SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
మరికొద్దిరోజుల్లో, సోవియట్ కాలం నాటి ఇంటర్‌ప్లానెటరీ స్పేస్‌క్రాఫ్ట్ భాగం (గ్రహాంతర అంతరిక్ష నౌక ) ఒకటి అదుపుతప్పి భూమివైపు దూసుకురానుంది. దీని బరువు సుమారు అరటన్ను. ఈ అంతరిక్ష వ్యర్థం 1972లో ప్రయోగించిన కాస్మోస్ 482కు చెందిన ల్యాండింగ్ మాడ్యూల్ది.
శుక్రగ్రహంపై పరిశోధన కోసం దీనిని ప్రయోగించారు. కానీ, ఆ ప్రయోగం విఫలమైంది.
అయితే, భూ ఉపరితలంపై ఇదెప్పుడు పడుతుందో కచ్చితంగా తెలియదు. మే నెలలో, మొదటి పదిహేను రోజుల్లో ఇది భూమిపై పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇది నివాస ప్రాంతాలపై పడే ప్రమాదం ఉందని బీబీసీ న్యూస్ రష్యాతో ఖగోళ నిపుణుడొకరు చెప్పారు.
మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా, ఆగ్నేయ ఐరోపాలో ఇది భూమిపై పడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

1972 మార్చి 31న బైకోనర్ కాస్మోడ్రోమ్ నుంచి ఈ వీనస్ అంతరిక్ష నౌకను ప్రయోగించారు.
ఇది మరో అంతరిక్ష కేంద్రానికి బ్యాకప్ లాంటిది. ఈ రెండూ వెనెరా 8 ప్రోగ్రామ్‌లో భాగం.
గ్రహాంతర అన్వేషణలో విజయం సాధించే అవకాశాలను పెంపొందించేందుకు ఇలా ఒకేరకమైన నౌకలను ప్రయోగించారు.
మానవసహిత సొయూజ్ మిషన్లలో వాడిన ఒకే కుటుంబానికి చెందిన మోల్నియా-ఎం రాకెట్లనే ఈ ప్రయోగానికి కూడా వాడారు.
అయితే, అత్యంత ఎత్తయిన కక్ష్యలోకి భారీ అంతరిక్ష వాహనాలను ప్రయోగించేటప్పుడు కాస్మోస్ 482 రాకెట్లకు ఒక అదనపు దశ ఉంటుంది.
వెనెరా 8ను నాలుగు రోజుల ముందు ప్రయోగించారు. అది దాని గమ్యస్థానాన్ని చేరుకుని, గ్రహాంతర అన్వేషణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.
కానీ, దాని బ్యాకప్‌గా లాంచ్ చేసిన రాకెట్లో మాత్రం లోపాలు వచ్చి, భూకక్ష్య నుంచి బయటకు రాలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images / Nasa
ప్రమాదం
వీనస్ అంతరిక్ష నౌక తొలి మూడు దశలు నిర్దేశించిన ప్రకారమే కొనసాగాయి. భూమికి సమీపంలోని కక్ష్యలోకి హెడ్ యూనిట్‌ను తీసుకెళ్లాయి. ఆ తర్వాత ఇంటర్‌ప్లానెటరీ స్పేస్ స్టేషన్ దాని లక్ష్యాన్ని చేరుకోవాలి.
అయితే, దిశా నిర్దేశం చేసే బూస్టర్ బ్లాక్ పాడవడంతో ఆకాశంలో నిర్దేశిత స్థానంలో ఉండటంలో ఈ అంతరిక్ష కేంద్రం విఫలమైంది.
ఆ తర్వాత ‘కాస్మోస్ 482’ అనే కోడ్ నేమ్ ఈ అంతరిక్ష కేంద్రానికి పెట్టారు.
విఫలమైన అంతరిక్ష ప్రయోగాలను సోవియట్ యూనియన్ 1970ల్లో కాస్మోస్ పేరుతో పిలిచేది.

ఫొటో సోర్స్, Getty Images / Nasa
నాసా వెబ్సైట్ ప్రకారం.. ఈ క్రాఫ్ట్ నాలుగు భాగాలుగా విడిపోయింది. ఇందులో రెండు భూమికి దిగువ కక్ష్యలోనే ఉండిపోయి, 48 గంటల్లో వాతావరణంలో మండిపోయాయి.
మరో రెండు డీసెంట్ మాడ్యూల్, ప్రధాన ఇంజిన్‌తో ఉన్న బ్లాక్ ఎత్తైన దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి (ఎలిప్టికల్ ఆర్బిట్‌లోకి) ప్రవేశించాయి.
టైటానియం ఇంధన ట్యాంకులకు చెందిన మూలకాలు కొన్నిరోజుల్లో కక్ష్యను వదిలిపెట్టి, న్యూజీలాండ్‌లో పడిపోయినట్లు అంతరిక్ష ప్రయోగాలకు చెందిన ప్రముఖ టెలిగ్రామ్ చానల్ టెఖాస్కీ వెస్ట్నిక్ రచయిత జార్జీ త్రిష్కిన్ బీబీసీ న్యూస్ రష్యాతో అన్నారు.
”ఈ అంతరిక్ష కేంద్రానికి చెందిన వివిధ భాగాలు, బ్లాక్ ఎల్గా పిలిచే రాకెట్‌కు చెందిన నాలుగో దశ ఇప్పటికీ దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరుగుతున్నాయి” అని తెలిపారు.
డీసెంట్ మాడ్యూల్ బరువు 495 కేజీలు ఉంటుందని నాసా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images / NASA / Newsmakers
బలమైన మాడ్యుల్ ఇది
వాతావరణంలోనే విడిపోయి, కాలిపోయినప్పుడు లేదా భూమి నుంచే దాన్ని అంచనా వేసి, నియంత్రించినప్పుడు ఈ స్పేస్‌క్రాఫ్ట్ పడిపోవడం అంత పెద్ద సమస్య కాదు.
ఉదాహరణకు, అతిపెద్ద ఆర్బిటల్ స్టేషన్ మిర్‌ను కూడా నిర్వీర్యం చేసి, పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయేలా చేశారు.
మిర్ స్పేస్‌క్రాఫ్ట్ క్రాష్‌ను రష్యా చాలా సంస్థాగతంగా చేపట్టింది. దాని జీవితకాలం ముగియగానే, పసిఫిక్ మహా సముద్రంలో మిర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కూల్చేశారు.
కాస్మోస్ 482 పడిపోవడం అనియంత్రితంగా ఉండవచ్చు. ముఖ్యంగా ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. ఇది పూర్తిగా విచ్ఛిన్నమై వాతావరణంలోనే కాలిపోయే అవకాశం లేదు.
ఎందుకంటే, శుక్రుడి ఉపరితలంపై దిగేలా దీని ల్యాండింగ్ మాడ్యూల్‌ను రూపొందించారు. ఇది అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అత్యధిక ఉష్ణోగ్రతలతో రూపొందించారు.
భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఎదుర్కొనే దానికంటే అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా ఈ స్పేస్‌క్రాఫ్ట్ రూపొందింది.
”శుక్రుడి వాతావరణంలోకి ప్రవేశించేలా డీసెంట్ మాడ్యూల్‌ను రూపొందించారు. దీని హీట్ షీల్డ్, సీల్ చేసిన కంపార్ట్మెంట్ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగలవు” అని జార్జి అన్నారు.
ఎక్కడ పడే అవకాశం
త్రిష్కిన్ అంచనాల ప్రకారం.. దీని కక్ష్యా మార్గమే దీని శకలాలు భూమిపై ఎక్కడ పడే అవకాశం ఉందో తెలియజేస్తాయి. ఈజిప్ట్ , సిరియా, తుర్కియే, అజర్బైజాన్ వంటివి దీని మార్గంలో ఉన్నాయి. అంతేకాక, ఈ ప్రాంతాల్లో నివాస ప్రదేశాలకు కూడా ముప్పు ఉంది.
డివైజ్ పూర్తిగా మనుగడ సాగించి, భూమిపై గంటకు 242 కి.మీల వేగంతో ఇది క్రాష్ అయితే, ఇంపాక్ట్ ఎనర్జీ సుమారు 1.1-1 ఎంజేగా ఉండనుంది. ఇది కొన్ని వందల గ్రాముల డైనమైట్ పేలుడుకు సమానమని త్రిష్కిన్ అంటున్నారు.
కాస్మోస్ 484 మే 8 నుంచి 14 మధ్యలో భూమిపై పడిపోవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)