SOURCE :- BBC NEWS
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలో లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్న పశువధశాల కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్రంగా మారింది.
ఓవైపు ఆ కంపెనీలో నిబంధనలకు విరుద్ధంగా పశువులను వధిస్తున్నారంటూ గో సేవా సమితి సభ్యుల అభ్యంతరాలు, మరోవైపు పశువధశాల వెదజల్లే వాయు కాలుష్యం, దుర్గంధంతో అవస్థలు పడుతున్నామంటూ గ్రామస్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇదే కాకుండా ఆ సంస్థకు అనుమతుల విషయంలో టీడీపీ, వైసీపీ నేతల ప్రత్యారోపణలతో రాజకీయ వివాదం చెలరేగింది.
కంపెనీ ఎప్పుడు ఏర్పాటైంది?
తణుకు మండలం తేతలిలోని చివటం రోడ్డులో జాతీయ రహదారికి సమీపంలోని 3 ఎకరాల 39 సెంట్ల స్థలంలో 2014 జులై 22న లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యకలాపాలను దిల్లీకి చెందిన వ్యాపారవేత్తలు ప్రారంభించారు.
దిల్లీలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో నమోదైన ఈ కంపెనీ ప్రధానంగా ఫుడ్ స్టఫ్ తయారు చేస్తుందని పేర్కొన్నారు. ఆ మేరకు తేతలి గ్రామ పంచాయతీ నుంచి గోడౌన్ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు.
బయటి నుంచి గేదెల మాంసం తీసుకువచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేసి, తర్వాత ఎగుమతి చేస్తారని కంపెనీ పెట్టే ముందు ప్రచారం జరిగింది.
చుట్టుపక్కల గ్రామస్థులు, గో సంరక్షణ సమితి, గో సేవా సమితి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2016లో కంపెనీ నిర్మాణం నిలిచిపోయింది.
2018లో తిరిగి నిర్మాణం మొదలుపెట్టగా స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. పంచాయతీ తీర్మానం లేదంటూ, పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు లేవంటూ స్టే తీసుకురావడంతో నిర్మాణం నిలిచిపోయింది.
ఆ తర్వాత కోర్టు స్టే ఎత్తేయడంతో నిర్మాణాన్ని కొలిక్కి తెచ్చినా కార్యకలాపాలు మొదలుపెట్టలేదు.
2022లో పశువధ కర్మాగారం ప్రారంభానికి ట్రయల్ రన్ నిర్వహించారు.
పశువులను ఇక్కడే వధించి, మాంసాన్ని ప్యాక్ చేసి, ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, స్థానికులు ఆందోళనలు ఉధృతం చేయడంతో ఆ పనులు నిలిపేశారు.
అప్పటి నుంచి కంపెనీ ఉన్నా కార్యకలాపాలు మాత్రం చేపట్టేవారు కాదు.
గత రెండు నెలలుగా పశువధ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో పశువులను ఇక్కడికి తీసుకువచ్చి వధించి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు.
పశువుల దొంగతనాలు పెరిగాయా?
నిబంధనల మేరకు పాలు ఇవ్వని, వట్టిపోయిన పశువులను మాత్రమే కొనుగోలు చేసి ఫ్యాక్టరీకి తీసుకురావాలి. పశుసంవర్ధకశాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లోని పశు కేంద్రాల్లో సర్టిఫై చేసిన వట్టిపోయిన గేదెలనే కొనుగోలు చేయాలి. కబేళాకు తరలించే గేదెలను కూడా ఈ కంపెనీ తీసుకుంటుంది.
వట్టిపోయిన గేదెలనే కాకుండా ఎక్కువ డబ్బు ఆశజూపి పాడి గేదెలను కూడా ఫ్యాక్టరీ సంబంధీకులు దళారుల నుంచి కొనుగోలు చేస్తున్నారని తణుకు గో సేవా సమితి సభ్యుడు జల్లూరి జగదీష్ ఆరోపించారు.
తాజాగా కార్మాగారానికి తరలిస్తున్న పశువుల్లో ఎక్కువ శాతం పాడి గేదెలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
వాస్తవానికి రైతులు, వాటి యజమానులు పాడి గేదెలను వధించడానికి ఏ మాత్రం ఇష్టపడరు. కాబట్టి దళారులను ఆశ్రయించి గేదెలను దొంగిలించి మరీ తరలిస్తున్నారని తణుకుకు చెందిన సీనియర్ జర్నలిస్టు దొరబాబు బీబీసీకి చెప్పారు.
“ఇటీవలి కాలంలో తణుకు పరిసర ప్రాంతాల్లో గేదెలను దొంగిలిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో కొందరు ముఠాలుగా ఏర్పడి గ్రామ శివార్లలోని గేదెల ఫామ్‌లు, పాకలను లక్ష్యంగా చేసుకుని పశువులను అపహరించి ఇక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఇటీవల ఓ ఘటన జరిగింది. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో రెండు పాడి గేదెలను అపహరించుకుపోయిన ఘటనలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ పశువులను పోలీసులు రికవరీ చేయలేకపోయారు” అని దొరబాబు చెప్పారు.
గేదెల చోరీ జరగడం వాస్తవమే కానీ ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆ గేదెలు సదరు కంపెనీకి తరలివెళ్లాయన్న సాక్ష్యాలు దొరకలేదని తణుకు రూరల్ సీఐ కృష్ణ కుమార్ బీబీసీకి చెప్పారు.
ఇటీవల కపిలేశ్వరపురం నుంచి వాహనంలో వచ్చిన మూడు గేదెలను అడ్డుకున్న స్థానికులు వాటిని పోలీసు స్టేషన్లో అప్పగించారు. అనంతరం వాటిని చివటం గ్రామంలోని గోశాలకు తరలించగా వాటిలో రెండు గేదెలు రెండు పూటలా పాలిస్తున్నాయి.
ఇలా పాలిచ్చే పశువులను వధిస్తుండటం పైనే వివాదం రేగుతోందని దొరబాబు చెప్పుకొచ్చారు.
కాలుష్యంపై ప్రజల ఆందోళన
ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలతో చుట్టపక్కల గ్రామాల్లో నీరు కలుషితమవుతోందని, దుర్గంధంతో అవస్థలు పడుతున్నామని తేతలి గ్రామంతో పాటు చుట్టుపక్కల చివటం, సత్యవాడ, పైడిపర్రు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని గో సేవా సమితి సభ్యుడు జల్లూరి జగదీష్ చెబుతున్నారు.
తీవ్ర దుర్గంధంతోపాటు మురుగు నీటిని పంటకాలువల్లోకి వదులుతుండటంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల సమీప గ్రామాల ప్రజలు రోడ్డుపై నిరసనలు, ధర్నాలు చేపట్టారు.
పొల్యూషన్ లేదంటున్న పీసీబీ
లాహం పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలతో కాలుష్యపరంగా ఇప్పటికైతే ఇబ్బందులేమీ లేవని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఏఈ కె.వెంకటేశ్వరరావు బీబీసీతో అన్నారు.
చుట్టుపక్కల గ్రామస్థుల ఆందోళనలను ప్రస్తావించగా, ”ఆ పరిశ్రమపై వివాదాలకు సంబంధించి జాయింట్ కమిటీ వేశారు. అందులో పీసీబీ తరఫున మేం కూడా ఉన్నాం. ఫ్యాక్టరీని మళ్లీ పరిశీలిస్తాం” అని ఆయన చెప్పారు.
గో వధ జరుగుతోందా?
ఇక గేదెలతో పాటు గోవులను కూడా వధిస్తున్నారన్న గో సేవా సమితి ఆరోపణలను పశు సంవర్థకశాఖ అధికారులు ఖండించారు. ఇక్కడ గోవధ జరగడంలేదు, కేవలం గేదెలను వధించి మాంసం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు కె. నరసింహారావు బీబీసీతో స్పష్టం చేశారు.
గేదె మాంసం ఎగుమతికి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతితోనే ఇక్కడి ఫ్యాక్టరీ నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
స్థానికుల నిరసనలను డాక్టర్ నరసింహారావు వద్ద ప్రస్తావించగా, అవన్నీ తమకు సంబంధం లేని విషయాలని, తమకు తెలిసినంత వరకు అన్ని అనుమతులతోనే కేంద్రం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులు ఏమంటున్నారు?
స్థానికుల ఆందోళనల నేపథ్యంలో ఆ కంపెనీ వైపు ఉద్యోగులు తప్ప మరెవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలపై తణుకు రూరల్ సీఐ కృష్ణకుమార్ మాట్లాడారు.
“ప్రత్యేకంగా మేం పికెట్ పెట్టలేదు. అక్కడ గొడవలు జరగకుండా మా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. అంతేగానీ మేం ఎవర్నీ అకారణంగా అడ్డుకోవడం లేదు” అని అన్నారు.
పదిరోజుల కిందట ఓ పాల వాహనంలో పశువులను వధించిన తర్వాత వచ్చే వ్యర్థాలు, ఎముకలను తరలించడం కలకలం రేపింది. పక్కా సమాచారం రావడంతో ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పాలవాహనాన్ని స్థానికులు అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఫ్యాక్టరీకి అన్ని అనుమతులూ ఉంటే పాల వాహనంలో వ్యర్థాలను తరలించాల్సిన అవసరం ఏముందని స్థానికులు ప్రశ్నించారు.
దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
“మా హయాంలో అడ్డుకున్నాం”
తమ హయాంలో ఈ ఫ్యాక్టరీలో కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
“2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫ్యాక్టరీని స్థాపించారు. మేం అధికారంలో ఉన్న 2019–24 మధ్య కార్యకలాపాలు జరగకుండా అడ్డుకున్నాం. ఇందులో మా వ్యక్తిగత ప్రయోజనాలు గాని, ఆ కంపెనీపై కక్ష గానీ లేవు. చుట్టుపక్కల గ్రామస్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకునే మేం అడ్డుకున్నాం. కానీ ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని తెరిచారు. ఆందోళనకారులను పోలీసులతో భయపెట్టే యత్నం చేస్తున్నారు. కంపెనీని వెంటనే మూసివేయాలి, లేదంటే నిరసనలు ఉధృతం చేస్తాం” అని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
“అనుమతులను వెరిఫై చేయమన్నాం”
ఈ పరిశ్రమకు వైసీపీ హయాంలోనే అనుమతులు వచ్చాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.
“ఆ పరిశ్రమకు వైఎస్సార్సీపీ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయి. మేం వచ్చిన తర్వాత కోర్టు ఉత్తర్వులతో తెరిచారు. ప్రాథమికంగా అన్ని పర్మిషన్లు ఉన్నాయని అంటున్నారు. ఆ పరిశ్రమను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా నేను అధికారులను కోరాను” అని రాధాకృష్ణ బీబీసీతో అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై వివరాలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ నాగరాణిని సంప్రదించే ప్రయత్నం చేసింది బీబీసీ. ఆమె స్పందన రాగానే ఇక్కడ తెలియచేస్తాం.
“ఎవరికీ భయపడేది లేదు”
తమ పరిశ్రమకు అన్ని అనుమతులూ ఉన్నాయని లాహం ఫుడ్ ప్రొడక్ట్స్ జనరల్ మేనేజర్ అరవింద్ సరేన్ స్పష్టం చేశారు.
“మాకు అన్ని అనుమతులూ ఉన్నాయి. నిబంధనల మేరకే మేం ప్రాసెస్ చేస్తున్నాం. రోజుకు 400 పశువులను ప్రాసెస్ చేసేందుకు అనుమతి ఉండగా 100 నుంచి 150 పశువులను మాత్రమే ప్రాసెస్ చేస్తున్నాం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మేం నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నాం. ఎవరికీ భయపడేది లేదు” అని సరేన్ బీబీసీతో అన్నారు.
“ఎవరి అండ ఉందో తెలియాలి”
పచ్చటి పొలాల మధ్య కాలుష్యం వెదజల్లుతూ, నిబంధనలేమీ పాటించకుండా అక్కడ పశువధ అడ్డగోలుగా సాగుతోందని గో సంరక్షణ సేవా సమితి ప్రతినిధి కొండ్రెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు.
“30 ఎకరాల్లో ఉండాల్సిన ఇలాంటి ఫ్యాక్టరీని 3 ఎకరాల 39 సెంట్లలో నిర్మించారు. చుట్టుపక్కల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నా సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఎవరిని చూసుకునో ఆ తెగింపు అర్థం కావడం లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ స్పందించాలి. అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలి” అని శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)