SOURCE :- BBC NEWS
జీవితాన్ని క్లోజప్‌లో చూస్తే ట్రాజెడీ
లాంగ్షాట్లో చూస్తే కామెడీ
ఈ మాట అన్నది చార్లీచాప్లిన్. నవ్విస్తూ ఏడిపించడం ఆయన స్టైల్. అందుకే ఇంకా గుర్తున్నాడు. కామెడీ రాయడం కష్టం, తీయడం ఇంకా కష్టం. బాధ తెలిసిన వాడే నవ్వించగలడు. అందుకే మనకి ఫుల్ లెంగ్త్ కామెడీ డైరెక్టర్లు తక్కువ.
జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తర్వాత గ్యాప్ వుంది. మధ్యలో మేర్లపాక గాంధీ , అనుదీప్ ఆశలు కల్పించారు కానీ, చప్పబడిపోయారు. వరుసగా కామెడీని నమ్ముకున్నది అనిల్ రావిపూడి ఒకరే. అతనికి వెంకటేష్ లాంటి నటుడు తోడైతే థియేటర్లో నవ్వుల పువ్వులే. పండుగని కూడా మరిచి “సంక్రాంతికి వస్తున్నాం” ఉదయం ఆటకి కుటుంబాలతో వచ్చారంటే దర్శకుడి మీది నమ్మకం. హీరో కామెడీపై కాన్ఫిడెన్స్.
ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుంది.
ఆమె వెనుక అతని భార్య వుంటుంది.
ఇది మార్క్స్ బ్రదర్స్ కొటేషన్. బతికినంత కాలం జనాల్ని నవ్వించిన నటులు. ఇద్దరమ్మాయిల మధ్య ఒక పురుషుడు. సక్సెస్ఫుల్ ఫార్ములా. దీన్ని ఎమోషనల్‌గా వాడితే శోభన్‌బాబు కార్తీక దీపం. కామెడీ చేస్తే వెంకటేష్ – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.
పాత ఫార్ములాకి కొంచెం క్రైమ్ డ్రామా కలిపి అనిల్ రావిపూడి సంక్రాంతి వంట వండాడు.
కథ ఏమంటే….
ప్రముఖ టెక్ కంపెనీ సీఈవో సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్)ని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. సెక్యూరిటీగా వున్న పోలీస్ అధికారి మీనాక్షి (మీనాక్షి చౌదరి) అతన్ని కాపాడలేకపోతుంది. ముఖ్యమంత్రికే అతిథిగా వున్న సత్య కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది. కిడ్నాప్ చేసిన గ్యాంగ్ లీడర్ డిమాండ్ ఏమంటే జైలులో ఉన్న అతని అన్నని వదిలేయాలి. జైలర్ చాలా స్ట్రిక్ట్. మాట వినే రకం కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినడు. ఈ సమస్యని పరిష్కరించే శక్తి యాదగిరి దామోదరరాజుకి (వెంకటేష్) మాత్రమే వుంది. ఒకప్పటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఇపుడు సస్పెన్షన్‌లో ఉన్నాడు. నలుగురు పిల్లలతో గోదారి ప్రాంతంలో. ప్రశాంతంగా ఉన్నాడు. ఎవరు పిలిచినా రాడు. మీనాక్షి పిలిస్తే వస్తాడు.
రాజు భార్య భాగ్యంకి (ఐశ్వర్య రాజేష్) భర్త అంటే పిచ్చి ప్రేమ. అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ మీనాక్షి నేరుగా ఇంటికొస్తే పరిస్థితి ఏంటి? కిడ్నాప్ ఆపరేషన్ ఎలా పూర్తయ్యింది. ఇదంతా స్క్రీన్ మీదే చూడాలి.
ఈ సినిమా ట్రైలర్ చూసిన ఎవరికైనా కథ సులభంగా అర్థమవుతుంది. సస్పెన్స్, ట్విస్టులుండవు. ఒకవేళ ట్రైలర్ చూడకపోయినా, మొదటి 15 నిమిషాల్లో తెలిసిపోతుంది. ఫస్టాఫ్ అంతా రకరకాల కామెడీ సీన్స్‌తో నడుస్తూ వుండగా మీనాక్షి రాకతో ప్లాష్ బ్యాక్. మాజీ ప్రేయసితో భర్తని ఒంటరిగా పంపేది లేదని భాగ్యం కూడా బయల్దేరుతుంది. ఆమెతో పాటు కొడుకు, తండ్రి, పనివాడు కూడా వెళ్తారు.
ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వెంకటేష్‌తో సమానంగా పోటీ పడి నటించింది. అమాయకత్వం, అసూయ, ప్రేమ అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పండించగల నటి.
మొత్తంగా రెండున్నర గంటల సినిమా ప్రేక్షకులను కూర్చోపెట్టిందా? అంటే అక్కడక్కడ బోర్ ఉన్నా , డౌన్ అయినట్టు అనిపించినా మళ్లీ సర్దుకుంది. సన్నివేశాలు కూడా ఆల్రెడీ చూసేసినట్టుగా ఉన్నా, నవ్వేస్తు వుంటాం. ఫార్స్ కామెడీలో ప్రతి పాత్ర వింతగా ప్రవర్తిస్తూ వుంటాయి. లాజిక్ అడక్కూడదు. అలా వుంటేనే కామెడీ వర్కౌట్ అవుతుంది.
కామెడీ సరే… క్లైమాక్స్ సంగతేంటి?
శవం కామెడీ , జానేబీ దోయార్ (1983) గుర్తు తెస్తుంది. కన్ఫ్యూజన్ కామెడీకి షేక్స్పియర్ ఆద్యుడైతే, హిందీలో దర్శకులు కుందన్‌షా, బాసుచటర్జీ చెప్పుకోతగిన వాళ్లు.
పాత్రలకి విచిత్ర లక్షణాలను కలపడం జంధ్యాల ప్రత్యేకత. ఈ సినిమాలో బూతులు మాట్లాడే పిల్లవాడు బాగా నవ్విస్తాడు. ఈ క్యారెక్టర్ జంధ్యాల సినిమాలోదే. సాయికుమార్, ఉపేంద్రలిమాయే ట్రాక్ కూడా పాత సినిమాల్లోని కోట శ్రీనివాసరావుని గుర్తు తెస్తుంది.
కామెడీ మీద పెట్టిన శ్రద్ధ అనిల్ రావిపూడి క్లైమాక్స్ మీద పెట్టడు. ఏదో లాగించేస్తాడు. ఆఖరున స్కూల్ మాస్టర్ ఎపిసోడ్ పూర్తిగా అనవసరం.
పాటల్లో గోదారి గట్టు హిట్ అని చెప్పాల్సిన పనిలేదు. చిత్రీకరణ కూడా బాగుంది. ముఖ్యమంత్రిగా నరేష్, పార్టీ అధ్యక్షుడిగా వీటీవీ గణేష్ , డాక్టర్‌గా శ్రీనివాస్‌రెడ్డి యధాశక్తి నవ్వించారు. అవసరాల శ్రీనివాస్ ఉన్నా లేనట్టే.
ప్లస్ పాయింట్స్ః
1.వెంకటేష్, ఐశ్వర్య నటన
2.గోదారి గట్టు పాట
3.పగలబడి నవ్వించే కొన్ని సన్నివేశాలు
4.ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్ః
1.ఊహించే కథ
2.సెకెండాఫ్‌లో స్లో
3.పాత సినిమాల్లోని సీన్స్ గుర్తుకు రావడం
అనిల్, వెంకటేష్, దిల్‌రాజ్ కాంబోలో సంక్రాంతికి నవ్వించే సినిమా వచ్చింది.
కామెడీలో రెండు రకాలు స్లాప్స్టిక్ వల్గర్ కామెడీ, సెన్సిటివ్ సిట్యువేషన్ కామెడీ. అనిల్ రావిపూడిది రెండో రకం. ఇన్ని సినిమాలు తీసినా ఇంకా ఎండిపోకుండా వున్నాడంటే గ్రేట్.
ఫైనల్‌గా “సంక్రాంతికి వస్తున్నాం” గొప్ప సినిమా కాదు కానీ, కుటుంబంతో సహా పండుగకి హాయిగా చూడదగిన సినిమా. ఈ మాత్రం నవ్వించే సినిమాలు కూడా ఎక్కడొస్తున్నాయి?
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)