SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Planet Labs
మే 6, 7 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్‌పై భారత్ ”ఆపరేషన్ సిందూర్” ప్రారంభించింది.
తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని ఆ సమయంలో భారత ఆర్మీ ప్రకటించింది.
”గడచిన మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు నిర్మిస్తున్నారు. నియామకాలు, శిక్షణ, లాంచ్ పాడ్ల నిర్మాణం వాటిలో జరుగుతున్నాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంతటా అవి వ్యాపించి ఉన్నాయి” అని భారత మిలటరీ చర్య తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు.
దీనిని ‘యుద్ధ చర్య’గా అభివర్ణించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సమాధానం ఇవ్వడానికి తమకు పూర్తి హక్కు ఉందని తెలిపారు.
నాలుగు రోజుల దాడులు, ప్రతిదాడుల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ గురించి మొదట అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో సమాచారమిచ్చారు.
కాల్పుల విరమణ తర్వాత నాలుగు రోజుల్లో ఎవరికి ఎంత నష్టం జరిగిందనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో నిపుణుల అభిప్రాయమేంటి?


ఫొటో సోర్స్, Getty Images
నష్టంపై భారత్, పాకిస్తాన్ ఏం చెబుతున్నాయంటే…
పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ పాకిస్తాన్ వాయుసేన భారత్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను కూల్చివేసిందని తమ దేశ పార్లమెంట్లో ఓ ప్రకటన చేశారు. ఇందులో మూడు రఫెల్స్ కూడా ఉన్నాయని తెలిపారు.
రాత్రి వేళ జరిగిన దాడిలో తాము 70కిపైగా డ్రోన్లను కూడా లక్ష్యంగా చేసుకున్నామని పాకిస్తాన్ తెలిపింది.
భారత్ తరఫున మాట్లాడిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి పాకిస్తాన్ చెప్పిన సమాచారంపై స్పష్టంగా స్పందించలేదు. రఫెల్ కూలిపోయిందో లేదో చెప్పలేదు.
‘ఆపరేషన్ బన్యాన్-యున్-మెర్సస్’ పేరుతో తాము చేపట్టిన ప్రతీకార చర్యలో భారత్‌లోని 26 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది.
పఠాన్‌కోట్, అంబాలా, ఉధంపూర్, శ్రీనగర్, భఠిండా, ఆదంపూర్, అవంతిపుర, సూరత్‌గఢ్, సిర్సా ఇందులో ఉన్నాయి.
తమ డ్రోన్లు భారత రాజధాని దిల్లీ సహా ప్రధాన నగరాలపై సంచరించాయని కూడా పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది.
బ్రహ్మోస్ క్షిపణుల స్థావరమైన నగ్రోట, ఆదంపూర్‌లోని ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థపై తాము విజయవంతంగా దాడి చేశామని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చెప్పారు.
అయితే తరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు.
‘‘పాకిస్తాన్ నాశనం చేసిందని చెప్పుకుంటున్న ఎస్-400 వ్యవస్థ ముందు నిలబడి మోదీ ప్రసంగించారు. దీంతో యుద్ధం విషయంలో వినిపిస్తున్న కథనాలను, ఊహాగానాలను పూర్తిగా మార్చేశారు.’’ అని రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్వీపీ సింగ్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, @narendramodi
‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్ ఏం చెప్పింది?
‘ఆపరేషన్ సిందూర్’పై భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం
- తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం. 100 మందికిపై ఉగ్రవాదులను చంపేశాం.
- యూసఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి కీలక ఉగ్ర కమాండర్లను హతమార్చాం.
- అణ్వస్త్ర సామర్థ్యమున్న పాకిస్తాన్‌లోని 11 వైమానిక స్థావరాలపై ఒకే ఆపరేషన్‌లో దాడులు చేసిన మొదటి దేశం భారత్.
- పాకిస్తాన్ వాయుసేనకు చెందిన 20శాతం ఆస్తులు ధ్వంసమయ్యాయి.
- భోలారి ఎయిర్ బేస్‌కు చాలా నష్టం జరిగింది. స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్ మరణించారు.
- కశ్మీర్ అంశం పునర్ నిర్వచనం పొందింది.

ఫొటో సోర్స్, Maxar Technologies and Planet Labs
శాటిలైట్ చిత్రాల్లో ఏం కనిపిస్తోంది?
ఘర్షణ సమయంలో భారత్, పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆ తర్వాత తీవ్ర నష్టం కలిగించామనే మాటలు రెండు వైపుల నుంచీ వచ్చాయి.
దాడులు విస్తృతంగా జరిగినట్టు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోందని, అయితే జరిగిన నష్టం చెప్పిన దాని కన్నా తక్కువగా ఉందని అమెరికా న్యూస్ పేపర్ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
పాకిస్తాన్ మిలటరీ స్థావరాలను, ఎయిర్‌పోర్టులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని ఆ రిపోర్ట్ తెలిపింది.
”పాకిస్తాన్ పోర్టు నగరం కరాచీకి వందమైళ్ల కన్నా తక్కువ దూరంలో ఉన్న భోలారి వైమానిక స్థావరంలోని ఎయిర్‌క్రాఫ్ట్ హాంగర్పై తాము కీలక దాడి జరిపామని, హాంగర్లా కనిపిస్తున్న దానికి తీవ్రమైన నష్టం వాటిల్లినట్టు ఫోటోలు చూపిస్తున్నాయని భారత రక్షణ శాఖ అధికారులు చెప్పారు” అని ఆ రిపోర్టులో ఉంది.
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సులోని జమ్షోరో జిల్లాలో భోలారి ఎయిర్ బేస్ ఉంది. 2017లో దీన్ని ప్రారంభించారు. పాకిస్తాన్లో అత్యంత ఆధునిక ఎయిర్ బేస్‌ల్లో ఇదొకటి.
అలాగే నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రహీమ్ యర్ ఖాన్ ఎయిర్‌పోర్టు, సర్గోధ ఎయిర్ బేస్‌కు జరిగిన నష్టానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా ఆ రిపోర్టులో ఉన్నాయి.
ఇరవైకి పైగా భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని పాకిస్తాన్ తెలిపింది. ఇందులో ఉధంపూర్ ఎయిర్ బేస్ కూడా ఉంది. కానీ మే 12న తీసిన శాటిలైట్ చిత్రాల్లో ఉధంపూర్ ఎయిర్ బేస్‌కు ఎలాంటి నష్టం వాటిల్లినట్టు కనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులేం చెబుతున్నారు?
‘ఆపరేషన్ సిందూర్’ తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించిందని, భారత్ భారీ విజయం పొందిందని రక్షణ రంగ నిపుణులు జాన్ స్పెన్సర్ అభిప్రాయపడ్డారు.
”నాలుగు రోజుల పాటు జరిగిన మిలటరీ చర్య తర్వాత భారత్ భారీ విజయం సాధించింది. వ్యూహాత్మక లక్ష్యాలను అనుకున్నంత మేర కన్నా ఎక్కువగా ఆపరేషన్ సిందూర్ సాధించింది. ఉగ్రవాద మౌలిక స్థావరాలను నాశనం చేసింది, సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కొత్త జాతీయ భద్రతా సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది నిర్ణయాత్మక శక్తి, స్పష్టంగా వ్యక్తీకరణఅయింది” అని జాన్ స్పెన్సర్ ‘ఎక్స్’లో రాశారు.
”భారత్ ప్రతీకారం కోసం పోరాటం చేయడం లేదు. తనపై జరిగే దాడులను నిరోధించడానికి పోరాడుతోంది. అది ఫలితాన్నిచ్చింది. పాకిస్తాన్‌లోని ఏ లక్ష్యంపైనైనా దాడి చేయగల సామర్థ్యం తమకుందని భారత్ తెలియజేసింది. ఉగ్రవాదుల రహస్య స్థావరాలు, డ్రోన్ సెంటర్లు, చివరకు వైమానిక స్థావరాలను కూడా. అదే సమయంలో భారత్‌లోని ఏ సురక్షిత ప్రాంతంలోకి పాకిస్తాన్ చొచ్చుకుపోలేకపోయింది. ఇది టై కాదు…భారత్ చాలా ముందుంది” అని స్పెన్సర్ తెలిపారు.
ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ రవి అగ్రవాల్ భారత్-పాకిస్తాన్ సంఘర్షణఫై సీఎన్ఎన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియాతో మాట్లాడారు.
ఈ సంఘర్షణ ఫలితం ఏంటి అని ఆయన్ను ప్రశ్నించినప్పుడు ”పాకిస్తాన్ ఆర్మీ రక్షణ రంగ బడ్జెట్‌ను పెంచాలని కోరుకుంటుంది. బలమైన పొరుగుదేశాన్ని అడ్డుకోగలమన్న విషయాన్ని నిరూపించాలని అది కోరుకుంటుంది. తన ప్రాముఖ్యాన్ని నిలబెట్టుకోవాలనుకుంటుంది” అని ఆయన బదులిచ్చారు.
”దేశాధికారం ప్రముఖ నాయకుని చేతిలో ఉండాలని ఆర్మీ అనుకోవడం లేదు. ఇది తమ ప్రయోజనాలకు కూడా చెందిందన్నది వారి అభిప్రాయం” అని రవి అగ్రవాల్ చెప్పారు.
ప్రతిసారీ భారత్ నిరసన వ్యక్తంచేస్తుంటుంది. కానీ ఈ సారీ గతంలోకన్నా ఎక్కువగా పాకిస్తాన్ భూభాగం లోపలికి చొచ్చుకుపోయింది. పాకిస్తాన్ అణ్వాయుధ దేశమైనప్పటికీ. భారత్ అంత ధైర్యం ఎందుకు చూపించిందనుకుంటున్నారు?
”ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కన్నా 11 రెట్లు పెద్దది. 1999లో ఐదు రెట్లు మాత్రమే పెద్దది. భారత్ ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండడానికి ఇది కారణం. సీమాంతర దాడులు పెరిగాయని, సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత్ భావించింది. అయితే సమస్యకు మూలం ఎక్కడుందంటే పాకిస్తాన్లో పెరుగుతున్న ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ నియంత్రించలేకపోతోంది. ఇప్పుడు ఈ పరిస్థితులను మార్చాలని భారత్ అనుకుంది” అని రవి అగ్రవాల్ సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కాల్పుల విరమణ వ్యూహాత్మక తప్పిదమా?
కాల్పుల విరమణను వ్యూహాత్మక తప్పిదంగా చూసే ప్రమాదముందని వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు బ్రహ్మ చెలానీ అభిప్రాయపడ్డారు.
”సైనిక సంఘర్షణలో పాకిస్తాన్ పై చేయి సాధించి ఉంటే, ఎలాంటి సందేహం లేకుండా తనకున్న అవకాశాలను ఉపయోగించుకుని, భారత్‌కు అవమానకరంగా అనిపించే ఫలితాన్ని కోరుకుని ఉండేది” అని బ్రహ్మ చెలానీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
”దీనికి భిన్నంగా సాయుధ బలగాలు పై చేయి సాధించినప్పటికీ భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. భారత్ దౌత్యపరమైన విధానాన్ని, సంయమనాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తున్నప్పటికీ, దీన్ని వ్యూహాత్మక తప్పిదంగా చూసే ప్రమాదం కూడా ఉంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సంఘర్షణ నుంచి రెండు దేశాలు పాఠాలు నేర్చుకుంటాయని, భవిష్యత్తులో మరిన్ని ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెడతాయని అమెరికన్ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్కు చెందిన జోషువా టి. వైట్ చెప్పారు.
”చైనాతో తన సాన్నిహిత్యాన్ని పాకిస్తాన్ రెట్టింపు చేసుకోవచ్చు. డ్రోన్ల కోసం తుర్కియేతో మరింత భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవచ్చు. మొదటిసారి పాకిస్తాన్ వాయుసేన గగనతల పోరాటంలో చాలా బాగా పనిచేసింది” అని ఆయన విశ్లేషించారు.
”అయితే జరిగిన నష్టాన్ని అంచనావేస్తే పాకిస్తాన్ గగన తల రక్షణ వ్యవస్థపై ఎంతమేరకు ఆధారపడొచ్చనే ప్రశ్నలు తలెత్తుతాయి. ”
”భారత్ అనేక సంక్షిష్టతలను ఎదుర్కొంటోంది. భారత గగనతల రక్షణ వ్యవస్థ బాగానే పనిచేసినట్టు కనిపిస్తోంది. వైమానిక, భూ ఉపరితల దాడుల ద్వారా ఒకేసారి పాకిస్తాన్‌ను చేరుకోగలమని భారత ఆర్మీ నిరూపించింది. అయితే నిరంతరం సాగే సంఘర్షణను తట్టుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, క్షిపణులు, ఇతర యుద్ధ సామాగ్రి అవసరమన్న ఆందోళన ఈ సంఘర్షణ కలిగిస్తుంది” అని జోషువా వైట్ అన్నారు.
”కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయీకరణ చేసే అవకాశాన్ని తాజా సంఘర్షణ పాకిస్తాన్‌కు కల్పించింది. ఇది పాకిస్తాన్ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యం. అదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలపై అంతర్జాతీయ దృష్టి మళ్లీ పడేలా చేయడంలో దౌత్యపరంగా భారత్ విజయం సాధించింది” అని కింగ్ కాలేజ్ లండన్ సీనియర్ లెక్చరర్ వాల్టర్ లైడ్విగ్ ఖతార్ మీడియా సంస్థ అల్ జజీరాతో చెప్పారు.
ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అంతర్జాతీయ వేదికలపై నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పాకిస్తాన్‌పై ఉందని లైడ్విగ్ విశ్లేషించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)