SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, I&PR Telangana
మిస్ వరల్డ్ పోటీల చుట్టూ వివాదం రాజుకుంది.
రామప్ప ఆలయాన్ని కొందరు పోటీదారులు సందర్శించిన సమయంలో స్థానిక మహిళలు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత మహిళా వలంటీర్లు పోటీదారుల కాళ్లపై నీళ్లు పోయడం, కొందరు తెల్లని వస్త్రాలతో తుడవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
”తెలంంగాణ మహిళలతో వేరొకరి కాళ్లు కడిగిస్తారా?” అంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను ప్రభుత్వం ఖండిస్తోంది.
మరోవైపు, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ఇప్పటికే మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.


ఫొటో సోర్స్, I&PR Telangana
రామప్ప ఆలయంలో ఏం జరిగింది?
మే 14న మిస్ వరల్డ్ పోటీదారులను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలకు తీసుకెళ్లింది. ఇందులో భాగంగా కొందరు సుందరీమణులు పోచంపల్లిని సందర్శించి, అక్కడి వస్త్ర నైపుణ్యాన్ని తిలకించారు.
మరికొందరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప గుడిని సందర్శించారు. పోటీదారులను రెండు బ్యాచులుగా చేసి.. కొందర్ని వరంగల్ వేయి స్తంభాల గుడికి, మరికొందర్ని రామప్ప ఆలయానికి తీసుకెళ్లారు. సుందరీమణులందరూ సంప్రదాయ చీరకట్టులో వెళ్లారు.
రామప్ప, వేయి స్తంభాల ఆలయాలకు వెళ్లిన సమయంలో నీళ్లతో కాళ్లు కడుక్కునేందుకు ఇత్తడి తాంబూల పళ్లెం, చెంబు వంటి ఏర్పాట్లు చేశారు. గైడ్ ఇస్తున్న సూచనలకు అనుగుణంగా మిస్ వరల్డ్ పోటీదారులు కాళ్లు కడుక్కుంటూ, ఫోన్లలో చిత్రీకరించుకున్నారు.
ఈ సమయంలో కొందరు పోటీదారులు చెంబులో నీళ్లతో ఏం చేయాలో తెలియక అటూ ఇటూ చూస్తూ కనిపించారు. ఇంకొందరు తోటి వారిని చూస్తూ కాళ్లు కడుక్కున్నారు.
అయితే, రామప్ప ఆలయం వద్ద స్థానిక మహిళా వలంటీర్లు కొందరు మిస్ వరల్డ్ పోటీదారుల పాదాలపై చెంబుతో నీళ్లు పోస్తూ కనిపించారు. తర్వాత కాళ్లు తుడుచుకునేందుకు అందరికీ నాప్కిన్స్ ఇవ్వగా.. ఒక వలంటీర్ మాత్రం ఓ పోటీదారు కాళ్లు తుడిచారు.
దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫొటో సోర్స్, Screengrab/I&PR Telangana
సోషల్ మీడియాలో విమర్శలు
మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లను ప్రభుత్వం కడిగించిందంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నాయకులు, పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించారంటూ వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మిస్ వరల్డ్ పోటీదారులు వాళ్ల కాళ్లు వాళ్లే కడుక్కుంటే కూడా ఇంత రాద్ధాంతం చేయడమేంటని మరికొందరు నెటిజన్లు ప్రశ్నించారు.
”తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం దుర్మార్గమైన, అవమానకరమైన, అత్యంత హీనమైన చర్య. యావత్ మహిళా లోకానికి ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి” అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ప్రభుత్వం ఏమంటోంది?
‘అతిథి దేవోభవ’ అనే సంప్రదాయాన్ని కొనసాగించామే తప్ప ఎవరి కాళ్లూ స్థానిక మహిళలు కడగలేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య బీబీసీతో చెప్పారు.
”మేమూ వరంగల్ ఆడబిడ్డలమే. ఇక్కడ ఎవరి ఆత్మాభిమానం ఎవరికీ తాకట్టు పెట్టలేదు. వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. మిస్ వరల్డ్ పోటీదారులు వారి కాళ్లు వారే కడుక్కున్నారు. ఆ తర్వాత కాళ్లు తుడుచుకునేందుకు నాప్కిన్స్ అందిస్తే, వారే తుడుచుకున్నారు” అని చెప్పారు కావ్య.

ఫొటో సోర్స్, Facebook/Danasari Seethakka
వీడియోలో స్పష్టంగా ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ నాయకులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు.
హెరిటేజ్ వాక్ విజయవంతం కావడంతోనే బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు.
”ఆలయంలోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడం సంప్రదాయం. 33 మంది ఒకేసారి కాళ్లు కడుక్కుంటే నీరంతా వృథాగా పోతుందని, అలా తాంబూల పళ్లెం, చెంబులో నీటిని ఏర్పాటు చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్‌కు చెందిన ఒకమ్మాయి నీళ్లు పోస్తే, దాన్ని ప్రభుత్వమే చేయించినట్లుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు” అని మంత్రి అన్నారు.

ఫొటో సోర్స్, I&PR Telangana
ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు
72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ వేదికగా జరుగుతున్నాయి. మే 7న ప్రారంభమైన ఈ పోటీలు మే 31 వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమాన్ని ప్రభుత్వం మే 10న గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించింది.
తెలంగాణ టూరిజం, హెరిటేజ్, సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ఫ్లై ఓవర్లు, కూడళ్లలో ప్రత్యేక లైటింగ్, మిస్ వరల్డ్ పోటీలను సూచించేలా లోగోలు ఏర్పాటు చేశారు.
పోటీదారులను మే 12న బుద్ధవనం సందర్శనకు తీసుకెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. మే 13న చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించారు. పోటీదారులు ఎక్కడికి వెళ్లినా, రెడ్ కార్పెట్ వేసి నడిపించడం, ట్రాఫిక్ నిలిపివేయడం, ఫుట్ పాత్‌లపై ఉండే చిన్నచిన్న దుకాణాలు మూసివేయించడంపై విమర్శలు వస్తున్నాయి.
వేయి స్తంభాల గుడికి వెళ్లినప్పుడు వరంగల్ పట్టణంలోని ఆ గుడి ఉన్న రోడ్డులో దుకాణాలు మూసివేయించారు. రామప్ప టెంపుల్, చార్మినార్ వద్ద కూడా కొన్ని దుకాణాలు మూసివేయించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే, సాధారణ దుకాణాలు తెరిచే ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మిస్ వరల్డ్ పోటీదారుల కోసం సాధారణ ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని ఎంపీ కడియం కావ్య తెలిపారు.
”సాధారణంగా వీఐపీ రాకపోకలు ఉన్నప్పుడు కాసేపు ట్రాఫిక్ నియంత్రిస్తారు. అంతే తప్ప సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఎక్కడా జరగలేదు. ఎవరి ఉపాధికీ ఇబ్బంది లేకుండా చూశాం” అని బీబీసీతో చెప్పారు కావ్య.
మరోవైపు, ట్రాఫిక్ నిలిపివేయడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్‌కు వెళ్లినప్పుడు, వరంగల్‌కు వెళ్లే దారిలోను, వరంగల్ పట్టణంలోను, రామప్ప టెంపుల్‌కు వెళ్లే సమయంలోను ట్రాఫిక్ నిలిపివేసి కాన్వాయ్‌ను అనుమతించారు.
”మిస్ వరల్డ్ పోటీలపై ప్రపంచం దృష్టి ఉంటుంది. భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అందుకే ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాం” అని హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు.
”మిస్ వరల్డ్ పోటీలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం ఉంది. అందుకే, ఏదైనా అనుకోని ఘటన జరగకుండా ముందు జాగ్రత్తగా రామప్ప టెంపుల్ రోడ్డులో కోతులు పట్టించాం, తేనె తుట్టెలు తొలగించాం” అని ములుగుకు చెందిన ఫారెస్ట్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, X/IPRTelangana
మొదటి నుంచీ వివాదాలు
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలపై ముందు నుంచీ వివాదాలు చెలరేగాయి. మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నేతలు నిరసన తెలిపారు.
మే 10న పోటీల ప్రారంభం రోజున మహిళా సంఘాల నేతలు గచ్చిబౌలి స్టేడియం వద్ద నిరసన తెలిపారు. ఇందులో పాల్గొన్న పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సహాయ కార్యదర్శి కేఎన్ ఆశాలత తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. మే 14న వేయి స్తంభాల గుడికి వెళ్లే మార్గంలో కూడా కొందరు మహిళా సంఘాల నేతలు నిరసన తెలిపారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో ఈవెంట్ సందర్భంగా కొందరు మహిళా సంఘాల నేతలను హౌస్ అరెస్టు చేశారు. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ సందర్భంగా రాంనగర్‌లోని మార్క్స్ భవనం, బాగ్ లింగంపల్లిలోని ఐద్వా కార్యాలయం, ఖైరతాబాద్‌లోని ఏఐఎంఎస్ కార్యాలయం వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేశారు.
ఒకవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందాల పోటీలకు ప్రాధాన్యం ఇస్తోందని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య విమర్శించారు. శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తుంటే హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆమె చెప్పారు.
”అందాల పోటీలు ఎందుకోసం నిర్వహిస్తున్నారు? వాటిని రద్దు చేయాలి” అని మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు .
కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంఘాలు, మహిళా సంఘాల అభ్యంతరాలను తోసిపుచ్చింది.
”మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచం ముందు తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతాయి. తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు పోటీలు ఉపయోగపడుతున్నాయి” అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
మిస్ వరల్డ్ పోటీల చుట్టూ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని తెలంగాణ టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు.
”ఇవి తెలంగాణ వైభవాన్ని చాటే పోటీలు. కొందరు ఈ తరహా వివాదాలు సృష్టిస్తున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)