్ కూడా వస్తారని తెలుస్తోంది. అమెరికాలో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై బ్యాన్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందే, టిక్‌టాక్ సేవలు ఆగిపోయాయి. చైనా ఉపాధ్యక్షులు హన్ ఝెంగ్ కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)