SOURCE :- BBC NEWS

టీమ్ ఇండియా, భారత క్రికెట్ జట్టు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో భారత క్రికెట్ అభిమానులు కుంగిపోతున్నారు.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ జట్టు ఆధిపత్యం చెలాయించేది. ఈ టోర్నీలో దశాబ్ద కాలంగా భారత్ ఆస్ట్రేలియా మీద చారిత్రకం అనదగిన ఘన విజయాలు సాధిస్తూ వచ్చింది.

తాజా టోర్నీలో చాలాకాలంగా కొనసాగుతున్న జైత్రయాత్రకు బ్రేక్ పడటమే కాకుండా భారత జట్టు బలహీనతలు బయటపడ్డాయి.

ఉపఖండం పిచ్‌ల మీద చెలరేగి ఆడే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తేలిపోయారు. రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌ను కొంత ఇబ్బంది పెట్టాడు.

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి వల్ల భారత జట్టు బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కోల్పోవడమే కాదు, జట్టుకు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌ ఫైనల్‌లో చోటు కోల్పోయేలా చేసింది. 2021లో న్యూజీలాండ్, 2023లో ఆస్ట్రేలియాతో ఓటమి వల్ల భారత విజయపరంపరకు బ్రేక్ పడింది.

టెస్ట్‌మ్యాచ్‌ల విషయంలో ఇండియ్ క్రికెట్ ఫామ్ కలవరపెడుతోంది. జట్టు ఆడిన చివరి 8 మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లను ఓడిపోయింది. ఇందులో న్యూజీలాండ్‌తో ఆడిన టెస్ట్ సిరీస్‌ 0-3తో వైట్‌వాష్ కావడం షాకిచ్చింది.

ఈ వరస ఓటములు జట్టు ఆటతీరుతో పాటు కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్‌పై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు తిరిగి ఫామ్‌లోకి రాగలరా అనేది పెద్ద ప్రశ్న.

అద్భుతమైన ఈ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, జట్టులో మార్పులు లాంటి అంశాలు ఇండియన్ టెస్ట్ క్రికెట్‌ వారసత్వాన్ని కాపాడుకోవడంలో సవాళ్లు విసురుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
టీమ్ ఇండియా, భారత క్రికెట్ జట్టు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, AFP

భారత జట్టు 2025 జులైలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌లో పరిస్థితులు ఒక సెషన్‌లోనే నాటకీయంగా మారిపోతాయని అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు ఆటగాళ్ల టెక్నిక్, నైపుణ్యం, సత్తాకు పరీక్ష పెడతాయి.

2007 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌లో సిరీస్ గెలవలేదు. అంతకు ముందు రెండుసార్లు (1971,1986) మాత్రమే గెలిచింది. ఈ ట్రాక్ రికార్డ్‌ను చూస్తే భారత్ ముందు ఎంత పెద్ద సవాలు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒత్తిడికి తోడు న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలో ఇటీవలి పరాజయాలు సెలక్టర్లను కఠిన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ కోసం భారత జట్టుకు ఆటగాళ్ల ఎంపిక సెలక్టర్లకు పరీక్షలా మారింది.

న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు, వారి బ్యాటింగ్ చూసిన తర్వాత వారి ఎంపిక సెలక్టర్లకు పెద్ద తలనొప్పి కానుంది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రోహిత్ శర్మ మూడు టెస్టుల్లో 31 పరుగులు చేశాడు. తన ఆట తీరు సరిగ్గా లేకపోవడంత ఆయన చివరి టెస్టుకు దూరంగా ఉన్నాడు. కోహ్లీ తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి 190 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్‌లో వంద పరుగులు చేశాడు. మిగతా ఎనిమిది ఇన్నింగ్స్‌లో కోహ్లీ చేసింది 90 పరుగులే. కోహ్లీ అవుటైన తీరుపై సీనియర్లు విమర్శలు గుప్పించారు.

కోహ్లీ స్లిప్స్‌లో క్యాచ్ లేదా, వికెట్ల వెనుకాల కీపర్‌కు క్యాచ్, ఏదో ప్రాక్టీస్ చేసి అవుటైనట్లు ఒకే విధంగా అవుట్ కావడం ఆశ్చర్యం కలిగించింది. ఒత్తిడి వల్ల ఇలా జరిగిందా లేక బ్యాటింగ్‌లో లోపం ఉందా అనే సందేహాలు తలెత్తాయి.

2024 జనవరి నుంచి రోహిత్ శర్మ ఆడిన 16 టెస్టుల్లో ఒక్క సెంచరీతో 619 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ గణాంకాలు మరీ తీసికట్టుగా ఉన్నాయి. 2020 నుంచి కోహ్లీ టెస్టుల యావజరేజ్ 32. నాలుగేళ్లలో కోహ్లీ టెస్టుల్లో రెండు సెంచరీలు మాత్రమే చేశాడు.

ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్‌లలో ఓపెనింగ్ వచ్చి కళ్లు చెదిరేలా ఆడి మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన రోహిత్ శర్మ ఇప్పుడు క్రీజులో కుదురుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు.

ఇదిలా ఉంటే దశాబ్దకాలంగా ఇండియన్ క్రికెట్‌లో రారాజుగా వర్దిల్లుతున్న విరాట్ క్లోహీ ప్రస్తుత ఫామ్ చూస్తే ఈ హరియాణా హరికేన్ వెనక్కి పరుగులు పెడుతున్నాడా అనిపిస్తోంది.

టీమ్ ఇండియా, భారత క్రికెట్ జట్టు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఇండియన్ క్రికెట్ టీమ్ బ్యాటింగ్ వారసత్వం సునీల్ గావస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్‌కు, సచిన్ నుంచి కోహ్లీకి వచ్చింది. అయితే భారత జట్టులో కోహ్లీ తర్వాత ఆ స్థాయి ఆటగాడు ఎవరనే ప్రశ్నకు సమాధానం వెతికే పనిలోనే ఉంది సెలక్షన్ కమిటి.

కేఎల్ రాహుల్ క్లాసిక్ గేమ్ ఆడుతున్నా, చిన్న స్కోర్లను పెద్దవిగా మార్చడం, బ్యాటింగ్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడంలో విఫలం అవుతున్నాడు. రిషబ్ పంత్ దూసుకెళ్లే యుద్ధ విమానంలాంటి ఆటగాడు. అయితే ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు అవుట్ అవుతాడో ఊహించడం కష్టం. మ్యాచ్‌ను గెలిపించడంతో పాటు ఓడించగలడు.

శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం జట్టులో నమ్మకమైన బ్యాట్స్‌మెన్. కానీ, విదేశీ పిచ్‌లపైన తడబడుతున్నాడు. బ్యాటింగ్‌లో ఇంకా ఎదగాల్సి ఉంది.

పంజాబ్ యువతరంగం ఎడమ చేతి వాటం ఆటగాడు అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గురువు. ఇతని మీద కూడా ఆశలు భారీగా ఉన్నాయి. ఇక విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కఠిన పరిస్థితుల్లో నిలకడగా ఆడి సెంచరీ కొట్టాడు.

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు యశస్వి జైస్వాల్. ఆత్మ విశ్వాసం, సహనం, టెక్నిక్, అప్పుడప్పుడూ మెరుపుల్లాంటి షాట్లతో కోహ్లీ వారసుడు ఇతడే కావచ్చనే ఆశలు రేపుతున్నాడు.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ భారత జట్టు ప్రతిభ రోజు రోజుకీ మసకబారుతోంది. ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్‌లలో జస్‌ప్రీత్ బుమ్రా 32 వికెట్లు తీశాడు. ఇండియన్ పేస్ బౌలింగ్‌కు కంచుకోటలా నిలబడ్డాడు. మహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్‌తో పాటు మరో డజను మంది నమ్మకమైన పేస్ ‌బౌలర్లతో ఇండియన్ పేస్ టీమ్ అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉంది.

టీమ్ ఇండియా, భారత క్రికెట్ జట్టు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, AFP

బుమ్రా కచ్చితంగా తన తరంలో ప్రతిభావంతుడు. అతను ప్రస్తుతం భారత పేస్ భారాన్ని మోయాల్సి ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతని మీద భారం పెరిగింది. దీనివల్ల అతని దాడిలో వాడి తగ్గే ప్రమాదం ఉంది. షమీ విషయానికొస్తే ప్రస్తుతం అతను పునరావాసంలో ఉన్నాడు. షమీ కూడా తన మునుపటి ఫామ్ అందిపుచ్చుకుంటే ఈ ఇద్దరు భారత్‌కు అత్యున్నత పేస్ ద్వయంగా మారవచ్చు.

రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం, ఆస్ట్రేలియాలో రవీంద్ర జడేజా నిరాసక్త ప్రదర్శనతో ఇండియన్ స్పిన్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. అయితే వాషింగ్టన్ సుందర్ ఇండియన్ పిచ్‌ల మీద రాణించడం, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో మధ్యలో అడుగు పెట్టిన యువ స్పిన్నర్లు రవి బిష్ణోయ్, తనుష్ కొటియా టెస్ట్ క్రికెట్‌లో సత్తా ఏంటో చూడాల్సి ఉంది.

న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలో ఓటములు చూసిన తర్వాత జట్టును ఎంపిక చేసే సెలక్షన్ బోర్డు జట్టు కూర్పులో మార్పు దిశగా అడుగులు వేస్తోంది. జనవరి 23 నుంచి జరగనున్న రంజీ ట్రోఫీలో టెస్టుల్లో రాణించే సత్తా ఉన్న ఆటగాళ్ల పేర్లతో జాబితా సిద్ధం చేయాలని సెలెక్టర్లకు ఆదేశాలు అందాయి.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా జట్టులోని ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని అడిగే అవకాశం ఉంది. దీని వల్ల వారు కోల్పోయిన ఫామ్‌ను తిరిగి పొందవచ్చు.

టీమ్ ఇండియా, భారత క్రికెట్ జట్టు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

అన్ని ఫార్మాట్లకు తగినట్లుగా జట్టు కూర్పు అంత తేలిక్కాదు. ఇది అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. దీనికి చాలా సహనం, ఉదారత, స్పష్టమైన దృష్టి కోణం కావాలి. ఏవైనా సమస్యలు ఏర్పడినా, బయట నుంచి ఒత్తిడి పెరిగినా పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తారా లేదా అనేది చూడాలి. అయితే దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని గుర్తించి ప్రోత్సహిస్తే, ప్రస్తుతం ఉన్న అగాధంలో నుంచి భారతీయ క్రికెట్ మళ్లీ ఉన్నత శిఖరాలను చేరుకోగలదు.

2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 4-0తో ఓడిపోయింది. ఆ సమయంలో జట్టు అట్టడుగు స్థాయికి చేరుకుంది.

అయితే కొన్ని నెలల్లోనే కోహ్లి, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, జడేజా, అశ్విన్ లాంటి ఆటగాళ్లతో అన్ని ఫార్మాట్లలోనూ ఇండియన్ టీమ్ దుమ్ము రేపింది. దశాబ్ద కాలం పాటు అదే ఫామ్‌ను కొనసాగించి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)