SOURCE :- BBC NEWS

అమెరికా, పెరు, లా బొంబా, గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రతలు, అమెజాన్ ఫారెస్ట్

ఫొటో సోర్స్, Riley Fortier

మరుగుతూ నదిలో ప్రవహిస్తున్న నీటి ఉష్ణోగ్రతలు ప్రతి రోజూ 86 డిగ్రీల సెల్సియస్‌కు చేరతాయి. ఇది ఈ నది చుట్టూ ఉన్న వర్షారణ్యం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తోంది.

మీరు పెరూలోని వర్షారణ్యంలో నాలుగు గంటల పాటు గతుకుల దారిలో ప్రయాణిస్తే, ఆ భూభాగంలో ఒక పర్వతం దాటిన తర్వాత మీకు పొగలు కక్కుతూ ప్రవహిస్తున్న ఒక నది కనిపిస్తుంది.

స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఆఫ్ లూసన్నేలో మొక్కలపై అధ్యయనం చేస్తున్న డాక్టర్ అలెస్సా కుల్‌బర్గ్ దీని గురించి వివరించారు.

అక్కడ సాసర్ ఆకారంలో ఉన్న చెట్ల మధ్య నుంచి నీటి ఆవిరి పైకి వెళుతూ ఉంటుంది. “ఇది చాలా అద్భుతంగా ఉంది” అని కుల్‌బర్గ్ చెప్పారు. తొలిసారి ఆయన తన కళ్లతో చూసిన దృశ్యాన్ని గుర్తు చేసుకున్నారు.

లా బొంబా నదిని స్థానికంగా షానే టింపిష్కా లేదా హిర్వింటే అని పిలుస్తారు. ఇది తూర్పు పెరూలో ప్రవహించే ఈ ఉపనది అమెజాన్‌ నదిలో కలుస్తుంది.

1930ల్లో శిలాజ ఇంధనం కోసం ఇక్కడి కొండల్లో చమురు కంపెనీలు తీవ్రంగా అన్వేషించాయి. అయితే లా బొంబా గురించిన రహస్యాలను పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే బయట పెడుతున్నారు.

భూగర్భంలో బాగా లోతున ఉన్న ఉష్ణ మూలాల వల్ల నది వేడెక్కుతోందని పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు.

కుల్‌బర్గ్ మొదటిసారిగా 2022లో అమెరికా, పెరూలకు చెందిన పరిశోధకులతో పాటు రైలీ ఫార్టియర్‌తో కలిసి ఈ నిగూఢమైన ప్రదేశాన్ని సందర్శించారు. రైలీ ఫార్టియర్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మయామీలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

వాళ్లు అడవిలో నడుస్తున్న సమయంలో పరిశోధకులు అక్కడి చెట్లలో అసాధారణమైన అంశాన్ని గుర్తించారు. “నది పొడవునా, నదికి ఆనుకుని స్పష్టంగా గుర్తించదగిన మార్పు ఉందని మాకు అర్థమైంది. ఆ అడవిలో పెద్ద చెట్లు ఎక్కువగా లేవు. అవి కూడా ఎండిపోయినట్లుగా ఉన్నాయి. ఆకులన్నీ ఎండిపోయి గలగలలాడుతూ ఉన్నాయి” అని ఫార్టియర్ చెప్పారు.

సమశీతోష్ణ వాతావరణం ఉన్న అమెజాన్‌లో కూడా అడవిలోని ఆ భాగం ఎంత వేడిగా ఉందో ఫోర్టియర్ గుర్తు చేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరుగుతూ ఉండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు అమెజాన్ అటవీ ప్రాంతాన్ని ఎలా మార్చేస్తాయో తెలుసుకోవడానికి ఆ ప్రాంతం ఒక ఉదాహరణలా ఉందని ఆయనతో పాటు ఆయన టీమ్ సభ్యులు కూడా గ్రహించారు.

ఆ కోణంలోంచి చూస్తే, వేడి నీటి నది భవిష్యత్‌కు సంబంధించి ప్రకృతి చేస్తున్న ప్రయోగం మాదిరిగా భావించవచ్చు.

అయితే దీనిపై అధ్యయనం చేయడం అంత తేలిక కాదు. “ఇది ఆవిరి స్నానంలో ఫీల్డ్ వర్క్ చేయడం లాంటిది” అని ఫార్టియర్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
అమెరికా, పెరు, లా బొంబా, గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రతలు, అమెజాన్ ఫారెస్ట్

ఫొటో సోర్స్, Riley Fortier

ఉష్ణోగ్రతలను ఎలా నమోదు చేశారు?

లా బొంబా నది వద్ద ఉష్ణోగ్రతలను కొలిచే 13 రకాల పరికరాలను ఉపయోగించి ఉష్ణోగ్రతను ఎలా నమోదు చేశారో వివరిస్తూ అమెరికా, పెరూల నుంచి వచ్చిన వారి సహచరులు 2024 అక్టోబర్‌లో ఒక నివేదికను ప్రచురించారు.

పరిశోధకులు నది పొడవునా చల్లగా ఉన్న ప్రాంతాల్లోనూ పరికరాలను ఉంచారు.

సగటు వార్షిక ఉష్ణోగ్రత శీతల ప్రదేశాలలో 24-25 °C నుంచి వెచ్చని ప్రాంతాల్లో 28-29 °C వరకు ఉంటుంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత చల్లని ప్రాంతాల్లో 24-25 డిగ్రీలు ఉంటే వేడిగా ఉండే ప్రాంతంలో 28-29 డిగ్రీల మధ్య ఉంటుంది.

వేడి నీటి నది పొడవునా వేడిగా ఉన్న ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

నదిలో నీటి సగటు ఉష్ణోగ్రత 86 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని జియో థర్మల్ శాస్త్రవేత్త అండ్రెస్ రుజో తేల్చారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నివేదిక ప్రచురించలేదు.

అక్కడున్న మొక్కలు, చెట్లను పూర్తిగా విశ్లేషించడానికి ఈ బృందం కఠిన పరిస్థితులతో పోరాడాల్సి వచ్చింది.

నది వెంబడి కొన్ని భాగాలలో వృక్ష సంపదను వారు నిశితంగా అధ్యయనం చేశారు. అందులో కీలకమైన అంశాన్ని గుర్తించారు. నది వేడిగా ఉన్న చోట చెట్లు తక్కువగా ఉండటం, అవి త్వరగా ఎండిపోతూ ఉండటం, కొన్ని వృక్ష జాతులు అసలు లేకపోవడాన్ని గుర్తించారు.

“అడవిలో పెద్ద చెట్ల కింద చిన్న చిన్న మొక్కల సంఖ్య చాలా తక్కువగా ఉంది” అని కుల్‌బర్గ్ చెప్పారు. “వేడి నీటి ఆవిరి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా మొక్కలు ఎండిపోయినట్లుగా కనిపిస్తున్నాయి” అని అన్నారు.

ఉదాహరణకు నదీ తీరంలో ఉన్న 50 మీటర్ల ఎత్తు పెరిగే గ్వారియా గ్రాండిఫోలియా వంటి కొన్ని పెద్ద చెట్లకు ఈ వేడి వాతావరణం ఇబ్బందికరంగా మారుతోంది.

మొత్తంగా, నది నుంచి వస్తున్న వేడి ఆవిరి అక్కడి జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఆ ప్రాంతమంతా నీటి ఆవిరి గాలిలోకి చేరడంతో అక్కడ గాలిలో ఎగిరే కీటకాలు, ఇతర జంతువులు సంచరించలేకపోతున్నాయి. అయితే దీని గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయలేదని ఫోర్టియర్ బృందం తెలిపింది.

ఉష్ణ ప్రాంతాల్లో వృక్ష జాతులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడం సాధారణ అంశం. ఇది అంతగా ఆశ్చర్యం కలిగించే అంశం కాదు. అయితే అక్కడి చెట్లపై ఇలాంటి ప్రభావం ఉండటం చూసి ఆ బృందం ఆశ్చర్యపోయింది.

వాళ్ల అధ్యయనం అంతా 2 కిలోమీటర్ల దూరంలోపే కొనసాగింది. లా బొంబా నదిలో వేడి నీరు ప్రవహించే ప్రాంతాలు అక్కడక్కడా ఉన్నాయి. అందులో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి.

ఉష్ణోగ్రతలు నిర్దిష్ట స్థాయికి చేరుకున్నతర్వాత, దానికి మొక్కలు వెంటనే స్పందిస్తున్నాయని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.

“ఇది అద్భుతమైన అంశం” ఈ అధ్యయనంలో పాల్గొనని ఎక్స్‌టర్ యూనివర్సిటీకి చెందిన క్రిస్ బౌల్టన్ చెప్పారు. పొగలు కక్కే నదిని ప్రకృతి చేస్తున్న ప్రయోగంగా చెప్పడాన్ని ఆయన ప్రస్తుతించారు.

అమెరికా, పెరు, లా బొంబా, గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రతలు, అమెజాన్ ఫారెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

వాతావరణ మార్పుల ప్రభావం

అమెజాన్ భవిష్యత్‌లో ఎలా మారుతుందో చెప్పడానికి లా బొంబా నది ఒక ఉదాహరణ అని డీగో ఒలివెరా బ్రాండో చెప్పారు. అమెజాన్ టెక్నికల్ సైంటిఫిక్ సెక్రటేరియట్‌ ఆఫ్ ది సైంటిఫిక్ ప్యానల్‌లో సభ్యుడుగా ఉన్నారు. ఇది సైంటిఫిక్ పరిశోధన సంస్థ.

వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న పరిణామాలు స్థానిక ప్రజలపై చూపే ప్రభావం గురించి తనకు ఆందోళన ఉందని ఆయన అన్నారు. “ఇక్కడ నివసించే ప్రజలు ఈ అడవిలోని జీవ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారు” అని బ్రాండో చెప్పారు.

ఆయన చెప్పిన దాన్ని బౌల్టన్ కూడా అంగీకరిస్తున్నారు. అమెజాన్‌లోని మూలవాసులు ఇప్పటికే దీనికి సంబంధించిన ముప్పును ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రాంతంలో వరదలు, కరవు సంభవిస్తున్నాయి.

అమెజాన్ అడవుల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక మొక్కలు, వృక్ష జాతుల మనుగడకు ముప్పుగా మారుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన రొడాల్ఫో నొబ్రెగా చెప్పారు. లా బొంబా నది దీనికి స్పష్టమైన ఉదాహరణ అని ఆయన అన్నారు.

“ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగితే, దగ్గర్లోనే నీరు అందుబాటులో ఉన్నా, మొక్కలు ఆహారం సంపాదించుకునేందుకు అవసరమైన కిరణ జన్య సంయోగ క్రియ సామర్థ్యం తగ్గిపోవచ్చు” అని ఆయన గుర్తించారు.

అమెజాన్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జీవ వైవిధ్యాన్ని ప్రభావితం చేస్తున్న తీరును లా బొంబా నది ప్రత్యక్షంగా చూపిస్తోందని కుల్‌బర్గ్ భావిస్తున్నారు. అయితే అమెజాన్‌ వర్షారణ్యంలో ఈ కొద్ది భాగం మొత్తం అమెజాన్ అడవుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే అంశం కాదని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు.

ఉదాహరణకు, వేరే ఏ ప్రాంతంలోనూ ఇంత నీటి ఆవిరి ఉండదు. తుపాన్లు లేదా వర్షపాతంలో మార్పులు లాంటివి రానున్న రోజుల్లో వర్షారణ్యాల మనుగడను ప్రభావితం చేసే అంశాలు.

అమెరికా, పెరు, లా బొంబా, గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రతలు, అమెజాన్ ఫారెస్ట్

ఫొటో సోర్స్, Riley Fortier

అమెజాన్‌లో ఒక భాగం

అమెజాన్ అడవులపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పేందుకు వేడి నీళ్ల నది ఒక ఉదాహరణ కాదని చెప్పడానికి మరో కారణం కూడా ఉంది.

అమెజాన్ వర్షారణ్యం చాలా పెద్దది. ఇది బ్రెజిల్, పెరు, బొలీవియా, కొలంబియా, ఫ్రెంచ్ గయానా సహా తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది.

ఇది మొత్తం 67లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. “ఒక ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితుల్ని వేర్వేరు వర్షపాత నమూనాలు, వృక్ష జాతులకు ముడి పెట్టడం సరి కాదు” అని ఆయన వివరించారు.

బౌల్టన్, అతని సన్నిహితులు అమెజాన్ ప్రమాదకర పరిస్థితులకు చేరుకునేందుకు ఉన్న సాధ్యా సాధ్యాల గురించి గతంలో అధ్యయనం చేశారు.

“దశాబ్ధం లోపల చెట్లు హఠాత్తుగా చనిపోవడాన్ని చూడవచ్చు” అని బౌల్టన్ అన్నారు. అయితే వాతావరణ మార్పుల వల్ల అమెజాన్ వేడెక్కడం లేదా ఎండిపోవడం జరగదు.

అమెజాన్ ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం అడవుల విధ్వంసం. దీని వల్ల అడవి పైన మేఘాలు, వాతావరణంలో తేమ వంటి అంశాలలో తేడాలు వస్తాయి.

దీని వల్ల అడవుల్లో వర్షపాతం తగ్గిపోతుంది.

“మీరు చెట్లను నరికివేస్తుంటే, మీరు వర్షాలకు వాతావరణానికి ఉన్న బంధాన్ని నాశనం చేస్తున్నట్లే, దీని వల్ల వాతావరణం పొడిబారుతుంది” అని బౌల్టన్ చెప్పారు

అమెరికా, పెరు, లా బొంబా, గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రతలు, అమెజాన్ ఫారెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

దత్తత

అమెజాన్ వర్షారణ్యం త్వరగా పొడి ప్రదేశంగా మారే అవకాశం ఉంది. ఇదొక అడవికి బదులుగా గడ్డి మైదానంగా మారవచ్చు అని బౌల్టన్‌తో సహా 200 మందికి పైగా పరిశోధకులు రాసిన ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఉన్న ప్రాంతాలు 2023 నివేదికలో తెలిపారు.

వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే కఠిన పరిస్థితులు, ఇది వరకు లేని వాతావరణాన్ని తట్టుకుని ఏఏ జీవులు మనుగడ సాగించగలవనే అంశాన్ని లా బొంబా నదిని అధ్యయనం చెయ్యడం వల్ల తెలిసిందని పార్టియర్ సూచించారు.

నదీ తీరంలో 50 అడుగులకు పైగా ఎత్తు పెరిగిన సైబా లుపానా చెట్టును ఆయన ఉదహరించారు. ఆ చెట్టు నది పక్కనే ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలను తట్టుకుని పెరిగిన విషయాన్ని ఆయన అధ్యయనంలో గుర్తించారు.

సెయిబా చెట్టు తన కాండంలో నీటిని దాచుకోగలదని, వాతావరణం పొడిబారినప్పుడు ఆ నీటిని ఉపయోగించుకుని కరవు పరిస్థితుల్లోనూ నెట్టుకురాగదలని కుల్‌బర్గ్ తెలుసుకున్నారు.

లా బొంబా నది ఒడ్డున పెరుగుతున్న వృక్ష జాతుల్ని, అంతరించిన వాటిని గుర్తిస్తే, అమెజాన్ అడవిలో ఉష్ణోగ్రతలు పెరిగితే ఏఏ జాతుల మొక్కల్ని కాపాడాల్సి ఉంటుందనే దాని గురించి పర్యావరణ పరిరక్షకులకు ఒక అవగాహన వస్తుందని ఫార్టియర్ చెప్పారు.

దీని వల్ల అడవుల్లో పెద్ద పెద్ద వృక్షాల కింద జీవించే చిన్న మొక్కలు, చిన్న చిన్న కీటకాలు, జీవుల రక్షణ కూడా సాధ్యమవుతుందని కుల్‌బర్గ్ అన్నారు.

అమెజాన్ అడవుల్ని కాపాడుకోవడం, మానవాళిని కాపాడుకోవడమే అని బౌల్టన్ నమ్ముతున్నారు.

వర్షారణ్యంలో విధ్వంసం ఇలాగే కొనసాగితే అది అంతిమ దశకు చేరుకుంటే మొత్తం ప్రపంచానికి ప్రమాదంగా మారుతుంది.

“అమెజాన్ వర్షారష్యం లేకపోతే, వాతావరణంలోకి భారీ స్థాయిలో కార్బన్ వచ్చి చేరుతుంది. అది స్థానికంగానే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా” అని బౌల్టన్ చెప్పారు.

లా బొంబా నది కేవలం భవిష్యత్‌లో రాబోయే ప్రమాదానికి సూచిక మాత్రమే కాదు. హెచ్చరిక కూడా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)