SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
కౌన్ బనేగా కరోడ్ పతి – 16వ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్లో రితిక సింగ్ అనే కంటెస్టెంట్ అమితాబ్ బచ్చన్‌తో జెన్ జీ డేటింగ్ టర్మ్స్ గురించి మాట్లాడారు.
దిల్లీకి చెందిన ఈ అమ్మాయి ఓ జర్నలిస్ట్. ఈ షోలో ఆమె తన హాబీల గురించి చెబుతూ ఖాళీ సమయంలో తన స్నేహితులకు రిలేషన్షిప్ గురించి సలహాలు ఇస్తానని చెప్పారు.
నేటి యువత మానవ సంబంధాల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతూ అమితాబ్‌కు ‘బ్రెడ్ క్రంబింగ్’, ‘బెంచింగ్ ‘ అనే పదాలను పరిచయం చేశారు రితిక.
“బ్రెడ్ క్రంబింగ్ అంటే రొట్టె తినడమా?” అని అడిగి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు అమితాబ్. రితిక ఆయనకు వీటి అర్థాన్ని వివరించి చెప్పారు.
ఈ పదాలను నేను కూడా మొదటిసారి విన్నాను. ఇప్పటి వరకు ప్రేమ, పెళ్లి, లివ్-ఇన్ లాంటివి విన్నాం. కానీ బ్రెడ్ క్రంబింగ్, బెంచింగ్ ఏంటా అని మరి కొంత సమాచారం కోసం గూగుల్ చేశాను. ఈ రెండు పదాలే కాదు, బంధాలకు కొత్త నిర్వచనం చెప్పే చాలా పదాలు వాడుకలో ఉన్నాయని అర్థమైంది.
వాటిని చూశాక బంధాల స్వరూపం మారుతోంది అనిపించింది.
డేటింగ్, ప్రేమ, పెళ్లి, లివ్-ఇన్ లేదా సింగిల్.. ఇక్కడి నుంచి బంధాలు చాలా దూరం ప్రయాణించి బ్రెడ్ క్రంబింగ్, బెంచింగ్, సిట్యుయేషన్‌షిప్… ఇలా రకరకాలుగా మారాయి. బంధం స్వరూపాన్ని బట్టి కొత్త పదాలు పుడుతున్నాయి. అలాంటి కొన్ని కొత్త పదాలు చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
సిట్యుయేషన్‌షిప్
సిట్యుయేషన్‌షిప్‌లో ప్రేమ, స్నేహం రెండూ ఉండవు. ఇద్దరు ఒంటరి వ్యక్తులు ఒక నిర్వచనం లేని బంధంలో ఉండటాన్నే సిట్యుయేషన్‌షిప్ అంటారు. ఈ బంధానికి స్పష్టమైన నియమాలేం ఉండవు. ఇది డేటింగ్ కూడా కాదు. ఒకరి కంపెనీని మరొకరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు… అంతే.
ఈ బంధాల్లో ఒకరికొకరు మానసికంగా దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రేమ, స్నేహం, పెళ్లి ఇలాంటి వేటికీ బందీలు అవ్వరు. మా బంధం ఇది అని స్పష్టంగా చెప్పలేరు. కానీ, ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటారు.
ఇదొక అర్థరహితమైన బంధం అని జాహ్నవి కపూర్ ఓ సందర్భంలో అన్నారు. అటూ ఇటూ కాని బంధాలు తనకు అర్థం కావన్నారు. ప్రేమ, పెళ్లి అనే బంధంలో మధ్యేమార్గం ఏమీ ఉండదని తాను నటించిన ‘ఉలాజ్’ సినిమా గురించి ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో 2024లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను సిట్యుయేషన్‌షిప్‌లో ఉన్నానని సాన్య మల్హోత్రా 2022 జూన్‌లో ఫిలిం ఫేర్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే కొన్ని రోజుల అనుభవం తర్వాత ఇవి తనలాంటి వాళ్లకి సరిపడవని అర్థమైందని చెప్పారు.
“ఎవరినైనా ఇష్టపడితే డేట్ చేయండి. వాళ్లను చుట్టూ తిప్పుకోకండి” అని సలహా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో తానెప్పుడూ పడనని కూడా ఆమె స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెడ్ క్రంబింగ్
ఎవరిపైనైనా శ్రద్ధ చూపించడం, కవ్వించే సందేశాలు పంపడం, ఇష్టం అన్నట్లు ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ బంధాలు మాటల వరకు మాత్రమే పరిమితం. సీరియస్ బంధంలోకి అడుగుపెట్టాలని అనుకోరు.
ఒంటరిగా ఉండేవాళ్లు లేదా ఎవరైనా తమ ఉనికిని గుర్తించాలి అనుకునేవాళ్లు ఇలాంటి సందేశాలు పంపుతూ ఉంటారు. డిజిటల్ కమ్యూనికేషన్లో ఇలాంటి సందర్భాలు ఎక్కువ. ఇలా మెసేజెస్ చూసి ప్రేమ అనుకుని మోసపోయిన ఉదాహరణలు కోకోల్లలు.
ఎక్కడో పరిచయమవుతారు, లేదా ఆన్లైన్లో కలుస్తారు. నీ గురించే ఆలోచిస్తున్నా అంటారు. కానీ, కలుద్దాం అంటే రారు. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ఆసక్తి ఉండదు. బ్రెడ్ క్రంబింగ్కి ఇది కూడా ఓ ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
బెంచింగ్
కొన్ని కంపెనీలు కొంత మంది ఉద్యోగులను బెంచ్‌పై ఉంచుతుంటుంది. అంటే వాళ్లను పనిలో తీసుకోవచ్చు లేదా ఉద్యోగంలోంచి తీసేయవచ్చు. కచ్చితమైన పని ఉండదు. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ రావచ్చు అనే ఉద్దేశంతో రిక్రూట్మెంట్ సమయాన్ని తగ్గించుకునేందుకు చాలా కార్పొరేట్ సంస్థలు ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉంటాయి.
ఇదే మాదిరిగా ప్రేమిస్తున్న వ్యక్తితో బంధంలో ఉన్నట్లు ప్రవర్తిస్తారు కానీ ఉండరు. దీనిని బెంచింగ్ అంటారు. మరోవైపు వేరే భాగస్వామి కోసం వెతుక్కుంటూ ఉంటారు. డేటింగ్ యాప్స్, టెక్నాలజీలు కూడా వీళ్లు కాకపొతే మరొకరు అనుకునేలా చేస్తున్నాయి.
బంధాల పట్ల జెన్ జీ, జెన్ ఆల్ఫా చాలా స్పష్టంగా ఉంటున్నారు. పెద్దవాళ్లు ఎవరిని చూపిస్తే వాళ్లకే అవును అనేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. తమ వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కఠినమైన బంధాల వలయంలో ఉండటానికి ఆసక్తి చూపించడం లేదు.
ఈ రిలేషన్షిప్ టర్మ్స్ గురించి నేను జెన్ జీకి చెందిన నిహారిక వర్మతో మాట్లాడాను. ఈ అమ్మాయి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఆడిటర్‌గా పని చేస్తున్నారు. 1997 – 2012 మధ్యలో పుట్టిన వారిని జెన్ జీ అని అంటారు. 2013 – 2024 మధ్య పుట్టినవారిని జెన్ ఆల్ఫా అంటారు.
“సిట్యువేషన్‌షిప్, బెంచింగ్ ఇలాంటి పదాల పుట్టుక వెనుక పీర్ ప్రెషర్ (తోటి వారి ఒత్తిడి) చాలా ఉంటోంది. నాకు బాయ్ ఫ్రెండ్ లేరు. కానీ నా స్నేహితులు, రూమ్ మేట్స్ అడుగుతూ ఉంటారు, నువ్వెందుకు సింగిల్ అని. దీంతో తెలియకుండానే, ఒక బంధం ప్రేమ కాదని తెలిసినా స్నేహితుల దగ్గర షో ఆఫ్ చేయడానికి, ఎవరో ఒకరితో రిలేషన్ ఏర్పరచుకుంటున్నారు. చాలా సులభంగా… వై డోంట్ యూ ట్రై? ఒక బాయ్ ఫ్రెండ్‌ని చూసుకోవచ్చు కదా అంటూ ఉంటారు. అసలు ఈ వెతుక్కోవడం, చూసుకోవడం అనే ఆలోచనే నాకు అర్థం కాదు” అని నిహారిక అన్నారు.
“ఇలా చేయడం తప్పా ఒప్పా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇది వ్యక్తిగత ఆనందానికి, సౌఖ్యానికి సంబంధించిన విషయం. వయసుతో పాటు అభిప్రాయాలు కూడా మారతాయి. టీనేజ్‌లో ఇంట్లో ఒత్తిడి, కట్టుబాట్లు ఎక్కువగా ఉండటంతో మా మనసులో భావాలు చెప్పుకోవడానికి ఒక స్నేహితుడో, ప్రేమికుడో, సహచరుడో కావాలని అనుకుంటాం. కానీ వయసు పెరిగే కొద్దీ సుస్థిరమైన బంధమే ఉండాలని అనుకుంటాం” అన్నారు నిహారిక.
చాలా మంది సెల్ఫ్-లవ్, తమను తాము ప్రేమించుకోవడం, కెరీర్, తమ ఇష్టాలు, ఆసక్తులు, వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి సారించి, టైం పాస్ బంధాల్లో పడేందుకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. తమ ఇష్టాలను స్వేచ్ఛగా చెప్పి, పరస్పర గౌరవం కోరుకుంటున్నారు. ప్రేమలో నియమాలను కొత్తగా నిర్వచిస్తున్నారు. తమ ఉనికిని కోల్పోవడానికి ఇష్టపడటం లేదు. బంధాల్లో కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా మానసిక భద్రత, ఒకరి పట్ల ఒకరికి గౌరవం, విలువలు ఉండడంతో పాటు ఒకరి ఇష్టాలను మరొకరు ఆమోదించాలని చూస్తున్నారు

ఫొటో సోర్స్, Danae Diaz
ఆర్బిటింగ్
ఒక బంధం నుంచి విడిపోయిన తర్వాత కూడా అవతలి వ్యక్తి మీరు చేసే పనులపై దృష్టి పెడతారు. ఇది ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా చేస్తారు. మీ స్టోరీస్ చూస్తారు, సోషల్ మీడియాలో మీ పోస్టులను లైక్ చేస్తారు. కానీ మాట్లాడరు. నేను నీపై ఆసక్తి చూపిస్తున్నాను అనే సందేశాన్ని మాత్రమే ఇస్తారు. ఒక్కొక్కసారి ఇది అవతలి వ్యక్తిని చాలా అయోమయానికి గురి చేస్తూ ఉంటుంది.
అనా లవీన్ అనే రచయత దీనిపై మాట్లాడారు.
“చూసుకునేందుకు ఒకరికొకరు దగ్గరగా ఉంటారు కానీ మాట్లాడాలంటే అందనంత దూరంగా ఉంటారు” అని అనా అన్నారు.
‘ఇది కేవలం పార్ట్‌నర్స్‌తో మాత్రమే జరగదు, స్నేహితులు, బంధువులతో కూడా జరుగుతుంది’ అని ఆర్బిటింగ్ గురించి టేలర్ డేవిస్ ఓ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ వ్యాసం బెటర్ బై టుడే అనే మ్యాగజీన్లో 2018లో ప్రచురితమైంది.
“పక్కవారి జీవితంలోకి తొంగి చూడటం, అవతలి వాళ్ల జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకోవడం మానవ స్వభావం. దీనికి ఏమీ చేయలేం. ఇది ఒక్కోసారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది” అని మానసిక నిపుణులు అంటారు.
కుషనింగ్
ఒక వ్యక్తితో బంధంలో ఉంటారు. కానీ మరొకరితో వారిని ప్రేమిస్తున్నట్లు, ఇష్టం ఉన్నట్లు ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. మరొకరితో ప్రేమలో ఉన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించరు.
ఇలా ఒక బంధంలో ఉంటూ మరొకరితో ఇష్టం ఉన్నట్లు ప్రవర్తించడాన్ని కుషనింగ్ అంటారు. ప్రస్తుతం ఉన్న బంధం తెగిపోతే ఏమవుతుందో అనే భయంతో మరొకరితో కూడా ప్రేమగా ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు.
లవ్ బాంబింగ్
ఇది అతి ప్రేమ అని చెప్పుకోవచ్చు. ప్రేమతోనో లేదా అటెన్షన్ కోసమో లేదా అదుపులో పెట్టుకోవడానికో లవ్ బాంబింగ్ చేసి, బోలెడన్ని గిఫ్టులు కొనడం, అనుక్షణం వెంటాడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది మొదట్లో బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజులకు టాక్సిక్‌గా మారిపోతుంది.
సిమ్మర్ డేటింగ్
కొన్ని నగరాల్లో చాలా మంది యువత సిమ్మర్ డేటింగ్ చేస్తున్నారు. అంటే బంధాల్లోకి అడుగుపెట్టడానికి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం లేదు. కలిసి గడుపుతున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరి మధ్యా మానసిక బంధం ఏర్పడిన తర్వాత తమ బంధాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో నిర్ణయించుకుంటున్నారు.
ఈ విధమైన బంధాల్లో సుస్థిరత ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మున్డేన్ డేటింగ్
ఈ తరహా డేటింగ్లో ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంటి పని, వంట పనులు చేసుకుంటారు. షాపింగ్‌కి వెళ్తారు. రొమాంటిక్ రిలేషన్షిప్ మాత్రమే కాకుండా బాధ్యతలను, పనులను పంచుకుంటూ డేటింగ్లో ఉంటారు.
నానో షిప్స్
చాలా కొన్ని రోజులు మాత్రమే రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉంటారు. ఉన్నంత కాలం ఒకరి నుంచి ఒకరు ఒక విధమైన మానసిక స్థైర్యాన్ని పొందుతూ ఉంటారు. నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం అనుకుంటారు.
“ఒకటైతే నిజం. ఒకరిపై ‘ప్రేమ ఒక్కసారే కలుగుతుంది’, ‘ప్రేమ అమరం’ లాంటి ఆలోచనల నుంచి జెన్ జీ, జెన్ ఆల్ఫా బయటపడ్డారు. ఒకవేళ ఒక బంధంలో విడిపోయినా, అది జీవితానికి అంతం అని ఆలోచించే వాళ్లు తగ్గారు. ఒంటరిగా ఉండటంలో తప్పు లేదు” అని నిహారిక తన స్నేహితులు, తన చుట్టూ చూసిన అనుభవాల నుంచి చెప్పారు.
జెన్ జీ అత్యధికంగా సుస్థిరమైన బంధాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు టైమ్స్ నిర్వహించిన సర్వే తెలిపినట్లు 2025 ఫిబ్రవరిలో ఫార్చ్యూన్ పత్రికలో ప్రచురితమైన వ్యాసం పేర్కొంది.
టెక్నాలజీ, డిజిటల్ మాధ్యమాలు, మారుతున్న పరిస్థితులు ఇలాంటి కొత్త పదాలను వాడుకలోకి తీసుకొచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)