SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్‌ల మధ్య తలెత్తిన సంఘర్షణ ప్రస్తుతానికి శాంతించింది. కానీ, ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఇరు దేశాలు, పరస్పరం హాని కలిగించే అనేక వాదనలు చేశాయి.
పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుతం ‘బ్యాక్‌ఫుట్’పై ఉందని (వెనకడుగు వేసిందని) రక్షణ రంగ నిపుణులు సి. ఉదయ్ భాస్కర్ అంటున్నారు.
పహల్గాంలో పర్యటకులపై దాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. ఇది ఈ రెండు దేశాల మధ్య ఒక ఘర్షణకు దారి తీసింది.
ఈ ఘర్షణలో వివిధ రకాల ఆయుధాల వాడకం గురించి బాగా చర్చ జరిగింది. ఈ రెండు దేశాలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలను ఉపయోగించాయని చెబుతున్నారు.
వీటిలో, ముఖ్యంగా మిసైళ్లు, డ్రోన్ల గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది.
బీబీసీ ఈ అంశంపై రక్షణ రంగ నిపుణులు సి. ఉదయ్ భాస్కర్‌తో మాట్లాడింది.

ఈ ఘర్షణలో ఉపయోగించిన ఆయుధాలపరంగా చూస్తే, దీన్నొక యుద్ధంగా పరిగణించాలని ఉదయ్ భాస్కర్ అన్నారు.
”రెండు వర్గాలు ప్రదర్శించిన సైనిక సామర్థ్యాలు, ముఖ్యంగా డ్రోన్లు, మిసైళ్లు, శాటిలైట్లతో కూడిన క్రాస్ బార్డర్ సామర్థ్యాలను చూస్తుంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారమైతే దీన్ని నేను ఒక యుద్ధంగానే పరిగణిస్తా. ఈ ఘర్షణలో బీవీఆర్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిసైళ్లను వాడారు” అని బీబీసీతో ఉదయ్ భాస్కర్ చెప్పారు.
బియాండ్ విజువల్ రేంజ్ మిసైళ్లు అంటే.. అవి కంటికి కనిపించవని ఆయన తెలిపారు. ఉదాహరణకు, ఇలాంటి మిసైళ్లను ప్రయోగిస్తే పాకిస్తాన్ హెడ్ డిఫెన్స్ కూడా వాటిని గుర్తించలేదని (డిటెక్ట్ చేయలేదని) ఆయన చెప్పారు.

రఫేల్ యుద్ధ విమానంతో సహా భారత విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ చెబుతోంది. ఇందులో నిజమెంత ఉండొచ్చు?
ఇప్పటివరకు ఇరు వర్గాలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించలేదని ఉదయ్ భాస్కర్ అన్నారు.
కానీ, భారత్-పాక్‌ల మధ్య తలెత్తిన ఘర్షణ తీవ్రత పరంగా చూస్తే, ఏదో రకంగా కచ్చితంగా నష్టం వాటిల్లి ఉంటుందని చెప్పొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఘర్షణ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, చైనా రక్షణ రంగ కంపెనీల షేర్లు పెరిగాయి.
ముఖ్యంగా పాకిస్తాన్‌కు ఆయుధాలు, యుద్ధ విమానాలు సరఫరా చేసే కంపెనీల షేర్లలో ఈ పెరుగుదల కనిపించింది.
భారత్‌కు చెందిన రఫేల్‌ను జే-10సీ యుద్ధ విమానంతో కూల్చేశామని పాకిస్తాన్ ప్రకటనలు చేసింది. పాక్ పార్లమెంట్‌లో మే 7న, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ ప్రకటన చేశారు. భారత్, ఈ వాదనను ఖండించలేదు. అలాగే, రఫేల్ కూలినట్లుగా కూడా అంగీకరించలేదు.
దీంతో జే-10సీ యుద్ధ విమానాన్ని తయారు చేసే ఏవిక్ చెంగ్డూ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ సంస్థ షేర్లు, మే 7న గత 9 నెలల్లో ఎప్పుడూ పెరగనంత భారీగా పెరిగాయి.

ఫొటో సోర్స్, ANI
”కచ్చితంగా ఇరు వైపులా కొంత నష్టం జరిగి ఉంటుందని నా అభిప్రాయం. పాక్‌లోని అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని భారత్ అంటోంది. పాకిస్తాన్ కూడా తన వాదనలు వినిపించింది. కానీ, ఎటు వైపు నష్టం ఎక్కువగా జరిగిందో ఇంకా స్పష్టంగా ఎవరికీ తెలియదు” అని ఉదయ్ భాస్కర్ అన్నారు.
ఈ ఘర్షణను ఇరుదేశాల క్షిపణి సామర్థ్యాలు, వాయు రక్షణ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి ఒక పరీక్షగా చూడొచ్చా?
”2019లో బాలాకోట్‌లో జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సిందూర్‌కు చాలా తేడా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఉదాహరణకు డ్రోన్ వార్‌ను చూడండి. యుక్రెయిన్ యుద్ధంలో, మధ్యప్రాచ్యంలో ఇవే కనిపించాయి.
పహల్గాం తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’లో సాంకేతిక పురోగతికి సంబంధించిన చాలా సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్‌లు సంప్రదాయక పద్ధతులను దాటి ఒకట్రెండు అడుగులు ముందుకు వెళ్లాయి.
అయితే, మీరు ఈ విషయంలో సొంతంగా పురోగతి సాధించగలరా? ఇతర దేశాల మద్దతు అవసరమా? అనే దానిపైనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి” అని ఆయన వివరించారు.
ఇరుదేశాలు రక్షణ పరంగా ఎంత ఖర్చు చేస్తున్నాయి?
భారత్, పాకిస్తాన్ దేశాలు రక్షణ బడ్జెట్ కోసం పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తాయి.
2025 మిలిటరీ స్ట్రెంథ్ ర్యాంకింగ్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య 8 స్థానాల తేడా ఉందని గ్లోబర్ ఫైర్ పవర్ నివేదిక పేర్కొంది.
గ్లోబల్ మిలిటరీ పవర్-2025 జాబితాలో 145 దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ 12వ ర్యాంకులో ఉంది.
భారత ఆర్మీకి దాదాపు 22 లక్షల ఆర్మీ జవాన్లు, 4201 ట్యాంకులు, దాదాపు లక్షన్నర సాయుధ వాహనాలు, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 లాక్కుని వెళ్లే ఫిరంగులు (టోవ్డ్ ఆర్టిలరీ), 264 మల్టీ బ్యారెల్ రాకెట్ ఆర్టిలరీ ఉంది.
భారత వైమానిక దళం వద్ద 3,10,000 మంది సైనికులు, 2,229 విమానాలు ఉన్నాయి. ఇందులో 513 యుద్ధ విమానాలు, 270 రవాణా విమానాలు కూడా ఉన్నాయి.
మొత్తం విమానాల్లో 130 అటాక్ చేసే విమానాలు, 351 ట్రైనర్ విమానాలు, ఆరు ట్యాంకర్ ఫ్లీట్ విమానాలు భాగంగా ఉన్నాయి.
ఇటీవలి సంఘర్షణలో రెండు దేశాలకు ఏ దేశాల నుంచి మద్దతు లభించింది?
”భారత్, పాకిస్తాన్‌ల మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. వీటిలో 1971 యుద్ధం చాలా పెద్దది. అప్పుడు భారత్‌కు సోవియట్ యూనియన్, పాకిస్తాన్‌కు అమెరికా సహాయం చేశాయి. అప్పడు ఆ రెండు చాలా శక్తిమంతమైన దేశాలు.
కానీ, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో వచ్చిన మార్పు ఏంటంటే, మీడియం పవర్‌గా పరిగణించే దేశాలకు చెందిన యుద్ధ సామగ్రిని వాడారు. ఉదాహరణకు, పాకిస్తాన్‌కు చాలా డ్రోన్లను తుర్కియే సరఫరా చేసింది. అయితే అవి అంతగా విజయవంతం కాలేదని చెబుతున్నారు” అని ఉదయ్ భాస్కర్ అన్నారు.
విదేశీ టెక్నాలజీ, ఆయుధాలు
”పాకిస్తాన్‌కు చైనా చాలా మద్దతు ఇచ్చిందని, చైనా అందించిన ప్రోత్సాహాన్ని పాకిస్తాన్ బాగా వాడుకుందని అంటున్నారు. కానీ, పాకిస్తాన్‌కు చైనా అందించిన సాయం ఎంతవరకు ప్రభావవంతంగా ఉందో ఇప్పుడు మనం కచ్చితంగా చెప్పలేం.
నా అభిప్రాయం ప్రకారం, భారత్ సొంతంగానే సైనిక శక్తిలో చాలా పటిష్టంగా ఉంది. దీనితో పాటు విదేశీ యుద్ధ సామగ్రిని కూడా ఉపయోగించింది. ఉదాహరణకు, ఎస్-400 మిసైళ్లను రష్యా నుంచి భారత్ పొందింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఎస్-400 చాలా విజయవంతమైన క్షిపణులు అని నేను చెప్పగలను” అని ఉదయ్ భాస్కర్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)