SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Merseyside Police
పీటర్ సల్లివాన్ 38 ఏళ్లు జైల్లో గడిపారు. దీన్ని బ్రిటిషు చరిత్రలో అతి పెద్ద న్యాయతప్పిదంగా భావిస్తున్నారు.
వాయువ్య ఇంగ్లండ్‌లో 1986లో 21 ఏళ్ల వెయిట్రెస్ డయాన్ సిండాల్పై ఉన్మాద లైంగికదాడి చేయడంతో పాటు ఆమెను హత్య చేశారు. ఈ కేసులో హంతకుడి కోసం ఆ కౌంటీలోనే అతి పెద్ద సెర్చ్ ఆపరేషన్ జరిగింది.
అయితే ప్రస్తుతం 68 ఏళ్ల వయసున్న సల్లివాన్, ఆయన న్యాయవాద బృందం, పోలీసులు అసలైన నేరస్తుడిని పట్టుకోలేకపోయారని చాలా కాలంగా వాదిస్తూ వచ్చారు.
ఎవరో చేసిన నేరానికి సల్లివాన్ను జైలులో పెట్టారు. ఆయనకు జీవిత ఖైదు విధించారు.
అయితే ఘటనాస్థలంలో లభించిన నిందితుడి వీర్యం నమూనాలపై డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా, అవి సల్లివాన్ డీఎన్ఏతో సరిపోలలేదు. దీంతోపాటు అసలైన నిందితుడు ఎవరో కూడా తెలియలేదు. దీంతో ఈ కేసును పునర్విచారణ జరిపేందుకు సీసీఆర్‌సీకి అప్పగించారు. సీసీఆర్సీ అంటే ది క్రిమినల్ కేసెస్ రివ్యూ కమిషన్. న్యాయతప్పిదం వల్ల బాధితులుగా మారిన వారి కేసులు మళ్లీ విచారిచేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

సల్లివాన్ జైలు నుంచే వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ‘నిన్ను విడుదల చేస్తున్నాం’ అని న్యాయమూర్తి చెప్పడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు .
“నాకు కోపంగా కానీ, బాధగా కానీ లేదు” అని సల్లివాన్ చెప్పినట్లు అతని న్యాయవాది అన్నారు.
“నా విషయంలో చాలా దారుణం జరిగింది. అయితే అది ఒక మనిషిని క్రూరంగా, భయంకరంగా చంపేశారనే నిజంలోని తీవ్రతను తగ్గించలేదనేది వాస్తవం” అని ఆయన చెప్పారు.
విచారణ తర్వాత సల్లివాన్ సోదరి కిమ్ స్మిత్ మాట్లాడుతూ “ఇందులో ఎవరూ విజయం సాధించలేదు” అన్నారు. సిండాల్ కుటుంబానికి తన సంఘీభావం తెలిపారు.
“వాళ్లు తమ కూతురుని పోగొట్టుకున్నారు. వాళ్లు ఆమెను తిరిగి పొందలేరు. మేం పీటర్ (సల్లివాన్) ను వెనక్కి తీసుకొచ్చాం.మేమిప్పుడు అతనికి జీవితాన్ని తిరిగి ఇవ్వాలి” అని ఆమె చెప్పారు.
“ఇలా జరగడం సిగ్గుచేటు” అని కిమ్ స్మిత్ చెప్పారు

ఫొటో సోర్స్, Distribution
సిండాల్ హత్య జరిగిన సమయంలో వీర్యం నమూనాల్ని విశ్లేషించే సాంకేతికత అందుబాటులో లేదని పోలీసులు, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వెల్లడించింది.
డీఎన్ఏ పరీక్షల ఫలితాలు సల్లివాన్ నేరం చేయలేదని చెబుతున్నాయని, ఈ కేసులో పునర్విచారణ కోరతామని సీపీఎస్ ప్రతినిధి డంకన్ అట్కిన్సన్ చెప్పారు.
సల్లివాన్ దోషి అని ఇచ్చిన తీర్పును లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో న్యాయమూర్తి తిమోతి హోల్రాడే, న్యాయమూర్తులు జేమ్స్ గాస్, సైమన్ బ్రయన్ కొట్టివేశారు. న్యాయప్రయోజనాల దృష్ట్యా డీఎన్ఏ సాక్ష్యాలను అనుమతించడం అవసరమని, ఈ విషయంలో తమకు ఎటువంటి సందేహం లేదని పేర్కొంటూ శిక్షను రద్దు చేశారు.
“ఈ ఆధారాన్ని బట్టి, పిటిషనర్ దోషి అని చెప్పడం అసాధ్యం” అని న్యాయమూర్తి చెప్పారు.

సిండాల్ హత్య జరిగిన రాత్రి ఏం జరిగింది?
1986 ఆగస్టు 1న రాత్రి 11.45 గంటల సమయంలో సిండాల్ తాను పని చేసే బార్ నుంచి కారులో ఇంటికి బయల్దేరారు.
ఇంటికి వెళ్లేటప్పుడు దారి మధ్యలో పెట్రోల్ అయిపోవడంతో ఆమె కారు ఆగిపోయింది. దీంతో ఆమె వాహనాల రద్దీ, వెలుతురు ఉన్న ఓ ప్రధాన వీధిలో నడుచుకుంటూ ఇంటికి బయల్దేరారు.
రాత్రి 12.10 గంటల సమయంలో అదే వీధఇలో ఒక పురుషుడు, మహిళతో గొడవ పడుతూ ఉండటాన్ని తాను చూసినట్లు టాక్సీ డ్రైవర్ ఒకరు బీబీసీతో చెప్పారు.
“అతను ఆమె దగ్గరకు వచ్చాడు. వాళ్లిద్దరు ఒకరికొకరు తెలిసినట్లుగా అనిపించింది. అయితే వాళ్లు గొడవ పడుతున్నారు” అని ఆయన చెప్పారు.
అర్థరాత్రి 12.30 నుంచి 2.00 గంటలమధ్య కేకలు వినిపించాయని, ఆమెతో గొడవ పడుతున్న వ్యక్తి ఆమెపై దాడి చేసి ఉండవచ్చని కథనాలు వచ్చాయి. ఆ తరువాత రోజు ఉదయం ఆమె శరీరం అర్థనగ్నంగా రోడ్డు పక్కన పడి ఉండటాన్ని అటుగా వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తి ఒకరు గుర్తించారు.
బీబీసీ పరిశీలించిన కోర్టు పత్రాల్లో ఆమె పుర్రె పగిలిపోయి, మొహం, వక్షోజాలపై గాయాలవడంతోపాటు జననావయవాలు చీలిపోయాయని ఉంది.
ఆమెపై దాడి జరిగిన కాసేపటి తర్వాత కూడా ఆమె బతికే ఉందని, అయితే తలపై పదే పదే గట్టిగా కొట్టడంతో మెదడులో రక్తస్రావం జరిగి చనిపోయి ఉండవచ్చని భావించారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని పక్కన పెడితే, ఆమెకు అయిన గాయాలు తాను చూసిన కేసుల్లోనే ‘అత్యంత దారుణమైనవని’ సిండాల్ మృతదేహాన్ని పరిశీలించిన పాథాలజిస్ట్ కోర్టుకు చెప్పారు.

హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ఏం చేశారు?
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 3వేల మందిని ప్రశ్నించారు.
సిండాల్పై దాడి జరిగిన తీరుతో బ్రిటన్ నిర్ఘాంతపోయింది. మహిళలు, బాలికల్లో భయం, అసహ్యం, ఆందోళన కలిగింది.
“అమ్మాయిలు వీధుల్లోకి వెళ్లాలంటేనే భయపడ్డారు” అని ఈ కేసును రిపోర్టింగ్ చేసిన మాజీ జర్నలిస్ట్ జాన్ థాంప్సన్ చెప్పారు.
“తామ వచ్చే వరకు ఇంట్లో నుంచి కానీ, ఆఫీసు నుంచి కానీ అడుగు బయట పెట్టవద్దని మహిళలను హెచ్చరించారు. తండ్రులు, బాయ్ ఫ్రెండ్స్, సోదరులు, భర్తలు మహిళలకు రక్షణగా వెళ్లారు” అని ఆయన చెప్పారు.
“అసలైన భయం ఏంటో అప్పుడు తెలిసింది. ఎందుకంటే సిండాల్ హత్య ప్రత్యేకమైనది. అది చాలా భయంకరమైనది” అని థాంప్సన్ అన్నారు.
సిండాల్ మీద దాడి తర్వాత “రీక్లెయిమ్ ది నైట్” ఉద్యమంలో మొదటి ప్రదర్శన జరిగింది. 1977లో యార్క్‌షైర్‌లో సీరియల్ కిల్లర్ పీటర్ సట్‌క్లిఫ్ మహిళలను వరుసగా హత్య చేస్తున్న సమయంలో రీక్లెయిమ్ ది నైట్ అనే ఉద్యమం మొదలైంది. ఈ హత్యలు జరిగిన సమయంలో మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.
“మేము ఎవరైనా సరే, వాహనాల్లో పెట్రోలు అయిపోయి, వాహనం ఆగిపోతే వీధుల్లో నడవాలంటే భయం పుట్టడం అనేది సాధారణ స్థితిగా మారిపోయింది” అని అత్యాచారం, లైంగిక దాడి బాధితులకు సాయం అందించేందుకు ఏర్పడిన ఆర్ఏఎస్ఏ మెర్సీసైడ్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన జోసిఫిన్ ఉడ్ గుర్తు చేసుకున్నారు. ఈ సంస్థను సిండాల్ హత్య తర్వాత ఏర్పాటు చేశారు.
ఒక దశలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న డిటెక్టివ్లు సంఘటన జరిగిన బిర్కెన్‌హెడ్ పట్టణంలో పురుషులందరినీ ప్రశ్నించారు.
అయితే వారికి కొన్ని వారాల పాటు కేసులో ఎలాంటి క్లూ దొరకలేదు. సిండాల్ కేసు దర్యాప్తుకున్న దారులన్నీ మూసుకుపోతున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఆమెపై జరిగిన అకృత్యాన్ని చూసిన సాక్షులెవరూ లేరు.

ఫొటో సోర్స్, PA
పీటర్ సల్లివాన్ జైలుకెందుకు వెళ్లారు?
సిండాల్ హత్య జరిగిన తర్వాత రోజు, హత్య జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న కొండపైన ఆమె దుస్తులను ఎవరో తగులబెట్టడం, అదే సమయంలో ఓ వ్యక్తి పొదల్లో నుంచి బయటకు రావడాన్ని తాము చూసినట్లు అటుగా వెళుతున్న ఓ జంట పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ జంట అతనిని పీటర్ అని చెప్పింది. అయితే తర్వాత అతన్ని మరి కొందరు అనుమానితులతో కలిపి వరుసలో నుంచోపెట్టినప్పుడు ఆ జంట గుర్తించలేకపోయింది.
ఆ మంట చూసిన మరి కొందరు పోలీసులను సంప్రదించారు. ఆ వ్యక్తి గురించి వాళ్లు ఇచ్చిన వివరణ ప్రకారం పోలీసులు సల్లివాన్ కోసం వెదకడం మొదలు పెట్టారు.
హత్య కేసులో ఆయన్ని సెప్టెంబర్ 23న పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆయన తన చర్యల గురించి ‘పొంతనలేని’ సమాధానాలు చెప్పారు. పోలీసుల విచారణ సమయంలో సల్లివాన్ ఏడుస్తూ తానే “హత్య చేసినట్లు అంగీకరించాడని” కోర్టు పత్రాల్లో ఉంది.
తర్వాతి రోజు సల్లివాన్ నేరాంగీకారాన్ని తిరస్కరించారు. కానీ కాసేపటి తర్వాత దాన్ని అంగీకరించారు.
తర్వాత, ఆయనకు ఎలాంటి న్యాయ సహాయం అందలేదు.
దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయనకు న్యాయ సహాయం నిరాకరించారు.
సెప్టెంబర్ 25న ఆయనకు న్యాయవాదిని కేటాయించారు. ఆ తర్వాత పీటర్ తన నేరాంగీరాన్ని తిరస్కరించారు. అది పోలీసుల కల్పితమని చెప్పారు.
1987లో జరిగిన కోర్టు విచారణలో ఆయన నేరాంగీకారంపై చర్చ జరిగింది. సిండాల్ శరీరం మీద ఉన్న పళ్ల గాట్లు, పీటర్ పళ్లతో సరిపోయాయని డెంటల్ నిపుణులు ధ్రువీకరించారు.
లివర్‌పూల్ క్రౌన్ కోర్టు సల్లివాన్‌కు జీవిత ఖైదు విధించినప్పుడు ఆయన బోనులో మౌనంగా నిల్చుని ఉన్నారు. ఆయన తల్లి పెద్దగా అరుస్తూ కోర్టులో కుప్పకూలిపోగా, సోదరి స్పృహ కోల్పోయారు.
కోర్టు శిక్ష ప్రకటించిన తర్వాత డిటెక్టివ్ కానిస్టేబుల్ టామ్ బాక్స్టర్ “సల్లివాన్ కోపిష్టి కాడు. అతను నిదానంగా, మౌనంగా ఉండేవాడు’’ఇలాంటి హత్యలు ఎలాంటి వ్యక్తులు చేస్తారు? అని ఆయన బీబీసీతో అన్నారు.
ఈ కేసు విచారణ జరిగిన సమయంలో స్థానిక పత్రికలు సల్లివాన్‌కు “ది బీస్ట్ ఆఫ్ బిర్కెన్‌హెడ్” (బిర్కెన్‌హెడ్ పశువు) “రిప్పర్ ఆఫ్ ది మెర్సే” (మెర్సే హంతకుడు) (మెర్సే నది బిర్కెన్‌హెడ్, లివర్‌పూల్ మధ్య ప్రవహిస్తూ ఉంటుంది) అని పేర్లు పెట్టాయి. పత్రికలు ఇచ్చిన ఇలాంటి పేర్లతో తనను గుర్తించడాన్ని సల్లివాన్ ఖండించారు.

ఫొటో సోర్స్, Julia Quenzler/BBC
38 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ
కొత్తగా లభించిన ఆధారంతో కేసును మళ్లీ తెరవడంతో, సల్లివాన్లో ఆశ పుట్టింది.
“బాధితురాలి గాయాలు ఆమెపై జరిగిన లైంగికదాడికి సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి” అని జడ్జీ హోల్రోయ్డే చెప్పారు. నిజమైన హంతకుడు ఆమెలో తన వీర్యాన్ని నిక్షిప్తం చేశాడు అనేది ‘బలమైన ఆధారం’ అని న్యాయమూర్తి చెప్పారు.
“ఈ హత్య కేసులో ఒకరి కంటే ఎక్కువ మంది పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారం లేదు. ఆమె శరీరంలో లభించిన వీర్యం పరస్పర అంగీకారంతో జరిగిన సెక్స్ వల్ల వచ్చింది కాదు” అని కోర్టు తెలిపింది.
38 ఏళ్ల, ఏడు నెలల 21 రోజుల తర్వాత పీటర్ సల్లివాన్ విడుదలయ్యారు. ఆయన అరెస్ట్ తర్వాత 14,113 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. లివర్‌పూల్ క్రౌన్ కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి ముందు ఏడాది పాటు రిమాండ్‌లో ఉన్నారు.
సిండాల్ పొత్తి కడుపు నుంచి వీర్యాన్ని బయటకు తీసి దాని డీఎన్ఏ విశ్లేషించే సాంకేతికత ఇటీవల అందుబాటులోకి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
సిండాల్ శరీరం నుంచి తీసిన వీర్యం శాంపిళ్లు ఆమె ప్రియుడి వీర్యంతోనూ సరిపోలేదు. వీర్యాన్ని మార్చే అవకాశం కూడా లేదని ఫోరెన్సిక్ అధికారి తెలిపారు.

ఫొటో సోర్స్, PA
సిండాల్ను ఎవరు హత్య చేశారు?
సిండాల్ను హత్య చేసిన నిజమైన హంతకుడిని ఇప్పటిదాకా కనిపెట్టలేకపోయారు. తాము జాతీయ డీఎన్ఏ డేటాబేస్‌లో చేసిన పరీక్షలలో దురదృష్టవశాత్తూ హంతకుడిని గుర్తించడానికి సరిపోయే డీఎన్ఏ ప్రొఫైల్స్ లభించలేదని పోలీసులు తెలిపారు.
కొత్తగా దర్యాప్తు ప్రారంభమైన తర్వాత 2023లో 260 మందికి పైగా పరీక్షలు నిర్వహించామని డిటెక్టివ్ కరేన్ జాండ్రిల్ చెప్పారు.
“నేషనల్ క్రైమ్ ఏజన్సీ నుంచి స్పెషలిస్టులు, ఎక్స్‌పర్ట్స్‌ను నియమించాం. వారి సాయంతో డిఎన్ఏ ప్రొఫైల్స్ గుర్తించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. సమగ్ర దర్యాప్తు జరుగుతోంది” అని జాండ్రిల్ చెప్పారు.
“ఆ డీఎన్ఏ సిండాల్ కుటుంబ సభ్యులది కాదనేది సుస్పష్టం. అప్పట్లో ఆమె ప్రియుడిది కూడా కాదు. హంతకుడిని పట్టుకునేందుకు ఇది కీలక ఆధారం” అని ఆయన అన్నారు.
“ఈ శిక్ష పీటర్ సల్లివాన్ జీవితం మీద అంతులేని ప్రభావం చూపించిందని మేము గుర్తించాం.” అని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ లీగల్ సర్వీసెస్ డైరెక్టర్ నిక్ ప్రైస్ చెప్పారు.
“ఆ సమయంలో మా వద్ద ఉన్న ఆధారాలను బట్టి నేరారోపణ చేశాం” అని ఆయన అన్నారు.
కొత్తగా డీఎన్ఏ రిపోర్ట్‌ను ఆధారంగా ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసు ముగిసిందని, దీని గురించి పై కోర్టులో అప్పీలు చేసేది లేదని ఆయన తెలిపారు.
తన కేసును సీసీఆర్సీతో మళ్లీ దర్యాప్తు చేయించాలని సల్లివన్ 2008లో కోర్టుని కోరారు. అయితే దర్యాప్తు సంస్థ డీఎన్ఏ ప్రొఫైల్‌ను సేకరించే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపింది.
తర్వాత 2019లోనూ ఆయన మళ్లీ కేసు పునర్విచారణకు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు. ఈసారి కూడా ఆయనకు తిరస్కరణ ఎదురైంది.
2021లో సల్లివాన్ మరోసారి సీసీఆర్‌సీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈసారి వీర్యాన్ని పరీక్షించే సాంకేతికత అందుబాటులోకి రావడంతో 1986లో భద్రపరిచిన వీర్యాన్ని పరీక్షకు పంపించారు.
గతంలో కనుక వీర్యాన్ని డీఎన్ఏ టెస్టుకు పంపించి ఉంటే ఎలాంటి ఫలితాలు రాకుండానే ఒక ఆధారాన్ని శాశ్వతంగా కోల్పోయి ఉండేవాళ్లమని జాసన్ పీటర్ నాయకత్వంలోని సల్లివాన్ తరపు న్యాయవాదుల బృందం తెలిపింది.
బిర్కెన్హెడ్లో నల్లటి గ్రానైట్‌తో నిర్మించిన సిండాల్ స్మారక చిహ్నం వద్ద ఇప్పటికీ తాజా పూలు ఉన్నాయి. ఇక్కడే ఆమెపై దాడి జరిగింది. అక్కడున్న నల్లటి గ్రానైట్ రాయి మీద ” ‘‘మహిళ అయినందుకు 2.8.1986న హత్యకు గురయ్యారు” అని రాసి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)