SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
52 నిమిషాలు క్రితం
న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ వంతెనను మెక్సికన్ నేవీ శిక్షణ నౌక ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు.
క్వాటెమోక్ నౌకను కెప్టెన్ నడుపుతున్న సమయంలో నౌకలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో అది బ్రూక్లిన్ వైపునున్న వంతెన వైపు వెళ్లాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. శనివారం ఈ ఘటన జరిగిన సమయంలో నౌకలో 277 మంది ఉన్నారు.
నౌక వంతెన కిందకు వెళ్తున్నప్పుడు, తెరచాపల స్తంభాలు వంతెనను ఢీకొనడం వీడియోల్లో కనిపించింది. ఆ స్తంభాలపై సిబ్బంది నిల్చుని ఉండగానే, అవి అమాంతం విరిగి ఓడ డెక్‌పై పడిపోయాయని అధికారులు చెప్పారు.
ఈ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురైందని ఈ ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్షసాక్షి, బ్రూక్లిన్కు చెందిన నిక్ కార్సో అన్నారు. ”చాలామంది అరుపులు వినిపించాయి, కొందరు నావికులు తెరచాపలకు వేలాడుతూ కనిపించారు” అని ఆయన వార్తా సంస్థ ఏఎఫ్పీకి చెప్పారు
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, గాయపడిన 19 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ పోస్ట్ ద్వారా ధ్రువీకరించారు.
అయితే, ఈ ప్రమాదంలో బ్రూక్లిన్ వంతెనకు పెద్ద నష్టమేమీ జరగలేదు, ప్రాథమిక తనిఖీల అనంతరం వంతెనను యథావిధిగా రాకపోకలకు పునరుద్ధరించారు.
మెకానికల్ సమస్యలతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
న్యూయార్క్ కోస్ట్ గార్డ్ మాట్లాడుతూ, క్వాటెమోక్ నౌకలోని మొత్తం మూడు మాస్ట్స్(తెరచాపల స్తంభాలు) విరిగిపోయాయన్నారు. నౌకలోని సిబ్బందిని లెక్కబెట్టామని, ఎవరూ నీటిలో పడిపోలేదని చెప్పారు.
నౌక వంతెనను ఢీకొట్టడంతో తీరం వెంబడి ఉన్న ప్రజలు పరుగులు తీశారు.

ఆ సమయంలో తాను పనిచేసుకుంటూ ఉన్నానని, నౌక వంతెనను ఢీకొట్టడం చూశానని మరో సాక్షి కెల్విన్ ఫ్లోర్స్ బీబీసీతో చెప్పారు.
వీధిలోకి వచ్చి చూస్తే అంతా గందరగోళంగా ఉందని, అగ్నిమాపక యంత్రాలు.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారని, అయితే రోడ్లు ట్రాఫిక్‌తో నిండిపోయాయని ఆయన అన్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మృతి చెందడంపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత, క్వాటెమోక్ను అక్కడి నుంచి పక్కకు తరలించారు.
297 అడుగుల పొడవు (91 మీ), 40 అడుగుల (12 మీ) వెడల్పు కలిగిన ఈ నౌక 1982లో మొదటిసారి ఉపయోగంలోకి వచ్చిందని మెక్సికన్ నౌకాదళం తెలిపింది.
ఏటా నేవల్ మిలిటరీ స్కూల్ తరగతుల ముగింపులో భాగంగా, క్యాడెట్ల శిక్షణ కోసం ఈ నౌక బయలుదేరుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 6న మెక్సికోలోని అకాపుల్కో నుంచి ఇది బయలుదేరిందని, ఐస్లాండ్ చేరుకోవాల్సి ఉందని నౌకాదళం తెలిపింది.
క్వాటెమోక్ మాస్ట్ ఎత్తు 48.2 మీ (158 అడుగులు) అని పోలీసులు తెలిపారు.
వంతెన కింద నుంచి ప్రయాణించేందుకు 135 అడుగుల ఎత్తులోపు నౌకలకు మాత్రమే అనుమతి ఉందని న్యూయార్క్ రవాణా శాఖ వెబ్సైట్ చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)