SOURCE :- BBC NEWS

నంబాల కేశవరావు, బసవరాజు, మావోయిస్ట్, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, UGC

“మా సోదరుడు నంబాల కేశవరావు మృతదేహాన్ని మాకు అప్పగించమని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆయన మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం” అని కేశవరావు సోదరుడు నంబాల ఢిల్లీశ్వరరావు బీబీసీతో చెప్పారు.

పోస్టుమార్టం అనంతరం నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిరాకరించారని, దీంతో తాము హైకోర్టుని ఆశ్రయించామని ఢిల్లీశ్వరరావు అన్నారు.

సీపీఐ – మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో, భద్రతా దళాల చేతుల్లో మరణించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మే 21న ప్రకటించారు.

నంబాల కేశవరావు మరణం దగ్గరి నుంచి మృతదేహం అప్పగించాలన్న హైకోర్టు తీర్పు వరకు.. ఈ మధ్యలో ఏం జరిగింది? నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆయన స్వగ్రామం జియ్యన్నపేటలో పరిస్థితి ఏంటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

హైకోర్టు ఏమంది?

నంబాల కేశవరావు, ‘అవామ్-ఇ-జంగ్’ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జ వెంకట నాగేశ్వరరావు మృతదేహాలను అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు మే 23న, శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. స్వగ్రామాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించుకుంటామని పేర్కొన్నారు.

కేశవరావు మృతదేహం కోసం ఆయన సోదరుడు ఢిల్లీశ్వరరావు, సజ్జ వెంకట నాగేశ్వరరావు తరఫున ఆయన సోదరుడు శ్రీనివాసరావు పిటిషన్ దాఖలు చేశారు.

“ఈ పిటిషన్‌‌పై హైకోర్టు మే 24న (శనివారం) విచారణ జరిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం జరిగినట్లు ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్ చెప్పారు. పోస్టుమార్టం పూర్తైనందున పిటిషనర్లు ఛత్తీస్‌గఢ్ అధికారులను సంప్రదించి.. మృతదేహాలను తీసుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది” అని ఢిల్లీశ్వరరావు బీబీసీతో చెప్పారు.

నంబాల కేశవరావు, బసవరాజు, మావోయిస్ట్, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, ఛత్తీస్‌గఢ్

‘అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు’

నంబాల కేశవరావు మృతి చెందినట్లు ప్రకటించడంతో, ఆయన మృతదేహం అప్పగించాలని కేశవరావు కుటుంబ సభ్యులు ఛత్తీస్‌గఢ్ పోలీసులను కోరారు. ఇందుకోసం కేశవరావు సోదరులైన నంబాల ఢిల్లీశ్వరరావు, నంబాల రామ్‌ప్రసాద్ తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ఢిల్లీశ్వరరావు బీబీసీతో మాట్లాడుతూ, ”మే 21 రాత్రి మా సోదరుడు నంబాల రామ్‌ప్రసాద్, మరికొందరు ప్రజాసంఘాల నేతలతో కలిసి ఎన్‌కౌంటర్ జరిగిన నారాయణపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఛత్తీస్‌గఢ్ పోలీసులు రామ్‌ప్రసాద్ బృందంతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. మృతదేహం అప్పగించాలని పోలీసులను కోరారు. కానీ, పోలీసులు సమాధానం చెప్పలేదు. చాలాగంటల తర్వాత ఇవ్వడం కుదరదని చెప్పారు.”

”ఈ విషయాన్ని రామ్‌ప్రసాద్ మాకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నారు. అయినా, అక్కడే ఉండి మృతదేహం ఇస్తే మా సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకుంటామని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు వివరించారు. అయినా, వారు వినలేదు. పైగా ఇక్కడ ఉండటం మంచిది కాదంటూ రామ్‌ప్రసాద్‌ను, తనతో పాటు వెళ్లిన వారిని అక్కడి నుంచి ఏపీ బోర్డర్‌కి పంపించేశారు” అని చెప్పారు.

నంబాల కేశవరావు, బసవరాజు, మావోయిస్ట్, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, ఛత్తీస్‌గఢ్

ఫొటో సోర్స్, Getty Images

‘మృతదేహం అప్పగింతకు పోలీసులు నిరాకరించారు’

“మృతదేహాన్ని మీకు అప్పగిస్తే.. దానిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. స్వగ్రామంలో ర్యాలీలు చేస్తారు. అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు కడతారు. ఏదైనా సందర్భం వస్తే అక్కడ నివాళులు అర్పించడం వంటివి చేస్తుంటారు. ఇదంతా మళ్లీ నక్సలిజం వైపు కొందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది. అందుకే మేం మృతదేహం ఇవ్వం” అని పోలీసులు ఛత్తీస్‌గఢ్ వెళ్లిన రామ్‌ప్రసాద్ బృందంతో అన్నారని నంబాల ఢిల్లీశ్వరరావు తెలిపారు.

దీంతో తాము హైకోర్టును ఆశ్రయించామని ఆయన అన్నారు.

”మృతదేహాన్ని అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మే 23న పిటిషన్‌ దాఖలు చేశాం. అందులో మా కుటుంబ సభ్యులు, ఇతరులతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు వెళ్లినప్పుడు పోలీసులు మృతదేహాన్ని ఇవ్వకుండా తిప్పి పంపించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కూడా సహకరించలేదు” అని పిటిషన్‌లో పేర్కొన్నట్లు చెప్పారు.

“నేను శ్రీకాకుళం జిల్లా ఎస్పీతో మాట్లాడా. ముందు మాట్లాడిన ఆయన, ఆ తర్వాత నుంచి స్పందించలేదు. మృతదేహాన్ని అప్పగిస్తే మా ఆచార, సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకుంటామని ఇటు ఏపీ, అటు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాం” అని ఢిల్లీశ్వరరావు చెప్పారు.

ఈ విషయమై శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు. పోలీసుల స్పందన వచ్చిన తర్వాత ఈ కథనంలో అప్డేట్ చేస్తాం.

మృతదేహాన్ని 24 గంటల్లో సివిల్‌ సర్జన్‌ పరిశీలనకు పంపించాలని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా కూడా పోలీసులు అవేవీ పట్టించుకోకపోగా, తమను బెదిరించే ప్రయత్నం చేశారని ఢిల్లీశ్వరరావు ఆరోపించారు.

నంబాల కేశవరావు మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాకు తీసుకుని వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని, వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు, సంఘాల నాయకులతో మాట్లాడి అంత్యక్రియల విషయమై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీశ్వరరావు చెప్పారు.

నంబాల కేశవరావు, బసవరాజు, మావోయిస్ట్, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, ఛత్తీస్‌గఢ్

సొంతూరు జియ్యన్నపేటలో ఇదీ పరిస్థితి

నంబాల కేశవరావు సొంతూరు శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట గ్రామం.

కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు కేంద్రం ప్రకటించిన తరువాత బీబీసీ ఆ గ్రామానికి వెళ్లింది. అక్కడ నంబాల కేశవరావుతో అనుబంధం ఉన్నవారు, చూసిన వారు, ఆయన గురించి తెలిసిన వారు పెద్దగా లేరు. ఒకరిద్దరు మాత్రం ఆయన గురించి విన్నామని బీబీసీతో చెప్పారు.

“అప్పుడప్పుడు పోలీసులు వచ్చి నంబాల కేశవరావు, ఆయన కుటుంబం కోసం అడిగేవారు. ఆయన కుటుంబానికి ఇక్కడ ఇల్లు ఉంది కానీ, ఎవరూ ఉండరు. అంతా విశాఖలోనే ఉంటారు. ఎప్పుడైనా పొలాలు చూసుకోడానికో, గ్రామంలో ఏవైనా కార్యక్రమాలుంటేనో వస్తారు, వెళ్తారు. అంతకుమించి మాకేమీ తెలియదు” అని జియ్యన్నపేటకు చెందిన నారాయణమ్మ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)