SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ రచయిత్రి-న్యాయవాది-ఉద్యమకారిణి బాను ముష్తాక్ రచించిన చిన్న కథల సంకలనం ‘హార్ట్ ల్యాంప్’ కు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించింది.
దీంతో కన్నడ భాషలో ఈ బహుమతి గెలుచుకున్న తొలి పుస్తకంగా ‘హార్ట్‌ల్యాంప్’ రికార్డులకెక్కింది.
కన్నడంలో ఉన్న హార్ట్ల్యాంప్లోని కథలను ఇంగ్లిష్‌లోకి దీపా భస్తి అనువదించారు.
1990 నుంచి 2023 మధ్య ముష్తాక్ రాసిన 12 చిన్నకథల ఈ పుస్తకంలో, దక్షిణ భారతదేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇబ్బందులను వివరించారు.
ముష్తాక్ అందుకున్న ఈ అవార్డుకు చాలా ప్రాధాన్యముందని, ఇది ఆమె రచనలకు పేరు తీసుకురావడమేకాక, భారతదేశ ప్రాంతీయ సాహిత్య సంప్రదాయాలను కూడా ముందుకు తెస్తుందని భావిస్తున్నారు.
2022 సంవత్సరం ప్రారంభంలో, గీతాంజలి శ్రీ రాసిన ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పుస్తకం కూడా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డును అందుకుంది. ‘టూంబ్ ఆఫ్ శాండ్’ ను డైసీ రాక్వెల్ హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించారు.
మతపరమైన సంకుచిత భావాలు, పితృస్వామ్య సమాజం నుంచి…మహిళలు ఎదుర్కొనే సవాళ్లు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి.
సమస్యల పట్ల అవగాహన ఉంటడంతో ఆమె కథల్లోనే పాత్రలు సున్నితమైన భావాలను పలికిస్తుంటాయని సాహితీ విమర్శకులు అభిప్రాయపడ్డారు.


ఫొటో సోర్స్, Getty Images
వివాహం తర్వాత జీవితం
కర్ణాటకలోని ఒక చిన్న పట్టణంలో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పెరిగారు ముష్తాక్. అక్కడున్న చాలామంది అమ్మాయిల మాదిరిగానే, స్కూల్లో ఉర్దూ భాషలో ఖురాన్ చదివారు.
అయితే ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె తండ్రి, బాను ముష్తాక్‌ను మామూలు స్కూల్లో చదివించాలని కోరుకున్నారు. ఆమెకు ఎనిమిదేళ్ల వయసులో కన్నడ మీడియం కాన్వెంట్లో చేర్చారు.
కన్నడ భాషపై పట్టు సాధించడానికి ముష్తాక్ చాలా కష్టపడ్డారు. కానీ ఆ తరువాత ఈ భాషే ఆమె సాహిత్య వ్యక్తీకరణకు తోడ్పడింది.
స్కూల్ రోజుల నుంచే ఆమె రాయడం మొదలుపెట్టారు. తోటి స్నేహితులంతా పెళ్లికి మొగ్గుచూపుతున్న సమయంలో, బాను ముష్తాక్ మాత్రం ఇంకా చదువుకోవాలి, కాలేజీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ముష్తాక్ రచనలు పబ్లిష్ కావడానికి కొన్నేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో ఆమె చాలా ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొన్నారు.
26 ఏళ్ల వయసులో ఆమె తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
వివాహం జరిగిన ఏడాది తర్వాత, ఆమె రాసిన చిన్న కథ స్థానిక పత్రికలో ప్రచురితమైంది. ఆమె వివాహ జీవితం మొదట్లో గొడవలతోనే గడిచినట్టుగా చాలా ఇంటర్వ్యూలలో చెప్పాారామె.
“నేనెప్పుడూ రాయాలనే అనుకునేదాన్ని. కానీ దేనిగురించి రాయాలో తెలిసేది కాదు. తర్వాత వివాహం జరిగింది. అకస్మాత్తుగా బురఖా ధరించాల్సి వచ్చింది. జీవితాంతం ఇంటి పనులు చేయాలని చెప్పారు. 29 ఏళ్ల వయసులో తల్లినయ్యా. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (ప్రసవానంతర కుంగుబాటు)కు గురయ్యా” అని వోగ్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
‘ది వీక్’ మ్యాగజీన్‌కు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో, తన జీవితం ఇంటికే ఎలా పరిమితమైందో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితులపై తిరుగుబాటు
తిరుగుబాటు తత్వం ఆమెను ఆ పరిస్థితుల నుంచి బయటపడేలా చేసింది.
‘‘ఒకానొక సందర్భంలో నేను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవాలనుకున్నా. అదృష్టవశాత్తు నా భర్త నన్ను కాపాడారు. నా బిడ్డను నా కాళ్లమీద పెట్టి, మమ్మల్ని ఒంటరివాళ్లను చెయ్యొద్దని వేడుకున్నారు” అని ‘ది వీక్’ మ్యాగజీన్‌తో అన్నారు ముష్తాక్.
హార్ట్ల్యాంప్లో ఆమె సృష్టించిన స్త్రీ పాత్రలు ప్రతిఘటన, తిరుగుబాటు తత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
“ప్రధాన స్రవంతి భారతీయ సాహిత్యంలో, ముస్లిం మహిళల పాత్రలు చురుకుగా కనిపించవు. బాధలను ఓర్చుకుని అణచివేతను అనుభవించే తత్వంతో కనిపిస్తాయి. కానీ, ముష్తాక్ రచనల్లో అలా కాదు. ఆమె పాత్రలు కష్టపడే తత్వంతో, సమస్యలపై చర్చించే ధైర్యం కలిగిన పాత్రలు. కొన్నిసార్లు నిరసన కూడా తెలుపుతాయి. అది జీవితాలను మార్చేసే నిరసన” అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రికలో ప్రచురితమైన ఒక రివ్యూ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల హక్కుల కోసం గొంతెత్తారు.
ముష్తాక్ ఒక ప్రముఖ స్థానిక పత్రికకు రిపోర్టర్‌గా పనిచేశారు. తరువాత ‘బందాయ ఉద్యమం’లో చేరారు.
సాహిత్యం, క్రియాశీలత ద్వారా సామాజిక, ఆర్థిక అన్యాయాలను రూపుమాపడానికి ఈ ఉద్యమం నిర్వహిస్తున్నారు.
దశాబ్దం పాటు జర్నలిస్టుగా పనిచేసిన తర్వాత, న్యాయవాద వృత్తి చేపట్టారు.
దశాబ్దాల తన కెరీర్లో, గణనీయమైన సంఖ్యలో ఆమె రచనలు ప్రచురితమయ్యాయి. వీటిలో ఆరు చిన్న కథా సంకలనాలు, ఒక వ్యాస సంకలనం, ఒక నవల ఉన్నాయి.
కానీ ఆమె పదునైన రచనల వల్ల కొందరు ఆమెను ద్వేషించారు కూడా.
మసీదులలో నమాజ్ చేసే మహిళల హక్కులకు మద్దతుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు 2000 సంవత్సరంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ‘ది హిందూ’ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముష్తాక్ వివరించారు.
ఆమెపై ఫత్వా జారీ చేశారు. ఒక వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆమె భర్త అడ్డుకున్నారు. ఇంత జరిగినా ముష్తాక్ భయపడలేదు. రచనలు కొనసాగించారు.
“నేనెప్పుడూ మూఢనమ్మకాలు, మతపరమైన ఛాందస విధానాలనే సవాల్ చేశాను. ఈ సమస్యలు నా రచనకు కేంద్రబిందువుగా ఉన్నాయి. సమాజం చాలా మారిపోయింది, కానీ ప్రాథమిక సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయినా మహిళలు, అణగారిన వర్గాల పోరాటం కొనసాగుతుంది” అని ఆమె ‘ది వీక్’ మ్యాగజీన్‌తో అన్నారు.
ముష్తాక్ రచనలు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు అనేక స్థానిక, జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి.
1990-2012 మధ్య ప్రచురితమైన ఐదు చిన్న కథల సంకలనం ‘హసీనా అండ్ అదర్ స్టోరీస్’ కూడా 2024లో ఆంగ్లంలోకి అనువాదమై ప్రతిష్టాత్మకమైన ‘PEN ట్రాన్స్లేషన్ ప్రైజ్‌ని గెలుచుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)