SOURCE :- BBC NEWS

వైవాహిక అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

(హెచ్చరిక: ఇందులో లైంగిక హింసకు సంబంధించిన విషయాలున్నాయి.)

ఓ సాయంత్రం కేట్ (అసలు పేరు కాదు), ఆమె భర్త మాట్లాడుకుంటున్నారు. ఆయన చెప్పబోతున్న విషయాన్ని ఆమె ఏ మాత్రం ఊహించలేకపోయారు.

”నేను నిన్ను అత్యాచారం చేస్తూ వచ్చాను. నిన్ను వివస్త్రగా మార్చి, చాలా సంవత్సరాల నుంచి ఫోటోలు తీస్తున్నాను” అని ఆమె భర్త అన్నారు.

కేట్‌కు మాటలు రాలేదు. షాక్‌లో ఉండిపోయారు. అలాగే కూర్చుండిపోయారు. ఆయనేం చెబుతున్నారో ఆమె అర్ధం చేసుకోలేకపోయారు.

”ఇది చాలా చిన్న విషయంలాగా చెప్పారు. రేపు మనం డిన్నర్‌లో ఐస్‌క్రీమ్ తిందాం అన్నంత ఈజీగా చెప్పారు’’ అన్నారామె.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

‘టీ’లో మత్తుమందు కలిపి

ఆమెను నాలుగుగోడల మధ్య బందీని చేసి, ఏళ్లపాటు వేధించారు ఆమె భర్త. తీవ్రమైన హింసకు పాల్పడ్డారు. ప్రిస్క్రిప్షన్‌లో మందులను ఇష్టానుసారం తనపై ప్రయోగించారు.

కొన్నిసార్లు కేట్‌కు మెలకువ వచ్చేటప్పటికీ, ఆమెతో సెక్స్ చేస్తుండేవారాయన. ఆమె నిద్రలో ఉండడం వల్ల ఆమె అంగీకారం లేకుండానే ఇది జరిగేది. ఇది అత్యాచారం.

తర్వాత దీనిపై పశ్చాత్తాపం వ్యక్తంచేసేవారు. తాను నిద్రలో ఉన్నానని, ఏం చేస్తున్నానో తనకే తెలియదని ఆమెకు నచ్చజెప్పేవారు. తనకు అనారోగ్యం ఉందని, ఏదో సమస్య ఉందని ఆమెతో చెప్పేవారు.

వైద్యనిపుణుల దగ్గరకు వెళ్లి సాయం తీసుకోవడంలో కేట్ ఆయనకు సహకరించారు.

కానీ, రాత్రివేళ ఆమె తాగే టీలో నిద్రమాత్రలు కలిపేవారన్న విషయం అప్పటికి ఆమెకు తెలియదు. అవి తాగి నిద్రపోతున్నప్పుడు ఆయన అత్యాచారం చేసేవారు.

‘‘నేను నీపై చేసిన అత్యాచారాల గురించి నీకు చెబితే, నువ్వు పోలీసుకు ఫిర్యాదు చేస్తే, నా జీవితం అంతటితో అయిపోతుందని నేను భయపడ్డా ’’ అని నిజం ఒప్పుకుంటూ కేట్ భర్త ఆమెతో చెప్పారు.

తన భర్తే తనపై ఇంతటి ఘాతుకాలకు పాల్పడ్డారన్న విషయాన్ని కేట్ నమ్మలేకపోయారు.

భర్త చేసిన అఘాయిత్యాలకు కొన్ని నెలల్లోనే ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.

చాలా బరువు తగ్గానని, ప్యానిక్ ఎటాక్స్ వచ్చేవని కేట్ వెల్లడించారు.

ఆమెకు ఈ నిజాలన్నీ తెలిసిన దాదాపు ఏడాది తర్వాత ప్యానిక్ ఎటాక్ వచ్చింది. ఆ సమయంలో తనకు జరిగిన ఘటనలన్నీ ఆమె తన సోదరికి చెప్పారు. ఆ విషయాలను ఆమె తల్లికి చెప్పడంతో, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేట్ భర్తను అరెస్టు చేసి విచారణ జరిపారు.

నాలుగు రోజుల తర్వాత డేవన్, కార్న్‌వాల్ పోలీసులను సంప్రదించిన కేట్ ఈ కేసును ఇంతటితో ముగించాలని కోరారు.

‘‘నేను దీనికి సిద్ధంగా లేను. నాకే కాదు, నా పిల్లలకు కూడా బాధగా ఉంది. వాళ్ల నాన్న ఇంకెప్పుడూ ఇలా చేయరు’’ అని వారితో అన్నారు.

ఇక మీదట భర్తతో కలిసి ఉండకూడదని కేట్ అనుకున్నారు. ఆయన కూడా ఇంటి నుంచి వెళ్లిపోయారు.

లైంగిక వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

నేరం తీవ్రతను గుర్తించేలా చేసిన డిటెక్టివ్

ఆరు నెలల తర్వాత కేట్ మళ్లీ పోలీసుల దగ్గరకు వెళ్లారు. డిటెక్టివ్ కాన్ మైక్ స్మిత్ నేతృత్వంలో విచారణ మొదలయింది.

తాను ఒక తీవ్రమైన నేరం నుంచి తప్పించుకున్నానన్న విషయం అర్ధం చేసుకోవడంలో డిటెక్టివ్ సాయపడ్డారని కేట్ చెప్పారు.

”నా శక్తిని నేను తిరిగి పొందడంలో ఆయన నాకు సాయం చేశారు. నాకు నష్టం జరిగిందన్న విషయాన్ని మొదట నేను గుర్తించలేదు. అది అత్యాచారమని ఆయన నాకు వివరించి చెప్పారు” అని కేట్ తెలిపారు.

ఆమె మాజీ భర్త మెడికల్ రికార్డులు కీలకమైన ఆధారాలయ్యాయి. తాను చేసిన తప్పును కేట్ దగ్గర అంగీకరించిన తర్వాత ఆయన ప్రైవేటుగా ఒక సైకియాట్రిస్ట్‌‌ను కలిశారు.

భార్య నిద్రపోతున్నప్పుడు సెక్స్ చేసేందుకు వీలుగా ఆమెకు మత్తుమందు ఇచ్చినట్టు సైకియాట్రిస్ట్‌‌కు ఆయన చెప్పారు. తన నోట్స్‌లో సైకియాట్రిస్ట్‌‌ ఇది రికార్డు చేసుకున్నారు.

నార్కోటిక్స్‌ అనానిమస్‌లో కొందరికి, అలాగే తామిద్దరం వెళ్లే చర్చిలో స్నేహితులకు తన భర్త ఈ విషయాలు చెప్పారని కేట్ తెలిపారు.

కేసుకు సంబంధించిన ఫైళ్లను క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)కు సమర్పించారు. కానీ అభియోగాలు మోపకూడదని సీపీఎస్ నిర్ణయించింది.

ఇలా ఎందుకు జరిగిందో కేట్‌కు అర్ధం కాలేదు.

”నేరస్తుడే స్వయంగా అంగీకరించినా, దోషిని నిర్ధరించడానికి కావాల్సిన ఆధారాలు సరిపోవడంలేదంటే, ఇక ఏ ఆధారాలు లేనివారు ఇలాంటి కేసుల్లో ఏం చేయగలరు” అని కేట్ అన్నారు.

సీపీఎస్ నిర్ణయాలపై రివ్యూ కోరుతూ ఆమె అప్పీలు చేశారు. ఆమె మాజీ భర్తపై అభియోగాలు మోపుతామని ఆరు నెలల తర్వాత సీపీఎస్ తెలిపింది.

చార్జింగ్ ప్రాసిక్యూటర్ తీసుకున్న మొదటి నిర్ణయం తప్పని కూడా సీపీఎస్ అంగీకరించింది.

‘‘దీనివల్ల బాధితురాలికి కలిగిన బాధకు క్షమాపణలు తెలియజేస్తున్నాం’’ అని సీపీఎస్ ప్రతినిధి ఫైల్ ఆన్ ఫర్ ఇన్వెస్టిగేట్స్‌తో చెప్పారు.

ప్రొఫెసర్ హెస్టెర్

ఫొటో సోర్స్, University of Bristol School for Policy Studies

దోషికి 11 ఏళ్ల జైలు శిక్ష

కేట్ మాజీ భర్త ఆమెకు నిజం చెప్పిన ఐదేళ్ల తర్వాత, 2022లో ఈ కేసు కోర్టుకెళ్లింది.

కేట్‌కు సెక్సువల్ ఫాంటసీ ఉందని విచారణ సమయంలో ఆమె భర్త ఆరోపించారు. నిద్రలో కట్టేసి, మెలకువ వచ్చేటప్పటికి సెక్స్ చేస్తున్న పొజిషన్‌లో ఉండాలన్నది ఆమె ఫాంటసీ అని ఆరోణలు చేశారు.

ఆమెకు మత్తు మందు ఇచ్చినట్టు ఆయన అంగీకరించారు. ఆమె మేల్కొనకుండా ఉండడానికి అలా చేశానని, అత్యాచారం చేయడానికి కాదని ఆయన వాదించారు. కానీ కేట్ మాజీ భర్త చెప్పిన వాదనలను జ్యూరీ నమ్మలేదు.

”అవి పూర్తిగా అబద్ధాలని నాకనిపించింది. ఇది ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం. ఓ రకమైన లైంగిక చర్యపై ఆమెకు అమితాససక్తి ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు ఆయన ప్రయత్నించారు” అని డిటెక్టివ్ కాన్ స్మిత్ చెప్పారు.

వారం రోజుల విచారణ తర్వాత కేట్ మాజీ భర్తను అత్యాచారం, ఉద్దేశపూర్వకంగా మత్తు మందు ఇచ్చి లైంగిక హింసకు పాల్పడిన నేరాల్లో దోషిగా తేల్చారు.

‘‘ దోషి స్వార్థ పరుడు, తన అవసరాలకు అంతులేని ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఇంత చేసినా ఆయనలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు’’ అని శిక్ష విధిస్తూ.. జడ్జి వ్యాఖ్యానించారు.

కేట్ మాజీ భర్తకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

మంత్రి జెస్ ఫిలిప్స్

ఫొటో సోర్స్, PA Media

జీసెల్ పెలికో కేసుతో పోల్చిచూసిన కేట్

మూడేళ్ల తర్వాత కేట్ తన జీవితాన్ని పిల్లలతో కలిసి పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆమెకు పోస్ట్ ట్రమటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ), న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు తేలింది. ఆమె అనుభవించిన బాధ వల్ల ఇవన్నీ వచ్చాయి.

కేట్ తన కేసును జీసెల్ పెలికో కేసుతో పోల్చారు. ఫ్రెంచ్ మహిళ అయిన జీసెల్‌ను ఆమె మాజీ భర్త మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. పదుల సంఖ్యలో పరాయి పురుషులతో ఆమెపై అత్యాచారం చేయించారు.

”తనకు కావాల్సిన మద్దతు, సాయం అందుతుందని ఆశిస్తూ నేను ప్రార్థించడం నాకు గుర్తుంది” అని జీసెల్ గురించి చెబుతూ కేట్ అన్నారు.

మత్తుమందు

ఫొటో సోర్స్, Getty Images

కెమికల్ కంట్రోల్ అంటే ఏంటి?

”గృహ హింసకు పాల్పడే వారు ఇప్పుడు ”కెమికల్ కంట్రోల్” అనే పదం ఉపయోగిస్తున్నారు. మత్తు మందు ఇవ్వడాన్ని ఒక ఆయుధంగా వారు భావిస్తున్నారు. బహుశా ఇది మరింత పెరగొచ్చు” అని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ సెంటర్ ఫర్ జెండర్ వయొలెన్స్ రీసెర్చ్‌ ప్రొఫెసర్ మరియన్నె హెస్టెర్ హెచ్చరించారు.

” దీన్నిహింసకు పాల్పడేవారి సాధనంగా నేను భావిస్తాను. ఇంట్లో ప్రిస్కిప్షన్ ఔషధాలుంటే, ఏదో ఒక విధంగా హింసకు పాల్పడేలా దీన్ని ఉపయోగించడమేనా ?” అని ఆమె ప్రశ్నించారు.

పోలీసు రికార్డుల్లో వస్తున్న మార్పుల కారణంగా స్పైకింగ్ (ఇంజెక్షన్ల ద్వారా మత్తు మందులు ఇవ్వడం) వంటి నేరాలు తక్కువగా రికార్డులకెక్కుతున్నాయని ఇంగ్లండ్ అండ్ వేల్స్ డొమెస్టిక్ అబ్యూజ్ కమిషనర్ నికోల్ జాకోబ్స్ చెప్పారు.

”వచ్చే దశాబ్దంలో మహిళలు, బాలికలపై నేరాలను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనివ్వాలని మంత్రులు కోరుకుంటే పోలీసుల దగ్గరకు వచ్చిన గృహహింసకు సంబంధించిన నేరాలన్నింటినీ కచ్చితంగా లెక్కించాలి” అని ఆమె చెప్పారు.

”నేరస్థులను బాధ్యులుగా చేయడమే కాకుండా, వేధింపుల తర్వాత బాధితులు తిరిగి తమను తాము పునర్నిర్మించుకునేలా సాయం అందడానికి కూడా ఇది చాలా కీలకం” అని ఆమె అన్నారు.

నేరంలో మరో రూపంలో జరిగే స్పైకింగ్ ఘటనలను గుర్తించే పోలీసు సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తున్నట్టు హోమ్ ఆఫీసు తెలిపింది.

స్పైకింగ్‌తో పాటు, శరీరంలోకి హానికరమైన పదార్ధాలను చొప్పించడాన్ని యూకే వ్యాప్తంగా కొత్త నేరంగా గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు చర్చల్లో క్రైమ్, పోలీసింగ్ బిల్లు కింద వీటిని చేర్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. దీనివల్ల బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నారు.

యూకేలో స్పైకింగ్‌ ఇప్పటికే నేరం.

ఇంగ్లండ్, వేల్స్‌లో వర్తించే కొత్త చట్టం ప్రకారం నేరస్థులు పదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిఉంటుంది.

ఈ కేసులో కేట్‌కు న్యాయం లభించింది. ఆధారాలు సరిపోవంటూ ప్రాసిక్యూషన్ తేల్చినప్పుడు, కేట్ అంతటితో ఈ కేసును వదిలేస్తే ఆమె మాజీ భర్త జైలులో ఉండేవారు కాదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)