SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ANI
యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఎలా స్పందించాలనే విషయంపై సన్నద్ధత కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బుధవారం (మే 7న) మాక్ డ్రిల్స్‌ను చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పహల్గాంలో పర్యటకులపై జరిగిన దాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మాక్ డ్రిల్స్ ముఖ్యమని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్‌లో పౌర రక్షణ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు తెలియజేసేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.
ఈ డ్రిల్స్‌లో వైమానిక దాడులకు సంబంధించిన హెచ్చరికల సైరన్లు, దాడి జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలనే విషయంలో దేశ పౌరులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
హోం మంత్రిత్వ శాఖ సివిల్ డిఫెన్స్ రూల్స్- 1968లో సెక్షన్ 19 ప్రకారం ఈ డ్రిల్స్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మాక్ డ్రిల్స్‌లో ఏం చేస్తారు?
సాధారణంగా మాక్ డ్రిల్స్‌లో ఎంపిక చేసిన ప్రజలకు, వలంటీర్లకు ట్రైనింగ్ ఇస్తారు.
నగరం నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రతి చోట ఈ మాక్ డ్రిల్స్ చేపట్టాలని హోం మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.
మాక్ డ్రిల్స్‌లో భాగంగా చాలా కార్యక్రమాలను చేపడతారు.
ఈ సమయంలో ఇళ్లలో, సంస్థల్లో ఉన్న లైట్లను అన్నింటినీ కొంతసేపు ఆపివేయాలని ఆదేశాలు జారీ చేస్తారు.
అత్యవసర పరిస్థితుల్లో పౌర రక్షణ వ్యవస్థ ఎలా స్పందిస్తుంది?
ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి ప్రజలను సురక్షితంగా ఎలా తరలిస్తారనే దానిపైనా శిక్షణ ఉంటుంది.

ఫొటో సోర్స్, Screenshot
గతంలో ఇలాంటి మాక్ డ్రిల్స్ చేశారా?
1971 తరువాత ఇలాంటి మాక్ డ్రిల్స్‌ను చేపట్టడం ఇదే తొలిసారి.
1971లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం (బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం) సమయంలో మాక్ డ్రిల్స్ నిర్వహించారని.. మళ్లీ ఐదు దశాబ్దాల తర్వాత, మార్క్ డ్రిల్స్‌ను కేంద్రం చేపడుతోందని ‘టైమ్స్‌నౌ’ కథనం పేర్కొంది.
1962లో చైనాతో, 1965, 1971లో పాకిస్తాన్‌తో భారత్ పూర్తి స్థాయి యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఈ డ్రిల్స్‌ను చేసింది.
మాక్ డ్రిల్స్ సందర్భంగా అప్పుడు భారత్ సైరన్‌లు మోగించింది. ఆ సమయంలో ప్రజలు కొద్దిసేపు పాటు తమ ఇళ్లలోని లైట్లను ఆపివేశారని ‘ఫస్ట్ పోస్ట్’ తన కథనంలో పేర్కొంది.
అలాగే, తమ ఇళ్లలోని అద్దాలను కాగితంపై కవర్ చేశామని, ఒకవేళ బయట ఉంటే నేలపై పడుకుని, చెవులు మూసుకున్నట్లు కొందరు గుర్తు చేసుకున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ ఎక్కడ నిర్వహిస్తారు?
సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్‌లో మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం ఈ జాబితాలో ఉన్నాయి.
బుధవారం జరగబోయే మాక్ డ్రిల్స్ హైదరాబాద్, విశాఖపట్నంలో చేపట్టనున్నారు.
సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్‌ను మూడు కేటగిరీలుగా విభజించారు. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రాంతాలు కేటగిరీ- 2లో ఉన్నాయి.
దేశ రాజధాని దిల్లీ కేటగిరీ 1లో ఉంది.

ఫొటో సోర్స్, ANI
మాక్ డ్రిల్స్ ఎవరు నిర్వహిస్తారు?
పెద్ద ఎత్తున ప్రజలు, వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కేంద్ర హోం శాఖ తెలిపింది.
కోఆర్డినేషన్ కోసం జిల్లా అధికారులు ఈ డ్రిల్స్‌లో భాగమవుతారు.
గ్రౌండ్ ఆపరేషన్స్ కోసం హోమ్ గార్డులు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వలంటీర్లు పాల్గొంటారు.
ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీసు స్కీమ్), ఎన్‌ఐకేఎస్ (నెహ్రూ యువ కేంద్ర సంఘటన్) వలంటీర్లు, స్కూల్-కాలేజీ విద్యార్థులు కూడా ఈ డ్రిల్స్‌లో పాలుపంచుకుంటారు.
డ్రిల్స్ నిర్వహించిన తర్వాత, ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం తప్పనిసరిగా ‘యాక్షన్ టేకెన్ రిపోర్టు’ను ప్రభుత్వానికి సమర్పించాలి.
మాక్ డ్రిల్స్ సమయంలో గుర్తుంచుకోవాల్సినవి..
- భయపడకూడదు, స్థానిక అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలి.
- నీరు, వైద్య సరఫరాలు, ఫ్లాష్‌లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలి.
- ఊహాగానాలను, సోషల్ మీడియాలో వచ్చే ధ్రువీకరణ లేని వార్తలను పట్టించుకోకూడదు.
- కరెంట్ కానీ, ఇంటర్నెట్ కానీ ఆగిపోతే ఆందోళన చెందవద్దు
- అధికారిక అప్‌డేట్ల కోసం రేడియో లేదా ప్రభుత్వ ఛానళ్లను ఫాలో కావాలి.

ఫొటో సోర్స్, Getty Images
మాక్ డ్రిల్స్ ప్రధాన లక్ష్యాలేంటి?
- వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థలు సమర్థతను అంచనావేయడం
- భారత వైమానిక దళంతో అనుసంధానమై ఉన్న రేడియో/హాట్‌లైన్ లింక్స్ నిర్వహణను చూడటం
- కంట్రోల్ రూమ్‌లు, షాడో కంట్రోల్ రూమ్‌ల పనితీరును పరీక్షించడం
- శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడంపై పౌర రక్షణ వ్యవస్థలపై పౌరులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం
- క్రాష్ బ్లాక్ అవుట్ (యుద్ధాల సమయాల్లో నగరాల్లో ప్రజలు లైట్లను ఆపివేసే) చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు తెలియజేయడం. దీనివల్ల రాత్రిపూట వైమానిక దాడులు చేసేటప్పుడు, ప్రజలు ఉండే ప్రాంతాలను గుర్తించే ప్రమాదం తగ్గుతుంది. 1971లో ఈ విధానాన్ని భారత్ ఉపయోగించింది.
- సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయడం, వాటి స్పందన ఎలా ఉందో తెలుసుకోవడం. వార్డెన్ సర్వీసులు, ఫైర్‌ఫైటింగ్, రెస్క్యూ ఆపరేషన్స్, డిపో మేనేజ్‌మెంట్ ఈ పరిథిలోకి వస్తాయి.
- ప్రజలను తరలించే ప్రణాళికలు, వాటి అమలు సన్నద్ధతను అంచనావేయడం
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)