SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Walking With Dinosaurs/BBC Studios
కెనడాలోని అల్బెర్టా పచ్చని అటవీ వాలు ప్రాంతాల్లో సామూహిక సమాధి దాగి ఉంది.
కేవలం ఒక్క రోజులోనే చనిపోయిన వేలాది డైనోసార్స్ ఇక్కడ సమాధి అయ్యాయి.
7.2 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనలో వేలాది డైనోసార్లు ఒకేసారి ఎలా చనిపోయాయి? అనే అంశాన్ని తెలుసుకునేందుకు మృత్యునది (రివర్ ఆఫ్ డెత్)గా పేరొందిన పైప్స్టీన్ క్రీక్‌కు శిలాజ జంతువులపై అధ్యయనాలు చేసే పెలియాంటాలజిస్టుల బృందం వెళ్లింది.
అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు వారు ప్రయత్నించారు.

మందపాటి రాతిపొరలతో ఉన్న దీన్ని పగులకొట్టాలంటే భారీస్థాయిలో సిబ్బంది అవసరమని ఇక్కడ తవ్వకాలకు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ ఎమిలీ బాంఫోర్త్ చెప్పారు. ఆ రాతి పొరలను ‘పలాలియో గోల్డ్’ అని అభివర్ణించారు.
దుమ్ము, ధూళి పొరలను తొలగించే అత్యంత సున్నితమైన పనిని ఆమె బృందం మొదలుపెట్టగానే, గుట్టలుగా ఉన్న శిలాజ ఎముకలు నెమ్మదిగా బయటకు వచ్చాయి.

ఫొటో సోర్స్, Kevin Church/BBC News
”అది వెలికితీసిన పెద్ద ఎముక, తుంటిలో ఒక భాగం” అని ప్రొఫెసర్ బాంఫోర్త్ చెప్పారు.
”ఇక్కడ మాకు పొడవైన, సన్నని ఎముకలే కనిపించాయి. ఇవన్నీ పక్కటెముకలు. ఇది మాత్రం కాలి బొటనవేలి ఎముకలోని భాగం. ఇక్కడే మరొకటి లభించింది. కానీ అదేమిటో మాకు తెలియదు. పైప్స్టోన్ క్రీక్ మిస్టరీకి ఇదొక గొప్ప ఉదాహరణ” అని వెల్లడించారు.
ప్రాచీన శ్మశానవాటికను, అక్కడ పురావస్తు ఆధారాలను పరిశోధకులు ఎలా సేకరిస్తున్నారో చూడటానికి పైప్స్టోన్ క్రీక్‌ను బీబీసీ సందర్శించింది.
ఈ ప్రదేశంలో సేకరించిన వేలాది శిలాజాలు కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయి.

ఫొటో సోర్స్, Kevin Church/BBC News
పాచీరైనోసార్స్ అని పిలిచే డైనోసార్‌కు చెందినవే ఈ ఎముకలన్నీ.
ఈ జంతువులు లేట్ క్రెటేషియస్ కాలంలో మనుగడ సాగించాయి. నాలుగు కాళ్లు, పెద్ద తలతో ఐదు మీటర్ల పొడవు ఉండే వీటి బరువు రెండు టన్నులు.
తవ్వకాలను మొదలుపెట్టిన బాంఫోర్త్ బృందం, ప్రతీ చదరపు మీటరు విస్తీర్ణంలో 300 వరకు ఎముకలు బయటపడవచ్చని అంచనా వేసింది.
బాంఫోర్త్ బృందం ప్రస్తుతం టెన్నిస్ కోర్టు పరిమాణంలో తవ్వకాలు జరుపగా, బయటపడిన ఎముకల గుట్ట కిలోమీటర్ దూరం మేర విస్తరించింది.
”ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఎముకల గుట్టల్లో ఇదొకటి అని మేం భావిస్తున్నాం” అని బీబీసీకి బాంఫోర్త్ చెప్పారు.
ప్రపంచంలో సగానికిపైగా ఉన్న డైనోసార్ జాతులన్నీ ఏక జాతిగానే పరిగణిస్తున్నారని, ఇక్కడే వేలాది పాచీరైనోసార్స్ ఉన్నాయని వెల్లడించారు.

ఫొటో సోర్స్, Kevin Church/BBC News
శీతకాలంలో దక్షిణానికి, వేసవిలో ఉత్తరం దిశగా వందలాది మైళ్లు మందలుగా డైనోసార్స్ సంచరించేవని అధ్యయనవేత్తలు భావిస్తున్నారు.
”ఒకే జాతికి చెందిన ఒక సమూహానికి చెందిన జంతువులకు సంబంధించి ఒకేచోట భారీ పరిమాణంలో నమూనాలు ఉన్నాయి. శిలాజాల చరిత్రలో ఇలా ఎప్పుడూ జరిగి ఉండదు” అని ప్రొఫెసర్ బాంఫోర్త్ చెప్పారు.

ఫొటో సోర్స్, Walking with Dinosaurs/BBC Studios
ఆధారాలు అందిస్తున్న పెద్ద జంతువులు…
ఆల్బెర్టా నైరుతి ప్రాంతం పాచీరైనోసార్స్కు మాత్రమే నివాస ప్రాంతం కాదు.
ఈ నేలపై భారీ డైనోసార్లు కూడా సంచరించాయి. ప్రాచీన పర్యావరణ వ్యవస్థను అవగాహన చేసుకోవడానికి వాటిపై అధ్యయనం అవసరం.
రెండు గంటలు ప్రయాణించి మేం డెడ్ఫాల్ హిల్స్ చేరుకున్నాం. దట్టమైన అడవిని, ఉధృతంగా ప్రవహించే నదిని దాటి, చదునైన రాళ్లపై నుంచి వెళ్లాం.
ఇక్కడ ప్రత్యేకంగా తవ్వకాలు అవసరం లేదు. తీరం పక్కనే పొడవైన ఎముకలు దొరుకుతున్నాయి. ప్రవహించే నీటితో రాళ్లు శుభ్రమవుతున్నాయి. కాసేపు ఎదురుచూస్తే చాలు వాటిని తీసుకోవచ్చు.
ఒక పెద్ద వెన్నెముకను త్వరగానే గుర్తించాం. బురదలో పక్కటెముకల ముక్కలు, పళ్లు చెల్లాచెదురుగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Kevin Church/BBC News
”ఎడ్మోన్టోసారస్ అని పిలిచే డైనోసార్లు ఇక్కడ మాకు ఎక్కువగా కనిపించాయి. ఇది పుర్రె ఎముక. దీన్ని బట్టి ఆ డైనోసార్ బహుశా 30 అడుగుల పొడవు ఉండొచ్చు” అని పెలియాంటాలజిస్ట్ జాక్సన్ స్వీడర్ చెప్పారు.
పాచీరినోసారస్ మాదిరిగానే అడవులలో సంచరించిన మరో శాకాహారి ఎడ్మోన్టోసారస్.
గ్రాండ్ ప్రయిరీకి సమీపంలోని ఫిలిఫ్ జే క్యూరీ డైనోసార్ మ్యూజియం కలెక్షన్ మేనేజర్ పేరు స్వీడర్.
ఈ రెండు రకాల డైనోసార్స్కు సంబంధించిన ఎముకలు తీసుకెళ్లి శుభ్రం చేయడం, విశ్లేషించడం వంటివి మ్యూజియంలోనే జరుగుతుంటాయి.
దాదాపు 1.5 మీటర్ల పొడవున్న పాచీరినోసారస్ పుర్రెపై ఆయన పనిచేస్తున్నారు. దీనికి ‘బిగ్ శామ్’ అని పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, Kevin Church/BBC News
ఫిలిఫ్ జే క్యూరీ డైనోసార్ మ్యూజియం సిబ్బంది కొన్నేళ్లుగా ఈ అద్భుతమైన ప్రాంతంలో పనిచేస్తున్నారు. 8000 వరకు డైనోసార్ ఎముకల్ని వీరు సేకరించారు. ఇందులో యుక్తవయసు నుంచి వృద్ధాప్యం వరకు పాచీరైనోసారస్కు సంబంధించిన ఎముకలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Walking with Dinosaurs/BBC Studios
ఈ మ్యూజియంలోనూ, ఇతర ప్రదేశాల్లోనూ ఎముకలపై అన్ని కోణాల్లో చేసే పరిశోధన పైప్స్టోన్ క్రీక్‌లో అనేక జంతువులు ఒకేసారి చనిపోవడానికి కారణమేమిటి? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
”ఇది కాలానుగుణంగా వలసపోయే మంద అని మేం భావిస్తున్నాం. అది ఏదో విపత్కరమైన సంఘటనలో చిక్కుకుంది. అందులో మొత్తం కాకపోయినా పెద్ద సంఖ్యలోనే తుడిచిపెట్టుకుపోయాయి” అని ప్రొఫెసర్ బాంఫోర్త్ చెప్పారు.
ఇప్పటిరకు ఉన్న అన్ని ఆధారాలను బట్టి చూస్తే ఆ విపత్కర సంఘటన ఆకస్మిక వరదలే అయి ఉండొచ్చు.
పర్వతాలపై నుంచి అప్రతిహతంగా భారీ నీటి ప్రవాహం జంతువుల సమూహంపైకి విరుచుకుపడి ఉండవచ్చు. వేళ్లతో సహా పెకిలించేసిన చెట్లు, కొట్టుకొచ్చిక బండరాళ్ల కింద పడి అవి చనిపోయి ఉండవచ్చు.
పాచీరినోసారస్కు తప్పించుకొనే అవకాశం కూడా లేకపోవచ్చని ప్రొఫెసర్ బాంఫోర్త్ అన్నారు.
”ఈ జంతువులు శరవేగంగా కదలలేవు. ఎందుకంటే భారీ సముదాయంలో ఉంటాయి. అధిక బరువు కూడా. ఈతలో కూడా అంత ప్రావీణ్యం లేదు” అని చెప్పారు.
అక్కడ లభించిన రాళ్లపై సుడుల్లాంటి ఆకారం కనిపిస్తుంది. అత్యంతవేగంతో ప్రవహించిన నీటి అలల వల్ల క్రమక్షయంతో అవి ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, Kevin Church/BBC News
”ఇక్కడకు మేం వచ్చిన ప్రతీసారి మాకు కచ్చితంగా ఎముకలు దొరుకుతాయి ఈ జీవరాశి గురించి ప్రతి సంవత్సరం మేం కొత్త విషయం కనిపెడుతూనే ఉన్నాం” అని ప్రొఫెసర్ బాంఫోర్త్ చెప్పారు.
కొత్త సిరీస్ ‘వాకింగ్ విత్ డైనోసార్స్’ మే 25వ తేదీ (బ్రిటిష్ కాలమానం ప్రకారం18:25 గంటల) నుంచి బీబీసీ ఒన్‌లో ప్రసారం మొదలవుతుంది. ఈ ఎపిసోడ్స్ అన్నీ బీబీసీ ఐప్లేయర్లోనూ అందుబాటులో ఉంటాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)