SOURCE :- BBC NEWS

పులి

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్‌లో పులుల సంఖ్య దశాబ్ద కాలంలోనే మూడింతలు అయ్యిందంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

”మాది చాలా చిన్న దేశం. కానీ 350కి పైగా పులులు ఉన్నాయి. పులుల సంఖ్య భారీగా పెరిగిపోయి, అవి మనుషులను తినేస్తుంటే చూస్తూ ఉండలేం” అని ఆయన వ్యాఖ్యానించారు.

కాప్29 సదస్సు నిర్దేశించిన లక్ష్యాల సాధనలో నేపాల్ సాధించిన పురోగతిని సమీక్షించేందుకు గత నెలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఇలా అన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం, నేపాల్‌లో 2019 నుంచి 2023 మధ్య కాలంలో పులుల దాడుల్లో 40 మంది చనిపోయారు, 15 మంది గాయపడ్డారు. అయితే, వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

”మా దేశానికి 150 పులులు చాలు” అని ప్రధాని కేపీ శర్మ అన్నారు. పులులను ఇతర దేశాలకు బహుమతిగా ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు.

వాట్సాప్ చానల్
పులులు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్ని పులులు ఉండాలి?

ఏ ప్రాంతంలో ఎన్ని పులులు ఉండాలనే ప్రశ్నకు ఒక్క ముక్కలో సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో వేట జంతువుల సాంద్రత, అంటే పులులు వేటాడి తినగలిగే జంతువుల (జింకలు, దుప్పులు, అడవి గేదెలు లాంటివి) సంఖ్య మీద అది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

సాధారణంగా ఒక్కో పులికి సుమారు 500 వేట జంతువులు ఉండే ప్రాంతం అవసరమని పులులపై అధ్యయనం చేస్తున్న ఉల్లాస్ కరాంత్ చెప్పారు.

తమ దేశంలో పులులు ఎక్కువయ్యాయంటూ నేపాల్ ప్రధాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. పులుల సంఖ్యపై కంగారుపడే బదులు పులుల వేటాడే జంతువుల రక్షిత ఆవాసాల పరిధిని విస్తరించేందుకు చర్యలు చేపడితే మంచిదని కరాంత్ సూచిస్తున్నారు.

వేట జంతువుల సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పులులు ఆహారం కోసం వెతుక్కుంటూ తమ పరిధిని దాటి వస్తుంటాయి. అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి.

పులులు

ఫొటో సోర్స్, Getty Images

సాధారణంగా అడవులకు, జనావాసాలకు మధ్య ‘బఫర్ జోన్లు’ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో అడవి జంతువులు ఎక్కువగా తిరుగుతుంటాయి. కానీ, చాలామంది ప్రజలు పశువుల మేత కోసం, కట్టెల కోసం తరచూ ఆ బఫర్ జోన్లలోకి వెళుతుంటారు. అలాంటి సందర్భాల్లోనే పులులు ఎక్కువగా దాడులు చేస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో వేర్వేరు అటవీ పార్కులు, రిజర్వ్ ఫారెస్టుల మధ్య జంతువులు రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లోనూ మనుషులపై వన్యమృగాలు దాడులు చేసే ప్రమాదం ఉంటుంది.

నేపాల్‌లో పులుల దాడుల్లో చనిపోతున్నవారి సంఖ్య పెరగడం, ఆ దేశ వన్యప్రాణుల సంరక్షణ విధానం పేలవంగా ఉందని చెప్పడానికి ఒక సంకేతమని జంతుశాస్త్ర నిపుణులు కరణ్ షా అంటున్నారు.

ఇప్పటి దాకా, పులుల సంఖ్య విషయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించడంపైనే నేపాల్ దృష్టి పెడుతూ జాతీయ పార్కులు, అభయారణ్యాల చుట్టూ ఉండే ప్రజలపై పడే ప్రభావం గురించి పట్టుకోలేదనిపిస్తోందని కరణ్ షా చెప్పారు.

స్థానిక ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించాలని, అప్పుడే వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములవుతారని కరణ్ చెప్పారు. పశువులపై పులులు దాడులు చేస్తుండటంతో స్థానికుల్లో భయాలు పెరుగుతున్నాయని అన్నారు.

“మా దేశ జనాభాలో ఇప్పటికీ అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారు అడవులపై ఆధారపడి బతుకుతున్నారు. కానీ వాళ్లు పులుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, కొందరు గాయపడుతున్నారు” అని ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఫారెస్ట్రీ యూజర్స్ నేపాల్ సంస్థ అధ్యక్షుడు ఠాకూర్ భండారీ చెప్పారు.

కేపీ శర్మ ఓలీ

ఫొటో సోర్స్, UML SECRETARIAT

విజయగాథ విషాదమవుతోందా?

శతాబ్దం కిందట, ఆసియాలో దాదాపు 1,00,000 పులులు ఉండేవి. కానీ అడవుల నరికివేత, అడ్డూ అదుపు లేని వేట కారణంగా అవి ప్రమాదంలో పడ్డాయి. భారత్, నేపాల్, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా, రష్యా సహా 13 దేశాల్లోని అడవుల్లో ఇప్పుడు 5,600 పులులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఈ దేశాలన్నీ 2022 నాటికి తమ భూభాగంలో పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే నేపాల్ లక్ష్యాన్ని అధిగమించడంలో మొదటి స్థానంలో నిలిచింది. పులుల వేటను అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలతో పాటు, దేశంలో అడవుల విస్తీర్ణాన్ని రెట్టింపు చేయడంతో ఇది సాధ్యమైంది.

దక్షిణ నేపాల్‌లోని 16 రక్షిత ప్రాంతాలను భారత సరిహద్దు వెంట ఉన్న ప్రాంతాలతో కలుపుతూ అటవీ కారిడార్‌లను ఏర్పాటు చేయడం కూడా అందుకు దోహదపడింది.

అయితే, ఇప్పటిదాకా ఇది నేపాల్ సాధించిన గొప్ప విజయమని అక్కడి పాలకులు అనుకున్నారు. కానీ, పెరుగుతున్న పులుల సంఖ్య మనుషులకు ముప్పుగా మారుతోందని ప్రధానమంత్రి ఓలి ఆందోళన వ్యక్తం చేశారు.

“జంతు ప్రదర్శనశాలలు, రెస్క్యూ కేంద్రాలు ఇప్పటికే సమస్యాత్మకమైన పులులతో నిండిపోయాయి” అని నేపాల్ వన్యప్రాణుల సంరక్షణ శాఖ 2023లో ఒక నివేదికలో తెలిపింది.

ఈ వన్యప్రాణుల సంరక్షణ, పర్యవేక్షణ, పునరావాసం వంటి విషయాల్లో తక్షణమే సమగ్ర విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పింది.

పులుల సంఖ్య..

ఫొటో సోర్స్, NTCA

పులులను విదేశాలకు బహుమతిగా ఇవ్వాలని ప్రధాని అన్నారు. డాక్టర్ కరాంత్ మాత్రం.. ‘‘పదేపదే మనుషుల ప్రాణాలు తీస్తున్న పులులను గుర్తించి వెంటనే చంపేయాలి’’ అని సూచిస్తున్నారు.

సహజసిద్ధమైన అడవుల్లో మనుషుల ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు, పోడు వ్యవసాయం, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం పేరుతో అడవులను ధ్వంసం చేయకుండా ఉంటే పులుల దాడులను తగ్గించొచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)