SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆనంద్ మణి త్రిపాఠి
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
9 మే 2025, 17:52 IST
అప్‌డేట్ అయ్యింది 2 గంటలు క్రితం
పాకిస్తాన్, పాక్ పాలిత కశ్మీర్‌లో భారత్ దాడుల తర్వాత, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈ ఉద్రిక్తతలపై ప్రపంచంలోని అనేక దేశాలు స్పందిస్తున్నాయి. వాటిలో చైనా కూడా ఒకటి.
పాకిస్తాన్, పాక్ పాలిత కశ్మీర్‌లో భారత వైమానిక దాడులు “విచారకరం” అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. తాజా పరిస్థితుల గురించి తాము ‘ఆందోళన’ చెందుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
“భారత్, పాకిస్తాన్ ఎప్పటికీ ఇరుగుపొరుగుదేశాలే. అలాగే, అవి చైనాకి కూడా పొరుగుదేశాలు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా చైనా దాన్ని వ్యతిరేకిస్తుంది” అని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
రెండు దేశాలు ‘సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు మరింత పెంచే చర్యలను నియంత్రించాలని’ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి విజ్ఞప్తి చేశారు.

పాకిస్తాన్‌లో అస్థిర పరిస్థితులను చైనా ఎప్పటికీ కోరుకోదని, అలాంటి పరిస్థితి ఏర్పడితే అక్కడి చైనా పెట్టుబడులు వృథా అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
2005-2024 మధ్య చైనా పాకిస్తాన్‌లో 68 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది.
దీంతో పాటు, చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడర్, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల్లో భాగంగా పాకిస్తాన్‌లో బీజింగ్ భారీ పెట్టుబడులు పెట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో, రోడ్డు మార్గం ద్వారా మధ్య ఆసియాను అనుసంధానించాలనుకునే తన కలల ప్రాజెక్టు ఆగిపోవాలని చైనా కోరుకోదు.
దీనితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు బెన్నెత్ యూనివర్సిటీలో చైనా వ్యవహారాల నిపుణుడు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తిలక్ ఝా చెప్పారు.
“ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే, అది చైనా ప్రాజెక్టుల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. తన ప్రయోజనాలకు హాని కలిగించేది ఏదీ జరక్కూడదని చైనా కోరుకుంటుంది” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా – పాక్ స్నేహం
1951 మే 21 నుంచి చైనా – పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి.
కొన్ని దశాబ్ధాలుగా రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం, దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా చైనా మీద పాకిస్తాన్ ఆధారపడటం ఇటీవలి సంవత్సరాల్లో బాగా పెరిగింది.
పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు అందిస్తున్నప్పటికీ, భారత్‌తో జరిగిన యుద్ధాల్లో ఎప్పుడూ ప్రత్యక్ష సహకారం అందించలేదు.
భారత్ పశ్చిమ దేశాలకు దగ్గరయ్యే కొద్దీ పాకిస్తాన్ చైనా వైపు మొగ్గింది.
రుణాలు తీసుకోవడం నుంచి ఎఫ్ఏటీఎఫ్( ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) కఠిన చర్యల నుంచి తప్పించుకోవడం వరకు చైనా పాకిస్తాన్‌కు అండగా నిలిచింది.
అదే సమయంలో, భారత్‌తో సంబంధాల విషయంలోనూ చైనా సమతుల్యతను పాటిస్తూ వచ్చింది.
“భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం లేదా యుద్ధం లాంటి పరిస్థితి ఉండాలని చైనా ఎన్నటికీ కోరుకోదు. యుద్ధం జరిగితే చైనా ప్రయోజనాలు దెబ్బతింటాయి. అది మధ్య ఆసియాలో తీవ్ర సంక్షోభానికి దారితీస్తుంది” అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చైనా స్టడీస్ ప్రొఫెసర్ ఆర్ వరప్రసాద్ చెప్పారు.
“ప్రస్తుతం చైనాకు అమెరికా సుంకాలు తలనొప్పిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో తన సంబంధాలు మెరుగ్గా ఉండాలని చైనా కోరుకుంటుంది” అని ఆయన చెప్పారు.
“చైనా తన సొంత ప్రయోజనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఎలాంటి వివాదంలో చిక్కుకోవడానికి ఇష్టపడదు. అందుకే బీజింగ్ నాయకత్వం ఏ యుద్ధంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా మద్దతివ్వడం లేదు” అని ప్రసాద్ చెప్పారు.
తిలక్ ఝా మాట్లాడుతూ, “ప్రస్తుతం భారత్ – పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న షింజాంగ్ ప్రావిన్స్ అభివృద్ధిని చైనా కోరుకుంటోంది. పాకిస్తాన్‌లో చైనా చేపట్టిన చైనా – పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ విజయవంతమైతేనే ఇది సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టుల్ని భారత్ ఇప్పటికే వ్యతిరేకిస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత మరింత పెరగాలని కోరుకోదు” అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా – పాకిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్యం
ప్రస్తుతం పాకిస్తాన్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. చైనా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటోంది.
చైనా కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం, చైనా – పాకిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2024లో 23.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది భారీ పెరుగుదల.
అదే సమయంలో, పాకిస్తాన్‌కు చైనా ఎగుమతులు 17 శాతం పెరిగి 20.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతులు 18.2 శాతం తగ్గి 2.8 బిలియన్లకు పడిపోయాయి.
2024లో పాకిస్తాన్‌కు చైనా ఎక్కువగా ఎలక్ట్రానిక్ మెషినరీ, పరికరాలను ఎగుమతి చేసింది. వీటి మార్కెట్ విలువ 5.6 బిలియన్ డాలర్లు.
ఇందులో, 35 శాతం సెమీకండక్టర్ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లతో సహా టెలిఫోన్ సెట్లు 27 శాతం ఉన్నాయి.
చైనా 2.4 బిలియన్ డాలర్ల విలువైన అణు రియాక్టర్లు, బాయిలర్లు, మెషినరీ, మెకానికల్ పరికరాలు పాకిస్తాన్‌కు ఎగుమతి చేసింది.
దీంతో పాటు, 1.3 బిలియన్ డాలర్ల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది.
“ఒక దేశంతో ఇంత భారీస్థాయిలో వాణిజ్యం చేస్తున్నప్పుడు, ఆ దేశంలో పరిస్థితులు తమ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండాలని కోరుకోవడం సహజం” అని తిలక్ ఝా చెప్పారు.
“పాకిస్తాన్‌లో చైనా ప్రాజెక్టులకు ఇప్పటికే అనేక రూపాల్లో ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రెండు దేశాల ఉద్రిక్తతలు చైనాకు ఎంత మాత్రం మంచిది కాదు” అని వరప్రసాద్ అన్నారు.
“చైనా పౌరులు ఇప్పటికే పాకిస్తాన్‌లో భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే పాకిస్తాన్‌లో చైనా చేపట్టిన ప్రాజెక్టులు ప్రమాదంలో పడతాయి” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ప్రయోజనాలు
అమెరికాకు దూరం జరిగిన తర్వాత, పాకిస్తాన్ చైనా వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది.
చైనా – పాకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండటంతో పాటు ఇస్లామాబాద్ భారీస్థాయిలో బీజింగ్ నుంచి ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది.
గత ఐదేళ్లలో పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న మొత్తం ఆయుధాల్లో 81 శాతం చైనా నుంచేనని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్(SIPRI) నివేదిక తెలిపింది.
గత ఐదేళ్లలో పాకిస్తాన్ సమకూర్చుకున్న ఐదు ఆయుధాల్లో నాలుగు చైనావే. చైనా పాకిస్తాన్‌కు పీఎల్-15 మిసైల్స్ ఇచ్చింది. ఎస్‌డీ- 10 పీఎల్-15 లాంటి క్షిపణులు చైనాకు చెందిన ఆధునిక బీవీఆర్ టెక్నాలజీతో తయారయ్యాయి.
చాలా దూరం నుంచి నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది.
పహల్గాం దాడి తర్వాత, చైనా వైఖరి గురించి పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త తస్నీం అస్లాంను బీబీసీ ప్రశ్నించింది.
చైనాకు పాకిస్తాన్ ద్వారా గల్ఫ్ దేశాలతో సంబంధాలు సులభమవుతాయని ఆయన అన్నారు.
“ఈ రీజియన్‌లో చైనా చాలా పెద్ద దేశం. దానికి భారత్, పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో శాంతియుత పరిస్థితులు ఉండటం చైనా ప్రయోజనాలకు అవసరం. తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడం చైనాకు అవసరం” అని తస్నీం అస్లాం చెప్పారు.
“రెండు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు చైనా అభివృద్ధికి సాయపడతాయి. లేకుంటే ప్రాజెక్టులు పూర్తయినా, భద్రతా సంక్షోభం, అస్థిరత ఇలాగే కొనసాగితే, చైనా చేపట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు ఎలా సాధ్యమవుతాయి? ప్రస్తుతం గ్వాదర్ పోర్ట్ పూర్తయింది. అయితే, శాంతి నెలకొనకపోతే చైనా దాని నుంచి ఆశించిన ప్రయోజనం పొందలేదు” అని ఝా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వివాదంలో చిక్కుకోవడం చైనాకు ఇష్టం లేదు
భారత్, పాకిస్తాన్, చైనా సంబంధాలు ఎలా ఉండవచ్చనే విషయాన్ని విశ్లేషిస్తూ, “రెండు దేశాలు సంయమనం పాటించాలని చైనా తరచూ విజ్ఞప్తి చేస్తోంది. రెండు దేశాల మధ్య తనంత తానుగా చైనా ఎలాంటి వివాదంలోనూ తలదూర్చదు” అని ఆర్ ప్రసాద్ చెప్పారు.
“చైనా ఇక్కడ కూడా అదే చేస్తోంది. చైనా ప్రస్తుతం అమెరికాతో ట్రేడ్ వార్‌లో చిక్కుకుంది కాబట్టి, భారతదేశంతో తగవు తెచ్చుకోవాలని అనుకోవడం లేదు” అని వరప్రసాద్ విశ్లేషించారు.
భారత్ కూడా చైనాకు పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే దిల్లీతోనూ బీజింగ్ బలమైన సంబంధాలు కోరుకుంటోంది.
“ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ తరహాలోనే భారత్ కూడా ఇతర దేశాల మద్దతు కోరుకుంటుంది, అయితే పాకిస్తాన్‌కు దౌత్యపరంగా చైనా మద్దతు ఇవ్వడం ద్వారా భారత్ దౌత్య ప్రభావాన్ని చైనా తగ్గిస్తోంది.
“ఈ మూడు దేశాలు ప్రత్యర్థులు మాత్రమే కాదు, ఇరుగుపొరుగు దేశాలు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో అస్థిరత చెలరేగితే అందరికీ నష్టం తప్పదు” అని తిలక్ ఝా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)