SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌లో అధికారం చేతులు మారినప్పటి నుంచి ఆ దేశంతో సంబంధాలు భారత్‌కు కాస్త ఇబ్బందిగానే ఉంటున్నాయి.
గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవాల్సివచ్చింది.
అప్పటికి 15ఏళ్లుగా షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను పరిపాలిస్తున్నారు. ఆమె దేశం వీడిన తర్వాత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉన్నారు.
షేక్ హసీనా పదవీకాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలుండేవి. కానీ, గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి.

తీవ్ర ఉద్రిక్తతను పెంచిన నిర్ణయాలు
భారత్ నుంచి పోర్టుల ద్వారా నూలు (ఉన్ని లేదా పత్తి దారాలు) దిగుమతిని ఇటీవల బంగ్లాదేశ్ నిలిపివేసింది.
బంగ్లాదేశ్ జాతీయ రెవెన్యూ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లోని బెనాపోల్, భోమారా, సోనమస్జిద్, బంగ్లాబంధ, బురిమారి ఓడరేవులలో అమలవుతోంది. బంగ్లాదేశ్‌కు భారత్ నుంచి నూలు దిగుమతి అయ్యే పోర్టులు ఇవే.
భారత విమానాశ్రయాలు, పోర్టుల ద్వారా భారతీయ వస్తువుల ఎగుమతులతో పాటు బంగ్లాదేశ్ ఎగుమతులకు వీలుకల్పించే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని కొద్దిరోజుల క్రితం భారత్ ఉపసంహరించుకుంది.
రద్దీ భారీగా ఉండడం దీనికి కారణమని భారత్ తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ మధ్య బ్యాంకాక్‌లో సమావేశం జరిగిన కొద్ది రోజులకే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకోవాలన్న భారత నిర్ణయం వెలువడింది.
” బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని భారత్ కోరుకుంటోంది. ప్రజాస్వామ్య, సమ్మిళిత, సంపన్న బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఉన్నాం. ఓడరేవులు, విమానాశ్రయాలలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించాం. అయితే మేం ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన పరిణామాలను కూడా గమనించాలని కోరుతున్నాను” అని గురువారం( ఏప్రిల్ 17) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై స్పందిస్తూ అన్నారు.
షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందడం, బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలు కూడా రెండు దేశాల మధ్య సమస్యలను పెంచుతున్నట్టు కనిపిస్తోంది.
బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్టెక్ సదస్సులో ప్రధానమంత్రి మోదీ, ముహమ్మద్ యూనస్ మధ్య దాదాపు 40 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. బంగ్లాదేశ్‌లో లక్ష్యంగా మారిన హిందువులు, ఇతర మైనారిటీల భద్రత అంశాన్ని మోదీ లేవనెత్తగా, షేక్ హసీనాను అప్పగించాలని ఢాకా చేసిన అభ్యర్థన గురించి యూనస్ మాట్లాడారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా, పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ స్నేహం
ఇటీవల చైనా వెళ్లిన ముహమ్మద్ యూనస్ అక్కడ చేసిన ఒక ప్రకటన వివాదాస్పదమయింది.
ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలను బంగ్లాదేశ్ ల్యాండ్‌లాక్ (చుట్టుముట్టడం) చేసిందని, ఈ ప్రాంతంలో సముద్రానికి ఏకైక సంరక్షణగా బంగ్లాదేశ్ మాత్రమే ఉందని, అక్కడ ఆర్థిక కార్యకలాపాలను పెంచాలని చైనాకు విజ్ఞప్తి చేశారు.
“రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కలుషితం చేసే ప్రకటనలు చేయవద్దు” అని యూనస్‌తో మోదీ చెప్పారని బ్యాంకాక్‌లో ఇద్దరు నేతల చర్చల తర్వాత భారత ప్రభుత్వం తెలిపింది. చైనాలో యూనస్ చేసిన ప్రకటనను ఉద్దేశించే భారత్ ఈ విషయం చెప్పింది.
ఇది జరుగుతుండగానే భారత సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండే లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని చైనా, పాకిస్తాన్ సాయంతో బంగ్లాదేశ్ పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇది భారత భద్రతకు ఆందోళన కలిగించే అంశం.
ముహమ్మద్ యూనస్ చైనా పర్యటన సందర్భంగా ఈ వైమానిక స్థావరం గురించి చర్చించారని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ తెలిపింది. ఈ ప్రణాళికలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉందని వార్తలు వచ్చాయి.
పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ బుధవారం( ఏప్రిల్ 16న) ఢాకా వెళ్లారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు 15 ఏళ్ల తర్వాత తొలిసారి గురువారం(ఏప్రిల్ 17) ప్రారంభమయ్యాయి.
మరికొన్నిరోజుల్లో పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఢాకాలో పర్యటించనున్నారు. 2012 తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బంగ్లాదేశ్ వెళ్లడం ఇదే మొదటిసారి.
అంతేకాకుండా, తీస్తా ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యాన్ని బంగ్లాదేశ్ స్వాగతించడం కూడా భారత్‌కు ఆందోళన కలిగించే అంశం.

ఫొటో సోర్స్, Getty Images
ముహమ్మద్ యూనస్ ఏమంటున్నారు?
భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయన్న చర్చ కూడా ఊపందుకుంది.
భారత్‌తో సంబంధాల గురించి ముహమ్మద్ యూనస్ కొన్ని వారాల కిందట బీబీసీ బంగ్లాతో మాట్లాడారు.
“మా సంబంధాలు ఏ విధంగానూ క్షీణించలేదు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అవి భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాయి. భారత్, బంగ్లాదేశ్ చాలా దగ్గరి దేశాలు. ఒకదేశంపై మరొకటి చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాయి. చారిత్రకంగా, రాజకీయంగా, ఆర్థికంగా మాకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. వాటినుంచి పక్కకు వెళ్లలేం.” అని అన్నారు.
అదే సమయంలో సంఘర్షణ జరిగే అవకాశాన్ని కూడా యూనస్ అంగీకరించారు.
“రెండు దేశాల మధ్యలో కొంత సంక్షోభం తలెత్తింది. వాస్తవానికి తప్పుడు ప్రచారం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాల మధ్య అపనమ్మకం ఏర్పడింది. దీన్ని అధిగమించడానికి మేం ప్రయత్నిస్తున్నాం.” అని ఆయన అన్నారు

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చట్టబద్ధత లేదు’
వీణా సిక్రీ బంగ్లాదేశ్‌లో భారత మాజీ దౌత్యవేత్త. షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ఆమె పాలనను అంతం చేయడానికి సాగిన ఉద్యమమని వీణా సిక్రీ అంటున్నారు.
“బంగ్లాదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధత లేదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ అధికార మార్పు తర్వాత, జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి కచ్చితంగా భిన్నమైన విధానం ఉంది. వారు ఇతర దేశాలతో సంబంధాల విషయంలో 1971కి ముందు నాటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. అది పాకిస్తాన్‌తో అయినా లేదా మరే దేశంతో అయినా. 1971లో జరిగిన ప్రతిదాన్ని వారు తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. 1971లో ఓడిపోయిన శక్తులు ఇప్పుడు తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఇది చాలా భిన్నమైన పరిస్థితి.” అని ఆమె విశ్లేషించారు.
బంగ్లాదేశ్‌కు చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్నీ వీణా సిక్రీ విశ్లేషించారు. ” బంగ్లాదేశ్, చైనాకు మధ్య గతంలో కూడా సంబంధాలున్నాయి. బంగ్లాదేశ్ తన సైనిక పరికరాలన్నింటినీ చైనా నుంచే పొందుతోంది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అయితే భారత భద్రతకు సంబంధించి ఆందోళన కలిగించే అంశాలకు బంగ్లాదేశ్ దూరంగా ఉండాలి.” అని ఆమె అన్నారు.
“లాల్మోనిర్హాట్ వైమానిక స్థావరానికి పాకిస్తాన్ సాయం తీసుకుంటామని, తీస్తా ప్రాజెక్టును చైనాకు ఇస్తామని బంగ్లాదేశ్ అకస్మాత్తుగా ప్రకటించినప్పుడు, సరిహద్దు దగ్గర ఏదైనా కార్యకలాపాలు నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భారత్ కూడా స్పష్టం చేసింది. భద్రతాపరమైన పరిమితులను పాటించాలి. పాకిస్తాన్‌తో కలిసి లాల్మోనిర్హాట్లో వైమానిక స్థావరాన్ని నిర్మించబోతున్నామని చెప్పడం భద్రతాపరమైన హెచ్చరికగా భావించాలి.” అని సిక్రీ అన్నారు.

ఫొటో సోర్స్, X/Shehbaz Sharif
‘పాకిస్థాన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న బంగ్లాదేశ్’
ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ న్యూదిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో అధ్యయనాలు, విదేశాంగ విధాన విభాగం ఉపాధ్యక్షులు.
భారత్ పట్ల పెద్దగా సానుకూలంగా లేని ప్రభుత్వాలు గతంలో కూడా ఉండేవని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఉదాహరణగా చెబుతూ ప్రొఫెసర్ పంత్ అన్నారు. అయితే భారత్‌తో సంబంధాల విషయంలో సమతుల్యతను పాటించడంలో అవి జాగ్రత్త వహించేవని చెప్పారు.
“షేక్ హసీనా పూర్తిగా ఏకపక్షంగా ఉండేవారని చెప్పడం కూడా తప్పు. ఆమె పదవీకాలంలోనే బంగ్లాదేశ్‌కు చైనా అతిపెద్ద రక్షణ భాగస్వామిగా మారింది. ఆమె భారత్, చైనా మధ్య సమతుల్యతను పాటించారు. ద్వైపాక్షిక సంబంధాన్ని రెండు వైపులా పెంపొందించుకోవాలి. కానీ ప్రస్తుతం యూనస్ పరిపాలన భారత్ పట్ల ప్రత్యేకించీ శత్రు వైఖరిని అవలంబించినట్లు కనిపిస్తోంది.” అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ అంటే చాలా సానుకూల అభిప్రాయం ఉన్న అనేకమంది వ్యక్తులు ప్రస్తుతం బంగ్లాదేశ్ పాలనా వ్యవస్థను నడుపుతున్నారని ప్రొఫెసర్ పంత్ అంటున్నారు.
“చైనా గురించి మర్చిపోండి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, ఇది అసాధారణమైనది. భారత ఈశాన్య ప్రాంతం గురించి యూనస్ చేసిన ప్రకటన భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు, ప్రాంతీయ పరిస్థితులపట్ల ఆ దేశం ప్రదర్శిస్తున్న ఉదాసీనతను ప్రతిబింబిస్తుంది.” అని ఆయన విమర్శించారు.

ఫొటో సోర్స్, AFP
సంబంధాలు క్షీణించాయని అనుకోవచ్చా?
భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించాయని చెప్పడం సరైనదేనా? అవుననే అంటున్నారు ప్రొఫెసర్ హర్ష్ పంత్.
“బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వ వైఖరి రెండు దేశాల సంబంధాలపై కచ్చితంగా చాలా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ వైఖరిని మార్చుకోవాలనే ఉద్దేశం దురదృష్టవశాత్తు వారిలో కనిపించడం లేదు. రాబోయే కాలంలో ఇందులో మార్పు చూస్తామని నేను అనుకోవడం లేదు.” అని ఆయన అన్నారు.
రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని వీణా సిక్రీ కూడా అంగీకరిస్తున్నారు.
“ప్రస్తుతం మంచి సంబంధాలున్నాయని నేను అనుకోవడం లేదు. ఇది బంగ్లాదేశ్ ప్రభుత్వం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా, ఎలాంటి చట్టబద్ధత లేకుండా అధికారాన్ని చేపట్టిన వ్యవస్థ. ఈ విషయాన్నిగుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.” అని వీణా సిక్రీ చెప్పారు.
పరిస్థితులను బట్టి భారత్ వ్యవహరించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
“ఇటీవల ముహమ్మద్ యూనస్‌తో బ్యాంకాక్‌లో జరిగిన సమావేశాల సమయంలో అన్ని పరిమితులను కచ్చితంగా విధించి ఉంటారని నేను భావిస్తున్నా. ఆ పరిమితులను గౌరవించకపోతే, అది వేరే విషయం. అప్పుడు భారత్ ఏం చేస్తుందన్నది చూడాలి.” అని సిక్రీ అన్నారు.

ఫొటో సోర్స్, @narendramodi
బంగ్లాదేశ్ వైఖరిపై భారత్‌కు ఆందోళన ఎందుకు?
”షేక్ హసీనా పదవీకాలంలో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి. కనెక్టివిటీ, వాణిజ్యం, వ్యూహాత్మక సంబంధాలు, సరిహద్దు సమస్యలు…ఇలా ఏవైనా కావచ్చు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించకపోయుండొచ్చు. కానీ రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేయలేని స్థితిలో అవి ఉన్నాయి. కానీ అకస్మాత్తుగా ప్రస్తుతం ప్రతిదీ ఒక సమస్యలా కనిపిస్తోంది.” అని ప్రొఫెసర్ పంత్ అన్నారు.
ప్రస్తుత బంగ్లాదేశ్‌కు కూడా కాలం అనుకూలంగా లేదని పంత్ అన్నారు.
ఇప్పటి బంగ్లాదేశ్‌ను, కొన్ని నెలల క్రితం షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న బంగ్లాదేశ్‌తో పోల్చి చూస్తే తేడా తెలుస్తుందని పంత్ అభిప్రాయపడ్డారు.
“కొన్ని నెలల్లోనే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మునుపటి స్థితికి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ సామాజిక, రాజకీయ సమతుల్యత అస్థిరంగా ఉంది. విజయగాథ నుంచి దీర్ఘకాలిక సమస్యలను సృష్టించే ప్రతికూల ధోరణిలోకి వెళ్తున్న బంగ్లాదేశ్ కనిపిస్తోంది. భారత్ ఒక పెద్ద దేశం, ఎలాంటి వాటినైనా తట్టుకోగలదు. కానీ లౌకిక, మితవాద ఇస్లామిక్ రాజ్యంగా బంగ్లాదేశ్ భవిష్యత్తులో మనుగడ సాగిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.” అని పంత్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)