SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, FB/janasenaparty
తెలుగు సినీ పరిశ్రమలో టీ కప్పులో తుపాను మాదిరి వెలసిపోతుందనుకున్న థియేటర్ల బంద్ వివాదం ఇప్పుడు మరింత ముదిరింది.
ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఆ పరిశ్రమ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసే వరకూ వెళ్లింది.
స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమ వర్గీయులు తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని, దాన్ని కూడా తాను తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నానని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఉపముఖ్యమంత్రి కార్యాలయం సుదీర్ఘ ప్రకటన కూడా విడుదల చేసింది.

అసలేమిటీ వివాదం
సినిమా థియేటర్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలని కొద్దికాలంగా ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.
అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తుండటంతో తమకు ఆదాయం సరిపోవడం లేదని మల్టీప్లెక్స్ తరహాలోనే సినిమా వసూళ్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే వాదనను సింగిల్ థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ఇటీవల బలంగా తెరపైకి తెచ్చారు.
మల్టీప్లెక్స్‌ల్లో పర్సంటేజ్ విధానంలో నిర్మాతలు డబ్బులు చెల్లిస్తున్నారని, సింగిల్ స్క్రీన్ విధానంలో కూడా అలానే చెల్లించాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్ నెరవేరకపోతే జూన్ 1నుంచి థియేటర్లు బంద్ చేస్తామని రెండు రోజుల కిందట హెచ్చరించారు.

ఫొటో సోర్స్, @kanduladurgesh
ఆ నిర్ణయం వెనుక ఎవరున్నారంటూ సినిమాటోగ్రఫీ మంత్రి ఆగ్రహం
సినిమా ఎగ్జిబిటర్ల నుంచి ఆ బంద్ ప్రకటన వచ్చిన దరిమిలా ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా స్పందించారు.
జనసేన పార్టికి చెందిన ఆయన, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రకటన చర్చనీయాంశం అయ్యింది. బంద్ నిర్ణయంపై మంత్రి సీరియస్ అయ్యారు.
జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ చేయాలని తీసుకున్న అంశంపై విచారణ చేపట్టాలని, ఈ వ్యవహారం వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి దుర్గేశ్ సూచించారు.
బంద్ ఏమీ లేదని ప్రకటించిన చాంబర్
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయిన నేపథ్యం, తెలుగు సినీరంగంలో విపరీతంగా ఈ బంద్ విషయం చర్చకు వచ్చిన పరిస్థితుల్లో, జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్ చాంబర్ శనివారం సాయంత్రం ప్రకటించింది.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు శనివారంనాడు సమావేశమయ్యారు.
చర్చల అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడిస్తూ.. జూన్ 1నుంచి థియేటర్ల బంద్ లేదని ప్రకటించారు.
బంద్ అనే నిర్ణయమే తాము తీసుకోలేదని, అది తప్పుగా ప్రచారం జరిగిందని కేవలం ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామనడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఇక ఇక్కడితో వివాదం సమసిపోయిందని భావించిన నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన సినీవర్గాలతోపాటు, రాజకీయవర్గాల్లోనూ సంచలనం సృష్టించింది.

ఫొటో సోర్స్, @APDeputyCMO
పవన్ కల్యాణ్ కార్యాలయ ప్రకటనలో ఏముందంటే..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా.. తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించినట్లు ప్రకటనలో ఉంది.
ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది.
‘కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది. ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని.. ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే.. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు’’ అని అందులో పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదని, కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ల కోసం ప్రభుత్వం వద్దకి రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని పవన్ కల్యాణ్ కార్యాలయం పంపిన ప్రకటన పేర్కొంది.
‘‘అందరూ కలసి రావాలని నేను సూచించినా సానుకూలంగా స్పందించలేదు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఛీత్కరించి, ఎన్ని ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరిచిపోయినట్లున్నాయి’’ అని ఆ ప్రకటనలో ఉంది.
దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారని ఆ ప్రకటనలో ఉంది.
‘‘ఎవరికివారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది.. మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌ను తగిన విధంగానే స్వీకరిస్తా. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావు లేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, HEMANT CHATURVEDI
పవన్ సినిమా ఆపే సీన్ ఎవరికీ లేదు కానీ…: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘పవన్ కల్యాణ్ సినిమా ఆపే సీన్ ప్రస్తుతం పరిశ్రమలో ఎవరికీ లేదు. అలాగని సింగిల్ థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్ల సమస్య లేదని కాదు. చాలా కాలంగా ఉంది. మరి వాళ్లు బంద్ అని అంటే..పవన్ కల్యాణ్ ఎందుకంత రియాక్ట్ అయ్యారో అర్థం కావడం లేదు. ఏదో జరిగింది’’ అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బీబీసీతో అన్నారు.
ఈ వివాదం వెనుక ఆ నలుగురు: నట్టి కుమార్
తెలుగు సినీరంగంపై ప్రస్తుతం గుత్తాధిపత్యం వహిస్తున్న ఆ నలుగురు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, ఏసియన్ అనిల్ లే ఈ సమస్యను సృష్టించారని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ ఆరోపించారు.
బీబీసీతో ఆయన మాట్లాడుతూ పవన్ సినిమా జూన్‌లో ఉందని తెలిసి బంద్ ప్రకటించడం వెనుక కచ్చితంగా కుట్రకోణం ఉందని ఆరోపించారు.
ఆ సినిమాను ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేయాలని చూస్తోందని, ఆ సంస్థకి సినిమా వెళ్లకుండా బ్లాక్మెయిల్ చేసేందుకే థియేటర్ల బంద్ విషయాన్ని తెరపైకి తెచ్చారని నట్టికుమార్ ఆరోపించారు.
‘ఆ బంద్ వెనుక ఎవరూ లేరు’
‘‘సింగిల్ థియేటర్లు సంక్షోభంలో ఉన్న మాట నిజం. ఆ థియేటర్ల పరిస్థితి బాగుంటే ఎవరి మాటో విని బంద్ ఎందుకు చేస్తారు. పవన్ సినిమాతో పాటు పెద్ద సినిమాలు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో తమ సమస్యకి పరిష్కారం వస్తుందని ఆశించి ఈ టైంలో బంద్‌కి పిలుపు ఇచ్చి ఉండొచ్చు’’ అని సినీ విమర్శకుడు రంగావఝ్ఝల భరద్వాజ అన్నారు.
‘‘పవన్ కల్యాణ్ ఆగ్రహించారని తెలిసి వెంటనే వారి నిర్ణయం మార్చుకుని ఉంటారు. ఈ విషయంలో అదే జరిగి ఉంటుంది. అంతేగానీ, పవన్ కల్యాణ్‌తో వివాదం పెట్టుకునే పరిస్థితి సినీరంగంలో ఎందుకు ఉంటుంది” రంగావఝ్ఝల బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)