SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Jen Troth
14 నిమిషాలు క్రితం
జెన్ ట్రోత్ తాను తల్లిని కావాలని అనుకున్నారు.
అయితే, ఆమె చూపును కోల్పోవడం వల్ల పిల్లలను కనొద్దని వైద్యులు చెప్పడంతో ఆ ఆలోచనే ఆమెకు భయంకరంగా అనిపించింది.
ప్రస్తుతం ఆమె తన కళ్లతో 10 శాతం మాత్రమే చూడగలరు.
దృష్టి లోపం ఉన్న వారు ఆత్మవిశ్వాసంతో, సురక్షితంగా జీవించేందుకు అవసరమైన నిధులు అందిస్తున్నట్లు వెల్ష్ ప్రభుత్వం ప్రకటించింది.

తన తండ్రికి, నాయనమ్మకు దృష్టి లోపం ఉండటంతో తనకు కూడా వారసత్వంగా వస్తుందని భయపడ్డట్లు ట్రోత్ చెప్పారు.
ఆమె తండ్రి 74 ఏళ్ల పీటర్ మెకానిక్‌గా పని చేస్తూ చూపు కోల్పోయిన తర్వాత నిరుద్యోగిగా మారానని చెప్పారు.
దీంతో, సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆయన దుబయి వెళ్లారు.
ఈ కారణంగానే తాను అంధత్వం గురించి మాట్లాడకుండానే పెరిగానని, 24 ఏళ్లు వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ట్రోత్ చెప్పారు.
‘‘ఈ విషయాన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు కంపెనీలకు చెప్పేందుకు, స్నేహితులకు చెప్పేందుకు భయపడ్డాను” అని ట్రోత్ అన్నారు.
కంటిచూపు కోల్పోవడం వల్ల రిలేషన్షిప్స్లో మహిళలు ఎదుర్కొంటున్న భద్రత అంశాలు చాలా ఉన్నాయని ఆమె తెలిపారు.
“మీ జీవితంలోకి వచ్చే వాళ్లు మంచి వ్యక్తులుగా ఉంటారని మీరు అనుకుంటారు. అయితే, చాలా సందర్భాల్లో వారు అలా ఉండకపోవచ్చు” అని ట్రోత్ చెప్పారు.
“నేను అంధురాలిని కాదని నిరూపించడానికి, నాలో అంధత్వం గురించి ఉన్న భయాన్ని పోగొట్టడానికి నా మునుపటి భాగస్వామి నన్ను గదిలో బంధించారు.”
ఇలాంటి సంఘటనలు తనని వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లాయని చెప్పారు. ఓ కంటి వైద్య నిపుణుడు తాను పిల్లల్ని కనకూడదని నిరంతరం చెప్పేవారని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Jen Troth
“నేను తల్లిని కావాలని ఎప్పుడూ అనుకునే దాన్ని. ఎందుకంటే నా జీవితం కుటుంబంతో ముడిపడి ఉంది. పూర్తిగా చూపు లేకపోవడం కంటే తల్లిని కాలేనందుకు ఎక్కువగా భయపడుతున్నాను” అని ఆమె చెప్పారు.
తన భాగస్వామి ఇంజనీర్ కావడం, తరచుగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో తల్లిగా తాను అన్నిపనులు చక్కబెట్టగలనా అనే ఆందోళన కలిగేదని ఆమె చెప్పారు.
ఇది నిజంగానే భయం కలిగించే అంశమని ట్రోత్ అన్నారు.
“నాకు అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. పిల్లలు నా చుట్టూ ఎక్కడ పరుగులు తీస్తున్నారో నాకెలా కనిపిస్తుంది? ఒంటరిగా నేను పిల్లల్ని పెంచడానికి ఎలా అనుమతిస్తారు? ఎవరు నాకు సాయం చేస్తారు?’’ అని ప్రశ్నించుకున్నట్లు ట్రోత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Rhian Morris
బ్రిడ్జెండ్‌కు చెందిన రియాన్ మోరిస్‌కు నిస్టాగ్మస్, మయోపియా, గ్లకోమా ఉన్నాయి. పుట్టినప్పటి నుండి ఆమెకు చూపులేదు.
ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒకరికి 13, మరొకరికి మూడేళ్లు. వారిద్దరికీ కూడా చూపు లేదు. ఏడాది వయసున్న మరో బిడ్డకు డౌన్స్ సిండ్రోమ్ ఉంది.
“నేపీలు వంటివి మార్చడానికి బహుశా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. పిల్లల దుస్తుల గుండీలు తీయడానికి కూడా. దీంతో ఒక దశలో ఆశను కోల్పోయాను. ఇప్పుడు జిప్ ఉన్న దుస్తులు కొంటున్నాను” అని మోరిస్ చెప్పారు.
జనం ఫుట్‌పాత్ మీద వాహనాలను పార్క్ చేయడం వల్ల తన కుమారుడిని స్కూలుకు తీసుకెళ్లడం సవాలుగా మారిందని ఆమె అన్నారు.
అయితే, పిల్లలను కూర్చోబెట్టుకుని నెట్టుకు వెళ్లే బండి మీద ఒక గుర్తును పెట్టారు. అది ఎదురుగా వచ్చే వారికి తనకు చూపు లేదనే విషయాన్ని తెలియజేస్తుంది.
తన ఫోన్ తనకు లైఫ్ లైన్ లాంటిదని ఆమె చెప్పారు. ఫోన్‌తో ఫోటోలు తీసి వాటిని జూమ్ చేసి చూస్తానని అన్నారు.
“నేను నా పిల్లలను సొంతంగానే బయటకు తీసుకు వెళతాను. సొంతంగా బయటకు వెళతాను. ఇదంతా ఎందుకంటే నా పిల్లలు కూడా ఒంటరిగా బయటకు వెళ్లగలమని అనుకోవాలి” అని మోరిస్ చెప్పారు.
“మనం ఏదైనా ఒక పని చేయలేకపోతే, అందుకు మరో మార్గం కనుక్కుంటాం లేదా ఎవరినైనా సాయం కోరతాం” అని వివరించారు.
కార్డిఫ్‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి తఫ్సిలా ఖాన్. ఆమెకు రెటినిటిస్ పిగ్మెంటోసా ఉంది.
తనకు 30 ఏళ్లొచ్చేవరకు క్రమంగా ఆమె చూపు మందగిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు పిల్లలు పుట్టారు. అయితే, వారిలో ఎవరికీ వారసత్వంగా ఆమెకున్న ఈ సమస్య రాలేదు.
చిన్నప్పటి నుంచి తన పిల్లలు కచ్చితమైన బస్సును గుర్తించేవారని, కెఫేలో ఆర్డర్ చేసుకునేవారని తెలిపారు తఫ్సిల్ ఖాన్.
“వాళ్లను పార్కులకు తీసుకెళ్లడం సవాలుగా ఉండవచ్చని అనుకున్నాను. అయితే, వారు దృష్టి లోపం ఉన్న తల్లితో పెరిగారు. అందుకే వారికి అది చాలా మామూలుగా అనిపించింది” అని ఆమె చెప్పారు.
“ఇది పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ఇతర పిల్లలు చేయని పనులు వారు చేశారు” అని తఫ్సీల్ ఖాన్ తెలిపారు.

ఫొటో సోర్స్, Rhian Morris
బ్రిటన్‌లో 22 లక్షల మంది అంధులు ఉన్నారు. వారిలో 60 శాతం మంది మహిళలు.
1960ల వరకు వీరిలో చాలా మంది తల్లి అయ్యేందుకు అర్హులు కామని భావించేవారు. వారిలో కొంతమంది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకున్నారు.
అయితే, ఇప్పుడు అనేక మంది వికలాంగ మహిళలు గౌరవం, మద్దతు కోసం పోరాడుతున్నారని రాయల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ పీపుల్ (ఆర్ఎన్ఐబీ) చెప్పింది.
అంధులు, పాక్షికంగా చూపు కోల్పోయిన వారిలో 41 శాతం మంది మహిళలు తాము తల్లులు కావడం గురించి తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని, అందులో 26 శాతం మందికి వైద్యుల వల్ల అలాంటి అభిప్రాయం ఏర్పడిందని ఓ పరిశోధనలో తేలింది.
దీనిపై అవగాహన కలిగించేందుకు ట్రోత్ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి, తల్లిగా తనకు ఎదురైన ఆటంకాలను ఎలా అధిగమించారో అవసరమైన వారికి వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, jorge Lizalde
దృష్టి లోపం ఉన్న వారి పట్ల వ్యతిరేక అభిప్రాయాలు, తల్లయ్యే విషయంలో వారిపై అంచనాలు, వారి ఆత్మవిశ్వాసంపైన, వారికి అందుబాటులో ఉన్న వనరుల్ని చేరుకోవడంపైన బలమైన ప్రభావం చూపిస్తాయని ఆర్ఎన్ఐబీ సిమ్రు డైరెక్టర్ అన్స్లే వర్క్‌మాన్ అన్నారు.
“మీరెవరైనప్పటికీ తల్లి కావడం వల్ల కొన్ని అనుకోని కొత్త సవాళ్లు ఎదురు కావచ్చు. అయితే, అవి తల్లి కావడం వల్ల వచ్చే ఉత్తేజభరితమైన అనుభవాన్ని, ప్రతిఫలాన్ని ఆపలేవు.” అని అన్నారు.
వేల్స్ లో విజన్ సర్వీస్ ద్వారా ఆప్టోమెట్రీ ప్రాక్టీసెస్ అందిస్తున్నామని, బ్రిటన్‌లో ఇలాంటి సేవలు అందిస్తోన్న సంస్థ ఇదొక్కటేనని వేల్ష్ ప్రభుత్వం చెబుతోంది.
2023-24లో చూపు కోల్పోయిన 8 వేల మందికి ఈ సంస్థ సేవలు అందించింది. అందులో 5,500 మంది మహిళలు.
“దృష్టి లోపం ఉన్న వారు ఆత్మ విశ్వాసంతో, భద్రంగా జీవించేందుకు సాయం చేయడానికి అనేక సంస్థలకు నిధులు అందిస్తున్నాము. వారి సేవల్ని మెరుగు పరిచేందుకు వేల్స్ విజన్ ఫోరమ్‌తో కలిసి పని చేస్తున్నాం’’ అని వేల్స్ ప్రభుత్వం తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)