SOURCE :- BBC NEWS

మొసలి పుర్రె

ఫొటో సోర్స్, Delhi Customs/X

లగేజ్‌లో మొసలి పుర్రెను పెట్టుకుని విమానం ఎక్కడానికి వచ్చిన ఓ వ్యక్తిని దిల్లీ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశామని అధికారులు ప్రకటించారు.

గత సోమవారం కెనడా వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన 32 ఏళ్ల వ్యక్తిని సెక్యూరిటీ చెక్ దగ్గర మొదట ఆపారు.

”పదునైన పళ్లతో ఉన్న ఒక పుర్రె చెకింగ్‌ సందర్భంగా కనిపించింది. అది పిల్ల మొసలి దవడను పోలి ఉంది. దాని బరువు దాదాపు 777 గ్రాములు ఉంది. క్రీమ్ రంగులో ఉన్న వస్త్రంలో ఈ పుర్రెను చుట్టి పెట్టారు.” అని దిల్లీ కస్టమ్స్ గురువారంనాడు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

ఆ వ్యక్తిని అరెస్టు చేశామని, మొసలి పుర్రెను అటవీ, వన్యవప్రాణి సంరక్షణ విభాగానికి అప్పగించామని చెప్పింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

మొసలి పుర్రెతో థాయ్‌లాండ్ నుంచి భారత్ మీదగా కెనడాకు…

మొసలి పుర్రె వెంటబెట్టుకుని తిరగడం భారత పర్యావరణ పరిరక్షణ చట్టం, కస్టమ్స్ చట్టాల ప్రకారం అతిక్రమణ కిందకు వస్తుందని అధికారులు తెలిపారు.

అటవీ, వన్యప్రాణుల సంరక్షణ విభాగం ఈ పుర్రెపై పరిశీలన జరిపింది. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పరిరక్షించే జాతికి చెందిన మొసలి పుర్రెగా దాన్ని గుర్తించారు.

ఆ వ్యక్తి థాయ్‌లాండ్ నుంచి ఆ పుర్రెను తీసుకొచ్చినట్టు ఆరోపణలున్నాయని ఒక అటవీశాఖ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్‌పేపర్‌కు చెప్పారు.

వన్యప్రాణులను తీసుకెళ్లాల్సివచ్చినప్పుడు తప్పనిసరిగా కొన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే, ఆ వ్యక్తి అవేమీ లేకుండానే పుర్రెను వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని అటవీశాఖ అధికారి రాజేశ్ టాండన్ చెప్పారు.

తాను మొసలిని వేటాడడం, చంపడంలాంటివేమీ చేయలేదని ఆ వ్యక్తి అధికారులకు చెప్పినట్టు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.

మొసలి కచ్చితంగా ఏ ఉపజాతులకు చెందిందో తేలడానికి మరికొన్ని పరీక్షలు చేయనున్నారు.

ఆ వ్యక్తిపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు సాగుతోందని దిల్లీ కస్టమ్స్ తెలిపింది.

గత ఏడాది ఇలాగే గుర్తు తెలియని జంతువు కొమ్ములను తీసుకెళ్తున్న 32 ఏళ్ల కెనడా మహిళను దిల్లీ ఎయిర్‌పోర్టులో ఆపేశారు. ఉత్తర లద్దాఖ్‌ ప్రాంతంలో ట్రెక్కింగ్ సమయంలో అవి తనకు దొరికాయని, అందుకే వాటిని తనతో తీసుకెళ్లాలనుకున్నానని ఆమె తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)