SOURCE :- BBC NEWS
ఇంతకుముందు క్యాన్సర్ అనగానే వయసు పైబడిన వాళ్లకే వస్తుందిలే అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిలోనూ క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తున్నామంటున్నారు డాక్టర్లు.
అదే కోవలోకి వస్తుంది బోవెల్ క్యాన్సర్ లేదా కొలన్ క్యాన్సర్. దీన్నే పేగు క్యాన్సర్ అని కూడా అంటారు.
సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లలో కనిపించే పేగు క్యాన్సర్ కేసులు ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ లాన్సెట్ విడుదల చేసిన తాజా నివేదిక చెబుతోంది.
కొలన్ క్యాన్సర్‌పై లాన్సెట్ సంస్థ తాజాగా 50 దేశాల్లో పరిశోధనలు జరిపింది. 27 దేశాల్లో 25 నుంచి 49 ఏళ్ల వయసు వారిలో పేగు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది.
కొలన్ క్యాన్సర్ కేసులు యువతలో ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో సంపన్న దేశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా ఈ నివేదిక చెబుతోంది.
ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, న్యూజీలాండ్, నార్వే, స్లొవేనియా, స్కాట్లాండ్, ఇజ్రాయెల్, కెనడా, ఫ్రాన్స్, అమెరికా, చిలీ, ఇంగ్లండ్, అర్జెంటీనా, పూర్టోరీకోలలో యువతలో కొలన్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని, అలాగే తక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్, యుగాండాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.
భారత్‌లో తక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ గత రెండు దశాబ్దాలతో పోలిస్తే క్రమంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్‌లో ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ అజయ్ చాణక్య చెప్పారు.
గ్లోబోకాన్, జాతీయ క్యాన్సర్ ప్రోగ్రామ్ రిపోర్టు ప్రకారం.. 2000-2010 మధ్య ఏడాదికి 30,000 నుంచి 40,000 వరకు కొత్త కేసులు నమోదయ్యాయి. 2010-2020 మధ్య ఈ సంఖ్య 50 వేల నుంచి 60 వేలకు పెరిగింది. 2020 నుంచి 2022 మధ్య అంటే కేవలం రెండేళ్లలోనే 70,038 కొత్త కేసులు నమోదయ్యాయి.
కొలన్ క్యాన్సర్ అంటే?
మన పొట్ట భాగంలో చిన్న, పెద్ద పేగులుంటాయి. పెద్ద పేగు మన జీర్ణ వ్యవస్థలో కీలకమైన భాగం. మనం రోజూ తినే ఆహారం జీర్ణమయ్యాక, మలినాలు పెద్ద పేగు నుంచే బయటకు వెళ్తాయి.
పెద్ద పేగులో రెండు భాగాలుంటాయి. మొదటి భాగాన్ని కొలన్, రెండో భాగాన్ని రెక్టమ్ అంటారు.
పెద్ద పేగు చివరి భాగాన్ని కొలన్ అంటారు. ఈ కొలన్ భాగంలో చిన్న చిన్న కణతులు లేదా గడ్డల్లాంటివి ఏర్పడతాయి. వాటినే వైద్య భాషలో పాలిప్స్ అంటారు.
ఈ పాలిప్స్ కేన్సరస్ పాలిప్స్‌గా మారడానికి సుమారు 10 ఏళ్లు పడుతుంది.
గుర్తించడం ఎలా?
సరైన అవగాహన ఉంటే దీన్ని ముందుగా గుర్తించడం సాధ్యమే అంటున్నారు వైద్యులు.
సరైన సమయంలో కొలనోస్కోపీ చేయించుకుంటే కొలన్ క్యాన్సర్‌ని తొలి దశలోనే గుర్తించడమే కాకుండా దానిని నివారించే అవకాశాలు 16 శాతం వరకు ఉన్నాయని లాన్సెట్ అధ్యయనం తెలిపింది.
40 ఏళ్లు దాటిన వ్యక్తులు కొలనోస్కోపీ చేయించుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. శరీరంలో ఏవైనా కణతులు ఏర్పడితే అవి ప్రమాదకరంగా మారేలోపే వాటిని తొలగించే అవకాశం ఉంటుంది.
కొలనోస్కోపీ అనేది ఓ స్క్రీనింగ్ ప్రక్రియ. దీని ద్వారా పెద్దపేగును పూర్తిగా పరీక్షిస్తారు.
ఇలా చేస్తే బయటపడొచ్చు
కొలన్ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించగలిగి, సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే బయట పడొచ్చని ఏలూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల వెంకటేష్ అంటున్నారు. ఆయన ఇంతకుముందు క్యాన్సర్ నుంచి కోలుకున్నారు.
వైద్యులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించడంతో పాటు మళ్లీ కొలన్ క్యాన్సర్ బారిన పడకుండా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని ఆయన చెప్పారు.
రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా నీళ్లు తీసుకోవడం మంచిదని వెంకటేష్ అంటున్నారు.
పైకి ధైర్యంగా కనిపించినా క్యాన్సర్ అనగానే చాలామందిలో ఎంతో కొంత బెరుకు, భయం ఉంటాయని, అయితే డాక్టర్ల కౌన్సెలింగ్ ఆ భయాల నుంచి బయటపడటానికి సాయపడుతుందని ఆయన చెబుతున్నారు.
వంశపారంపర్యంగా వస్తుందా?
పేగు క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించాలంటే ఫ్యామిలీ క్యాన్సర్ హిస్టరీని పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా రక్తసంబంధీకులు, బాగా దగ్గరి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కొలన్ క్యాన్సర్ బారిన పడ్డారా అనేది తెలుసుకోవాలి.
కుటుంబ చరిత్రలో పేగు క్యాన్సర్ ఉన్నంత మాత్రాన తర్వాత తరం వారికి కచ్చితంగా వస్తుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ 10 శాతం అవకాశం ఉండొచ్చని డాక్టర్ అజయ్ చాణక్య అన్నారు.
కడుపులో ఏదైనా సమస్యతో వైద్యులను సంప్రదిస్తే కుటుంబంలో ఎవరైనా పేగు క్యాన్సర్ బారిన పడ్డారా అనేది చర్చించాలని సూచిస్తున్నారు. ఇలా వ్యాధిని త్వరగా గుర్తించడమే కాకుండా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉందని తెలిస్తే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, కొవ్వు పదార్థాలను తగ్గించడం, రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అమెరికాలో కామన్‌గా కనిపించే క్యాన్సర్లలో మూడో స్థానంలో ఉంది పేగు క్యాన్సర్. అలాగే అక్కడి క్యాన్సర్ మరణాలకు రెండో ప్రధాన కారణం ఇది.
పేగు క్యాన్సర్‌కు కారణాలు
దీనికి కారణాలేంటనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం బోవెల్ క్యాన్సర్‌కి కారణాలు కావచ్చని డాక్టర్లు పరిగణిస్తున్నారు.
- సిగరెట్లు తాగడం
- ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం
- రెడ్ మీట్ అతిగా తీసుకోవడం
- ఊబకాయం
- విపరీతమైన చిరుతిండ్లు
- ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, జంక్ ఫుడ్ అతిగా తీసుకోవడం
- పేగులో క్యాన్సర్ పాలిప్స్ ఉండటం
- అనారోగ్యకరమైన జీవన విధానం
మహిళలతో పోలిస్తే పురుషులలోనే ఈ రకం క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో ఎక్కువగా కనిపించడానికి వారి జీవన విధానం కూడా ఓ కారణమని అంటున్నారు.
అయితే పేగు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం, క్యాన్సర్ స్క్రీనింగ్‌కు వెళ్లడం మంచిది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
పేగు క్యాన్సర్ ఉన్న వ్యక్తుల్లో కడుపులో ఎప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది.
- మలంలో రక్తం పడుతుంది, మలం నలుపురంగులో కనిపిస్తుంది.
- ఎక్కవసార్లు మలవిసర్జన చేయాల్సి రావచ్చు.
- మల విసర్జన తర్వాత కూడా పొట్ట భారంగానే ఉన్నట్టు అనిపిస్తుంది.
- విరేచనాలు లేదా మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.
- విరేచనంతో పాటు మ్యూకస్ అంటే జిగురు పడుతుంది.
- పొట్ట కింద భాగంలో నొప్పిగా, ఇబ్బందిగా ఉంటుంది.
- సరైన ఆహారం తీసుకున్నా బరువు తగ్గుతూ ఉంటారు.
- ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, దేనిపై ఏకాగ్రత లేకపోవడం.
రోజువారీ జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వలన మనం కొలన్ క్యాన్సర్ ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు.
పళ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాల్లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మన రోజువారీ ఆహారంలో ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి.
ఆల్కహాల్, సిగరెట్లకు వీలైనంత దూరంగా ఉండాలి.
రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిది.
మన శరీర బరువు ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి.
తిన్న ఆహారం పూర్తిగా అరిగేలా అవసరమైనంత నీరు తాగడంతో పాటు ప్రతిరోజు విరేచనానికి వెళ్లాలి. కొంతమంది బాగా ఇబ్బందిగా అనిపించే వరకు బాత్రూంకి వెళ్లరని దాని వలన మలబద్ధకం పెరిగి, ఇటువంటి సమస్యలకు దారితీసే ప్రమాదముందని అపోలో హాస్పిటల్ అంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ చాణక్య వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS