SOURCE :- BBC NEWS

 భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతలు, డ్రోన్ వార్

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ప్రపంచంలో తొలి డ్రోన్ యుద్ధం దక్షిణాసియాలోని ఇరుగుపొరుగు అణ్వాయుధ దేశాల మధ్య మొదలైంది.

జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలపై పాకిస్తాన్ గురువారం డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందని భారత్ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇస్లామాబాద్ తోసిపుచ్చింది.

కొన్ని గంటల వ్యవధిలో తాము భారత్‌కు చెందిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ ప్రకటనపై దిల్లీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దశాబ్దాల వైరంలో ప్రస్తుత దాడులు ప్రమాదకరమైన కొత్త దశను సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, రెండు దేశాలు సరిహద్దుల వెంబడి ఫిరంగుల దాడులతో పాటు మానవరహిత ఆయుధాలతో పరస్పర దాడులకు దిగుతున్నాయి.

వాషింగ్టన్‌తో పాటు ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఇప్పటికే ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. నిశ్శబ్ధంగా, సుదూర ప్రాంతాలపై దాడి చేయగల డ్రోన్లు భారత్ – పాకిస్తాన్ సంఘర్షణలో కొత్త అధ్యాయానికి తెరతీశాయి.

“డ్రోన్ యుగంలోకి మారుతున్న భారత్ – పాకిస్తాన్ సంఘర్షణలో ఉద్రిక్తతలను పెంచడమా, లేదా తగ్గించడమా అనేది ఈ కంటికి కనిపించని, మానవరహిత ఆయుధాలు నిర్ణయిస్తాయి. అందువల్ల, దక్షిణాసియా గగనతలంలో డ్రోన్ యుద్ధంలో నైపుణ్యం ఉన్నవారు యుద్ధంలో పాల్గొనడమే కాదు, అదెలా ఉండాలో కూడా నిర్ణయిస్తారు” అని యూఎస్ నావల్ వార్ కాలేజ్‌లో ప్రొఫెసర్ జహరా మాటిసెక్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

బుధవారం ఉదయం నుంచి భారత్ చేసిన వైమానిక దాడుల వల్ల పాకిస్తాన్, పాక్ పాలిత కశ్మీర్‌లో 36 మంది చనిపోగా, 57 మంది గాయపడినట్లు పాకిస్తాన్ చెబుతోంది.

మరోవైపు, పాకిస్తాన్ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం దాడికి ప్రతిస్పందనగానే తాము క్షిపణి దాడులు చేసినట్లు భారత్ చెబుతోంది. మరోవైపు, పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇస్లామాబాద్ అంటోంది.

కరాచీ, లాహోర్, రావల్పిండితోపాటు తమ దేశంలోని వివిధ నగరాల్లో గురువారం భారత్‌కు చెందిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. భారత్ ప్రయోగించిన ఇజ్రాయెలీ హరోప్ డ్రోన్లను టెక్నాలజీతో పాటు, ఆయుధ సంపత్తితో అడ్డుకున్నట్లు పాక్ తెలిపింది.

లాహోర్‌తో పాటు పాక్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్స్‌ను నాశనం చేసినట్లు భారత్ తెలిపింది. అయితే, దీనిని ఇస్లామాబాద్ తోసిపుచ్చింది.

 భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతలు, డ్రోన్ వార్

ఫొటో సోర్స్, Getty Images

లేజర్ ఆధారిత క్షిపణులు, బాంబులు, డ్రోన్లు, మానవ రహిత వాహనాలు ఆధునిక యుద్ధంలో కీలకంగా మారాయి. ఇవి మిలిటరీ ఆపరేషన్ల కచ్చితత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచుతాయి.

శత్రువుల ఎయిర్‌ ఢిఫెన్స్ సిస్టమ్స్‌ కళ్లుగప్పేందుకు లేదా ధ్వంసం చేసేందుకు డ్రోన్లను ఉపయోగించవచ్చు. ప్రత్యర్థి రాడార్లను రెచ్చగొట్టేందుకు ఇవి గగనతలంలోకి ప్రవేశించి, ఆ తర్వాత వాటిని వెంబడించే డ్రోన్లు, లేదా యాంటీ రేడియేషన్ క్షిపణుల వంటి వాటి ద్వారా అసలు లక్ష్యాలను ఎంచుకోవచ్చు.

“యుద్ధంలో యుక్రెయిన్, రష్యా ఇలాగే చేస్తున్నాయి. లక్ష్యాలను టార్గెట్ చేయడం, లేదంటే ప్రత్యర్థిని రెచ్చగొట్టడం వంటి రెండుపాత్రలు పోషిచడం డ్రోన్లను.. మానవ రహిత ఎయిర్‌క్రాఫ్ట్‌ల అవసరం లేకుండానే ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దెబ్బతీయడంలో కీలకంగా మార్చింది” అని ప్రొఫెసర్ మాటిసెక్ చెప్పారు.

భారత్ దగ్గరున్న డ్రోన్లు ఎక్కువగా ఇజ్రాయెల్ తయారు చేసిన ఐఏఐ సెర్చర్, హెరాన్ వంటి మానవ రహిత నిఘా వాహనాలతో పాటు,

మిసైల్స్ మాదిరిగా రెండుగా విడిపోయి కచ్చితత్వంతో లక్ష్యాలపై దాడి చేయగల హార్పి, హరోప్ డ్రోన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

హారోప్‌ డ్రోన్లు ప్రత్యేకమైనవి. దాడులు చేయడంలో కచ్చితత్వంతో ఇవి యుద్ధాన్ని కొత్తగా మార్చేస్తున్నాయి. ఇది ఆధునిక సంఘర్షణల్లో ఎగిరే ఆయుధాల ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.

శాంతియుత పరిస్థితుల్లోనూ, యుద్ధ సమయాల్లోనూ భారత్‌కు అత్యంత ఎత్తులో నిఘా నేత్రంగా హెరోన్ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఐఏఐ సెర్చర్ ఎంకే ఐఐ డ్రోన్ ఫ్రంట్‌లైన్ కార్యకలాపాల కోసం రూపొందించారు. ఇది 300 కిలోమీటర్ల దూరం, 7 వేల మీటర్ల ఎత్తు వరకు 18 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది.

భారత్ వద్ద దాడులకు వినియోగించదగిన డ్రోన్ల సంఖ్య ఓ మోస్తరుగా ఉందని అనేక మంది భావిస్తారు. అయితే, ఇటీవల 4 బిలియన్ డాలర్లతో అమెరికా నుంచి 31 ఎంక్యు-9బి ప్రిడేడర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకోవడం పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఈ డ్రోన్లు 40 వేల మీటర్ల ఎత్తులో 40 గంటల పాటు ఎగరగలవు.

భారత్ స్వార్మ్ డ్రోన్ వ్యూహాలను అభివృద్ధి చేస్తోంది. గగనతల రక్షణ కోసం పెద్ద సంఖ్యలో మానవ రహిత విమాన వాహనాలను మోహరించడం, ఎయిర్‌ డిఫెన్స్‌ను బలోపేతం చేయడం, దాడులు చేయడంలో శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.

పాకిస్తాన్ వద్ద విస్తృతమైన, వైవిధ్యమైన డ్రోన్ల శ్రేణి ఉంది. ఇందులో స్వదేశంలో తయారైన వాటితోపాటు దిగుమతి చేసుకున్నవి కూడా ఉన్నాయని లాహోర్‌కు చెందిన రక్షణరంగ నిపుణుడు ఇజాజ్ హైదర్ బీబీసీతో చెప్పారు.

“చైనా, తుర్కియేతో పాటు దేశీయంగా తయారైన డ్రోన్లు వెయ్యికి పైగా ఉండవచ్చని ఆయన అన్నారు. చైనాకు చెందిన సీహెచ్-4, తుర్కియేకు చెందిన బేరక్తార్, అకిన్సీ, పాకిస్తాన్ సొంతంగా తయారు చేసిన బుర్రాక్, షాపర్ డ్రోన్లు ఉన్నాయి. వీటికి తోడు దాడి సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఆయుధాలను పాకిస్తాన్ అభివృద్ధి చేస్తోంది.”

 భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతలు, డ్రోన్ వార్

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దశాబ్ధకాలంగా మానవ రహిత వాహనాలను తన కార్యకలాపాలకు అనుసంధానిస్తోందని హైదర్ చెప్పారు.

ముఖ్యంగా ‘లాయల్ వింగ్‌మ్యాన్’ డ్రోన్లను అభివృద్ధి చేయడం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. లాయల్ వింగ్ మ్యాన్ డ్రోన్లను పైలట్లు నడిపే ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కలిపి ప్రయోగించవచ్చని ఆయన అన్నారు.

“ఇజ్రాయెల్ అందిస్తున్న సాంకేతికత, హరోప్, హెరాన్ డ్రోన్ల సరఫరా భారత్‌కు కీలకం. మరోవైపు, పాకిస్తాన్ డ్రోన్ల కోసం తుర్కియే, చైనా మీద ఆధారపడడం రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఆయుధ పోటీకి నిదర్శనంగా ఉంది” అని ప్రొఫెసర్ మాటిసెక్ అన్నారు.

“యుద్ధ విమానాలు, భారీ మిసైళ్లకు బదులుగా డ్రోన్లను మోహరించడం చిన్నస్థాయి సైనిక చర్యకు నిదర్శనంగా భావించవచ్చు. ఫైటర్ జెట్ల కంటే డ్రోన్ల ఆయుధ సామర్థ్యం తక్కువ. ఒక విధంగా చెప్పాలంటే, ఇది పరిమిత చర్య. అయితే పూర్తి స్థాయి వైమానిక దాడులకు ఇది ఆరంభంగా అనుకోవాల్సి వస్తే, పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి” అని ఇండియన్ డిఫెన్స్ అనలిస్ట్ మనోజ్ జోషి బీబీసీకి చెప్పారు.

జమ్మూలో ఇటీవలి డ్రోన్ల దాడి “రెచ్చగొట్టే చర్యలకు వ్యూహాత్మక ప్రతిస్పందనగా కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో ఎదురుదాడి కాదు” అని ఇజాజ్ హైదర్ భావిస్తున్నారు.

“భారత్ మీద పాకిస్తాన్ నిజంగా పూర్తి స్థాయి ఎదురుదాడి చేస్తే అది అందరూ నిర్ఘాంతపోయేలా, విస్తుపోయేలా ఉంటుంది. అది ఇంకా సంపూర్ణంగా, అన్ని విధాలుగా, మానవ సహిత, మానవ రహితంగా విస్తృత స్థాయిలో లక్ష్యాలపై దాడులు చేస్తుంది. అలాంటి ఆపరేషన్‌ చేపడితో ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న టిట్ ఫర్ టాట్ తరహా దాడులను మించి ఉంటుంది” అని హైదర్ చెప్పారు.

 భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తతలు, డ్రోన్ వార్

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్ యుద్ధక్షేత్రాన్ని డ్రోన్లు మార్చేశాయి. అయితే, భారత్ – పాకిస్తాన్ సంఘర్షణలో వాటి పాత్ర పరిమితంగా ఉందని నిపుణులు అంటున్నారు.

”రెండు దేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణులను ప్రయోగించడానికి వైమానిక దళాలను ఉపయోగిస్తున్నాయి. మనం చూస్తున్న డ్రోన్ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. భారీ యుద్ధానికి ఇదొక ప్రారంభం కావచ్చు” అని జోషి చెప్పారు.

“ఇది ఉద్రిక్తతలను తగ్గించే దిశగా సంకేతం కావొచ్చు, లేదా పెంచేది కావొచ్చు. రెండింటికీ అవకాశం ఉంది. మనం ఇప్పుడు మలుపు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎటువైపు వెళతామనేది ఎవరికీ తెలియదు.”

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)