SOURCE :- BBC NEWS

మొహమ్మద్ అసిఫ్ హఫీజ్… చూడటానికి గౌరవనీయుడైన వ్యక్తిగా కనిపించేవారు. ప్రతిష్ఠాత్మక లండన్ పోలో క్లబ్‌కు ప్రచారకర్తగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహించే వ్యక్తిగా, బ్రిటన్ ఉన్నతవర్గంతో పాటు రాజకుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు.
ఆయన యూకే, పశ్చిమాసియా దేశాల అధికారులకు అందించే సమాచారంతో కొన్నిసార్లు భారీ మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్టపడేది. ఇది తన ‘నైతిక బాధ్యత’ అని, నేర కార్యకలాపాలను అడ్డుకోవాలనే ఆలోచనే తననీ పనికి పురిగొల్పుతుంటుందని ఆయన చెబుతుండేవారు.
కానీ, ఇదంతా కేవలం ఆయన బయటి ప్రపంచానికి చూపించాలనుకున్న రూపం మాత్రమే. మాదక ద్రవ్యాలు అక్రమంగా సరఫరా చేసే నేరగాళ్లలో హఫీజ్ ఒకరని అమెరికా చెబుతోంది.
ప్రపంచంలో మాదకద్రవ్యాలను భారీ ఎత్తున అక్రమంగా సరఫరా చేసే నేరగాళ్లలో హఫీజ్ ఒకరు.
పాకిస్తాన్, ఇండియాలాంటి దేశాల్లోని తమ కేంద్రాల నుంచి హెరాయిన్, మెథాంఫెటమిన్, హాషీష్ లాంటి మాదకద్రవ్యాలను టన్నుల కొద్దీ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే భారీ మాదక ద్రవ్య సామ్రాజ్యాన్ని హఫీజ్ యూకేలోని తన ఇంటి నుంచే ఒక కీలుబొమ్మలా ఆడిస్తుంటారు.
ఆయన అధికారులకు అందించే సమాచారమంతా తన ప్రత్యర్థుల గురించినదే. దీని ద్వారా మార్కెట్‌లో ఉన్న ఇతర ముఠాలను తొలగించి, తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలన్నదే ఆయన అసలు ఉద్దేశం.
అథోజగత్తులో ఆయనకు ‘ది సుల్తాన్’ అనే బిరుదు ఉంది.
అయితే నేర ప్రపంచంలో ఈ విధమైన అధికారం, పేరు చిరస్థాయిగా నిలవవు. బ్రిటిషు, అమెరికా అధికారుల సంయుక్త ఆపరేషన్ ద్వారా 66 ఏళ్ల హఫీజ్‌ను యూకే నుంచి 2023లో అమెరికాకు అప్పగించారు.
తనపై వచ్చిన ఆరోపణలను కిందటి నవంబర్‌లో ఆయన అంగీకరించారు.
మిలియన్ల కొద్దీ హెరాయిన్ డోసుల సహా మాదకద్రవ్యాలను అమెరికాలో దిగుమతి చేసుకునేందుకు కుట్ర పన్నినందుకు ఆయనకు 16 ఏళ్ల జైలు శిక్ష పడింది.
2017 నుంచి కస్టడీలో ఉన్న ఆయన జైలు శిక్ష 2033లో ముగియనుంది.
హఫీజ్ కేసును బీబీసీ నిశితంగా పరిశీలించింది. కోర్టు పత్రాలు, కార్పొరేట్ లిస్టింగ్స్, హఫీజ్ గురించి తెలిసిన వారితో ఇంటర్వ్యూల ద్వారా సమాచారాన్ని సేకరించింది.
హఫీజ్ ఇంతకాలం చట్టానికి దొరకకుండా ఎలా తప్పించుకోగలిగారు, చివరకు ఆయన అసలు రంగు ఎలా బయటపడింది?


ఫొటో సోర్స్, Mark Greenwood
ఎవరీ హఫీజ్?
పాకిస్తాన్‌లోని లాహోర్‌లో హఫీజ్ ఓ మధ్యతరగతి కుటుంబంలో 1958లో పుట్టారు. మొత్తం ఆరుగురు సంతానంలో ఆయన ఒకరు. ఆయన బాల్యం బాగానే గడిచింది. హఫీజ్ తండ్రికి లాహోర్ సమీపంలో ఓ ఫ్యాక్టరీ ఉండేదని లాహోర్‌లో ఆయన కుటుంబం గురించి తెలిసినవారు చెప్పారు.
తదుపరి తాను కమర్షియల్ పైలట్‌గా శిక్షణ పొందానని హఫీజ్ అమెరికాలోని ఓ కోర్టుకు తెలిపారు .
సర్వానీ ఇంటర్‌నేషనల్ కంపెనీ పేరుతో 1990 నుంచి 2010 మధ్యన హఫీజ్ వ్యాపారాలు నిర్వహించారు. ఈ కంపెనీకి పాకిస్తాన్, యుఏఇ,యూకేలో అనుబంధ వ్యాపారాలు ఉండేవి.
ప్రపంచవ్యాప్తంగా సైన్యానికి, ప్రభుత్వాలకు, పోలీసులకు సాంకేతిక పరికరాలు, మాదక ద్రవ్యాలను గుర్తించే పరికాలను విక్రయిస్తామని ఆ కంపెనీ వెబ్‌సైట్ తెలిపింది. ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌ను మూసివేశారు.
సర్వానీ గ్రూపు వ్యాపారాల కింద వివిధ దేశాలలో ఓ టెక్స్‌టైల్ కంపెనీని కూడా నమోదు చేశారు. లాహోర్‌లో ప్రసిద్ధ నైట్‌బ్రిడ్జి బ్రాండ్ ఫ్రాంచైజీ అయిన ఇటాలియన్ రెస్టారెంట్, లండన్‌కు పశ్చిమాన విండర్స్ సమీపంలో టిప్మూర్ అనే కంపెనీ ఉన్నాయి. ఈ కంపెనీ పోలో, ‘గుర్రపుసవారీ సేవలను’ అందిస్తుంది.
ఈ వ్యాపారం ఆయనకు విలాసవంతమైన జీవితాన్ని తెచ్చిపెట్టడమే కాదు, యూకేలో పలుకుబడి, ప్రతిష్ఠ కలిగిన వర్గాలలోకి ప్రవేశం కల్పించింది. 2009 నుంచి 2011 వరకు కనీసం మూడేళ్లపాటు ఆయన ప్రతిష్ఠాత్మకమైన హామ్‌పోల్ క్లబ్‌కు అంతర్జాతీయ ప్రచారకర్తగానూ ఉన్నారు.
ఈ క్లబ్‌లో 2009లో ప్రిన్స్ విలియమ్‌తో హఫీజ్, హఫీజ్ భార్య షాహీనా సంభాషించడం, ప్రిన్స్ హారీని ఆలింగనం చేసుకోవడం వంటి ఫోటోలు కనిపించాయి.
హఫీజ్ ఎప్పుడూ క్లబ్ లో సభ్యుడిగా లేడని, క్లబ్ కు ఇకపై అంబాసిడర్లు లేరని, ప్రస్తుత బోర్డుకు ఆయనతో ఎలాంటి సంబంధాలు లేవని హామ్ పోలో క్లబ్ బీబీసీకి తెలిపింది. హఫీజ్, ఆయన భార్య యువరాజును కలిసినప్పుడు తీసిన ఫోటో”థర్డ్ పార్టీ వ్యవహారం” అని పేర్కొంది.
ఇక సర్వానీకి చెందిన అంతర్జాతీయ శాఖలు 2010లో వివిధ దశలలో మూసివేసినట్టు యూకే కంపెనీ హౌస్, ఇతర దేశాల్లోని కంపెనీ రిజస్ట్రీల ఆధారంగా స్పష్టమవుతోంది.

‘ఏదో జరుగుతోందనే అనుమానం’
యూఏఈలోని సర్వానీ కంపెనీలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఒకరు తాను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ”ఏదో జరుగుతోందనే అనుమానం” వచ్చినట్టు బీబీసీకి చెప్పారు.
ఎంత పెద్ద ప్రాజెక్టులకైనా ”కేవలం నగదులోనే చెల్లింపులు” చేసేవారని చెప్పారు.
ఆ కంపెనీ అనుమానంగా అనిపించడంతో ఉద్యోగం వదిలిపెట్టేసినట్టు ఆయన చెప్పారు. ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన పేరు బయటపెట్టొద్దని కోరారు.
”ఎటువంటి బ్యాంకు కార్యకలాపాలు ఉండవు, రికార్డులు ఉండవు.. ఆధారాలు ఉండవు” అని ఆయన బీబీసీకి చెప్పారు.
ప్రజల గురించి ఆందోళన కలిగిన వ్యక్తిలా నటిస్తూ హఫీజ్ యూఏఈ, యూకే అధికారులకు అప్పుడప్పుడు లేఖలు రాసేవారు. వాటిల్లో తన ప్రత్యర్థి నేరముఠాల సమాచారం ఇస్తుండేవారు.
ఈ ఉత్తరాలను బీబీసీ చూసింది. దీంతోపాటు ఇలాంటి సమాచారాన్ని అందించినందుకు, అతనిని అభినందిస్తూ దుబయిలోని బ్రిటిషు ఎంబసీ, యూకే హోమ్ ఆఫీస్ నుంచి అతను అందుకున్న లేఖలను కూడా చూసింది.
వ్యక్తిగత లేఖలపై తాము వ్యాఖ్యానించబోమని హోమ్ కార్యాలయం బీబీసీకి చెప్పింది. దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా ఫారిన్, కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీసు, దుబయ్ ప్రభుత్వాన్ని బీబీసీ సంప్రదిచింది. కానీ, వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
హఫీజ్ కుటుంబసభ్యులు 2018లో ఈ ఉత్తరాలను బీబీసీతో పంచుకున్నారు. ఆ సమయంలో తనను అమెరికాకు అప్పగించే విషయంపై హఫీజ్ సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నారు.
ఈ లేఖలను వారు యూకేలోని న్యాయస్థానాలకు, తదుపరి యురోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ఈసీహెచ్ఆర్)కు సమర్పించారు. హఫీజ్ ఇన్ఫార్మర్ అని, ఆయనకు రక్షణ అవసరమని కోరారు. అయితే ఇది మార్కెట్‌లో తన ప్రత్యర్థులు లేకుండా చేసేందుకు హఫీజ్ వేసిన ఎత్తుగడ అంటూ న్యాయస్థానాలు ఈ విన్నపాన్ని కొట్టివేశాయి.
”తన భారీ నేరసామ్రాజ్యానికి పోటీగా ఉండగలిగే వ్యక్తుల నేరాల గురించి అధికారులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి హఫీజ్” అని ఈసీహెచ్ఆర్ తేల్చింది.

హఫీజ్ పతనం మొదలైంది ఇలా
హఫీజ్ ఇటువంటి ఉత్తరాలు రాస్తున్న వేళే 2014లో ఆయన లేకుండా జరిగిన ఓ సమావేశం ఆయన పతనానికి దారితీసింది.
హఫీజ్‌కు చెందిన ఇద్దరు సన్నిహితులు కొలంబియాకు చెందిన ఓ పెద్ద కొనుగోలుదారుని కెన్యాలోని మోంబాసాలోని ఓ ఫ్లాట్‌లో కలిశారు. ఈ సందర్భంగా తాము సరఫరా చేసే హెరాయిన్ ఎంత స్వచ్ఛమైనదో చెప్పడానికి కొద్దిమొత్తం హెరాయిన్‌ను దహనం చేసి చూపారు. అలాగే వందశాతం నాణ్యమైన హెరాయిన్‌ను ఎంతమొత్తంలోనైనా సరఫరా చేయగలమని చెప్పారు.
ఇంతటి నాణ్యమైన హెరాయిన్ సరఫరా చేయగలిగే వ్యక్తి ‘దిసుల్తాన్’గా పేరుగాంచిన పాకిస్తానీ హఫీజ్ అని కొనుగోలుదారుకు చెప్పారు.
అయితే తాము మాట్లాడిన కొలంబియా కొనుగోలుదారు అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఇఏ)కు చెందిన అండర్‌కవర్ ఏజెంట్ అని కొద్ది సమయంలోనే హఫీజ్ సన్నిహితులు తెలుసుకున్నారు. ఈ సమావేశమంతా ఓ క్లిష్టమైన స్టింగ్ ఆపరేషన్‌లో భాగం. దానిని రహస్యంగా వీడియో తీశారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ బీబీసీ సంపాదించగలిగింది.
ఈ ఒప్పందాన్ని సమన్వయం చేసింది బక్తాష్, ఇబ్రహిం అక్షా సోదరులని, వీరిద్దరూ కెన్యాలో హింసాత్మకమైన మాదకద్రవ్యాల అక్రమవ్యాపారానికి నేతృత్వం వహించేవారని అమెరికా కోర్టు పత్రాలు చెబుతున్నాయి. వీరి తండ్రి కూడా మాదకద్రవ్యాల ప్రపంచంలో ఓ భయపెట్టేస్థాయి కలిగిన కీలక గూండానే.ఆయనను 2000లో అమెస్టర్‌డామ్ రెడ్‌లైట్ జిల్లాలో హత్య చేశారు.
ఈ ఒప్పందంలో భారతీయుడైన విజయగిరి ‘వికీ’ గోస్వామికూడా భాగస్వామిగా ఉన్నాడు. ఇతను అక్షా కార్యకలాపాలు చూసేవాడు.
అక్టోబర్ 2014లో కొనుగోలుదారు ఎవరో తెలియని స్థితిలో అక్షా సోదరులు, గోస్వామి, హఫీజ్ కలిసి నకిలీ కొలంబియా డ్రగ్ రవాణాదారులకు 99 కేజీల హెరాయిన్, 2కేజీల క్రిస్టల్ మెత్‌ను సరఫరా చేశారు. అంతేకాదు,ఈ డ్రగ్స్‌ను వందలకిలోలు సరఫరా చేయగలమని అక్షాలు హామీ ఇచ్చారు.
ఒక నెల తరువాత అక్షా సోదరులను, గోస్వామిని మోంబాసాలో అరెస్ట్ చేశారు. కొద్దికాలానికే వారు బెయిల్‌పై విడుదలయ్యారు. రెండేళ్లపాటు తమను అమెరికాకు అప్పగించకూడదంటూ న్యాయపోరాటం కొనసాగించారు.
ఇంతలో గోస్వామి, అక్షా సోదరుల అరెస్ట్ సమయంలో స్వాధీనం చేసుకున్న పరికరాలనుంచి సేకరించిన ఆధారాలతో హఫీజ్‌పై కేసు నమోదు చేయడానికి అమెరికా అధికారులు యూకే అధికారులతో కలిసి రహస్యంగా పనిచేశారు. ఆ పరికరాల్లో హఫీజ్ ”ముఖ్య సరఫరాదారు” అని చెప్పడానికి బోలెడు సందేశాలు కనిపించాయి. వీటి ఆధారంగానే హఫీజే ‘దిసుల్తాన్’ అనే గుర్తింపుతో ఉన్నాడని కనిపెట్టగలిగారు.
అమెరికాలో అభియోగాలను ఎదుర్కొంటున్నప్పటికీ గోస్వామి తన అక్రమ వ్యాపారాలను ఆపలేదు. కెన్యాలో బెయిల్‌పై ఉన్నప్పుడు 2015లో హఫీజ్‌తో కలిసి భారత్‌లోని సోలాపూర్‌లో ఉన్న ఓ రసాయన పరిశ్రమ నుంచి ఎఫిడ్రైన్ అనే డ్రగ్‌ను టన్నులకొద్దీ మొజాంబిక్‌కు సరఫరా చేయాలని పథకం వేశారు.
ఎఫిడ్రైన్ అనేది ఓ శక్తిమంతమైన ఔషధం. దాన్ని కొద్దిమొత్తంలో చట్టబద్ధంగా వాడే ఔషధమే అయినా, అదే పదార్థాన్ని మెటాంఫెటామైన్ తయారీకి కూడా వాడతారు. గోస్వామి, హఫీజ్ కలిసి మెజాంబిక్ రాజధాని మపుటులో ఓ మెత్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు. కానీ 2016లో పోలీసులు సోలాపూర్ కర్మాగారంపై దాడులు చేసి 18 టన్నుల ఎఫిడ్రైన్ స్వాధీనం చేసుకోవడంతో వారి పథకం విఫలమైంది.

అమెరికాకు అప్పగించొద్దంటూ..
ఎట్టకేలకు అక్షా సోదరులు, గోస్వామి 2017లో అమెరికాలో విచారణను ఎదుర్కోవడానికి విమానమెక్కారు.
ఎనిమిదినెలల తరువాత హఫీజ్‌ను లండన్‌లో ఆయన ఫ్లాట్‌లో అరెస్ట్ చేశారు. ఆగ్నేయ లండన్‌లోని భారీ భద్రత ఉండే బెల్మార్షా జైలులో ఆయనను నిర్బంధించారు. అక్కడి నుంచే ఆయన తనను అమెరికాకు అప్పగించకూడదంటూ ఆరేళ్లపాటు పోరాడారు.
అమెరికాలో 2019లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. గోస్వామి తన నేరాన్ని అంగీకరించి, తనకు తెలిసిన విషయాల్లో విచారణకు సహకరిస్తానంటూ న్యూయార్క్ కోర్టుకు చెప్పారు. అక్షా సోదరులు కూడా తమ నేరాన్ని ఒప్పుకున్నారు.
బక్తాష్ అక్షాకు పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అతని సోదరుడు ఇబ్రహీంకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
గోస్వామి జైలుశిక్ష ఖరారు కావాల్సి ఉంది. హఫీజ్ కేసు విచారణకు వచ్చి ఉంటే అతనికి వ్యతిరేకంగా గోస్వామి వాంగ్మూలం ఇచ్చి ఉండేవాడు.
మరోపక్క బెల్మార్ష జైలులో హఫీజ్‌కు ఎటువంటి ప్రత్యామ్నాయ అవకాశాలు లేకుండా పోయాయి.
అమెరికాకు తనను అప్పగించకుండా చూడాలంటూ లండన్‌లోని హైకోర్టు, ఈసీహెచ్ఆర్ న్యాయమూర్తులను ఒప్పించడంలో హఫీజ్ విఫలమయ్యారు.అధికారులకు సమాచారం ఇచ్చింది తానే కనుక, అది మనసులో పెట్టుకున్న తోటిఖైదీల నుంచి ముప్పు కలిగే అవకాశముందనే హఫీజ్ వాదనను న్యాయమూర్తులు తోసిపుచ్చారు.
అమెరికా జైలు తన పట్ల ‘అమానవీయంగా, అమానకరంగా” వ్యహరిస్తుందని కూడా హఫీజ్ వాదించారు. అలాగే టైప్2 డయాబెటిస్, ఆస్థ్మాలాంటి అన ఆరోగ్య సమస్యలను ఏకరువుపెట్టినా కోర్టులు వినలేదు. ప్రతిదశలోనూ హఫీజ్ చేసిన ఇలాంటి వాదనలన్నీ వీగిపోయాయి. ఆయనను మే 2023లో అమెరికాకు అప్పగించారు.
కిందటి నవంబర్‌లో హెరాయిన్, మెటాంఫెటామైన్, హాషీస్ తయారీ, పంపిణీకి, అమెరికాలో దిగుమతికి కుట్ర పన్నారనే రెండు కేసులలో హఫీజ్ తన నేరాన్ని అంగీకరించారు. దీంతో విచారణ లేకుండా శిక్ష ఖరారు చేశారు.
శిక్ష ఖరారుకు ముందు న్యాయవాది హఫీజ్ అత్యంత అదృష్టమైన జీవన పరిస్థితుల మధ్య నుంచి, అతను పథకం ప్రకారం ప్రజల జీవితాలను, సమాజాలను నాశనం చేసే మాదకద్రవ్యాల పంపిణీ ద్వారా లాభాలు సంపాదించాలని చూశాడని చెప్పారు.
”అనేకమంది మాదకద్రవ్యాల వ్యాపారులు అవసరాలు, పేదరికరం, విద్యావకాశాలు లేకపోవడం వల్ల ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఈ నిందితుడు మాత్రం అవకాశాలు, సౌఖ్యాలతో నిండిన జీవితం నుంచి ఇలాంటి మార్గం ఎంచుకున్నాడు”
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)