SOURCE :- BBC NEWS
44 నిమిషాలు క్రితం
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఆ దేశ విధానాలను ప్రభావితం చేయడమే కాకుండా ప్రపంచ స్థాయిలో చాలా విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇవి ఆర్థిక విధానాల నుంచి దౌత్యపరమైన నిర్ణయాల వరకు ఉంటాయి.
నేడు (జనవరి 20) డోనల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈసారి జేడీ వాన్స్ ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా ఉండనున్నారు.
ట్రంప్ చర్యలు ‘అనూహ్యంగా ఉంటాయి’ అని అభివర్ణిస్తుంటారు. అంటే ఏదైనా అంశంపై ఆయన వైఖరిని ముందుగా అంచనా వేయలేం. కొంతమంది దీనిని ట్రంప్ బలంగా భావిస్తారు, మరికొందరు బలహీనతగా చెబుతుంటారు.
ట్రంప్ మొదటి టర్మ్‌తో పోలిస్తే రెండో టర్మ్ వచ్చేసరికి ప్రపంచం చాలా మారిపోయింది. ఆయనకు కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి.
అటువంటి పరిస్థితిలో ట్రంప్ హయాంలో ఎలాంటి మార్పులు జరగవచ్చు?
అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై భారత్ మరింత పన్ను చెల్లించాల్సి ఉంటుందా? అమెరికా, చైనాల మధ్య సంబంధాలలో ఎలాంటి మార్పులు రావొచ్చు? ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాలో ఎంతవరకు శాశ్వత శాంతిని తెస్తుంది?
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందా? వాతావరణ మార్పులపై అమెరికా వైఖరి ఎలా ఉంటుంది?
ఈ ప్రశ్నలన్నింటినీ బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ ‘ది లెన్స్’లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముఖేష్ శర్మ చర్చించారు.
ఈ చర్చలో జెరూసలేంకు చెందిన సీనియర్ డిప్లొమాటిక్ జర్నలిస్ట్ ఇంద్రాణి బాగ్చీ, దౌత్య విశ్లేషకులు రాజీవ్ నయన్, సీనియర్ జర్నలిస్ట్ హరీందర్ మిశ్రాలు పాల్గొన్నారు.
భారత్‌పై సుంకాలు విధిస్తారా?
డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం “అమెరికా ఫస్ట్” విధానాన్ని నొక్కిచెప్పడంతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొద్దిగా మార్పులు రావొచ్చు. ఈ పరిస్థితులను భారత్ దౌత్యపరంగా ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
దీనిపై ఇంద్రాణి బాగ్చి మాట్లాడుతూ.. “ట్రంప్ గతంలోనూ భారత స్టీల్, అల్యూమినియంపై సుంకాలు విధించారు. కొన్ని వారాల క్రితం కూడా ఆయన సుంకాల గురించి మాట్లాడారు” అని గుర్తుచేశారు.
‘అమెరికాతో సంబంధాల విషయంలో మోదీ ప్రభుత్వం ఈసారి ఎలాంటి వ్యూహాత్మక విధానాన్ని అవలంబిస్తుంది? అది భారత్‌కే కాకుండా అమెరికాకూ ఎలా ప్రయోజనకరంగా మారుతుందనేది చూడాలి’ అని ఆమె అన్నారు.
“భారతదేశం ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటే, ఏ దేశం మనల్ని సాధారణంగా చూడదు. మనం ఎక్కడ బలపడగలమో కూడా చూసుకోవాలి” అని బాగ్చి అన్నారు.
దక్షిణాసియా విషయంలో అమెరికా వేసే వ్యూహాలకు భారత్, పాకిస్తాన్, అప్గానిస్తాన్ దేశాల పాత్ర చాలా కీలకం.
దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్, అప్గానిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 194 కోట్ల మంది నివసిస్తున్నారని ప్రపంచ బ్యాంకు అంచనా. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్.
గత కొన్నేళ్లలో దక్షిణాసియాలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. మరి, ట్రంప్ రెండవ టర్మ్‌లో భారత స్థానం అలాగే ఉంటుందా?
పాక్, అఫ్గానిస్తాన్‌లతో అమెరికా సంబంధాలలో చాలా మార్పులు వచ్చాయని ఇంద్రాణి బాగ్చి చెప్పారు. గత కొన్నివారాలుగా పాకిస్తాన్ క్షిపణి సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించిందని బాగ్చి గుర్తుచేశారు. పాకిస్తాన్ దీర్ఘ శ్రేణి క్షిపణిని తయారు చేస్తోందని, అది తమ వైపే రావొచ్చని అమెరికా భావించిందని ఆమె అన్నారు.
ఇజ్రాయెల్‌కు అండగా ఉంటారా?
గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం హమాస్‌తో ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.
యుక్రెయిన్- రష్యా, పశ్చిమాసియాలోని పరిస్థితుల గురించి అమెరికా ఎన్నికల ప్రచారంలో డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే ఈ యుద్ధాలు వీలైనంత త్వరగా ముగుస్తాయని చెప్పారు.
అయితే, ఆయన అధికారం చేపట్టడానికి ముందే ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇపుడు ఈ ఒప్పందంలో ట్రంప్ ఎలాంటి పాత్ర వహిస్తారనేది చూడాలి.
దీనిపై జెరూసలేంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హరీందర్ మిశ్రా మాట్లాడారు.
కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రకు సంబంధించి ఓ కథనం ప్రచురితమైంది. దానిని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కూడా పంచుకున్నారు.
‘‘జో బైడెన్ తన పదవీకాలంలో చేయలేని పనిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కేవలం ఒకే ఒక్క సమావేశంలో ట్రంప్ తన ప్రత్యేక ప్రతినిధి ద్వారా సాధించారని ఈ కథనంలో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్పుల విరమణ జరగాలని, బందీలను విడిచిపెట్టాలని నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు’’ అని హరీందర్ చెప్పారు.
ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే దేశాలపై ట్రంప్ మరింత ఒత్తిడి తెస్తారని భావిస్తున్నారు. ట్రంప్ మొదటి టర్మ్‌లో ఇజ్రాయెల్ పట్ల ఆయన నిబద్ధత స్పష్టంగా ఉంది. ఇజ్రాయెల్ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. రెండోసారి కూడా ట్రంప్ వైఖరి అలాగే ఉంటుందని భావిస్తున్నారు.
ఇంద్రాణి మాట్లాడుతూ.. “ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది? ఇది శాశ్వత శాంతి ఒప్పందంగా మారుతుందో లేదో చూడాలి” అని హరీందర్ అన్నారు.
అరబ్ దేశాలతో..
అబ్రహం ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, సూడాన్, బహ్రెయిన్ గుర్తించాయి. ఈ విషయాన్ని అమెరికా అనేక సార్లు ప్రస్తావించింది.
అమెరికా లక్ష్యం ఏంటంటే, ఈ ప్రాంతంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సౌదీ అరేబియా కూడా ఈ ఒప్పందంలో భాగం కావాలని కోరుకుంటోంది. ఈ ఒప్పందంలో సౌదీ భాగమైతే ఇక్కడి పరిస్థితుల్లో పెద్ద మార్పు వస్తుందని అమెరికా భావిస్తోంది.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా అంగీకరించలేదు. పాలస్తీనాకు మొదట స్వతంత్ర దేశ హోదా ఇవ్వాలని, ఆ తర్వాతే మిగతా విషయాలు జరుగుతాయని స్పష్టంచేశారు.
అయితే, పాలస్తీనాను ఇజ్రాయెల్ గుర్తించేలా ట్రంప్ ప్రభుత్వం ఈ అబ్రహం ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లగలదా?
దీనిపై దౌత్య విశ్లేషకులు రాజీవ్ నయన్ మాట్లాడుతూ.. ”ట్రంప్ రెండోసారి అధికారంలో వస్తే పాలస్తీనా, అరబ్ దేశాలకు అనుకూలంగా పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం చెలాయించిన చోట ఇజ్రాయెల్ కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది” అని అన్నారు.
”అంతకుముందు ‘ఒపెక్ ప్లస్’ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు కూడా రష్యా, చైనాల వైపు వెళుతున్నాయి. అమెరికాతో సంబంధాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఆయా దేశాలు లాభదాయకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అమెరికా ఇష్టపడదు” అని రాజీవ్ అన్నారు.
ట్రంప్, పుతిన్‌ల మధ్య మంచి సంబంధాలు ఏర్పడితే సౌదీ అరేబియా, యూఏఈ తదితర అరబ్ దేశాలపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ దేశాలు ఇజ్రాయెల్‌పై ఎక్కువ ఒత్తిడి చేయలేవని రాజీవ్ అభిప్రాయపడ్డారు.
రష్యా- యుక్రెయిన్ యుద్ధం
రష్యా, యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ట్రంప్ ఆపగలరా? అనే ప్రశ్న చాలామందిలో ఉంది.
దీనిపై సీనియర్ జర్నలిస్ట్ ఇంద్రాణి బాగ్చీ స్పందిస్తూ.. “ట్రంప్, పుతిన్ మధ్య ఉన్న పాత స్నేహం కారణంగా ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుత యథాతథ స్థితిని అంగీకరించాలని యుక్రెయిన్‌కు ట్రంప్ చెబుతారని అనుకోను. ఎందుకంటే, ఇక్కడ యూరప్ కోణం లోంచి ఆలోచించాలి. ఏ విధంగా చూసినా యుక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించడం అంతర్జాతీయ చట్టం ప్రకారం తప్పు. ట్రంప్ అలాంటి రాజీ చేయకపోవచ్చు” అని అన్నారు.
ఈ విషయంపై రాజీవ్ నయన్ మాట్లాడుతూ.. “బైడెన్, ట్రంప్ నాయకత్వానికి మధ్య వ్యత్యాసం ఉంది. యుక్రెయిన్‌కు బైడెన్ పూర్తిగా మద్దతు ఇచ్చారు, అయితే ట్రంప్ భిన్నంగా ఉండవచ్చు. ప్రస్తుతం అమెరికన్ ప్రజలు యుక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నారు. ట్రంప్ దానిని మార్చడానికి ప్రయత్నిస్తే, ఆయన అమెరికన్ ప్రజలకు ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది” అని అన్నారు.
“చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యం ట్రంప్‌కు ఉంది. ఒకటి లేదా రెండు రోజుల్లో పరిష్కారం దొరక్కపోవచ్చు. కానీ, ఐదారు నెలల్లో మార్పు చూస్తారు” అని రాజీవ్ అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)