SOURCE :- BBC NEWS
సంక్రాంతి సీజన్ వచ్చేసింది. కొత్త సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి.
గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతించాయి.
‘పుష్ప-2 ది రూల్’ సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత సినిమాల టికెట్ రేట్ల పెంపుపై పెద్దఎత్తున వివాదం నడిచింది.
ఆ తర్వాత సంక్రాంతి సీజన్ సందర్భంగా వచ్చే సినిమాల టికెట్ రేట్లు పెరుగుతాయా? లేదా? అన్న చర్చ సాగింది.
వీటిలో భారీ బడ్జెట్ చిత్రాలుగా చెప్పుకొంటున్న మూడు సినిమాలకు రేట్లు పెరిగాయి.
టికెట్ రేట్లు పెంచితే ఏమవుతోంది?
సాధారణంగా సంక్రాంతి సీజన్ అనగానే సినిమాల సందడి మొదలవుతుంది. బాగా పేరున్న హీరోల సినిమాలకు తోడు కొన్ని తక్కువ బడ్జెట్ ఉన్న చిత్రాలు విడుదలవుతుంటాయి.
ఈ చిత్రాల వసూళ్లు, జనాదరణ బట్టి సంక్రాంతి విజేతగా ఫలానా సినిమా అని అభిమానులు ప్రకటించుకుంటారు.
ఇప్పుడు సంక్రాంతి సీజన్ విషయంలోనూ అదే చర్చ నడుస్తోంది. దీని కంటే ఎక్కువగా నడుస్తున్న చర్చ మాత్రం టికెట్ ధర పెంపు.
తెలంగాణలో బెనిఫిట్ షోకు అనుమతించకపోయినా, టికెట్ రేట్లు మాత్రం 150 రూపాయల వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చేసింది.
టికెట్ ధర పెంచడం వల్ల థియేటర్లు నష్టపోతున్నాయని చెబుతున్నారు వాటి యజమానులు, ఎగ్జిబిటర్లు.
అంతేకాదు, కచ్చితంగా ప్రేక్షకులపై భారం పడే అంశమే. దీనివల్ల రిపీట్ ఆడియెన్స్ (మళ్లీ మళ్లీ సినిమా చూసే ప్రేక్షకులు లేదా రెండు, మూడు సినిమాలు చూసే ప్రేక్షకులు) తగ్గిపోతున్నారనేది వారు చెబుతున్నమాట.
”సగటు మధ్యతరగతి లేదా ఎగువ, దిగువ మధ్య తరగతి ప్రేక్షకుల ఆలోచన భిన్నంగా ఉంటుంది. ఈ నెల సినిమాల కోసం బడ్జెట్ రూ.1000 లేదా రూ.1,500 అనుకుంటారు. ఆ మొత్తం ఒకే సినిమాకు పెట్టడం వల్ల ఇతర సినిమాలు చూడటం ఆపేస్తున్నారు. ఒకే సినిమా చూడటంతో తర్వాత వేరొక సినిమాకు ప్రేక్షకులు రావడం తగ్గిపోతున్నారు.” అని తెలంగాణ తెలుగు ఫిలిం ఎగ్జిబిటర్స్ అండ్ కంట్రోలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.విజేందర్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
గతంలో ఒక వ్యక్తి సినిమాల సీజన్ వచ్చిందంటే, మూడు, నాలుగు సినిమాలు చూసేవారని, ఇప్పుడు ఒక్క సినిమాకు పరిమితం అవుతున్నారని చెప్పారాయన.
సింగిల్ స్క్రీన్లలో అలా.. మల్టీప్లెక్సులలో ఇలా..
టికెట్ రేట్ల పెంపు అనేది మల్టీప్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లపై తీవ్ర ప్రభావం పడుతోందని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. టికెట్ రేట్లు ఫిక్స్‌డ్‌గా ఉండాలని వారి డిమాండ్.
తెలంగాణ ఎగ్జిబిటర్లు, సినిమా థియేటర్ల యాజమానులు టికెట్ ధర విషయంలో ఇటీవల ఓ మీడియా సమావేశం నిర్వహించి రేట్లు పెంచవద్దని కోరారు.
అయితే, నిర్మాతల విజ్జప్తి మేరకు టికెట్ రేట్లు పెంచుతున్నట్లుగా ప్రభుత్వాలు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి.
”సాధారణంగా టికెట్ ధరలు పెంచితే థియేటర్లు లాభపడతాయని అనుకుంటారు. కానీ, థియేటర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. మల్టీప్లెక్స్‌ల విషయంలో చూస్తే, లాభాల్లో నిర్మాత 55 శాతం, మల్టీప్లెక్స్ యాజమాన్యం 45 శాతం తీసుకుంటాయి. అదే థియేటర్ల విషయానికి వస్తే, షేర్ తరహాలో కాకుండా అద్దె తరహాలో చెల్లింపులు ఉంటాయి. వారానికి గరిష్ఠంగా 5 లక్షల వరకు ఇస్తుంటారు. ఇది కూడా పట్టణం, నగరం, థియేటర్‌ను బట్టి ఉంటాయి. అందులోనే సిబ్బంది జీతాలు, విద్యుత్తు బిల్లులు..అన్నీ ఉంటాయి.” అని విజయేందర్ రెడ్డి చెప్పారు.
అదే నష్టం వస్తే, చెరిసగం అని చెబుతుంటారని చెప్పారు.
‘బెనిఫిట్’ లేదంటూ.. ప్రత్యేక షోలకు ఓకే
సినిమా టికెట్ ధరలు, ప్రత్యేక షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
పుష్ప-2 సంఘటన తర్వాత బెనిఫిట్ షోలకు తెలంగాణలో అనుమతించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు.
తాజాగా గేమ్ చేంజర్ సినిమా ప్రదర్శనల విషయంలో తెల్లవారుజామున నాలుగు గంటల షో నుంచి అనుమతించింది తెలంగాణ ప్రభుత్వం.
అదే ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి ఒంటి గంట షోకు కూడా అనుమతించింది.
ఈ వ్యవహారం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల గేమ్ చేంజర్ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్లో స్పందించారు.
”టికెట్ ధర పెంపుపై తప్పుడు ప్రచారం ఉంది. రేట్లు పెంచినందుకు ప్రతి రూపాయికి 18 శాతం జీఎస్టీ వస్తుంది.” అని చెప్పారు.
థియేటర్ల యాజమాన్యాలు ఏం అడుగుతున్నాయి?
థియేటర్ల యాజమాన్యాల ప్రతిపాదన మరో విధంగా ఉంది.
రెవెన్యూ పంపిణీ అనేది పర్సంటేజీ విధానంలోకి వస్తే థియేటర్ల యాజమాన్యాలకు ఇబ్బంది ఉండదని తెలంగాణ తెలుగు ఫిలిం ఎగ్జిబిటర్స్ అండ్ కంట్రోలర్స్ అసోసియేషన్ ప్రతినిధి బాలగోవింద్ రాజ్ బీబీసీకి చెప్పారు.
”సినిమాల బడ్జెట్ ప్రకారం థియేటర్లకు అద్దెలు చెల్లిస్తే వాటి మనుగడ సాధ్యమవుతుంది. అదే మేం డిమాండ్ చేస్తున్నాం.” అని చెప్పారు.
ఈ విషయంపై నిర్మాతల మండలి ప్రతినిధి ఒకరు బీబీసీతో మాట్లాడుతూ.. ”మేం టికెట్ రేట్లు పెంచమని అడగడానికి ప్రధాన కారణం ఒకటే. ఈ మధ్యకాలంలో బడ్జెట్ బాగా పెరిగింది. ఆడియెన్స్ మళ్లీ మళ్లీ రావడం తగ్గిపోయింది. సినిమా బాగుంటే రేట్లు పెరిగినా, చూసేందుకు వస్తుంటారు. బాగా లేకపోతే వెంటనే రేట్లు తగ్గిపోతాయి.” అని అన్నారు.
జీవోలో ఏముంది?
2022 మార్చిలో అప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుపై జీవో నం.13 జారీ చేసింది.
ప్రభుత్వం నియమించిన కమిటీ ఆదేశాల మేరకు రేట్లను పెంచుతున్నట్లుగా ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. కార్పొరేషన్లలో కనీస టికెట్ ధర రూ.40గా నిర్ణయించింది.
మున్సిపాలిటీలలో కనీస టికెట్ ధర రూ.30, నగర పంచాయతీ లేదా పంచాయతీలలో కనీస టికెట్ ధర రూ.20గా నిర్ణయించింది.
రిక్లైనర్ సీట్లు ఉన్న థియేటర్లలో రూ.250 గరిష్ఠ ధర పెట్టుకునేందుకు అనుమతించగా రెగ్యులర్ సీట్లకు నగర, పట్టణ, పంచాయతీల పరిధిని బట్టి రూ.150, రూ.125, రూ.100 వరకు ఉంది.
ఇవన్నీ జీఎస్టీ కాకుండా అని ప్రభుత్వం చెప్పింది. జీఎస్టీతో కలుపుకొని మరికొంత పెరిగే అవకాశం ఉంది.
ప్రతి థియేటర్లోనూ నాన్ ప్రీమియం కేటగిరీ కింద 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. వీటి టికెట్ ధరలు తక్కువగా ఉంచాలి.
థియేటర్లు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అందులో ఒక షో తప్పకుండా చిన్న బడ్జెట్ సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది.
టికెట్లు ఎంత శాతం పెంచుకోవచ్చు?
ఏపీ ప్రభుత్వ జీవో నం.13లో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. టికెట్ రేట్లు ఎంతశాతం పెంచుకోవచ్చన్నది ప్రస్తావించలేదు.
సూపర్ హై బడ్జెట్ చిత్రాల విషయంలో టికెట్లు పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
”సృజనాత్మక, అత్యధిక సాంకేతికతతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా తీసినప్పుడు నిర్మాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాంటివి సూపర్ హై బడ్జెట్ సినిమాలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అది కూడా నిర్మాణ వ్యయం రూ.100 కోట్లకుపైగా ఉండాలి. ఇందులో హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ల పారితోషికాలు రావు.’’ అని ప్రభుత్వ జీవోలో పేర్కొంది.
‘‘అలాంటి సూపర్ హై బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నప్పుడు వాటిని పరిశీలించి విడుదల తేదీ నుంచి పది రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ సినిమాలన్నీ కూడా 20శాతం షూటింగ్ కచ్చితంగా ఏపీలో జరుపుకొని ఉండాలి.” అని ప్రభుత్వం జీవో చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)