SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
44 నిమిషాలు క్రితం
పహల్గాం దాడి జరిగి నెలరోజులవుతుంది. ఈ దాడికి ముందూ, తర్వాత అన్నట్టు భారత్‌లో పరిస్థితులు మారిపోయాయి.
ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ దాడులు, ప్రతిదాడులతో యుద్ధం దాకా వెళ్లిన ఉద్రిక్తతలు అనూహ్యంగా సాధారణస్థితికి చేరాయి.
ఈ నెలరోజులుగా పహల్గాం దాడి, ఆ చుట్టూ జరిగిన పరిణామాలే వార్తల్లో ముఖ్యాంశాలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల్లో జరిగిన 15 కీలక పరిణామాల గురించి తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Getty Images
1) ఏప్రిల్ 22, 2025: పహల్గాం దాడి
జమ్ముకశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ నేపాలీ సహా 26మంది చనిపోయారు. మృతుల్లో భారత నేవీకి చెందిన 26ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఒకరు.
దాడికి వారం రోజుల ముందు పెళ్లిచేసుకుని, హనీమున్ కోసం వినయ్ నర్వాల్, హిమాన్షు దంపతులు కశ్మీర్ వెళ్లారు. అక్కడ హిమాన్షు కళ్లముందే భర్త వినయ్ నర్వాల్‌ను కాల్చిచంపారు. భర్త మృతదేహం దగ్గర హిమాన్షి కూర్చుని ఉన్న ఫోటో అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది.
కాల్పుల్లో చనిపోయిన వారిలో తెలుగువారు విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరుకు చెందిన మధుసూదనరావు ఉన్నారు. దాడి జరిగిన సమాచారం అందిన వెంటనే కేంద్ర హోమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ బయలుదేరి వెళ్లారు.
ఈ దాడితో భారత్‌లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ”పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల హస్తం ఈ దాడిలో ఉంది” అని భారత్ ఆరోపించింది. ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.
పహల్గాం దాడి జరిగినప్పుడు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు.

ఫొటో సోర్స్, ANI
2) ఏప్రిల్ 23: భారత్ స్పందన
పహల్గాం దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతిచర్యలు ప్రారంభించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన సీసీఎస్ ( భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం తాత్కాలిక నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసేంత వరకు ఇది అమలవుతుంది.
పాకిస్తాన్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో పాకిస్తానీయులకు జారీచేసిన ప్రత్యేక వీసాలు వెంటనే రద్దవుతాయని, ప్రత్యేక వీసా కింద భారత్‌లో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.
దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న ఇదే హోదా గల భారత ఉద్యోగులను వెనక్కు పిలిపించింది.
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ చెక్‌పోస్ట్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. భారత్ వైపు నుంచి సరైన పత్రాలతో వెళ్లినవారు కూడా ఈ ఏడాది మే 1 లోపు తిరిగి రావాలని తెలిపింది.
పహల్గాం కాల్పుల అనుమానితుల చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. కాల్పుల్లో ముగ్గురు పాల్గొన్నట్టు భద్రతాదళాలు అనుమానిస్తున్నాయని పీటీఐ తెలిపింది.
పహల్గాం దాడికి బదులు ఉంటుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
మరోవైపు పహల్గాం దాడిలో తమ దేశానికి ఎలాంటి ప్రమేయం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3) ఏప్రిల్ 24: బిహార్ ఎన్నికల ప్రచారంలో పహల్గాం దాడిపై మాట్లాడిన ప్రధాని మోదీ
బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ పహల్గాం దాడిపై తొలిసారి బహిరంగంగా స్పందించారు.
”పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నవారిని, కుట్రలో భాగమైన వారిని ఊహకందని రీతిలో శిక్షిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్నా” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
భారత్ చర్యలపై అదే రోజు పాకిస్తాన్ ప్రతిస్పందించింది.
భారతీయ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. అలాగే 1972నాటి సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
భారత్, పాకిస్తాన్ మధ్య అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నది సిమ్లా ఒప్పందం సారాంశం.

ఫొటో సోర్స్, Getty Images
4) ఏప్రిల్ 27: ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మోహరించిన భారత్
భారత నౌకాదళం అరేబియా సముద్రంలో తన నౌకా సామర్థ్యాలను పరీక్షించింది. ఈమేరకు ఇండియన్ నేవీ ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది.
”భారత నౌకాదళానికి చెందిన నౌకలు పలు నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి తమ సంసిద్ధతను చాటుకున్నాయి” అని భారత నౌకాదళ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పశ్చిమ తీరంలో మోహరించారు.

5) ఏప్రిల్ 28: తీవ్రవాదుల ఇళ్లు కూల్చివేసినట్టు వార్తలు
పహల్గాం దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో పోలీసు బృందాలు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేశాయి. పహల్గాం దాడి తర్వాత అనంత్‌నాగ్ పోలీసులు విడుదల చేసిన ముగ్గురు తీవ్రవాదుల స్కెచ్‌లలో ఆదిల్ హుస్సేన్ థోకర్ పేరు కూడా ఒకటి. తమ ఇంటిని కూల్చివేశారని ఆదిల్ థోకర్ కుటుంబం చెప్పింది.
భారత్ దాడి చేసే అవకాశముందని పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.
”మేం బలగాల మోహరింపును పెంచాం. తక్షణమే ఏమైనా జరగొచ్చు. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే తీసుకున్నాం” అని రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
6) ఏప్రిల్ 29: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటన
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతాసలహాదారు అజిత్ డోభాల్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశమయ్యారు.
పహల్గాం దాడికి ప్రతిగా.. ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని.. ఎక్కడ (టార్గెట్), ఎప్పుడు (టైమింగ్), ఎలా (మోడ్) చేయాలో నిర్ణయించే అధికారం కూడా వారిదేనని సమావేశంలో ప్రధాని మోదీ చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.
పాకిస్తాన్ విమానాలకు భారత్ గగనతలాన్ని మూసివేసింది.
వచ్చే 24 నుంచి 36 గంటల్లో పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తుందని పాకిస్తాన్ సమాచారశాఖ మంత్రి అతావుల్లా తరార్ చెప్పారు. ఏప్రిల్ 30 తెల్లవారుజామున 3.09 గం.లకు తరార్ ఈ ప్రకటన చేశారు.
అదే సమయంలో, పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్యకు దిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని భారత్‌లోని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
నియంత్రణ రేఖ వెంబడి మదరసాలను పాకిస్తాన్ పోలీసులు, స్థానిక అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతంలో కనీసం వెయ్యి మదరసాలను పదిరోజుల్లో మూసివేశారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను తెరిచే ఉంచారు.
మదరసాలను మూసివేయడమే కాకుండా ఈ ప్రాంతంలోకి పర్యటకుల ప్రవేశాన్ని కూడా నిషేధించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించినట్టు వార్తలొచ్చాయి.

7) మే 6: మాక్ డ్రిల్స్‌కు భారత ప్రభుత్వ ఆదేశాలు
యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఎలా స్పందించాలనే విషయంపై సన్నద్ధత కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బుధవారం (మే 7న) మాక్ డ్రిల్స్‌ను చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Reuters
8) మే 7: ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన భారత్
ఆపరేషన్ సిందూర్ పేరుతో అర్ధరాత్రి పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసింది. మంగళవారం(మే 6) అర్ధరాత్రి దాటిన తరువాత 1.44 గంటలకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పత్రిక ప్రకటన విడుదల చేసింది.
”పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఈ ఆపరేషన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ స్థావరాల నుంచే భారత్‌పై ఉగ్రవాద దాడులకు ప్రణాళిక వేసి అమలు చేశారు. మొత్తం తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాం” అని ఆ ప్రకటనలో తెలిపింది.
పహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు గౌరవంగా ఆపరేషన్ సిందూర్ అన్న పేరును స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పెట్టారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
పాకిస్తాన్‌పై దాడుల వివరాలను భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్‌తో కలిసి మీడియాకు వివరాలు తెలియజేశారు.
సీమాంతర దాడులపై స్పందించే హక్కు భారత్‌కు ఉందని, అందుకు అనుగుణంగా భారత్ దాడులు చేసిందని విక్రమ్ మిస్రీ తెలిపారు.
భారత ఆర్మీ అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.
”ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రవాదదాడిలో బాధితులుగా ఉన్న సాధారణ పౌరుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించాం. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, వాటిని పూర్తిగా ధ్వంసం చేశాం” అని సోఫియా తెలిపారు.
భారత వైమానిక దాడుల్లో 26 మంది చనిపోయారని, 46మంది గాయపడ్డారని పాకిస్తాన్ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురీ ప్రకటించారు.
మూడు రఫెల్ సహా భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాకిస్తాన్ ప్రకటించింది.
ఈ వీడియోను రాయ్‌టర్స్ వార్తా సంస్థ షేర్ చేసింది.
అయితే ఈ ప్రకటనలపై భారత్ స్పందించలేదు.
మరోవైపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశంలోని 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
9) నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు
పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడుల తరువాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరిపింది. ప్రతిగా భారత్ కూడా కాల్పులు జరిపింది.
పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బుధవారం(మే 7) సాయంత్రం వరకు 16మంది మరణించినట్లు భారత సైన్యం వెల్లడించింది.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తమ దళాలు ఐదు భారత విమానాలను కూల్చివేశాయని చెప్పారు. ఈ మేరకు ఆయన పాక్ పార్లమెంట్‌కు చెప్పారని ఆ దేశ మీడియా రిపోర్ట్ చేసింది.
అందులో రెండు కశ్మీర్‌లో, మరొకటి భటిండాలో కూలిపోయాయని షాబాజ్ చెప్పారు.
పాకిస్తాన్‌లో బుధవారం తెల్లవారుజామున భారత్ జరిపిన దాడులలో తన కుటుంబానికి చెందిన పదిమంది కుటుంబసభ్యులు చనిపోయినట్టు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మౌలానా మసూద్ అజర్ తెలిపారు.
”అమాయకులైన మన ప్రజలను చంపిన వారినే మేం మట్టుబెట్టాం” అని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
“భారత సైన్యం కచ్చితత్వం, అప్రమత్తత, సున్నితత్వంతో వ్యవహరించింది. నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితత్వంతో, ప్రణాళిక ప్రకారం నాశనం చేసింది. జనావాసాలు, లేదా సాధారణ ప్రజలు ప్రభావితం కాకుండా సున్నితంగా వ్యవహరించింది” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
10) మే 8: భారత్, పాక్ మధ్య సరిహద్దుల్లో కాల్పులు, డ్రోన్లు, మిసైల్ దాడులు
జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
జమ్మూ, ఉధంపుర్.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ మిలటరీ స్థావరాలపై పాక్ దాడికి యత్నించిందని.. అయితే, ఎలాంటి నష్టం జరగలేదని ‘ఎక్స్’లో తెలిపింది.
సైరన్లు మోగడంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని, మార్కెట్లు మూతపడ్డాయని, జనం పరుగులు తీయడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షి బీబీసీకి తెలిపారు.
జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బ్లాకవుట్ ప్రకటించారు.
ఇదే సమయంలో, ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ను నిర్వాహకులు మధ్యలో నిలిపివేశారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం(మే 8)భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో మాట్లాడారని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అవంతీపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భఠిండా, ఛండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్‌లాయ్, భుజ్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను జరిపినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
”ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ దాడులను అడ్డుకున్నాం. పలు ప్రాంతాల్లో ఈ దాడుల శకలాలను గుర్తించాం. పాకిస్తాన్ దాడులు జరిపినట్లు ఇవి ధ్రువీకరిస్తున్నాయి” అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
నియంత్రణరేఖ వెంబడి రెండు దేశాల సైన్యం మధ్య జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ చనిపోయారు. మురళి స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్ళి తాండ.
మరోవైపు బుధవారం(మే 7) రాత్రి 25 భారత డ్రోన్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్ల వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పింది.
మే 9 రాత్రినాటికి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. రెండు దేశాలు పూర్తిస్థాయి యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నట్టు పరిస్థితి కనిపించింది.
రాత్రిళ్లు డ్రోన్ దాడులు జరుగుతున్న సమయంలో పంజాబ్, రాజస్థాన్, జమ్మూకశ్మీర్ సహా సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో బ్లాకౌట్ విధించిన దృశ్యాలు మీడియాలో కనిపించాయి.
ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

11) మే 10: ప్రతీకార దాడికి దిగినట్టు పాకిస్తాన్ ప్రకటన
భారత్‌పై ప్రతీకార దాడి జరుపుతున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. మూడు పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిట్టు ఆరోపించింది. ఆపరేషన్ బన్యాన్ అల్ మార్సస్ పేరుతో భారత్‌పై దాడులు జరుపుతామని తెలిపింది.
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) గుండా భారత్-పాకిస్తాన్ మధ్య భారీ షెల్లింగ్ జరిగింది.
పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసినట్లు భారత్ ధ్రువీకరించింది.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ శనివారం ఉదయం ఒక ప్రకటన చేస్తూ, ‘భారతదేశానికి తగిన సమాధానం ఇచ్చాం’ అని అన్నారు.
“మా రిటాలియేషన్ ఆపరేషన్ బన్యన్ అల్ మార్సస్‌లో, పాకిస్తాన్‌పై దాడులు ప్రారంభమైన ప్రదేశం నుండే భారత సైనిక స్థావరాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంది. ఈ రోజు మనం భారతదేశానికి తగిన సమాధానం ఇచ్చాం. అమాయక ప్రజల మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాము” అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
12) మే 10: భారత్, పాక్ కాల్పుల విరమణ
ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే శనివారం(మే 10) సాయంత్రం అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్‌లు పూర్తి స్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రూత్ సోషల్, ఎక్స్‌లో ప్రకటించారు.
ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరినట్లు భారత్-పాక్ స్పష్టం చేశాయి.
దీనిపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటన చేశారు. శనివారం(మే 10) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకారం కుదిరిందని ఆయన తెలిపారు.
పాకిస్తాన్, భారత్‌లు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇటు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అన్నారు.
”కనీసం మూడు డజన్ల దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు చేశాయి. వీటిలో తుర్కియే, సౌదీ అరేబియా, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలాంటి వారున్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు” అని ఇషాక్ దార్ అన్నారు.
విస్తృత చర్చలు ప్రారంభించడానికి భారత్, పాకిస్తాన్ అంగీకరించాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.
కాల్పుల విరమణ తర్వాత కూడా రెండు దేశాల మధ్య డ్రోన్ల దాడులు జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి.
ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు.
మే 7న పాకిస్తాన్ షెల్లింగ్ తర్వాత వందల మంది ప్రజలు పూంఛ్‌తో పాటు ఇతర సరిహద్దు పట్టణాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత వారు నెమ్మదిగా తిరిగి వస్తున్నారు.

ఫొటో సోర్స్, Narendra Modi/YT
13) మే 12: ప్రధాని మోదీ ప్రకటన
పాకిస్తాన్ డ్రోన్, మిసైల్ దాడులను భారత బలమైన వైమానిక రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుందని ఇండియన్ ఆర్మీ పేర్కొంది.
వైమానిక రక్షణ వ్యవస్థ దేశానికి గోడలా నిలిచిందని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు.
పాకిస్తాన్‌లోని అణ్వాయుధ కేంద్రంగా చెబుతున్న కిరానా హిల్స్‌పై భారత్ దాడి చేసిందా అని మీడియా ప్రశ్నించగా, “కిరానా హిల్స్‌లో ఒక అణ్వాయుధ కేంద్రం ఉందని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. కిరానా హిల్స్‌లో ఏముందో మాకు తెలీదుగానీ, మేమైతే దాడి చేయలేదు” అని ఏకే భారతి సమాధానమిచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్, రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడుల ఉద్రిక్తత ముగిసిన తర్వాత మే 12 సోమవారం రాత్రి భారత ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
టెర్రరిజంపై భారత్ చేసిన పోరాటంలో ‘ఆపరేషన్ సిందూర్’ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించిందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
భారత్ ప్రస్తుతానికి తన ప్రతీకారచర్యలను మాత్రమే నిలిపివేసిందని మోదీ ఉద్ఘాటించారు.
”రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే దానిపై ఆధారపడి పాక్ ప్రతి అడుగును సునిశితంగా పరిశీలిస్తాం” అని చెప్పారు.
తన ప్రసంగంలో ట్రంప్ పేరును మోదీ ఎక్కడా ప్రస్తావించలేదు. ”మన సోదరీమణుల సిందూరాన్ని ఉగ్రవాదులు తుడిచివేశారు. అందుకే భారత్ ఈ ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసింది. భారత్ జరిపిన దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు” అని ప్రకటించారు.

ఫొటో సోర్స్, @narendramodi
14) మే 13: ఆదంపూర్ వాయుసేన స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
జాతినుద్దేశించి ప్రసంగించిన తరువాతి రోజే భారత ప్రధాని మోదీ పంజాబ్‌లోని వాయుసేన స్థావరమైన ఆదంపూర్‌ను సందర్శించారు.
అక్కడ భారత వాయుసేనకు చెందిన సీనియర్ అధికారులు, సైనికులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు.
”ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత లక్ష్మణరేఖ చాలా స్పష్టం. ఉగ్రవాద దాడులకు భారత్ గట్టి జవాబు ఇస్తుంది. సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా మనమీ విషయం చూశాం. వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ భారత్ సరికొత్త విధానాలు” అని మోదీ చెప్పారు.

ఫొటో సోర్స్, Planet Labs
15) నష్టంపై శాటిలైట్ చిత్రాల విడుదల
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలో పాకిస్తాన్‌కు ఎక్కువ నష్టం జరిగినట్టు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.
మరోవైపు కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, పహల్గాంలో దాడి జరిపిన వారికి ఏమైంది, జమ్మూకశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలో పడిన భారీ లోహపు ముక్క ఏదైనా భారత ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిందా? లేదా? కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదని విశ్లేషకులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)